మాట ఇవ్వడం.. ఒట్టు వేయడం... ప్రమాణం చేయడం... ప్రేమలో ఇవి అతి సులభం. అతి కష్టం. ఇవ్వడం సులభం. నిలబెట్టుకోవడం కష్టం. అబ్బాయి అమ్మాయి ప్రేమలోనే కాదు భార్యాభర్తల ప్రేమలో స్నేహితుల ప్రేమలో కూడా ఒకరి కోసం ఒకరు మాట ఇవ్వడం అవసరం. వాలెంటైన్ వీక్ నడుస్తోంది. ఇవాళ ప్రామిస్ డే. నేడు స్త్రీలు, యువతులు పురుషుల నుంచి కోరే ప్రామిస్‌లు ఏమిటి? పురుషులు ఆ మాత్రం ప్రామిస్ చేయలేరా? ప్రేమను నిలుపుకోలేరా?
చాలా సినిమాల్లో, నవలల్లో ఒకటి చూస్తుంటాం. అమ్మాయి అబ్బాయిని ‘స్మోక్ చేయనని నాకు మాట ఇవ్వు’ అని అడుగుతూ ఉంటుంది. అబ్బాయి మాట ఇస్తాడు. అమ్మాయి సంతోషిస్తుంది. అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రామిస్‌లు అడుగుతారు. దేనికి? వారి మంచికి. తద్వారా తమ మంచికి. తద్వారా ఇద్దరి మధ్య నిలవాల్సిన సుదీర్ఘ అనుబంధానికి. ఇవాళ తాము ప్రేమలో ఉన్న అబ్బాయిలతో అడిగే ప్రామిస్‌లు ఏమిటో తెలుసా?
► రాష్‌గా డ్రైవ్ చేయకు.
► డ్రింక్ చేసి డ్రైవ్ చేయకు.
► ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకు.
► కెరీర్ మీద ఫోకస్ పెడతానని మాట ఇవ్వు.
► నీ ఫ్రెండ్స్ నీ మంచితనాన్ని మిస్ యూజ్ చేసేలా చూడనని మాటివ్వు
► పొదుపు చేస్తానని చెప్పు
► ఫేస్‌బుక్‌లో ఎక్కువ సేపు ఉండనని మాటివ్వు
► గతంలోని నీ చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోతానని మాటివ్వు
అమ్మాయిల ప్రపంచానికి అబ్బాయిల ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. అబ్బాయిల ప్రపంచంలో తాను కోరుకునే అమ్మాయి కూడా ఉంటుంది. కాని అమ్మాయిల ప్రపంచంలో అబ్బాయి మాత్రమే ఉంటాడు. ప్రేమికుడు అయినా భర్త అయినా జీవన భాగస్వామి అయినా. అందుకే అమ్మాయిలు చిన్న చిన్నవే అయినా ఎన్నటికీ తప్పని ప్రామిస్‌లు కోరుకుంటారు.
► నా పుట్టినరోజు, మొదటగా పరిచయం అయిన రోజు, ఎంగేజ్‌మెంట్ రోజు, పెళ్లిరోజు... ఇలా నాకు సంబంధించిన ముఖ్యమైన రోజులన్నీ గుర్తు పెట్టుకోవాలి.
► నీ తల్లిదండ్రులను నేను గౌరవిస్తాను. నా తల్లిదండ్రులను నువ్వు గౌరవించాలి.
► నువ్వు ఎల్లప్పుడూ నా పట్ల నిజాయితీగా ఉంటూ నా కోసమే ఉండాలి.
► సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొనేలా ఉండాలి.
► నేను ఊహించని సమయాల్లో కానుకలు ఇస్తూ నన్ను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి.
► నాకు చంద్రుణ్ణి తెస్తాను, డ్యూప్లెక్స్ కట్టిస్తాను అనే అబద్ధపు ప్రామిస్‌లు వద్దు. నువ్వు ఎంత చేయగలవో అది చేస్తానని ప్రామిస్ చెయ్.
► నా నుంచి నాకు తెలియాల్సిన విషయాలేవీ దాచొద్దు.
► నన్ను నీ జీవితం లో అతి ముఖ్యమైన మనిషిగా చూడాలి.
గమనించి చూస్తే ఈ ప్రామిస్‌లన్నీ ప్రేమను, బంధాన్ని దృఢతరం చేసేవే. కాలం చాలా సుదీర్ఘమైనది. అది అనూహ్యమైన పరీక్షలు పెడుతుంటుంది. అబ్బాయి అమ్మాయి లేదా భార్యాభర్తలు ప్రతి రోజూ దగ్గరగా ఉండకపోవచ్చు. వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్‌నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు.
‘నేను భోజనం చేసేశాను’ అని మనసు కు చెప్పుకున్నంత మాత్రాన నిజంగా భోజనం చేయకపోతే ఎలా కడుపు నిండదో ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని మనసులో అనుకున్నంత మాత్రాన ఆ ప్రేమ పెరగదు. పండదు. నోటితో చెప్పాలి. అందుకు ఈ ‘హ్యాపీ ప్రామిస్ డే’ లాంటి సందర్భాలు ఉపయోగపడతాయి. ‘మన నవ్వులు, సరదాలు, కోపతాపాలు, చిరాకులు, పరాకులు, కన్నీళ్లు, సంతోష సమయాలు, కలిసి ఉన్న ప్రతి క్షణం నాకు గుర్తే. నా పక్కన నువ్వు ఉన్నందుకు నాకెంతో సంతోషం. ఇలా ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండేలా నేను మసలుకుంటాను. సంతోషంగా ఉంచుతాను’ అని ప్రామిస్ చేస్తే నోరు తెరిచి చెప్తే చెప్పినందుకు ఆ ప్రామిస్ ను నిభాయించాల్సిన కమిట్‌మెంట్ ఏర్పడుతుంది... విన్నందుకు ఆమెకు
నిలదీసే హక్కూ వస్తుంది.
‘నేను ఎప్పటికీ నీవాడినే’ అని పురుషుడు చేసే ప్రామిస్ స్త్రీ ఎన్నిసార్లయినా వినడానికి ఇష్టపడుతుంది. ‘నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను’ అనే మాట కూడా. నిజానికి హ్యాపీ ప్రామిస్ డే రోజు పురుషుడి నుంచి స్త్రీ ఆశించే తప్పనిసరి ఒట్టు ఏమిటంటే ‘మన జీవితంలో ఉన్న ప్రస్తుత స్థితిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. మనం ఈ స్థితి నుంచి ఇంకా మంచి స్థితికి వెళ్లేందుకు కలిసి పని చేద్దాం. నిరాశ, నిస్పృహలు, ఫిర్యాదులు, నిందించుకోవడాలు లేకుండా అవగాహనతో మరింత బాగా ఉండేందుకు ఏం చేయాలో చేద్దాం. నీ సలహాను నేను గౌరవిస్తాను. నా ఆలోచనను నువ్వు డిస్కస్ చెయ్. మంచి చెడ్డలు ఇద్దరం పంచుకుందాం’’. ఈ ప్రామిస్ పురుషుడు చేస్తే ఆ ప్రేమ, ఆ బంధం తప్పక ముందుకు సాగుతాయి.
వృత్తి రీత్యా, ఉపాధి రీత్యా కొన్నాళ్లు దూరం ఉండాల్సి రావచ్చు. కాని ఇరువురూ కోరుకునేది మనం ఎంత దూరమైనా ఎప్పటికీ విడిపోము అనే ప్రామిస్‌నే. అమ్మాయి/భార్య అడక్క ముందే ‘నేను నువ్వూ దూరంగా ఉన్నాం. కాని మనం ఎప్పటికీ దగ్గరగా ఉంటామని నేడు నీకు ప్రామిస్ చేస్తున్నాను’ అని చెప్తే ఆ అనుభూతి వేరు.
హ్యాపీ ప్రామిస్ డే.
Comments
Please login to add a commentAdd a comment