![Valentines Day 2025: Remember Most Selfless Love All Mothers Love](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Valen.jpg.webp?itok=JM0RkFRC)
ప్రేమించిన ప్రియుడితో ఎప్పుడెప్పుడు తన మనసులోని మాటను చెబుదామని అమ్మాయి...ఎన్నాళ్ల నుంచో దాచుకున్న ప్రేమనంతా ఈ వాలెంటైన్స్ డే రోజున బయటపెట్టాలని అబ్బాయి..ఇలా కుర్రకారు తహతహలాడిపోతుంటుంది. నిన్న మొన్న వచ్చిన ఇలాంటి ప్రేమల కన్నా..ఈ భూమ్మీదకు తీసుకువచ్చి..ప్రాణాలన్నీ మనమీదే పెట్టుకుని బతికే అమ్మ ప్రేమను ఇలాంటి రోజును గుర్తు చేసుకుందాం. ప్రేమకు ప్రతిరూపం అమ్మ..అంటారే అలాంటి అమ్మ ప్రేమకు సాటిలేదు ఏ ప్రేమ. మనం ఎలా ఉన్నా..ఇష్టంగా లాలించే దేవత ఆమె. మనం పుట్టక ముందు నుంచి ప్రేమిస్తూ..మన ఆలన పాలనా కోసం ఎన్నో త్యాగాలు చేసి ఆ దేవతకు ఈ పవితమైన రోజున..మన గుండెల్లోని ప్రేమనంతా ఈ విధంగా తెలుపుదామా..!.
ఈ వాలెంటైన్ డే రోజున అమ్మ కళ్లు నులుముకుంటు నిద్రలేచేసరికి ఎదురుగా ఆమె ముందు నిల్చుని చూడండి. ఎప్పుడూ తానే మనల్ని నిద్రలేపే ఆమె ముందు గనుక మనమే ముందు లేచి ఎదురుగా ఉంటే కొంచెం తత్తరపాటు తోపాటు ఏంటా అని కచ్చితంగా కంగారుపడుతుంది. ఎందుకంటే అమ్మ కదా..? మనం ఏదైనా టెన్షన్‌లో ఉన్నామా..? లేక బాధగా ఉన్నామా..? అని భయపడుతుంది. కాస్త అనుమానంగా నటిస్తూ..విష్ చేస్తూ నవ్విచండి..ఏదో అయిపోతుందా రా ఈ రోజు అంటూ నవ్వేస్తుంది.
మనం ఇష్టపడ్డ అమ్మాయి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేయడం కాదు. మనల్ని ఇన్నాళ్లు సాకి, ఎన్నో ఒడుదుడుకులు, కష్టాలను దిగమింగిన మన అమ్మకు I Love You Maa అంటూ ప్రపోజ్ చేయండి. ఆమె పైకి కోపం నటించినా..ఈ విషయం అంతా చుట్టుపక్కల వాళ్లతో గొప్పగా చెప్పుకుని తప్పక ఆనందిస్తుంది.
అలాగే రోజూ ఎప్పుడు చివరగా మిగిలిపోయింది తినే ఆమెకు..కనీసం ఈరోజునైనా మనం ఆ అవకాశం ఇవ్వకుండా ఏదైనా చేసిపెట్టండి. లేదా కనీసం ఆమె చూడని వెరైటీ స్వీట్ లేదా చాక్లెట్‌తో నోటిని తీపి చెయ్యండి.
మనల్ని ఆడించడాని అమ్మ బొమ్మగా మారిన రోజులను గుర్తు తెచ్చుకుంటూ..ఆమె చిత్రంతో పెయింట్ చేసిన గ్లాస్ లేదా టెడ్డీ బొమ్మల గిఫ్ట్‌గా ఇవ్వండి. ఆమె కోసం కాదు..మన కోసమే. ఎందుకంటే..బిజీ బిజీ లైఫ్‌లతో అమ్మ ప్రేమను మర్చిపోతున్న మనకు ఇలాంటి రోజునైనా అలనాటి స్మృతులను గుర్తు తెచ్చుకునేలా సెలబ్రేట్ చేసుకునేందుకు. ప్రతి అమ్మకి తన బిడ్డకు మించిన గొప్ప బహుమతి ఉండదు. అయినా ఆమె మననుంచి ఆశించదు కూడా.
అలాగే కడ వరకు తనకు మంచి బిడ్డగా ఉంటాననే భరోసా ఇవ్వండి. ఆమెకు రెక్కల్లొస్తే ఎగిరిపోయే పక్షులం కాదు..నాకోసం ఆహర్నిశలు శ్రమించిన నిన్ను ఎన్నటికీ మర్చిపోను అనే నమ్మకం కలిగించండి.
చిన్నప్పుడు అందంగా రెడీ చేసి..బుగ్గన దిష్టి చుక్కగా కాటుక పెట్టి మురిసిపోయే ఆ అమ్మను ఈ రోజున మనం రెడీ చేద్దాం. ఎలా ఉన్నా.. ఎవరి అమ్మ వారికి అందం, ఇష్టం ఉంటాయి కదా..!. అందుకే ఈరోజున నాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అమ్మ నుదిటిని ముద్దాడదాం.
అలాగే చిన్నప్పుడు మనం భయపడినా..పరీక్షలప్పుడూ పాసవ్వుతానా? లేదా..? అన్న టెన్షన్ పడుతున్నప్పడు అమ్మ మనల్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని ధైర్యం చెప్పేది కదా..అది గుర్తుతెచ్చుకుని మరీ వయసు మళ్లినా.. నీ చేయి ఎన్నటికీ వదలను అనేట్టుగా ఆమెను ఆలింగనం చేసుకోండి.
చివరిగా వీటిలో ఏ ఒక్కటి మనం చేసినా..అమ్మ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఆమె మనకిచ్చిన అనంతమైన ప్రేమలో రవ్వంతైనా తిరిగిచ్చే ప్రయత్నం చేద్దామా..!. నిజానికి అమ్మ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. ఆ దేవతకు ప్రేమను ఇవ్వడమే గానీ తీసుకోవడం తెలియదు. ఆమె ప్రేమే మనకు సంజీవని, శ్రీరామ రక్ష. అలాంటి అమ్మకు ఈ రోజున మర్చిపోలోని ఆనందం కలిగేలా ప్రేమిద్దాం. ప్రస్తుత ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో ప్రేమను వ్యక్తం చేసే సావకాశం కూడా లేని ఈ పరిస్థితుల్లో ఇలాంటి రోజుని మిస్ చేయకుండా ఉపయోగించుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment