సాక్షి, అమరావతి: రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, వడ్డీలేని రుణాలు అందిస్తామని చంద్రబాబు చేసిన వాగ్దానాలను అప్పట్లో తుంగలో తొక్కినా రామోజీరావు తన పత్రికలో ఒక్క ముక్క కూడా రాయలేదు. కానీ ఇచ్ఛిన హామీలకంటే మిన్నగా రైతులకు ఈ ప్రభుత్వం సాయం చేస్తుంటే నిత్యం విషం చిమ్ముతూనే ఉన్నారు.
దుష్ప్రచారమే లక్ష్యంగా అబద్ధాలను పోగేసి ‘సున్నా వడ్డీలో మహా మోసం’ అంటూ మరో కథనాన్ని శనివారం ఈనాడు పత్రిక అచ్చేసింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పైసా భారం పడకుండా ఉచిత పంటలబీమా, సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం, సకాలంలో సున్నా వడ్డీ రాయితీ సహా రైతులకు మేలు చేసే ఎన్నో పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నా నిజాలను వక్రీకరించి వక్రరాతలు రాసేసింది.
అప్పుల ఊబిలో చిక్కుకోకుండా చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు సాగు వేళ తీసుకునే పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2019లో శ్రీకారం చుట్టింది. రూ. లక్ష లోపు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మరుసటి సీజన్ రాక మునుపే వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వాస్తవ సాగుదారులకు వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని అందించడం కోసం ఈ క్రాప్ డేటా ఆధారంగా ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోంది.
గతంలో రైతుపైనా వడ్డీ భారం
గతంలో రూ. లక్ష లోపు పంట రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే బ్యాంకులు వసూలు చేసే ఏడు శాతం వడ్డీలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తే, మిగిలిన 4 శాతం వడ్డీని రైతులు భరించేవారు. ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో బ్యాంకులకు జమ చేసేవారు.
ఈ మొత్తాన్ని బ్యాంకులు రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసుకునేవి. గతంలో క్లయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచ్‌లకు మాత్రమే అధికారం ఉండేది. దీంతో ఎంత మంది అర్హత పొందారు.. వారికి ఎంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లకు కూడా తెలిసేది కాదు. సామాజిక తనిఖీ కోసం బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ జాబితాలు ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు.
పారదర్శకంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం
వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావు లేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ డేటాను ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించి అర్హులైన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ద్వారా ఎస్వీపీఆర్ (సున్నా వడ్డీ పంట రుణాలు) పోర్టల్
((https://karshak.ap.gov.in/ysrsvpr/))లో ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు.
ఏడాదిలోగా రూ. లక్ష లోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీకి అర్హత పొంది, ఒక వేళ జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇలా అర్హత పొందిన రైతుల ఖాతాలో వారు చెల్లించిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వంప్రతీ ఏటా క్రమం తప్పకుండా జమ చేస్తోంది. రైతులలో జవాబుదారీతనాన్ని పెంచడం, సకాలంలో రుణ చెల్లింపు అలవాటు పెంపొందించే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఈ పథకం ద్వారా రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి రైతుల ఖాతాలకే జమ చేస్తోంది.
బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లింపు
టీడీపీ ఐదేళ్ల హయాంలో సుమారు 40.61 లక్షల మందికి కేవలం రూ. 685.46 కోట్లు చెల్లిస్తే, గడిచిన 4.5 ఏళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 73.88 లక్షల మందికి రూ. 1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో 39.08 లక్షల మంది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1,180.66 కోట్ల బకాయిలున్నాయి. కాగా రబీ 2021–22, ఖరీఫ్–2022 సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాయితీ సొమ్మును డిసెంబర్‌లో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వడ్డీ రాయితీని సకాలంలో అందించడమే కాదు. రైతులకు సంస్థాగత రుణాలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 2019 ఖరీఫ్ పంట కాలం నుంచి ఇప్పటి వరకు రూ. 8,24,428 కోట్ల పంట రుణాలను ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించారు. అంతేకాదు వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ కార్డుల ద్వారా 14 లక్షల మంది కౌలురైతులకు రూ. 8,054 కోట్ల వ్యవసాయ రుణాలు అందించింది.
ఈ ఏడాది అత్యధికంగా 8.22 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా, వారిలో ఇప్పటికే 4.88 లక్షల మందికి రూ.1,385.25 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. అంతేకాదు.. రైతు భరోసా కింద 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ. 33,209.81 కోట్లు, రాయితీపై విత్తన సరఫరా కోసం 74.45 లక్షల మందికి రూ. 1,316.57 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.50 లక్షల మందికి రూ. 7,802.05 కోట్లు, ఇన్‌పుట్‌సబ్సిడీ కింద 22.85 లక్షల మందికి రూ.1,977 కోట్లు చెల్లించి రైతులకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. మరో వైపు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment