టీచర్లపై ఈనాడు తాగుబోతు రాతలు
మద్యం దుకాణాలకు కాపలా కాశారా?
మరుగుదొడ్లు ఊడ్చారా?.. నిరూపించగలవా రామోజీ!
మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లలో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ?.. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవు
ఇప్పుడు ప్రతి స్కూల్లోనూ స్టాఫ్‌కు ప్రత్యేక సదుపాయాలు
అద్భుతంగా మారిన 45 వేల ప్రభుత్వ బడులు
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది.
ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కూల్లో స్టాఫ్‌కు ప్రత్యేక, ఆధునిక సదుపాయాల కల్పన ఆ పత్రికకు కనబడవు. ఒకేసారి 25 వేల మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రభుత్వమే. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడులు అద్భుతంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు, బోధనకు ఐఎఫ్‌పీ స్క్రీన్ల ఏర్పాటు జరిగాయి. వీటిని కావాలనే విస్మరించి ఆధారాలు లేని రాతలతో ఎల్లో మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది.
పాఠశాల అభివృద్ధిలో టీచర్లను భాగస్వామ్యం చేయడం తప్పేనా?
ఒకప్పటి బ్లాక్ బోర్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ బోధన సాగుతోంది. విద్యార్థులు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు 2019–20 విద్యా సంవత్సరంలో ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగాయి.
నాడు–నేడు మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలు బాగుపడ్డాయి. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్‌తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందిస్తున్నారు. 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ రికార్డు. ఇవన్నీ పూర్తి పారదర్శకత కొనసాగేందుకు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఏం అవసరమో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. వీటిని తప్పంటోంది ఈనాడు పత్రిక. మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లల్లో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ.
జగన్ పాలనలో
► విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు సమకూరాయి.
►గత నాలుగేళ్లలో అర్హత కలిగిన 25 వేల మంది టీచర్లు ఎస్‌జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ఇందులో నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారికీ అవకాశం లభించింది.
►నాడు–నేడుతో ప్రతి బడిలోనూ 12 రకాల సదుపాయాలు.
►బోధనకు డిజిటల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు.
►బడుల్లోకి కొత్త ఫర్నిచర్.
►మన బడికి అంతర్జాతీయ కీర్తి.
►కోవిడ్ కష్ట కాలంలో నెలల తరబడి పాఠశాలలు మూతబడినా ప్రతి టీచర్‌కు ఠంచన్‌గా వేతనాలు.
►బడిలో పాఠాలు చెప్పడం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం తప్ప ఏ ఉపాధ్యాయుడికీ అదనపు పనులు అప్పగించలేదు.
►మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఉన్నారు. వారికి ప్రతినెలా వేతనాలు చెల్లించేందుకు ‘టాయిలెట్ మెయింటనెన్స్ ఫండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత స్థానిక ఉపాధ్యాయులు తీసుకున్నారు.
చంద్రబాబు పాలనలో
► 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో చంద్రబాబు జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచారు. నూరు శాతం ఫలితాలు తేవాలని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో సాధ్యం కాదని ఆ ప్రధానోపాధ్యుడు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంతే అదే వేదికపై ఆ హెచ్‌ఎంను సస్పెండ్ చేశారు.
► 2003లో మంత్రిగా చేసిన నిమ్మల కిష్టప్ప గోరంట్లలో నిర్వహించిన జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టమని అనుచరులను రెచ్చగొట్టారు.
►మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ అవసరం తీర్చుకునేవారు.
►జన్మభూమి సభ్యులే పేరెంట్స్ కమిటీల్లో చేరిపోయి పప్పు, బియ్యం ఎత్తుకెళితే అడిగినందుకు ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు చేశారు.
►ఉపాధ్యాయులను నియమించకుండా నూరు శాతం ఫలితాలు తేవాలని ఒత్తిడి చేశారు. సాధ్యం కాదని చెబితే వెంటనే సస్పెండ్ చేసేవారు.
ఈ రాతలు టీచర్లను అవమానించడమే
గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయినులు పట్టణాలకే గాని మండల స్థాయి పాఠశాలలకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. బ్లాక్ బోర్డులౖపె రాసేందుకు సుద్దముక్క కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకు, స్టాఫ్‌కు అన్ని సదుపాయాలు కల్పించింది కళ్లకు కనిపిస్తున్నాయి. తప్పుడు రాతలు రాసి టీచర్ల మనోభావాలను కించపరచడం దుర్మార్గం. ఉపాధ్యాయుల విధులు, సిబ్బంది విధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ టీచర్ కూడా మరుగుదొడ్లు కడిగింది లేదు. గతంలో ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు స్థానిక బడుల్లో ఉండలేక కష్టాలు పడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పాఠశాలకైనా నిర్భయంగా వెళ్లే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. – గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు (వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్)
Comments
Please login to add a commentAdd a comment