సాక్షి, అమరావతి: అచ్చోసిన ఆంబోతు తిని ఊరి మీద పడి తిరిగినట్టు.. ఎన్నికల ముందు ఈనాడు పత్రికాధినేత రామోజీరావు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి విషయంలోనూ విషం జిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పేదింటి పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలపై కత్తిగట్టారు. వాస్తవాలను వక్రీకరించి అసత్యాలతో తనకలవాటైన రీతిలో చెలరేగిపోయారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు, పేద పిల్లల ప్రగతిపై ఏనాడూ అక్షరం ముక్క రాయని ‘ఈనాడు’ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు లేవంటూ అబద్ధాలను అచ్చేసింది.
మొదటి విడత మనబడి: నాడు–నేడుతో సమూలంగా రూపురేఖలు మార్చుకున్న 15,715 ప్రభుత్వ పాఠశాలల గురించి మాటమాత్రంగా ప్రస్తావించలేదు. కానీ నాడు–నేడు రెండోవిడతలో పనులు జరుగుతున్న పాఠశాలలపై రామోజీ విషం కక్కారు. గత ప్రభుత్వంలో సర్కారు బడి భవనాలు బీటలు వారి కూలిపోతున్నా అడిగింది లేదు.. విద్యార్థులకు కనీస వసతులైన పుస్తకాలు, తాగునీరు, యూనిఫామ్ ఇవ్వకున్నా నిలదీసింది లేదు. ఇప్పుడు నాడు–నేడు రెండో దశలో బడులకు కొత్త భవనాలు, అదనపు తరగతి గదులు నిర్మాణ పనులు సాగుతుండగా ఫొటోలు తీసి పనులు నిలిచిపోయాయంటూ రామోజీ దుష్ప్రచారం చేస్తున్నారు.
ఇలా ఒకటీ రెండుసార్లు కాదు.. ఈ విద్యా సంవత్సరంలో 15 సార్లు ఒకే అంశంపై తప్పుడు రాతలు ప్రచురించడం ఆయన మానసిక దౌర్భల్యానికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయని.. విద్యార్థులకు గొప్ప సదుపాయాలు కల్పిస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభినందించారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి కొనియాడారు. వివిధ దేశాల ప్రతినిధులు సైతం ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ప్రశంసిస్తున్నారు. తమ దేశంలోనూ ఏపీ విధానాలను అమలు చేస్తామని చెబుతున్నారు. కానీ రామోజీ పచ్చ కళ్లకు మాత్రం ఇవేమీ కనిపించడం లేదు.
నాడు–నేడు రెండో దశలో 22,344 స్కూళ్ల అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వం 2021–22 విద్యా సంవత్సరంలో నాడు–నేడు మొదటి దశ కింద 15,715 పాఠశాలలను రూ.3,669 కోట్లతో అభివృద్ధి చేసింది. నూతన భవనాలతో పాటు అవసరమైన 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇక 2022–23 విద్యా సంవత్సరంలో 22,344 పాఠశాలల్లో రూ.8,000 కోట్లతో రెండో దశ పనులు చేపట్టారు. ఇందులో మొదటి దశలో లేని అదనపు పనులు సైతం జోడించారు.
ఇప్పటికే 99.79 శాతం స్కూళ్లల్లో పనులు ప్రారంభించారు. 2,755 స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తవగా, 1,331 స్కూళ్లను నూరుశాతం అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో 6,340 స్కూళ్లల్లో టాయిలెట్లు, 4,707 స్కూళ్లల్లో కిచెన్ షెడ్లు, 11,840 స్కూళ్లల్లో మేజర్, మైనర్ రిపేర్లు పూర్తి చేశారు. అంతేకాకుండా ఆ పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు రూ.3,361 కోట్లు చెల్లించారు. వాస్తవం ఇదయితే ప్రస్తుతం పనులు కొనసాగుతున్న పాఠశాలల్లో ఫొటోలు తీసి, నిర్మాణ పనులు నిలిచిపోయాయంటూ ఈనాడు పత్రిక వక్రీకరిస్తోంది.
ఇందుకోసం పార్వతీపురం మన్యం జిల్లాలోని మూడు స్కూళ్లు, ప్రకాశంలోని కొత్తపట్నం, ఏలూరు జిల్లా ఉంగుటూరు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, విజయనగరం జిల్లా గుర్ల మండలాల్లోని పాఠశాలను చూపించింది. వాస్తవానికి ఆ పాఠశాలల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి గాయాలు కాకూడదని ఆరుబయట ఉంచారు.
ఈ ఫొటోలను అచ్చేసి రామోజీ పైశాచిక ఆనందం పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇవే పాఠశాలల గోడలు బీటలు వారి, పైకప్పులు ఎప్పుడు కూలతాయోనన్న భయంతో చదువులు సాగాయి. కానీ తన శిష్యుడు చంద్రబాబు జమానా కావడంతో రామోజీకి ఒక్క ముక్క కూడా రాయాలనిపించలేదు. ఇప్పుడు అన్నీ బాగున్నా చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి అన్నీ తప్పులే ఆయనకు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment