సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, దివ్యాంగులు సహా ఇతర సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులందరికీ రామరాజ్యమంటే ఏంటో.. సంక్షేమ శకం తీపిగుర్తులు ఎలా ఉంటాయో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వారికి తెలిసేలా చేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్నరోజుల్లో వాళ్లు పడ్డ కష్టాలన్నీ ఇప్పుడు పటాపంచలై వాళ్లు వాటిని దాదాపు మరిచిపోయేలా కూడా చేశారు.
కానీ.. ఆ జన్మభూమి కమిటీల ఆగడాలతో అప్పట్లో ఐదేళ్లపాటు అవ్వాతాతలు, దివ్యాంగులు సహా ఇతర సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులందరూ అనుభవించిన అష్టకష్టాలే ఇంకా ఇంకా అనుభవిస్తూ ఉండాలని రామోజీరావు కోరుకుంటున్నట్లు ఉంది ఈనాడు రాతలు చూస్తే. ఎందుకంటే.. ‘జగన్ వచ్చే.. పింఛను తుంచె..’ అంటూ ఆ పత్రిక పెట్టిన పెడ»ొబ్బలు అంతాఇంతా కాదు. నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీన తెల్లవారుజాము నుంచే ఇంటికే వెళ్లి ఇస్తున్నా.. చెప్పినట్లుగా ఏటా పింఛన్ మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లినా.. సంతృప్త స్థాయిలో పెన్షన్లు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నా నిలువెల్లా విషం నింపుకున్న రామోజీ తనను తాను వంచన చేసుకుంటూ ఏడుపుగొట్టు రాతలు రాస్తున్నారంటే ఆయన్ను ఏమనాలి? ఈనాడు వండివార్చిన విషపూరిత కథనంలోని అంశాలపై ‘ఫ్యాక్ట్‌చెక్’..
ఇదేనా స్వర్ణయుగమంటే..
ఈనాడు: గత తెలుగుదేశం ప్రభుత్వంలో సామాజిక భద్రత పింఛను లబ్ధిదారులకు స్వర్ణయుగమే..
వాస్తవం: 2014లో ఉమ్మడి రాష్ట్రం విడిపోయే సమయానికి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 43.11 లక్షల పెన్షన్ లబ్ధిదారులుండేవారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు కూడా రాష్ట్రంలో కేవలం 39 లక్షల మంది లబ్ధిదారులు మాత్రమే ప్రతినెలా పెన్షన్ తీసుకునేవారు. కానీ, ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత 55 నెలల్లో ఏకంగా 29,51,760 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది.
ఈనాడు: టీడీపీ ప్రభుత్వంలో ఒకే కుటుంబంలో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా కేటగిరీ పింఛన్లూ ఒకే ఇంటిలో రెండు ఉన్నా.. అందరికీ ఇచ్చారు..
వాస్తవం: 2014లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ పొందేందుకు అర్హులు..’ అంటూ అప్పటి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇందుకు 2014 సెప్టెంబరు 18న గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయం అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీచేసిన ఆర్‌సీ నెంబరు 1053 ఆదేశాలే సాక్ష్యం. వీటి ప్రకారం.. కేవలం 80 శాతానికి పైగా అంగవైకల్యం ఉండే వారికి మాత్రమే రెండో పెన్షన్ మంజూరు చేస్తామని ఆ ఆదేశాల్లో పేర్కొంది. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దివ్యాంగుల కేటగిరీలో పెన్షన్లు పొందే అందరికీ, రెండో పెన్షన్ మంజూరుకు వీలు కల్పించడంతో పాటు కొత్తగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కూడా రెండో పెన్షన్ మంజూరుకు వీలు కల్పించారు. ఇలా వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్తగా కలి్పంచిన వెసులుబాట్లతో రాష్ట్రంలో 3,53,645 మంది ఒకే ఇంట్లో రెండో పెన్షన్ కూడా పొందుతున్నారు.
‘జన్మభూమి’ పేరు వింటేనే హడల్
చంద్రబాబు పాలనలో ప్రతి పెన్షన్ లబ్ధిదారుడికీ జన్మభూమి కమిటీ పేరు గుర్తుకొస్తేనే వణికిపోయే పరిస్థితి. అప్పట్లో నెలనెలా తమ పెన్షన్ డబ్బులు తీసుకోవాలంటే నడవలేని, నిలబడలేని స్థితిలో కూడా చాంతాడంత క్యూలలో ఎర్రటి ఎండలో గంటల తరబడి నిరీక్షించిన రోజులను ఊహించుకుంటేనే వారు బెంబేలెత్తిపోతున్నారు.
పైగా.. బాబు పాలనలో అన్నీ అర్హతలున్న వాళ్లు పెన్షన్ కావాలంటే ఏడాదికో, లేదంటే రెండేళ్లకోసారో మొక్కుబడిగా ప్రభుత్వం నిర్వహించే జన్మభూమి కార్యక్రమంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేది. ఆ దరఖాస్తులు మండలాఫీసుల్లో కుప్పలపాలయ్యేవి. పెన్షన్లు తీసుకుంటున్న వారు ఎవరైనా మరణిస్తేనో లేదా ఇతర కారణాలతో తగ్గితేనే కొత్త పెన్షన్లు మంజూరయ్యేవి. ఆ దరఖాస్తుల దుమ్ము దులిపిన దాఖలాల్లేవు. ఎమ్మెల్యేని అడిగినా దిక్కూమొక్కూలేని పరిస్థితి.
సీఎం జగన్ పాలనలో.. సంతృప్త స్థాయిలో..
అదే ఇప్పుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మొదటి నుంచీ (గత నాలుగున్నర ఏళ్లకు పైగా) సంతృప్త స్థాయిలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరి ఇంటికి వలంటీరే స్వయంగా వెళ్లి పింఛను దరఖాస్తు తీసుకుని మంజూరు కాగానే తిరిగి లబ్ధిదారుడు ఇంటికే వచ్చి మంజూరు పత్రం అందజేస్తున్నారు. ఎక్కడన్నా ఏదైనా కారణంతో అర్హత ఉండీ పెన్షన్ మంజూరు కాకపోతే.. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక డ్రైవ్ ద్వారా వారికి పెన్షన్లు మంజూరు చేసే విధానాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలుచేస్తోంది.
కానీ, చంద్రబాబు హయాంలో పెన్షన్ లబ్ధిదారులు ఎన్ని ఇబ్బందులుపడ్డా ‘ఈనాడు’ మాత్రం చంద్రబాబు జమానాను స్వర్ణయుగం అని కీర్తిస్తోంది. అలాగే, అవ్వాతాతలు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఇతర చేతి వృత్తిదారులపట్ల పూర్తి మానవత్వంతో పెన్షన్ల మంజూరు నుంచి ప్రతినెలా ఠంఛన్‌గా ఒకటో తేదీనే లబ్ధిదారుల ఇంటివద్దే పంపిణీకి జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ‘ఈనాడు’కు బూటకపు విధానాలుగా కనిపిస్తుంటే దానిని ‘కళ్లుండీ చూడలేని కబోదీ’ అనే అనుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment