Fact Check: గంతలు కట్టుకొని ‘గుంతల కథ’ | Ramoji Rao Eenadu Fake News on AP Raods | Sakshi
Sakshi News home page

Fact Check: గంతలు కట్టుకొని ‘గుంతల కథ’

Published Tue, Nov 28 2023 6:26 AM | Last Updated on Tue, Nov 28 2023 6:35 AM

Ramoji Rao Eenadu Fake News on AP Raods - Sakshi

ఏదైనా ఓ కథనం రాయాలంటే క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్న ప్రాథమిక సూత్రాన్ని రామోజీరావు ఎప్పుడో వదిలేశారు. తన అనుంగు చంద్రబాబుకు పీఠం దక్కాలన్న ఒకే లక్ష్యంతో కళ్లు మూసుకొని అవాస్తవాలతో ఈనాడును నింపేస్తున్నారు. నలుగురు నడిచే దారుల పైనా అసత్య కథనాలు వండుతున్నారు. తాము నిత్యం ప్రయాణించే చక్కటి రోడ్డుపై ఇలాంటి వార్త వచ్చిందేమిటని ప్రజలు ఏమనుకుంటారోనన్న కనీస జ్ఞానం లేకుండా అబద్ధం అచ్చేశారు. అస్మదీయుడు చంద్రబాబు రాజకీయ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతుండటంతో రామోజీరావు రాతలు కూడా మరింత దిగజారిపోతున్నాయి.

రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై దు్రష్పచారం చేస్తూ ఈనాడు ఇచ్చిన కథనం ఇందుకు మరో నిదర్శనం. అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. బాబు ప్రభుత్వం రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ఇచ్చిన నిధులే కాస్తంత. అందులోనూ మామూళ్ల కక్కుర్తి. దీంతో ఏ రోడ్డు చూసినా అధ్వానమే. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దురవస్థ నుంచి రోడ్లను బయట పడేసింది. అత్యధిక నిధులు వెచ్చిస్తూ రోడ్లను పునరుద్ధరిస్తోంది. ఈ వాస్తవాలను విస్మరించి కళ్లు మూసుకుని పెన్నుతో విషం కక్కుతున్నారు.

రాష్ట్రంలో 99 శాతం బాగా ఉన్న రోడ్లను చూడకుండా.. రంధ్రాన్వేషణకు పాల్పడుతూ ఎక్కడో ఒక చోట రోడ్డు కాస్త దెబ్బ తిన్న ఫొటోలతో ప్రజలను  తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం ప్రజలకు తెలుసు. గతంలో అధ్వాన్నంగా ఉన్న తమ ఊరి రోడ్లు ప్రస్తుతం కొత్తగా తయారై హాయిగా ప్రయాణిస్తున్నారు. ప్రజలు గుర్తించిన ఈ వాస్తవాన్ని ఎల్లో సిండికేట్‌ కళ్లు తెరిపించేందుకు మరోసారి వివరంగా తెలియజేసేందుకే ఈ ఫ్యాక్ట్‌ చెక్‌... – సాక్షి, అమరావతి  

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో ఆర్‌ అండ్‌ బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులకు కలిపి మొత్తం రూ.23,792.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయంలో ఈ నాలుగేళ్లలోనే ఏకంగా రూ.42,236.28 కోట్లు వెచ్చించారు. రోడ్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమిది.  

బాబు హయాంలోనే రోడ్లు అధ్వాన్నం 
చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో రోడ్ల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్న వాస్తవాన్ని రామోజీరావు ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. క్ర­మం తప్పకుండా చేపట్టాల్సిన రోడ్ల మరమ్మతులు, నిర్వహణను టీడీపీ ప్రభుత్వం ఏమా­త్రం పట్టించుకోలేదు. రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలోభారీ వర్షాలు లేవు. కోవిడ్‌ పరిస్థితులు కూడా లేవు. అయినా రోడ్ల పనులకు ఏమాత్రం ప్రాధాన్యమివ్వనే లేదు. ఇదిగో ఈ లెక్కలు చూడండి 

► టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.2,953.81 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.591 కోట్లు ఖర్చు చేసింది. 
►రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు రూ.4,325 కోట్లే వెచ్చించింది.  
► పంచాయతీరాజ్‌ రోడ్ల కోసం  3,160.38 మాత్రమే ఖర్చు చేసింది. 
►2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.13,353 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 

నేడు.. మెరిసే మెత్తటి దారులు 
2019లో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయి.., వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ విజయంతో ప్రజా పాలన వచ్చింది. అప్పటి నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల సంక్షేమంతోపాటు మౌలిక సదుపాయాల పైనా దృష్టి సారించారు. చంద్రబాబు ప్రభుత్వం హయాంలో అడుగుకో అవస్థలా మారిన రోడ్లను క్రమంగా మెరుగులు దిద్దుతున్నారు. ఉన్న రోడ్లను విశాలంగా చేస్తున్నారు. కొత్త రోడ్లు వేస్తున్నారు. వరుసగా రెండేళ్లు భారీ వర్షాలతో పాటు కోవిడ్‌ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రోడ్ల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు దాంతో రాష్ట్రంలో రోడ్లు మెరుగయ్యాయి. ఇందు కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన ఖర్చు చూద్దాం.. 

► 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నాలుగేళ్లలోనే రోడ్ల నిర్మాణానికి రూ.4,148.59 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.951కోట్లు. అంటే బాబు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 591 కోట్లకంటే చాలా ఎక్కువే. ప్రస్తుత ఆరి్థక సంవత్సరం( 2023–24) తొలి నాలుగు నెలల్లోనే రూ.346 కోట్లు ఖర్చుపెట్టింది. 
►  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల ని­ర్మాణానికి రూ.7,340 కోట్లు ఖర్చుచేసింది.  
► పంచాయతీరాజ్‌ రోడ్ల కోసం 5,443.69 వెచ్చించింది. 
►జాతీయ రహదారుల కోసం రూ.25,304 కోట్లు వెచ్చించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జ­గన్‌ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు, నిరంతరం పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైంది. 
► ఇక రోడ్ల అభివృద్ధి సెస్‌ ద్వారా వచ్చిన రూ.3 వేల కోట్లను టీడీపీ చేసిన అప్పులు తీర్చడానికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. సెస్‌ ద్వారా వచ్చిన మరో రూ.2 వేల కోట్లకు అదనంగా రూ.2,500 కోట్ల రుణం తీసుకుని మొత్తం రూ.4,500 కోట్లతో 7,600 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించింది. 


శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం బుడ్డేపుపేట నుంచి బాలకృష్ణాపురం వరకు 3.22  కిలోమీటర్ల రోడ్డు టీడీపీ ప్రభుత్వంలో పూర్తిగా దెబ్బతిన్నది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆరోడ్డును రూ.74 లక్షలతో పునరుద్ధరించింది.  

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాళెం మండలం తొండంబట్టు – సిద్ధాపురం రోడ్డు  5.5 కిలోమీటర్లు టీడీపీ హయాంలో అధ్వానంగా ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ.3.75 కోట్లతో ఆ రోడ్డును పునరుద్ధరించి ప్రయాణికుల కష్టాలను తీర్చింది.  

బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తెనాలి–రేపల్లె ప్రదాన రహదారి క్రాప అడ్డరోడ్డు నుంచి క్రాప గ్రామం మీదుగా వేమూరు మండలం వెల్లబాడు అడ్డ రోడ్డు వరకు 3.60 కిలోమీటర్ల ఆర్‌ అండ్‌ బీ రోడ్డు 30 ఏళ్లగా గుంతల మయంగా మారి ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ. 2 కోట్లు వెచ్చించి నూతనంగా రోడ్డు నిర్మించడంతో ప్రజలకు సౌకర్యవంతంగా మారింది. 

రూ.45 కోట్లతో నాలుగు లేన్ల రోడ్డుగా కోడేరు –  నల్లజర్ల రహదారి
ఇది కోడేరు – నల్లజర్ల రోడ్డు (కేఎన్‌ రోడ్డు). పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గాల్లోని 25 గ్రామాలకు ప్రధాన రహదారి. తూర్పుగోదావరి జిల్లాకు అనుసంధాన రహదారి. వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, అనేక ఇంజనీరింగ్‌ కళాశాలలు, విద్యా సంస్థల బస్సులకు మార్గమది. జంగారెడ్డిగూడెం వెళ్లే బస్సులు, వందల సంఖ్యలో ఇదే మార్గంలో వెళుతుంటాయి. టీడీపీ హయాంలో దీని అభివృద్ధిని పట్టించుకోకపోవడంతో గుంతలమయంగా మారి, ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  ఉంగుటూరు నియోజకవర్గం చిలకంపాడు నుంచి తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని ఉద్యాన విశ్వవిద్యాలయం వరకు రెండు లేన్లుగా ఉన్న రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించడానికి రూ.45 కోట్లతో అంచనాలు రూపొందించారు. సెంటర్‌ డివైడర్‌తో రోడ్డుకిరువైపులా పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ విశాలంగా నిర్మించారు. ఇప్పుడీ రోడ్డు మీద వాహనాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement