రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మార్టేరు రోడ్డు
రోడ్లపై రోత రాతలతో పరాకాష్టకు రామోజీ పైత్యం
చంద్రబాబు హయాంలోనే రోడ్లపై తీవ్ర నిర్లక్ష్యం
టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.23,792.19 కోట్లు
రోడ్ల పునరుద్ధరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్న సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ వెచ్చించింది రూ.46,383.20 కోట్లు
యుద్ధప్రాతిపదికన రహదారుల నిర్మాణం, మరమ్మతులు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో టీడీపీ ఓటమి తథ్యమని స్పష్టం కావడంతో ఈనాడు రామోజీరావు పైత్యం పరిపరి విధాలుగా ప్రకోపిస్తోంది. అసహనంతో చిందులు తొక్కుతూ రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ విద్వేష విషం కక్కుతున్నారు. అందుకే రాష్ట్ర రోడ్ల పరిస్థితిపై మరోసారి రామోజీ తన మార్కు రోత రాతలతో ఈనాడు పత్రికను ఖరాబు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తూ రహదారుల పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసినా సరే ...కళ్లకు పచ్చ గంతలు కట్టుకున్న రామోజీ కబోదిలా వ్యవహరిస్తున్నారు.
అందులో భాగంగానే ఈనాడు పత్రిక గురువారం ‘రోడ్లేయని జగన్ ఓ జనహంతక చక్రవర్తి’ అంటూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెరతీశారు. తప్పుడు కథనంతో ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నంలో ఈనాడు బోల్తా కొట్టింది. వాస్తవానికి రాష్ట్రంలో రోడ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది చంద్రబాబు హయాంలోనే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రోడ్ల పునరుద్ధరణ పనులు వేగం పుంజుకున్నాయని ప్రభుత్వ రికార్డులు వెల్లడిస్తున్న వాస్తవం.
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు అయిదేళ్లలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులకు కలిపి మొత్తం రూ.23,792.19 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఏకంగా రూ.46,383.20 కోట్లు వెచ్చించారు. రోడ్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమిది. కళ్లుండీ కబోదిగా వ్యవహరిస్తున్న రామోజీకి కనువిప్పు కలిగించేందుకే ఈ ఫ్యాక్ట్ చెక్...
చంద్రబాబు జమానా..రహదారులు అధ్వాన్నం
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రోడ్ల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నది అక్షరసత్యం. ఆ ప్రభుత్వ హయాంలో మొదటి మూడేళ్లూ అసలు రోడ్ల గురించే పట్టించుకోలేదు. తరువాత రోడ్ల పునరుద్ధరణకు 2017–18లో తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని కూడా ఎన్నికల ప్రయోజనాల కోసం ‘పసుపు–కుంకుమ’ పథకానికి మళ్లించారు. దాంతో 2019 నాటికి రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
► టీడీపీ ప్రభుత్వ ఐదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.2,953.81 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.591 కోట్లు ఖర్చు చేసింది.
► రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల పునరుద్ధరణకు రూ.4,325 కోట్లే వెచ్చించింది.
► పంచాయతీరాజ్ రహదారుల కోసం రూ. 3,160.38 మాత్రమే ఖర్చు చేసింది.
► 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.13,353 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
వైఎస్సార్‌సీపీ హయాంలో మారిన రూపురేఖలు
2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రోడ్ల పునరుద్ధరణకు ప్రాధాన్యతనిస్తోంది. కోవిడ్ పరిస్థితులు, వరుసగా రెండేళ్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసినా రోడ్ల నిర్మాణంపై రాజీ పడలేదు. ప్రజల సంక్షేమంతోపాటు మౌలిక సదుపాయాలపైనా దృష్టి సారించారు. రోడ్ల మరమ్మతులు చేపట్టి విశాలంగా చేస్తున్నారు. కొత్త రోడ్లు వేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో రాష్ట్రంలో రోడ్లు మెరుగయ్యాయి. ఇందు కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ఖర్చు ఇలా ఉంది...
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రోడ్ల నిర్మాణానికి రూ.5,099.59 కోట్లు వెచ్చించింది. అంటే ఏడాదికి సగటున రూ.951కోట్లు. దీని ప్రకారం బాబు ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 591 కోట్లకంటే చాలా ఎక్కువే.
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అయిదేళ్లలో రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణానికి రూ.9,175 కోట్లు ఖర్చుచేసింది.
► పంచాయతీరాజ్ రోడ్ల కోసం రూ.6,804.61 కోట్లు వెచ్చించింది.
► జాతీయ రహదారుల కోసం రూ.25,304 కోట్లు వెచ్చించారు. సీఎం వైఎస్ జగన్ కేంద్రానికి పంపిన ప్రతిపాదనలు, నిరంతరం పర్యవేక్షణతోనే ఇది సాధ్యమైంది.
► ఇక రోడ్ల అభివృద్ధి సెస్ ద్వారా వచ్చిన రూ.3 వేల కోట్లను టీడీపీ చేసిన అప్పులు తీర్చడానికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేటాయించాల్సి వచ్చింది. సెస్ ద్వారా వచ్చిన మరో రూ.2 వేల కోట్లకు అదనంగా రూ.2,500 కోట్ల రుణం తీసుకుని మొత్తం రూ.4,500 కోట్లతో 7,600 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించింది.
Comments
Please login to add a commentAdd a comment