వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని తెలుగుదేశం మీడియాగా గుర్తింపు పొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర సంస్థలపై తీవ్రమైన విమర్శలు చేశారు. అవి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుగా మారాయని అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు తప్పుడు ,అబద్దపు వార్తలు ప్రచారం చేసిన ఈ మీడియా సంస్థలు తమ పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా అదే రీతిలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన చెప్పిన విషయాలన్నీ వాస్తవమే అని బోధ పడుతుంది. కారణం ఏమైనా ఈనాడు తదితర ఎల్లో మీడియా వైఎస్సార్సీపీపైన, మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఆ స్థాయిలో కక్ష బూనాయి.
ఆయనను ఇప్పుడు సైతం అడుగడుగునా అవమానించాలని, వేధించాలని ఆ మీడియా సంస్థలు కృతనిశ్చయంతో ఉన్నట్లు అర్థం అవుతుంది. లేకుంటే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా తప్పుడు సమాచారంతో కధనాలు ఎందుకు వండి వార్చుతారు! దానికి పెద్ద ఉదాహరణ జగన్ భద్రతకు సంబంధించి వచ్చిన వార్త అని చెప్పవచ్చు. ఏకంగా 986 మందిని జగన్ రక్షణకు వినియోగించారని, ఇందువల్ల ప్రభుత్వానికి 286 కోట్ల వ్యయం అయిందంటూ ఒక వార్తను జనం మీదకు వదిలారు. ఎవరైనా చదివినవారికి ఇది డబ్బు దుర్వినియోగమే అన్న అభిప్రాయం కలిగేలా వారు తమ టీవీలలో,పత్రికలలో ప్రచారం చేశారు.తీరా చూస్తే అదంతా అబద్దపు వార్తగా తేలింది.ఆ వివరాలను పేర్నినాని మీడియాకుతెలియచేశారు.అయినా దానిని టీడీపీ మీడియా సక్రమంగా ఇవ్వదనుకోండి. అది వేరే విషయం కాని, కచ్చితంగా ఈ సంస్థలు ఎన్నికల తర్వాత కూడా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని కొనసాగిస్తున్నాయన్న భావన కలుగుతుంది.
అదే సంగతిని పేర్ని నాని ఆధారసహితంగా వివరించారు. జగన్‌కు భద్రత కల్పించింది మొత్తం 196 మందితోనే అని ఆయన తేల్చి చెప్పారు. అదే చంద్రబాబు విషయంలో అందుకు దాదాపు పదిరెట్ల భద్రత కల్పించారన్న అంశాన్ని కూడా బయటపెట్టారు. చంద్రబాబు మనుమడు దేవాంశ్ ఏడాది వయసులో ఉన్నప్పుడే ఫోర్ ఫ్లస్ పోర్ సెక్యూరిటీని పెట్టారని ఆయన వెల్లడించారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ కాటగిరి,ఆయన సతీమణి, కుమారుడు ,కోడలికి కల్పించిన సెక్యూరిటీ వివరాలను తెలిపారు. చంద్రబాబుకు ,ఆయన కుటుంబానికి భద్రత కల్పించడాన్ని ఎక్కడా నాని తప్పు పట్టలేదు. జగన్ పై ఇలా దుర్మార్గపు రాతలురాయడాన్నే ఆక్షేపించారు.
ఈనాడు,తదితర టీడీపీ మీడియా కేవలం జగన్‌కు కల్పించిన భద్రత గురించి కాకుండా చంద్రబాబుకు,అలాగే ఆయా రాష్ట్రాలలో సీఎం పదవిలో ఉన్నవారికి ఎలాంటి భద్రత ఇస్తున్నది విశ్లేషణాత్మక కధనాలను ఇస్తే తప్పు కాదు. అలాకాకుండా కేవలం జగన్ పై ద్వేషభావంతో తప్పుడు కధనాలు రాయడమే దురదృష్టకరం. విచిత్రమేమిటంటే జడ్ ప్లస్ కాటగిరితో సహా ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సైతం వందలమందితో భద్రత పొందిన,ఇప్పటికీ పొందుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా టీడీపీ మీడియాలో జగన్ పై వచ్చిన వార్తకు వంత పాడడం.
ఎన్నికల తర్వాత కూడా జగన్ పై కసి,కక్ష తగ్గలేదన్నమాట. వచ్చే ఐదేళ్లు కూడా జగన్ వీటిని ఎదుర్కోక తప్పదు. ఎన్నికలకు ముందు లాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోను, అనేక ఇతర అంశాలలో ఎన్ని పచ్చి అబద్దాలను ఈనాడు మీడియా ప్రచారం చేసింది అంతా చూశాం. అప్పట్లో ఈనాడు అధినేత రామోజీరావు జీవించే ఉన్నారు.దాంతో ఆయన ఆధ్వర్యంలోనే అబద్దపు ప్రచారం చేస్తున్నారని భావించారు. ఆయన మరణం తర్వాత కూడా అదే పంధాను ఈనాడు కొనసాగిస్తుండడం విచారకరం. రామోజీరావు ఒకప్పుడు మాబోటి వాళ్లతో అబద్దాలు రాయవద్దని చెబుతుండేవారు. అలాంటి వ్యక్తి ఇలా ఇంత దారుణమైన అబద్దాలు రాయిస్తున్నారేమిటా అని గత ఐదేళ్లు బాదపడ్డాం. ఆయన కాలం చేసిన తర్వాత కూడా అదే పద్దతి కొనసాగిస్తుండడంతో ఇక ఆ పత్రిక తీరు మారదు అనుకునే పరిస్థితి ఏర్పడింది.
రామోజీ కుమారుడు కిరణ్ కూడా కేవలం రాజకీయ ట్రాప్ లో చిక్కుకుని ఈనాడు మీడియాను ప్రమాణరహితంగా చేయబోతున్నారా? అన్న సందేహం ఏర్పడుతోంది. అందరితో శభాష్ అనిపించుకోవలసిన రామోజీ ఒక రాజకీయ పార్టీ కొమ్ముకాసి అప్రతిష్టపాలయ్యారు. అందువల్లే ఏపీ ప్రభుత్వం రామోజీ సంతాప సభ ఏర్పాటు చేయడంపై కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. రామోజీకి ఏపీ ఉపయోగపడింది కాని, ఆయన వల్ల ఏపీకి ఏమి మేలు జరిగిందని ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. ఆయన కంపెనీలన్ని హైదరాబాద్ హెడ్ ఆఫీస్ గా ఉంచడం వల్ల ఏపీకి వచ్చే ఆదాయం ఏమీ లేదని, కాని ఏపీ ప్రజల వల్ల ఆయన సంస్థల ఉత్పత్తులకు గిరాకి దొరుకుతోందని సోషల్ మీడియాలో కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన అబద్దాలు రాయడం తెలుగుదేశంకు ఉపయోగపడింది కనుక ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక, ప్రజాధనం ఖర్చు చేసి సంస్మరణ సభ పెట్టారని కొందరు విమర్శిస్తున్నారు. కోట్ల రూపాయలు వ్యయం చేసి ప్రచార ప్రకటనలు కూడా ప్రభుత్వం ఇచ్చింది.
చంద్రబాబు నాయుడు తన రాజగురువుకు ఈ రకంగా రుణం తీర్చుకంటున్నారని కామెంట్లు వస్తున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు కూడా ఇలా ప్రత్యేకంగా ప్రభుత్వపరంగా సంతాప సభ జరిపారో, లేదో అని వారు గుర్తు చేస్తున్నారు. భారత రాష్ట్రపతి అయిన నీలం సంజీవరెడ్డికి గాని, మాజీప్రధాని పీవీ నరసింహారావుకు కాని, ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరికి ప్రభుత్వపరంగా ఇంత భారీ వ్యయంతో సంస్మరణ సభలు నిర్వహించలేదు. భవిష్యత్తులో ఎవరైనా ప్రైవేటు ప్రముఖుడు పరమపదిస్తే,ఇలాగే ప్రభుత్వం సంతాప సభలనుఅధికారికంగా నిర్వహిస్తుంందా అన్న ప్రశ్నను వేస్తున్నారు. అవసరం లేని వివాదం అయినప్పటికీ ,ఈనాడు మీడియా దుర్మార్గపు వైఖరి వల్ల ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయి.
పేర్ని నాని వేసిన ప్రశ్నలకు ఈనాడు ఎందుకు సమాధానం ఇవ్వలేకపోతోంది? ఒకప్పుడు అసత్యాలు అచ్చయినా, తప్పులు దొర్లినా వెంటనే క్షమాపణ కోరుతూ సవరణలు వేసేవారం.ఇప్పుడు ఈనాడు వంటి మీడియా అడ్డగోలు కధనాలు రాస్తూ జర్నలిజం ప్రమాణాలను అధమస్తాయికి తీసుకు వెళ్లడం దురదృష్టకరం. జగన్ బెంగుళూరు వెళితే కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయడానికే అని ఎల్లో మీడియా దుష్ట ప్రచారం చేసింది. స్పీకర్ ఎన్నికలో ఎన్డీయేకి మద్దతు ఇస్తే బీజేపీ తో జత కలవడానికి తంటాలు పడుతోందని ఆరోపిస్తున్నారు.విచిత్రం ఏమిటంటే బీజేపీతో జట్టు కట్టడానికి చంద్రబాబు ఢిల్లీలో పడిగాపులు పడి టీడీపీ ఆత్మగౌరవాన్ని మంట కలిపినా ఈ మీడియాకి అది గొప్పగా కనిపించింది. టీడీపీ, బీజేపీతో కలపడానికి తాను చాలా చివాట్లు తిన్నానని పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి మర్చిపోయినట్లు వీరు నటిస్తూ జగన్ పై ఉన్నవి,లేనివి కలిపి కల్పిత గాధలు రాస్తున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్లి చేసిన ప్రసంగాలు భవిష్యత్తులో ప్రభుత్వం ఎలా ఉండబోతోందో తెలియచేసినట్లనిపిస్తుంది. 2014-19 మద్యలో ఏపీ పేద రాష్ట్రమని, ఎన్నో కష్టాలు,బాధలు పడుతున్నామని అంటుండేవారు. తాను ఎంతగా శ్రమపడుతున్నది నిత్యం చెబుతుండేవారు.జనం వాటిని వినలేక బోర్ ఫీల్ అవుతుండేవారు. మళ్లీ అదే ప్రకారం కుప్పంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితులు ఆశాజనకంగా లేవని, ఖజానా ఖాళీగాఉందని, మోయలేనంత భారం ఉందని ఆయన చెబుతున్నారు. తనకు మనోధైర్యం ఉందని, కష్టాలు చూసి పారిపోయేవాడిని కానని సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు. తాను ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలను ఎగవేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న అనుమానం ప్రజలకు వస్తోంది.రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై ఎన్నికల ముందు ఇంతకన్నా ఎక్కువే విమర్శలు చేస్తూనే, సూపర్ సిక్స్ అంటూ అలవికాని హామీలను ఎందుకు ఇచ్చారో మాత్రం చంద్రబాబు చెప్పరు.
అధికారం కోసం ఏమైనా చేయవచ్చని ఆయన శైలి పదే,పదే రుజువు చేస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనలో అనేక స్కీములను అమలు చేసినా, ఎన్నడూ ఇలా తాను డబ్బుల కోసం శ్రమపడుతున్నానని, ఇరవైనాలుగు గంటలూ పాటు పడుతున్నానని కధలు చెప్పలేదు. ఆయన ఎన్నికల మానిఫెస్టోలో చెప్పింది చేయడానికి యత్నించారు. పేర్నినాని ఒక మాట అడిగారు. టీడీపీ కాని, చంద్రబాబు కుమారుడు లోకేష్ కాని మాట్లాడితే జగన్ వి పాలస్ లని అంటారే!అందువల్ల జగన్ ఇంటిని, చంద్రబాబు జూబ్లిహిల్స్ లో నిర్మించుకున్న రాజమహల్ ను మీడియాను పిలిచి చూపించి ఎవరివి పాలెస్ లో తేల్చడానికి సిద్దమా అని సవాల్ చేశారు. మరి దీనికి చంద్రబాబు లేదా లోకేష్ స్పందిస్తారా?.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment