మైనారిటీలకు ఎక్కువ మేలు చేసింది వైఎస్ జగనే
వాస్తవాలను వక్రీకరించిన ‘ఈనాడు’
నవరత్నాల ద్వారా కలిగిన ప్రయోజనం కనిపించలేదా ‘పచ్చ గురు’విందా!
ఈ ఐదేళ్లలో రూ.24,304.37 కోట్ల మేర సంక్షేమం.. డీబీటీ పద్ధతిలో రూ.13,239.49 కోట్లు జమ
నాన్ డీబీటీ విధానంలో రూ.11,064.88 కోట్లు లబ్ధి
స్వయం ఉపాధికంటూ తన హయాంలో రూ.248.51కోట్లే ఖర్చుచేసిన బాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మైనారిటీలకు మేజర్ మేలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రామోజీ మరోసారి విషం చిమ్మారు. వైఎస్సార్‌సీపీకి ముస్లిం మైనారీటీలు అండగా ఉన్నారని గుర్తించిన దినకంత్రీ పత్రిక ఈనాడులో తప్పుడు కథనం వండివార్చారు. వాస్తవాలను వక్రీకరించి చంద్రబాబుకు బాకా ఊదారు. మైనారిటీలను మోసం చేసిన జగన్ అంటూ గగ్గోలు పెట్టారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు అందించిన సాయం, సీఎం వైఎస్ జగన్ సర్కార్ అందించిన ఆర్థిక లబ్ది అధికారిక లెక్కలను గమనిస్తే నిజానికి మైనారిటీలకు ధోకా ఇచ్చింది ఎవరో ఇట్టే అర్థమవుతోంది.
బాబు చేసిన అరకొర సాయాన్ని భూతద్దంలో చూపే యత్నం చేస్తున్న రామోజీ పచ్చకళ్లకు సీఎం వైఎస్ జగన్ నవరత్నాలతో మైనారిటీలకు కల్పించిన ఆర్థిక భరోసా కన్పించలేదు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో మైనారిటీలకు సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.13,239.49 కోట్లు నేరుగా వారి ఖాతాలకే జమ చేశారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు, జగనన్న తోడు వంటి కార్యక్రమాల ద్వారా (నాన్ డీబీటీ) మరో రూ.11,064.88 కోట్లు ప్రయోజనం చేకూర్చారు. ఐదేళ్లలో మొత్తం రూ.24,304.37 కోట్ల మేర మైనారిటీలకు లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతోంది.
మైనారిటీలకు ధోకా ఇచ్చింది బాబే..
ముస్లిం మైనారిటీ ర్గాల సంక్షేమానికి 2014 మేనిఫెస్టోలో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేదు. హజ్ యాత్రికుల సౌకర్యం కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటలో హజ్ హౌస్‌ల నిర్మాణం హామీ కార్యరూపం దాల్చలేదు. ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లూ కేటాయిస్తానన్న హామీనీ బాబు అటకెక్కించారు. వక్ఫ్ ఆస్తుల రికార్డులను పక్కాగా తయారు చేసి వాటిని పరిరక్షిస్తామని చెప్పి మోసం చేశారు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం రూ.లక్ష వడ్డీలేని రుణాలు ఇస్తామని అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వడ్డీలేని ఇస్లామిక్ బ్యాంకింగ్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని ఇచ్చిన ప్రధాన హామీనీ అమలు చేయలేదు. అయినా అప్పుడు బాబు ఘనకార్యాలు రామోజీ పచ్చకళ్లకు కనిపించలేదు.
ఆరోపణ: ఇదీ వైకాపా ఘనకార్యం
వాస్తవం: స్వయం ఉపాధి రుణాల కోసం నిధులు కేటాయించి అమలు చేయలేదని ఈనాడు అడ్డగోలుగా రాసింది. వాస్తవానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక మైనారిటీలకు శాశ్వత జీవనోపాధి చూపించేలా వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు రూ.1,613.25 కోట్లు అందించింది. ఆసరా పథకం ద్వారా 1,69,412 మందికి రూ.583.01 కోట్లు అందించి వారికి అండగా నిలిచింది.
ఆరోపణ: రాయితీ రుణాలకూ పాతర
వాస్తవం: 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 36.18 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. వారిలో అత్యధిక శాతం మంది చిరు వ్యాపారులు, చేతివృత్తుల వారు ఉండటంతో వారికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండదండలు అందిస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా అరకొర సాయం చేసి చేతులు దులుపుకోకుండా వారికి స్వయం ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేలా, ఆర్థిక, సామాజిక, రాజకీయ చేయూతను అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. నవరత్నాలతోపాటు అనేక కార్యక్రమాల ద్వారా వారి జీవనోపాధికి ఊతమిచ్చేలా చేయడంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్సార్ వాహన మిత్ర వంటి అనేక పథకాలతో మైనారిటీలకు పెద్ద మేలు చేశారు.
ఆరోపణ: ఇమామ్‌లు.. మౌజమ్‌లకు వెన్నుపోటే
వాస్తవం: రాష్ట్రంలో మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లు, మౌజమ్‌లకు ఆర్థిక సాయం అందించే విషయంలో ఈనాడు చంద్రబాబు గొప్పులు ఘనంగా చెప్పే యత్నం చేసింది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అరకొరగా ఆర్థిక సాయం అందిస్తే దాన్ని పెంచి మరీ అందిస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతోంది. గత ప్రభుత్వం మౌజమ్‌లకు రూ.3 వేలు, ఇమామ్‌లకు రూ.5 వేలు మాత్రమే అందించింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మౌజమ్‌లకు రూ.5 వేలు, ఇమామ్‌లకు రూ.10 వేలు ఆర్థిక సాయం పెంచి జగన్ అందిస్తున్నారు.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనంగా రూ.300.68 కోట్లు అందించింది. దీనికితోడు వారికి భరోసా ఇచ్చేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వన్‌టైమ్ ఫైనాన్సియల్ అసిస్టెన్సీ ఇచ్చింది. తెల్లకార్డుదారులకు స్పెషల్ కోవిడ్ అసిస్టెన్సీగా మైనార్టీలకు సుమారు రూ.100 కోట్లు అందించింది. షాదీతోఫా ద్వారానూ ఆర్థిక సాయాన్ని పెంచి అందించిన ఘనత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి దక్కింది.
ఆరోపణ: తేదేపా హయాంలో రూ.248 కోట్ల రుణాలు
వాస్తవం: టీడీపీ ప్రభుత్వంలో గొప్పగా రుణాలు ఇచ్చినట్టు రామోజీరావు బాకాలు ఊదారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనారిటీల సామాజిక ఆర్థిక అభివృద్ధి, శిక్షణ, విద్యాభివృద్ధి కోసం బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చినట్టు గొప్పలు పోయారు. వాస్తవానికి 2014 నుంచి 2019 వరకు బ్యాంకుల ద్వారా ఇచ్చిన రుణాలకు టీడీపీ ప్రభుత్వం రూ.343.52 కోట్లు కేటాయించి రూ.248.51 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం శోచనీయం. ఐదేళ్లలో కేటాయించిన నిధులూ లబ్దిదారులకు ఖర్చు చేయలేని దారుణమైన పరిస్థితి గత ప్రభుత్వానిది. మరోవైపు మైనారిటీల శిక్షణ–ఉపాధి పథకంలో 2014 నుంచి 2019 వరకు కేవలం రూ.62 కేటాయించి అందులోనూ రూ.53.89 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం గమనార్హం. అదీ తొలి ఏడాది కేవలం రూ.4.30 కోట్లు కేటాయించి, ఎన్నికల ముందు మాత్రం గొప్పలు చెప్పుకొనేందుకు రూ.16.80 కోట్లు కేటాయించారు.
బాబుకు రామోజీ చేస్తున్న భజనను జనం నమ్మరు
చంద్రబాబు రాజకీయ ప్రయోజనం కోసం రామోజీ ఎంత బాజా వాయించినా జనం నమ్మే స్థితిలో లేరు. నవరత్నాల ద్వారా ఆర్థిక లబ్ధిని చేకూర్చే అనేక పథకాలను అందించడంతోపాటు మైనారిటీలకు శాశ్వత జీవనోపాధి కోసం సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముస్లింలను సీఎం వైఎస్ జగన్ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో ముస్లిం యువత వేలాది మంది బాగా చదువుకుని నేడు డాక్టర్‌లుగా, ఇంజనీర్‌లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా పలు రంగాలలో స్థిరపడి సామాజికంగా అభివృద్ధి చెందారు.
అందుకే ఆ మహానేత వైఎస్సార్‌ని ముస్లిం సమాజం గుండెల్లో పెట్టుకుంది. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి కంటే పది అడుగులు ముందుకు వేసి ముస్లింలకు మేలు చేస్తున్నారు. 2019 ఎన్నికలలో ముస్లింలకు ఐదు సీట్లు ఇచ్చారు. నాలుగు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి, శాసన మండలి డెప్యూటీ చైర్మన్‌గా అవకాశం కల్పించడమే కాకుండా నామినేటెడ్, స్థానిక సంస్థల పదవుల్లోనూ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లింలకు ఇచ్చి మరింత ఆదరణ చూపిన సీఎం వైఎస్ జగన్‌కు ముస్లిం సమాజం అండగా ఉంటుంది. – డాక్టర్ మీర్చా షంషీర్ ఆలీబేగ్, చైర్మన్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment