సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో కమీషన్లు కాజేసి, పంచుకుతిన్నాక.. దానిని పూర్తి చేయలేక చేతులెత్తేసిన చంద్రబాబు పాపాలను సీఎం వైఎస్ జగన్‌పై నెట్టేందుకు ‘ఈనాడు’లో పచ్చి అబద్ధాలను పాడిందే పాడుతున్నారు రామోజీరావు. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని ప్రధాని మోదీ ఆరోపిస్తే.. ట్రాన్స్‌ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు తాజాగా ఆ బాగోతాన్ని రట్టు చేశారు.
సోమవారం పోలవారం పేరుతో ఎంతలా వసూళ్లు చేసిందీ బట్టబయలు చేశారు. అక్రమార్జన కోసం జీవనాడి పోలవరం జీవం తీస్తూ చంద్రబాబు చేసిన తప్పులను సీఎం జగన్ సరిదిద్దుతూ ప్రణాళికాయుతంగా ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థిక ఇబ్బందుల్లోనూ స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని 6.1 కిమీల పొడవున స్పిల్ వే మీదుగా మళ్లించి రికార్డు సృష్టించారు. పోలవరంను కేంద్రం తరఫున రాష్ట్రం నిర్మిస్తోంది. చంద్రబాబు పాపాల వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్‌పై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే.
ఆ నిర్ణయం ఆధారంగా డయాఫ్రమ్‌వాల్‌ను నిర్మించి.. ప్రధాన (ఈసీఆర్ఎఫ్) డ్యామ్‌ను పూర్తి చేసి ఆయకట్టుకు నీళ్లందించి పోలవరం ఫలాలను రైతులకు అందించేలా అడుగులు వేస్తున్న సీఎం జగన్‌పై ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కర్షకుల్లో ఆదరణ మరింతగా పెరుగుతోంది. ఇది టీడీపీ ఉనికినే దెబ్బతీస్తుందనే ఆందోళనతో రామోజీరావు విషం చిమ్ముతూ తప్పుడు కథనాలు అచ్చేస్తున్నారు. ఆ క్రమంలోనే ‘చేయలేక చేతులెత్తేశారు’ శీర్షికన బుధవారం ‘ఈనాడు’లో కథనాన్ని అచ్చేశారు. ఆ కథనంలో సీఎం జగన్‌పై రామోజీరావుకు ఉన్న అక్కసు, అసూయ వ్యక్తం చేశారే తప్ప వీసమెత్తు నిజం లేదు. ఇవీ వాస్తవాలు..
ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టు డీపీఆర్–2కు ఇంతవరకూ సీఎం జగన్ పెట్టుబడి అనుమతి సాధించలేదు.
వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలి. చంద్రబాబు సీఎంగా ఉండగా కమీషన్ల కక్కుర్తితో దానిని రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారమే పూర్తిచేస్తామని 2016 సెప్టెంబరు 7న నాటి సీఎం చంద్రబాబు అంగీకరించి పనులను దక్కించుకున్నారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లు ఇచ్చేందుకు అప్పట్లో కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది.
ఇందులో 2014 ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు మినహాయించి మిగతాది అంటే రూ.15,667.91 కోట్లు ఇస్తామని తేల్చింది. 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.15,146.27 కోట్లు కేంద్రం విడుదల చేసింది. మిగిలింది రూ.521.63 కోట్లు మాత్రమే. కానీ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేస్తూ.. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేసి, ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీతో సమావేశమైన ప్రతిసారీ కోరుతున్నారు. ఇందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు.
ప్రధాని ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. విభాగాల వారీగా విధించిన పరిమితులను ఎత్తేసేందుకు సమ్మతి తెలిపింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి సూత్రప్రాయంగా కూడా అంగీకరించింది. ఆ గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అదనంగా రూ.2,749.85 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. మొత్తం రూ.15,661 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖకు శుక్రవారం సిఫార్సు చేసింది. దీన్ని ఖరారు చేసేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఏర్పాటుచేసిన ఆర్‌సీసీ (రివైజ్డ్ కాస్ట్ కమిటీ) దాన్ని ఆమోదించింది. నివేదిక ఇవ్వడం లాంఛనమే. ఆ నివేదికను చూసి కేంద్ర కేబినెట్‌కు జల్‌శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదన పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది.
ఈనాడు ఆరోపణ: 2020 వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఈ సమస్య పరిష్కారానికి సీఎం జగన్ చొరవ చూపలేదు.
వాస్తవం: గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేశాక ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్‌వాల్ నిర్మించాలి. కానీ.. నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో వరద మళ్లింపు పనులు పూర్తి చేయకుండానే డయాఫ్రమ్‌వాల్ పనులను ఎల్ అండ్ టీ, బావర్ సంస్థలకు నామినేషన్‌పై సబ్ కాంట్రాక్టుకు అప్పగించారు. పనులు చేసిన ఆ సంస్థలకు రూ.400 కోట్లు బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు.
ఆ తర్వాత రూ.2,917 కోట్ల విలువైన పనులను ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్‌పై కట్టబెట్టారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి కాఫర్ డ్యామ్‌లు పూర్తి చేయాలని కేంద్రం నిర్దేశించింది. పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావనే నెపంతో కాఫర్ డ్యామ్‌లలో ఖాళీలు పెట్టి, ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇదంతా చంద్రబాబు నిర్వాకమే. 2019, 2020లలో గోదావరి వరద కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాలగుండా అధిక ఒత్తిడితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్‌వాల్ దెబ్బతింది. దీనికి చంద్రబాబు తప్పిదమే కారణమని హైదరాబాద్ ఐఐటీ నివేదిక ఇచ్చింది.
డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తేల్చాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి షెకావత్‌ను అనేక సార్లు సీఎం జగన్ కోరారు. వాటికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి షెకావత్.. డయాఫ్రమ్‌వాల్ భవితవ్యాన్ని తొందరగా తేల్చాలని ఆ శాఖ సలహాదారు వెదిరె శ్రీరాంను ఆదేశించారు. కేంద్రం తీసుకునే నిర్ణయాల ఆధారంగా డయాఫ్రమ్‌వాల్‌పై ముందుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
ఈనాడు ఆరోపణ: ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణం ఆలస్యమైంది. సీపేజీ అధికమైంది. ఫలితంగా వాటిని నిర్మించిన ఉద్దేశమే దెబ్బతింది.
వాస్తవం: ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణంలో జాప్యానికి చంద్రబాబే కారణం. 2018లో ఈ డ్యామ్‌ల పనులు ప్రారంభించి.. 2019 ఫిబ్రవరిలో చేతులెత్తేశారు. సీఎం జగన్ 2019 మే 30న అధికారం చేపట్టారు. 2019 జూన్‌లో గోదావరికి వరదలు వచ్చాయి. నవంబర్ వరకూ గోదావరి వరదెత్తింది. వరదలు తగ్గాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లను సీఎం జగన్ పూర్తి చేశారు. కాఫర్ డ్యామ్‌లలో సీపేజీ సాధారణమే. సీపేజీ నీటిని దిగువకు తరలిస్తూ ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో దెబ్బతిన్న ఇసుక నేలను యధాస్థితికి తెచ్చే పనులను ప్రభుత్వం చేపట్టింది. డయాఫ్రమ్‌వాల్‌పై కేంద్రం నిర్ణయం తీసుకోగానే.. దాని ఆధారంగా ప్రధాన డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది.
ఈనాడు ఆరోపణ: అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీ కోసం ఇప్పటిదాకా టెండర్లే పిలవలేదు. ఆ నిపుణులు వచ్చి నిర్ణయాలు తీసుకుంటే తప్ప పనులు ముందుకు సాగవు.
వాస్తవం: పోలవరం పనుల్లో సమస్యలు పరిష్కరించాలంటే అంతర్జాతీయ నిపుణుల ఏజెన్సీ సహకారం అవసరమని సీడబ్ల్యూసీ పేర్కొంది. ఆ ఏజెన్సీ కోసం టెండర్లు పిలుస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ డిసెంబర్ 5న నిర్వహించిన సమావేశంలో పేర్కొంది. ఆ ప్రక్రియ పూర్తయితే ఏజెన్సీ అందుబాటులోకి వస్తుంది. ఆ ఏజెన్సీ నిర్ణయాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment