డ్వాక్రా సంఘాలు, రుణాలపై రామోజీ దిక్కుమాలిన రాతలు
రూ. 25,570.80 కోట్లు నాలుగు విడతల్లో ఇస్తే, జగన్ ద్రోహం చేసినట్టా..
చంద్రబాబు ప్రభుత్వం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా జగన్ ప్రభుత్వంలో ఉన్నతి
అప్పట్లో గరిష్టంగా రూ.30 వేల రుణమే.. ఇప్పుడది రూ.5 లక్షల దాకా పెంపు
హ.. హవ్వ! చదివిన వాళ్లు నవ్వుకుంటారే అని సిగ్గు ఎగ్గూ అన్నింటినీ ‘ఈనాడు’ వదిలేసింది. అధికారంలోకి వస్తే డ్వాక్రా (పొదుపు సంఘాల) రుణాలన్నీ (రూ.14,203.58 కోట్లు) భేషరత్తుగా మాఫీ చేస్తానని 2014 ఎన్నికల ముందు మాటిచ్చి ఆ తరువాత ఒక్క రూపాయీ మాఫీ చేయని చంద్రబాబు పాలనలో పొదుపు సంఘాల మహిళలందరూ ఓ వెలుగు వెలిగారట.
2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికి (2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి) పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న మొత్తం రూ.25,570.80 కోట్ల అప్పును వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతలో అందజేస్తే.. పొదుపు సంఘాలను, మహిళలు నిలువునా మోసం చేయడమట.
ఇలాంటి పచ్చి అబద్ధాలను రామోజీరావు తన ‘ఈనాడు’ పత్రికలో ‘నాడు దర్జా– నేడు గజగజ, డ్వాక్రా సంఘాలకు తీరని ద్రోహం’ అంటూ రోత రాతలు అచ్చేశారు. తమ ప్రభుత్వం డ్వాక్రా రుణ మాఫీ అమలు చేయని అంశాన్ని అప్పటి మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలో లిఖిత పూర్వకంగా వెల్లడించినా.. ఆ అంశాన్ని రామోజీ తన రాతల్లో ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. – సాక్షి, అమరావతి
ఈనాడు అబద్ధం: 2014 –19 మధ్య టీడీపీ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు ఉన్నతి పథకంలో రూ. 800 కోట్లు వడ్డీ లేకుండా రుణాలుగా ఇచ్చింది. అప్పును నెలవారీగా వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. మహిళా సాధికారితకు పెద్దపీట వేయడంలో తనను మించిన వారే లేరన్నట్టు గొప్పులు చెప్పుకునే జగన్..
ఈ ఐదేళ్లలో ఉన్నతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.
వాస్తవం: ఉన్నతి పథకం ద్వారా ఎస్టీ, ఎస్సీ సామాజికవర్గాలకు చెందిన పొదుపు సంఘాల మహిళలకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో 2.40 లక్షల మందికి రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల మంది వడ్డీ లేని రుణాలను అందజేసింది. అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా ఒక్కొక్కరి గరిష్టంగా కేవలం రూ. 30 వేల వరకు మాత్రమే రుణాలు ఇచ్చింది.
గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లు, అంతకు ముందు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో నాలుగేళ్లు కలిపి మొత్తం తొమ్మిదేళ్లలో 1.67 లక్షల మందికి రూ. 800 కోట్లు ఈ పథకం ద్వారా రుణాలు ఇస్తే, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలోనే 2.40 లక్షల మందికి రూ. 900 కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు అందజేసింది. ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం(ఒక్క ఏడాది)లోనే దాదాపు రూ.200 కోట్లు ఇచ్చింది.
ఈనాడు అబద్ధం: జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సున్నా వడ్డీ రాయితీలోనూ కోత పెట్టింది.
వాస్తవం: బ్యాంకులో రుణం తీసుకొని సకాలంలో కిస్తీల వారీగా చెల్లించే పొదుపు సంఘాల మహిళలకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల్లో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వారి రుణాలపై వడ్డీ రూ.4969.05 కోట్లు చెల్లించింది. ఆర్థిక ఏడాది ముగిసిన వెంటనే ఠంచన్‌గా సున్నా వడ్డీ పథకాన్ని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేసింది. దీని ద్వారా ఏటా 1.05 కోట్ల మంది మహిళలు ప్రయోజనం పొందారు.
ఇంకోవైపు.. చంద్రబాబు ప్రభుత్వం తన ఐదేళ్ల కాలంలో చివరి మూడు సంవత్సరాలు 2016 ఆగస్టు తర్వాత కాలానికి సున్నా వడ్డీ పథకానికి నిధులే ఇవ్వలేదు. ‘ఈనాడు’ తన కథనంలోనే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వలేదని అంగీకరించింది కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అమలులో ఉన్న ఈ పథకానికి నిధులే విడుదల చేయలేదు. అదే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి అమలు చేస్తూనే.. నవరత్నాల కార్యక్రమాలు ద్వారా కూడా అదనపు లబ్ధి చేకూర్చింది.
ఈనాడు అబద్ధం: జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ‘మిత్ర’లకు తీరని ద్రోహం చేసింది.
వాస్తవం: రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలు పొదుపు సంఘాలలో సభ్యులుగా ఉన్నారు. ఆ కోటి మందిలో ఓ రెండు మూడు వేల మందిని అప్పటి టీడీపీ ప్రభుత్వం భీమా మిత్రలుగా నియమించింది. ఆ నియామకాలు కూడా అప్పటి జన్మభూమి కమిటీ సభ్యుల తరహాలోనే జరిగాయి. తమ పరిధిలో దురదృష్టవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి ప్రభుత్వం ఇచ్చే బీమా సొమ్ములో కనీసం పది శాతం లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలూ ఉండేవి.
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన అనంతరం ఇప్పుడు ఈ కార్యక్రమాలను వారి ఆధ్వర్యంలో పారదర్శకంగా జరిపిస్తోంది. బీమా లబ్ధిదారుల నుంచి ఒక పైసా కూడా వసూలు చేయకుండా అందిస్తున్నారు. బీమా ప్రీమియాన్ని కూడా పూర్తిగా రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment