interest free loans
-
Nirmala Sitharaman: పెట్రో జీఎస్టీ ఎంతన్నది... రాష్ట్రాలే నిర్ణయించుకోవాలి
న్యూఢిల్లీ: ప్లాట్‌ఫాం టికెట్లకు ఇకపై జీఎస్టీ ఉండబోదు. వాటితో పాటు రిటైరింగ్ రూములు, వెయిటింగ్ రూములు, క్లోక్ రూములు, ప్లాట్‌ఫాంలపై బ్యాటరీ వాహనాలు తదితర రైల్వే సేవలపై కూడా జీఎస్టీ తొలగించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ఈ మేరకు పలు సిఫార్సులు చేసింది. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడా ఈ సందర్భంగా నిర్మల చర్చలు జరిపారు. కేంద్రం ఇచ్చే 50 ఏళ్ల వడ్డీ లేని రుణాల పథకం ప్రయోజనాలను రాష్ట్రాలు అందిపుచ్చుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్‌ను కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలన్నది కేంద్రం ఉద్దేశమని ఆమె పునరుద్ఘాటించారు. ‘‘అందుకు అంగీకరించాల్సింది ఇక రాష్ట్రాలే. అవి ఒక్కతాటిపైకి వచ్చి చర్చించి పెట్రోల్, డీజిల్‌పై ఎంత శాతం జీఎస్టీ వేయాలో నిర్ణయించుకుని కౌన్సిల్‌కు తెలపాలి’’ అని భేటీ అనంతరం నిర్మల మీడియాతో అన్నారు. ‘‘ఇన్పుట్ క్రెడిట్ పన్నులో మార్పుచేర్పులు చేయాలని నిర్ణయం జరిగింది. ఇన్వాయిసింగ్ తదితరాల్లో అక్రమాలకు అడ్డుకట్టే వేసేందుకు ఇకపై దేశవ్యాప్తంగా బయోమెట్రిక్‌తో కూడిన ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేస్తున్నాం. జీఎస్టీ చెల్లింపు తుది గడువును ఏప్రిల్ 30 నుంచి జూన్ 30కి పొడిగించాం. తద్వారా వర్తలకులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి సంస్థలు, పరిశ్రమలకు లబ్ధి చేకూరుతుంది’’ అని మంత్రి వివరించారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు... → అన్ని రకాల సోలార్ కుక్కర్లపై ఇకనుంచి 12 శాతం జీఎస్టీ → అన్ని రకాల కార్టన్ బాక్సులపై జీఎస్టీ 18 నుంచి 12 శాతానికి తగ్గింపు. జమ్మూ కశీ్మర్, హిమాచల్‌ప్రదేశ్ వంటి రాష్ట్రాల పళ్ల వ్యాపారులకు ప్రయోజనం. → స్ప్రింకర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు. → విద్యా సంస్థల హాస్టళ్లలో కాకుండా బయట ఉండే విద్యార్థులకు నెలకు రూ.20 వేల దాకా దాకా జీఎస్టీ మినహాయింపు → స్టీల్, అల్యుమినియం, ఇనుప పాల క్యాన్లపై 12 శాతం జీఎస్టీ. → జీఎస్టీ ఎగవేత తదితర ఉదంతాల్లో జరిమానాలపై వడ్డీ ఎత్తివేత. -
బ్యాంకు ఉద్యోగులకు షాక్.. వాటిపై పన్ను కట్టాల్సిందే..!
బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇచ్చే వడ్డీ రహిత లేదా రాయితీ రుణాలు "అంచు ప్రయోజనాలు" (ఫ్రింజ్ బెనిఫెట్స్) అని, వాటిపై పన్ను వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.బ్యాంకు సిబ్బంది అనుభవిస్తున్న రుణ ప్రయోజనం వారికి ప్రత్యేకమైనదని, అది జీతంతోపాటు అదనపు ప్రయోజనమని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఈ ప్రయోజనంపై పన్ను వర్తిస్తుందని మే 7న ధర్మాసనం పేర్కొంది.ఆదాయపు పన్ను నియమాన్ని కోర్టు సమర్థించడంతోపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటును బెంచ్‌మార్క్‌గా నిర్ణయించడం కూడా ఏకపక్ష లేదా అసమాన అధికార వినియోగం కాదని అభిప్రాయపడింది. ఫ్రింజ్ బెనిఫిట్ గణన కోసం ఒకే స్పష్టమైన బెంచ్‌మార్క్‌ను నిర్ణయించడం ద్వారా కస్టమర్ల నుండి వివిధ బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లను నిర్ధారించే చిక్కుముడి ఉండదని బెంచ్ పేర్కొంది.బ్యాంకులు తమ ఉద్యోగులకు అందించే వడ్డీ రహిత లేదా రాయితీతో కూడిన రుణ ప్రయోజనాలపై ఎస్బీఐ ప్రైమ్ లెండింగ్ రేటు ప్రకారం వసూలు చేసే వడ్డీ కంటే బ్యాంకు వసూలు చేసే వడ్డీ తక్కువగా ఉన్నట్లయితే వీటిని ఫ్రింజ్ బెనిఫిట్స్‌గా భావించి పన్ను విధించే ఆస్కారం ఉందని ఆదాయపు పన్ను నియమాలు చెబుతున్నాయి. -
సొంతింటి రుణానికి ప్రభుత్వ వడ్డీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండకూడదనేదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీ రామారావు అన్నారు. డబుల్ బెడ్రూమ్, గృహలక్ష్మి పథకాలతో సమాంతరంగా మధ్యతరగతి వారి కోసం ఓ సరికొత్త పథకానికి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. బ్యాంకు రుణంతో 1,200 నుంచి 1,500 చదరపు అడుగుల మధ్య ఇల్లు కొనుగోలు చేసే వారి బ్యాంకు వడ్డీని ప్రభుత్వమే కట్టేలా ఈ పథకం ఉండే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ ఆధ్వర్వంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండేళ్లు కరోనాతో, ఎన్నికలకు మరొక ఏడాది పోగా నికరంగా ఆరున్నరేళ్లు మాత్రమే పరిపాలించామని.. ఈ తక్కువ సమయంలో ప్రజలకు కనీస అవసరాలు మాత్రమే తీర్చగలిగామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు సృజనాత్మకత కార్యక్రమాల అమలులో చిన్న చిన్న సమస్యలు ఎదురవడం సర్వసాధారణమేనని, అలాంటిదే ధరణి అని కేటీఆర్ చెప్పారు. గతంలో లంచం ఇవ్వకుండా రిజి్రస్టేషన్ జరిగేది కాదని, కానీ, ఇప్పుడు ధరణితో పారదర్శకంగా ఒకే రోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరుగుతున్నాయని తెలిపారు. ధరణికి సమస్యలను పరిష్కరించేందుకు నిపుణుల కమిటీ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి చెప్పారు. తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి అయినా ఒక గంటలో హైదరాబాద్ చేరుకునేలా ఒక రవాణా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. హరిత భవనాలు, పునరుత్పాదక విద్యుత్‌కు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల షటిల్ సరీ్వస్‌లతో కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అర్బన్ పార్క్‌లను పెంచుతామన్నారు. అహంకారం కాదు.. చచ్చేంత మమకారం ప్రతిపక్షాలు మాకు అహంకారం అంటూ ప్రజలకు సంబంధం లేని అంశాలను చూపి తిడుతున్నాయని, తెలంగాణపై తమకుంది అహంకారం కాదని, చచ్చేంత మమకారమని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్‌ది సోషల్ మీడియాలో హడావుడే తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ లేదని విమర్శించారు. డిసెంబర్ 3న మళ్లీ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పారీ్టల్లో నిర్ణయాలు ఢిల్లీలో తీసుకోవాల్సి ఉంటుందని, సీఎం పీఠం కోసం కొట్లాడకుండా, సొంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వంతో నే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రెండున్నర దశాబ్దాలలో తెలంగాణ ప్రాంతంపై ప్రభావం చూపిన నేతలు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ అని అన్నారు. బాబు ఐటీ అభివృద్ధికి, రాజశేఖర్ రెడ్డి పేదల అభ్యు న్నతి కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఐటీ సహా పేదల వరకు అన్ని రంగాల వృద్ధికి కృషి చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. -
Fact Check: రైతు పథకాలకు కోతలంటూ కారుకూతలా?
సాక్షి, అమరావతి: సంతృప్తస్థాయిలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నా రామోజీరావు మాత్రం రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మడం ఆపడంలేదు. వాస్తవాలను కప్పిపుచ్చుతూ ‘రైతు పథకాలకు కోత పెట్టడం.. విప్లవాత్మక పాలనా?’ అంటూ అబద్ధాలను అచ్చేసి ప్రభుత్వంపై సోమవారం తన ‘ఈనాడు’ పత్రికలో బురద జల్లే ప్రయత్నం చేశారు. అసలు కోతలంటే ఏమిటో మీ చంద్రబాబును అడిగితే.. రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, వడ్డీలేని రుణాలు అందిస్తామని చేసిన వాగ్దానాలను తుంగలో తొక్కిన విధానాన్ని వివరిస్తాడు. అలాగే రైతులకు సున్నావడ్డీలో పెట్టిన బకాయిల వివరాలు చెబుతాడు. అంతేగానీ అర్హతే కొలమానంగా పార్టీలు, ప్రాంతాలు, కులమతాలకతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే ఆ రైతులే మీ పనిపడతారు. రైతులకు అన్ని విధాల అండగా ఉంటూ చేయిపట్టుకుని ముందుకు నడిపిస్తోంది ఈ ప్రభుత్వం. రైతులకు పథకాలను పంపిణీ చేసే ముందు అర్హుల జాబితాలను ఆర్బీకేల్లో సామాజిక తనిఖీల్లో ప్రదర్శిస్తున్నారు. అర్హత ఉండి జాబితాల్లో చోటుదక్కని వారికి మరో అవకాశం కల్పించడమే కాదు.. వారికి ఏటా రెండు విడతల్లో అదనంగా సంక్షేమ ఫలాలు దక్కేలా చేస్తున్నారు. నిజంగా కోతలు పెట్టే ఉద్దేశం ఉంటే ఇలా బూతద్దం పెట్టి మరీ వెతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు మాదిరిగా ఏదో సాకుతో కోతలు పెట్టొచ్చు. ఏటా పెరుగుతున్న లబ్ధిదారులు కన్పించలేదా? వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ. 12,500 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి మిన్నగా ఏటా మూడు విడతల్లో రూ. 13,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పైగా దేశంలో మరెక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలురైతు కుటుంబాలతోపాటు అటవీ భూముల సాగుదారులకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా రూ.13,500 చొప్పున జమ చేస్తోంది. ఇప్పటి వరకు 53.53 లక్షల మందికి రూ.33,209.81 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. ఈ లెక్కన చూస్తే 2019–20తో పోలిస్తే 2023–24 నాటికి 6,83,530 మంది భూ యజమానులు అదనంగా లబ్ధిపొందారు. వీరిలో 5,88,811 మంది భూ యజమానులు ఉండగా, 51,418 మంది కౌలుదారులు, 43,301 మంది అటవీ భూసాగుదారులకు అదనంగా లబ్ధి చేకూరింది. నిజంగా కోత పెట్టే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటే ఇలా ఏటా లక్షలాది మందికి అదనంగా లబ్ధి ఏ విధంగా కలిగిందో ‘ఈనాడు’కే తెలియాలి. బీమాతో ధీమా ఇదీ.. రైతులపై పైసా భారం పడకుండా ఈ–క్రాప్ నమోదే ప్రామాణికంగా నోటిఫైడ్ పంటలన్నింటికీ వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రక్షణ కల్పిస్తోంది ప్రభుత్వం. టీడీపీ హయాంలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల బీమా పరిహారం ఇస్తే.. ఈ నాలుగున్నరేళ్లలో 54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం ఇచ్చారు. ఖరీఫ్–21 సీజన్లో 15.61 లక్షల మందికి రూ.2,977.82 కోట్ల పరిహారం జమ చేయగా, ఇదే సీజన్లో అర్హత ఉండి సాంకేతిక కారణాల వల్ల లబ్ధిపొందని 28,010 మంది రైతులను జల్లెడ పట్టి మరీ రూ. 187.18 కోట్ల మేర బీమా పరిహారం జమ చేశారు. పారదర్శకంగా ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రాయితీ విపత్తులవేళ నష్ట పోయిన రైతులకు అత్యంత పారదర్శకంగా పంట నష్ట పరిహారం(ఇన్పుట్ సబ్సిడీ) ప్రభుత్వం జమ చేస్తోంది. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 22.85 లక్షల మంది రైతులకు రూ. 1,976.55 కోట్ల పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. గతేడాది అర్హత ఉండి పరిహారం దక్కని 65,851 మందికి రూ. 63.25 కోట్ల పరిహారాన్ని జమ చేశారు. రూ. లక్షలోపు రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద వడ్డీ రాయితీని వారి ఖాతాల్లోనే జమచేస్తోంది. 2014–18 మధ్య 39.07 లక్షల మందికి చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1,180.66 కోట్ల బకాయిల సొమ్మును జమ చేసింది. గడిచిన నాలుగున్నర ఏళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 73.88 లక్షల మందికి రూ. 1,834.55 కోట్లు చెల్లించింది. అర్హత ఉండి రాయితీ పొందని 85,499 మందికి సామాజిక తనిఖీల్లో గుర్తించి, రూ. 18.32 కోట్ల వడ్డీ రాయితీని అందించింది. నిజంగా కోత పెట్టే ఆలోచనే ఉంటే.. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను చెల్లించేదా?. రైతుల నిరంతర సేవలో ఆర్బీకేలు విత్తనం నుంచి పంట విక్రయం వరకు రైతులను చేయిపట్టి నడిపించేందుకు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రపంచ స్థాయి ఖ్యాతిని గడించాయి. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేల్లో వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుసంవర్ధక, మత్స్యసహాయకులు సేవలందిస్తున్నారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, పశుగ్రాసం, దాణా, ఆక్వా ఫీడ్, సీడ్లను రైతులకు సరఫరా చేస్తోంది. తక్కువ అద్దెకే సన్న, చిన్నకారు రైతులకు యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 10,444 గ్రామ స్థాయి, 492 క్లస్టర్ స్థాయి యంత్రసేవ కేంద్రాల్లో యంత్ర పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటి కోసం రూ.366.25 కోట్ల రాయితీని ప్రభుత్వం భరించింది. ఇప్పటి వరకు 4.67 లక్షల మంది రైతులు 13.28 లక్షల ఎకరాలలో వ్యవసాయ పనులకు యంత్రాలను వినియోగించుకున్నారు. మరోవైపు ఆర్బీకే సేవలకు అంతరాయం కలుగకుండా ఉండేందుకు అద్దెల చెల్లింపు కోసం ఇటీవల రూ.32.97 కోట్ల నిధులు విడుదల చేశారు. ఇవన్నీ తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు ‘ఈనాడు’ రోతరాతలు కొనసాగిస్తోంది. పెట్టుబడి సాయం అందింది ఇలా.. 2019–20లో 46,69,375 మందికి రూ. 6,173 కోట్లు, 2020–21లో 51,59,045 మందికి రూ. 6,928 కోట్లు, 2021–22లో 52,38,517 మందికి రూ. 7,016.59 కోట్లు, 2022–23లో 51,40,943 మందికి రూ. 6,944.50 కోట్లు, 2023–24లో రెండు విడతల్లో 53,52,905 మందికి రూ. 6,147.72 కోట్లు . -
రైతులను మోసం చేసింది మీ బాబే రామోజీ
సాక్షి, అమరావతి: రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని, వడ్డీలేని రుణాలు అందిస్తామని చంద్రబాబు చేసిన వాగ్దానాలను అప్పట్లో తుంగలో తొక్కినా రామోజీరావు తన పత్రికలో ఒక్క ముక్క కూడా రాయలేదు. కానీ ఇచ్ఛిన హామీలకంటే మిన్నగా రైతులకు ఈ ప్రభుత్వం సాయం చేస్తుంటే నిత్యం విషం చిమ్ముతూనే ఉన్నారు. దుష్ప్రచారమే లక్ష్యంగా అబద్ధాలను పోగేసి ‘సున్నా వడ్డీలో మహా మోసం’ అంటూ మరో కథనాన్ని శనివారం ఈనాడు పత్రిక అచ్చేసింది. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పైసా భారం పడకుండా ఉచిత పంటలబీమా, సీజన్ ముగియకుండానే పంట నష్ట పరిహారం, సకాలంలో సున్నా వడ్డీ రాయితీ సహా రైతులకు మేలు చేసే ఎన్నో పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నా నిజాలను వక్రీకరించి వక్రరాతలు రాసేసింది. అప్పుల ఊబిలో చిక్కుకోకుండా చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు సాగు వేళ తీసుకునే పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 2019లో శ్రీకారం చుట్టింది. రూ. లక్ష లోపు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మరుసటి సీజన్ రాక మునుపే వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. వాస్తవ సాగుదారులకు వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని అందించడం కోసం ఈ క్రాప్ డేటా ఆధారంగా ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోంది. గతంలో రైతుపైనా వడ్డీ భారం గతంలో రూ. లక్ష లోపు పంట రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే బ్యాంకులు వసూలు చేసే ఏడు శాతం వడ్డీలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తే, మిగిలిన 4 శాతం వడ్డీని రైతులు భరించేవారు. ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో బ్యాంకులకు జమ చేసేవారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసుకునేవి. గతంలో క్లయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచ్‌లకు మాత్రమే అధికారం ఉండేది. దీంతో ఎంత మంది అర్హత పొందారు.. వారికి ఎంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లకు కూడా తెలిసేది కాదు. సామాజిక తనిఖీ కోసం బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ జాబితాలు ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు. పారదర్శకంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలో వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావు లేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ డేటాను ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించి అర్హులైన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ద్వారా ఎస్వీపీఆర్ (సున్నా వడ్డీ పంట రుణాలు) పోర్టల్ ((https://karshak.ap.gov.in/ysrsvpr/))లో ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఏడాదిలోగా రూ. లక్ష లోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీకి అర్హత పొంది, ఒక వేళ జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇలా అర్హత పొందిన రైతుల ఖాతాలో వారు చెల్లించిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వంప్రతీ ఏటా క్రమం తప్పకుండా జమ చేస్తోంది. రైతులలో జవాబుదారీతనాన్ని పెంచడం, సకాలంలో రుణ చెల్లింపు అలవాటు పెంపొందించే లక్ష్యంతో అమలు చేస్తోన్న ఈ పథకం ద్వారా రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి రైతుల ఖాతాలకే జమ చేస్తోంది. బాబు ఎగ్గొట్టిన బకాయిలు చెల్లింపు టీడీపీ ఐదేళ్ల హయాంలో సుమారు 40.61 లక్షల మందికి కేవలం రూ. 685.46 కోట్లు చెల్లిస్తే, గడిచిన 4.5 ఏళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 73.88 లక్షల మందికి రూ. 1,834.55 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలో 39.08 లక్షల మంది రైతులకు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1,180.66 కోట్ల బకాయిలున్నాయి. కాగా రబీ 2021–22, ఖరీఫ్–2022 సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాయితీ సొమ్మును డిసెంబర్లో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వడ్డీ రాయితీని సకాలంలో అందించడమే కాదు. రైతులకు సంస్థాగత రుణాలు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. 2019 ఖరీఫ్ పంట కాలం నుంచి ఇప్పటి వరకు రూ. 8,24,428 కోట్ల పంట రుణాలను ఈ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించారు. అంతేకాదు వాస్తవ సాగుదారులకు సీసీఆర్సీ కార్డుల ద్వారా 14 లక్షల మంది కౌలురైతులకు రూ. 8,054 కోట్ల వ్యవసాయ రుణాలు అందించింది. ఈ ఏడాది అత్యధికంగా 8.22 లక్షల మంది కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా, వారిలో ఇప్పటికే 4.88 లక్షల మందికి రూ.1,385.25 కోట్ల రుణాలు పంపిణీ చేసింది. అంతేకాదు.. రైతు భరోసా కింద 53.53 లక్షల రైతు కుటుంబాలకు రూ. 33,209.81 కోట్లు, రాయితీపై విత్తన సరఫరా కోసం 74.45 లక్షల మందికి రూ. 1,316.57 కోట్లు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.50 లక్షల మందికి రూ. 7,802.05 కోట్లు, ఇన్‌పుట్‌సబ్సిడీ కింద 22.85 లక్షల మందికి రూ.1,977 కోట్లు చెల్లించి రైతులకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది. మరో వైపు ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పంపిణీ చేస్తోంది. -
స్వశక్తితో ఎదిగే మహిళల కోసం ‘మహిళా శక్తి’
సాక్షి, అమరావతి: మహిళా సాధికారిత లక్ష్యంగా చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వశక్తితో ఎదగాలనుకొనే పేదింటి మహిళలకు చేయూతనిచ్చేందుకు మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ మహిళలు కేవలం 10 శాతం ఖర్చుతో వారు ఆటోలు సమకూర్చుకొని, వాటి ద్వారా ఆర్థికంగా బలపడేలా ‘మహిళా శక్తి’ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలో ‘ఉన్నతి’ కార్యక్రమంలో వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో డ్రైవింగ్ నైపుణ్యం ఉండీ పలువురు మహిళలు ఆటోలను కిరాయికి తీసుకొని నడుపుకొంటున్నారు. ఇకపై వారు అద్దెవి కాకుండా సొంత ఆటోలు నడుపుకోవడం ద్వారా మరింత ఆదాయం పొందేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు ‘మహిళా శక్తి’కి రూపకల్పన చేశారు. ఈ పథకంలో ఆటో కొనుగోలుకు అయ్యే ఖర్చులో పది శాతం లబ్ధిదారు అయిన మహిళ భరిస్తే సరిపోతుంది. మిగతా 90 శాతం సెర్ప్ ద్వారా ప్రభుత్వమే రుణంగా అందిస్తుంది. ఈ రుణానికి వడ్డీ ఉండదు. మొత్తం రుణాన్ని 48 నెలలు కిస్తీ రూపంలో చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరు చొప్పున 660 మందికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేయూతనందిస్తుంది. ఇప్పటికే 229 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసి, వారికి డ్రైవింగ్‌లో నాలుగు రోజుల పాటు అదనపు శిక్షణ ఇచ్చారు. ఆటోలకు వచ్చే చిన్న చిన్న సమస్యల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డ్రైవింగ్ సమయంలో భద్రత తదితర అంశాలపై శిక్షణ కూడ పూర్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా డిసెంబరు 6వ తేదీన లబ్ధిదారులకు కొత్త ఆటోలు అందజేస్తారు. మిగిలిన మండలాల్లో వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేసి, వారికీ అంబేడ్కర్ జయంతి రోజు ఏప్రిల్ 14న కొత్త ఆటోలు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కొక్కరికీ రూ.లక్షన్నర దాకా అదనపు ప్రయోజనం సాధారణంగా ఆటోల కొనుగోలుకు బ్యాంకులు లేదా ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలు రుణాలిస్తాయి. దీనిని నెలవారీ కిస్తీల రూపంలో తిరిగి చెల్లించాలి. వీటిపై కనీసం రూ. లక్షన్నర వడ్డీనే అవుతుంది. ఇది ఆటో డ్రైవర్లకు ఆర్థిక భారమే. మహిళా శక్తి ద్వారా ఆటోలు పొందే లబ్ధిదారులకు ఇచ్చే రుణంపై వడ్డీ లేనందున, వారికి ఈ లక్షన్నర ఆర్థిక ప్రయోజనం అదనంగా కలుగుతుందని అధికారులు వివరించారు. -
karnataka assembly elections 2023: మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా: రాహుల్
ఉడుపి/మంగళూరు: కాంగ్రెస్ నేత రాహుల్ కర్ణాటక మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులకు రూ.10 లక్షల బీమా కల్పిస్తామని, లీటర్ డీజిల్‌పై రూ.25 చొప్పున రాయితీ ఇస్తామని, రోజుకు 500 లీటర్ల డీజిల్‌కు ఈ రాయితీ వర్తిస్తుందని, మత్స్యకార మహిళలకు రూ.లక్ష వడ్డీ లేని రుణం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాహుల్ గురువారం ఉడుపి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మత్స్యకారులతో సమావేశమయ్యారు. కేవలం హామీలు ఇవ్వడం కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే వాటిని అమలు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కాదని అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే మహిళలకు ప్రజా రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాహుల్ హమీ ఇచ్చారు. -
వడ్డీ లేని రుణం పేరిట మోసం..
తిరువొత్తియూరు: వడ్డీ లేకుండా రుణం ఇస్తామని నమ్మబలికి మోసం చేసిన నగల దుకాణ యజమానులను జనం ఆదివారం ముట్టడించారు. వివరాలు.. చైన్నె నొలంబూరు కేంద్రంగా రెండు నగల దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ నగలు తాకట్టు పెట్టిన వారికి వడ్డీ లేకుండా నగదు అప్పు ఇవ్వడం, నగల కోసం పెట్టుబడి పెట్టిన వారికి ఎక్కువ అధిక వడ్డీ ఇస్తామంటూ యజమానులు ఆసక్తికర ప్రకటనలు ఇచ్చారు. దీన్ని నమ్మి ఆ ప్రాంతానికి చెందిన వారే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఈ రెండు దుకాణాలకు సంబంధించిన సంస్థల్లో నగదును పెట్టుబడిగా పెట్టారు. కానీ డబ్బు డిపాజిట్ చేసిన వారికి చెప్పిన ప్రకారం నగదు గానీ, వడ్డీ గానీ ఇవ్వలేదు. దీంతో మోసపోయిన ప్రజలు నొలంబూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈక్రమంలో డిపాజిట్‌దారులు 100 మందికి పైగా ఆదివారం ఉదయం నగల దుకాణాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని సముదాయించి పంపించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. -
వన్ నేషన్.. వన్ దోస్త్
సాక్షి, మహబూబాబాద్: గత ఎన్నికల్లో దేశ ప్రధాని నరేంద్ర మోదీ వన్ నేషన్...వన్ రేషన్ అనే నినాదంతో ప్రజల ముగింటికి వచ్చారని, కానీ ప్రస్తుతం వన్ నేషన్.. వన్ దోస్త్‌గా వ్యవహరిస్తూ తన స్నేహితుడు అదానీకి రూ.వేల కోట్లు దోచిపెడుతున్నారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆరోపించారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో రూ. 14.75 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.750 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. జన్‌ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తే ధనాధన్‌గా అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పిన పీఎం మోదీ ఎవ్వరికీ రూపాయి వేయలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలిచిందని, దీన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ఇక్కడ అమలవుతున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. ఇక్కడ ఏ మంత్రి అయినా మాట్లాడతారు.. తెలంగాణ అభివృద్ధిని వివరించేందుకు ఇక్కడ ఏ మంత్రి అయినా గంటల కొద్దీ చెబుతారని.. మీరు ఏం చెప్పగలరని కేటీఆర్ బీజేపీ నేతలను ప్రశ్నించారు. నల్లధనం వెలికితీసి పేదలకు పంచుతామన్న ప్రధాని మోదీ... అదా నీ వంటి బడా కంపెనీలకు అప్పజెప్పిన డబ్బులతో ఎమ్మెల్యేలను, ఎంపీలను కొని పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా తననెవరూ అడిగే వారు లేరని విర్రవీగుతున్న ప్రధానికి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడుతున్నామని చెప్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించింది నిజం కాదా అని నిలదీశారు. బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ములుగు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై ప్రజలకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మన ప్రభుత్వాన్ని కడుపులో పెట్టుకోవాలి ప్రజలకు ఏం కావాలి.. ఏ పథకం అమలు చేస్తే ప్రజలు బాగుంటారని అనునిత్యం ఆలోచించే కేసీఆర్.. ఆయన నాయకత్వంలో పని చేస్తున్న మంత్రులంతా ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్నామని కేటీఆర్ చెప్పారు. ప్రజల కోసం పాటుపడుతున్న నాయకులను, ప్రభుత్వాన్ని ప్రజ లు కడుపులో పెట్టుకుని చూసుకోవాలని కోరారు. ఒకప్పుడు నేను రానుబిడ్డో అని పాటలు పాడుకున్న సర్కారీ దవాఖానాలకు ప్రజలు క్యూ కడుతున్నారని చెప్పారు. నాడు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంట్ పోతే వార్తగా మారిందన్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకా ష్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోతు కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, ఆరూరి రమే ష్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ క్యాంపులు, సన్మానాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. సమాజంలో మహిళల శక్తిని, పాత్రను తెలిపేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలన్నారు. వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు వైద్య, ఇతర అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పురపాలికల్లో డ్రై కంపోస్ట్, కిచెన్ కాంపోస్టింగ్, నీటి సంరక్షణ తదితర రంగాల్లో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న పురపాలక సిబ్బంది లేదా పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి సన్మానించాలన్నారు. పట్టణాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలని, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీల వంటి వాటిని వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించిన వీధి వర్తకులు మొదలుకొని వివిధ రంగాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వరకు ప్రత్యేకంగా గుర్తించాలని మంత్రి సూచించారు. కంటివెలుగు ద్వారా పురపాలక శాఖలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా రక్షణ, ఆరోగ్య సంరక్షణ, సాధికారికత వంటి అంశాలపై చర్చాగోషు్టలు నిర్వహించి అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. వారోత్సవాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా సిద్ధం చేయాలన్నారు. ఈ సంబరాలకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మహిళా జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, మహి ళా జడ్జీలను ప్రత్యేక అతిథులుగా ఆహా్వనించాలన్నారు. మంత్రి ఆదేశంతో పురపాలక శాఖ మహిళా వారోత్సవాల కార్యాచరణను ప్రకటించింది. -
గుడ్‌న్యూస్: పొగాకు రైతులకు వడ్డీ లేని రుణం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో మాండూస్ తుపాను ప్రభావంతో పొగాకు పంట నష్టపోయిన ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు చెందిన రైతులకు పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి నుంచి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని పంట రుణం ఇచ్చేందుకు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ మంత్రి పియూష్ గోయెల్ ఆమోదించారని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు చెప్పారు. గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి సభ్యులు 28,112 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.28.11 కోట్లు పంపిణీ చేసేందుకు అనుమతి లభించిందన్నారు. పొగాకు పంట నష్టపోయినట్లు రైతులు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజమండ్రిలోని సెంట్రల్ టూబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీటీఆర్ఐ)కి చెందిన ఆరుగురు శాస్త్రవేత్తలు, పొగాకు బోర్డు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలు తుపాను ప్రభావిత పొగాకు పొలాలను సందర్శించి, తక్షణ నష్ట నివారణకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. సుమారు రూ.25 కోట్ల మేర పొగాకు రైతులు మాండూస్ తుఫాను వల్ల నష్టపోయారని తెలిపారు. ప్రస్తుతం బ్యారన్‌కు ఇచ్చిన రూ.5 లక్షలు రుణంకు అదనంగా మరో రూ.50 వేలు రుణం ఇవ్వాలని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి సిఫారసు చేశామని చెప్పారు. అంతేకాకుండా పొగాకు పంట నష్టపోయిన రైతులకు కూడా నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు. ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో పొగాకు వేలం జరుగుతోందని, అత్యధికంగా కిలోకు రూ.271 ధర లభిస్తోందని, సగటున కిలోకు రూ.239.16 లభించిందని తెలిపారు. ఏపీలో ఫిబ్రవరి మాసం చివర కానీ, మార్చి మొదటి వారంలో కానీ ఆక్షన్ ప్రారంభమవుతోందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇదీ చదవండి: ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం -
రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు వడ్డీలేని రుణం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాలకు మూల ధన వ్యయం కింద రూ.15 వేల కోట్లు సమకూర్చనున్నట్లు కేంద్రం తెలిపింది. 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణం కింద రూ.15 వేల కోట్లు అదనపు మొత్తాన్ని సమకూర్చాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. ఆర్థిక శాఖ వ్యయ విభాగం ఇందుకు సంబంధించి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం పేరుతో 2021–22 సంవత్సరానికి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం కింద వడ్డీ లేకుండా 50 సంవత్సరాల రుణం రూపంలో ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తారు. దీనికోసం 2020–21 సంవత్సరానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. దీంట్లో రూ.11,830 కోట్లు రాష్ట్రాలకు విడుదల చేశారు. గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి కాలంలో రాష్ట్రస్థాయిలో మూలధన వ్యయానికి ఇది సహాయపడింది. ఈ పథకానికి వచ్చిన సానుకూల స్పందనను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ పథకాన్ని 2021–22 సంవత్సరానికి కూడా కొనసాగించాలని నిర్ణయించింది. ప్రత్యేక సహాయ పథకం కింద మూడు విభాగాలు ఉన్నాయి. మొదటి విభాగం ఈశాన్య, కొండప్రాంత రాష్ట్రాలకు సంబంధించినది. ఈ విభాగానికి రూ. 2,600 కోట్ల రూపాయలు కేటాయించారు. రెండో విభాగంలోని రాష్ట్రాల కోసం రూ. 7,400 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం అవార్డు మేరకు కేంద్రపన్నులలో వాటి దామాషా ప్రకారం కేటాయిస్తారు. మూడో విభాగం కింద రాష్ట్రాలకు మానిటైజేషన్, మౌలిక సదుపాయాల ఆస్తుల రీసైక్లింగ్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్ (ఎస్పీఎస్ఈసీ)ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు ప్రోత్సాహకం అందజేస్తారు. ఈ విభాగం కింద ఈ పథకానికి రూ.5 వేల కోట్లు కేటాయించారు. రాష్ట్రాలు అసెట్ మానిటైజేషన్, లిస్టింగ్, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకున్న దానిలో 33 శాతం నుంచి 100 శాతం వరకు మొత్తాన్ని 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణంగా పొందుతాయి. చదవండి: (కరోనా సంక్షోభం: 16 ఏళ్ల తర్వాత భారత్‌లో కీలకమార్పు) -
జగమంత అండ
కరోనా వచ్చింది... ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. నెలకు లక్షలు ఖర్చు చేసే వాళ్లు కూడా బ్యాంకు అకౌంట్‌ను భయం భయంగా చూసుకోవాల్సి వచ్చింది. బ్రాండెడ్ షర్టు కోసం వేలాది రూపాయల ఖర్చు చేసే వాళ్లు వెయ్యి రూపాయల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. వెయ్యి రూపాయలు చేతిలో ఉంటే వడ్డీ వ్యాపారి ముందు చేయి చాచాల్సిన దుస్థితి ఉండదనే చిరు వ్యాపారి బతుకు దాదాపుగా ఛిద్రమై పోయింది. హోల్‌సేల్ మార్కెట్ నుంచి టోకున కూరగాయలు, పండ్లు కొనుక్కుని కాలనీల్లో అమ్ముకుని రోజుకింత అన్నం తినేవాళ్లకు బతకడమే కష్టమైపోయింది. వెయ్యి రూపాయలు అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారి పొద్దున తొమ్మిది వందలే ఇస్తాడు. సాయంత్రం వచ్చి వెయ్యి రూపాయలు దండుకుంటాడు. పదివేల అప్పు కోసం చెయ్యి చాస్తే ఇచ్చేది తొమ్మిది వేలే. పండ్లు అమ్మగా వచ్చిన రాబడిలో వడ్డీ వ్యాపారికి చెల్లించాల్సింది చెల్లించుకోగా మిగిలిన దాంతో రోజులు నెట్టుకురావాలి. అధిక వడ్డీ కోరల నుంచి చిరు వ్యాపారులను రక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. చిరు వ్యాపా రుల రక్తాన్ని పీలుస్తున్న వడ్డీని మాఫీ చేయడానికి నిర్ణయించుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ‘జగనన్న తోడు’ పథకంతో చిరు వ్యాపారుల జీవితాలలో చిరుదివ్వెలను వెలిగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 10 లక్షల పైగా దీపాలవి. రాష్ట్రవ్యాప్తంగా ‘జగనన్న తోడు’ లబ్ధిదారులు 10 లక్షలమంది. ప్రాణానికి హాయి ఇరవై ఏళ్లుగా దోశలు, పొంగనాలు వేసుకుని బతుకున్నాను. గత ఏడాది కరోనా వల్ల మొత్తం వ్యాపారం దెబ్బతినింది. ఐదు నెలలు వ్యాపారం లేదు. చేతిలో రూపాయి కూడా లేదు. కరోనా పోయిన తర్వాత వ్యాపారం మొదలుపెట్టే ధైర్యం లేకపోయింది. ‘జగనన్న తోడు’ ద్వారా బ్యాంకులో లోన్ తెచ్చుకుని మళ్లీ పని మొదలుపెట్టాను. వడ్డీ లేని రుణం కావడం వల్ల సులభంగా వాయిదాలు చెల్లించగలుగుతున్నా. నిమ్మళంగా వ్యాపారం చేసుకుంటున్నా. ప్రాణానికి హాయిగా ఉంది. – జి. తులశమ్మ, అనంతపురం పట్టణం నేను కలెక్టర్ ఆఫీసు ముందు బండి మీద పండ్లు అమ్ముకుంటాను. ఇంతకు ముందు మాకు బ్యాంకుల్లో రుణం వచ్చేది కాదు. బయట ఐదు రూపాయల వడ్డీకి తెచ్చుకునేదాన్ని. ఇప్పుడు పదివేల లోన్ వచ్చింది. బండికి చిన్న మరమ్మతులు చేయించుకున్నాను. పండ్లు ఎక్కువగా తెచ్చుకుంటున్నాను. – నారాయణమ్మ,అనంతపురం పట్టణం బ్యాంకు లోన్ వచ్చింది కరోనాతో దాదాపు నాలుగు నెలలపాటు టిఫిన్ సెంటర్ తెరవడం కష్టమైంది. తెరిచిన తర్వాత కూడా నెలపాటు వ్యాపారం మునుపటిలా జరగలేదు. టిఫిన్ సెంటర్ సరుకులు కొనడమే కష్టంగా మారింది. ‘జగనన్న తోడు’ పథకం ద్వారా పదివేల రూపాయల రుణం ఇవ్వడంతో మా ఇబ్బందులు తీరాయి. కావల్సినన్ని సరుకులు కొన్నాను. వ్యాపారం పుంజుకుంది. నెల నెలా కిస్తీలు కట్టి రుణాన్ని చెల్లిస్తాను, అవసరమైనప్పుడు మళ్లీ రుణం తీసుకుంటాను. – నోముల మరియమ్మ, గుంటూరు పట్టణం నేను సోడాలు అమ్ముకుని జీవిస్తున్నాను. గతంలో వ్యాపారానికి పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకునే వాడిని. ఎంత కష్టపడినా ఇంటి ఖర్చులు గడిచేవి కాదు. నా శ్రమంతా ఏమవుతోందని, ఇల్లు గడవాలంటే ఇంకా ఎంత కష్టపడాలో అని దిగులుగా ఉండేది. కేవలం వడ్డీలు చెల్లించడం కోసమే వ్యాపారం చేస్తున్నానా అని కూడా అనిపించేది. మరో పని తెలియదు. కుటుంబ పోషణకోసం వేరే మార్గం ఉండేది కాదు. ప్రస్తుతం ‘జగనన్న తోడు’ ద్వారా బ్యాంకులో వడ్డీలేని రుణాలు దక్కడంతో నా కష్టానికి ప్రతిఫలం దక్కుతోందనే సంతోషం కలుగుతోంది. ముఖ్యమంత్రి జగనన్నే నాకు, నా కుటుంబానికి తోడుగా ఉన్నారు. – ఎ. బాబులు, ఏలూరు పట్టణం ముప్పై ఏళ్లుగా పండ్ల వ్యాపారం చేసుకుంటున్నా. ప్రభుత్వ ప్రోత్సాహంతో మొదటి సారి అప్పు కోసం బ్యాంకు వైపు చూసాను. ఇలాంటి పథకాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో వాయిదాలు చెల్లిస్తాను. తనఖా లేకుండా వడ్డీ ఇచ్చేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మేము తిరిగి కట్టగలం అని నమ్ముతున్నాయి. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. – మాబు, అనంతపురం పట్టణం కష్టకాలంలో ఆదుకుంది కరోనా లాక్‌డౌన్‌తో నా పిండిమర వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాను. బయట అధిక వడ్డీలతో అప్పు తీసుకోవాలంటే భయం. రోజంతా కష్టపడి అసలు, వడ్డీ చెల్లించిన తర్వాత చేతిలో ఏమీ మిగలదు. కష్టమంతా వడ్డీకి ధారపోయాల్సిందే. అటువంటి సమయంలో ‘జగనన్న తోడు’ పథకం ఆదుకుంది. – పి రమేష్, గుంటూరు పట్టణం -
వడ్డీ పడతలే..
సాక్షి, సిద్దిపేట: మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వం.. పావలా వడ్డీకి రుణాలు అందిస్తే.. టీఆర్ఎస్ సర్కార్ వడ్డీ లేకుండా రుణాలు అందిస్తామని ప్రకటించి మహిళలను సంతోషంలో ముంచేసింది. ఈ ప్రకటన మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలిపోతోంది. మూడు సంవత్సరాలుగా జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు వడ్డీ డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదు. తీసుకున్న రుణాలను వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని బ్యాంకర్లు తెగేసి చెప్పడంతో మహిళలు ఆందోళన చెందుతున్నాయి. ఈక్రమంలో రుణ గడువు ముగిసే నా టికి వడ్డీ డబ్బులు చెల్లించాల్సిన ప్రభుత్వం.. డబ్బులు విడుదల చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ కోసం ఎదురుచూపులు మహిళా సంఘాలు బ్యాంకుల ద్వారా తీసుకున్న అప్పులకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తోంది. ఒకవేళ మహిళలు ముందుగా చెల్లించే వడ్డీ డబ్బులను సైతం వారి ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మహిళా సంఘాలు సంతోషడ్డాయి. అయితే, మూడేళ్లుగా అప్పునకు అసలు పోగా వడ్డీ డబ్బులు ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తుందో నని మహిళలు ఎదు రు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 22 మండలాల పరిధి లో 712 గ్రామైక్య సంఘాలు, 17,432 స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) ఉన్నాయి. ఆయా సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలు, వికలాంగులకు చెందిన సంఘాల్లో మొత్తం 1,88,990 మంది సభ్యులుగా ఉన్నారు. వీరికి మూడేళ్లుగా రూ.77.68 కోట్ల వడ్డీ డబ్బులు రావాల్సి ఉందని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. ఇందులో 2015–16 ఆర్థిక సంవత్సరానికి రూ.26.65 కోట్లు, 2016–17 ఆర్థిక సంవత్సరానికి రూ.30.03 కోట్లు, 2017–18 సంవత్సరానికి రూ.21 కో ట్లు ఉన్నాయి. ప్రభుత్వం వడ్డీ లేకుండా రుణం ఇస్తుందని.. అప్పులు తీసుకుంటే మూడు సంవత్సరాలుగా వడ్డీ రాకపోవడంతో అప్పు లు చేసి రుణం తీర్చామని మహిళలు చెబుతున్నారు. వడ్డీ డబ్బులు వస్తే పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు ఉపయోగించుకుంటామంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధు లు స్పందించి ప్రభుత్వం నుంచి వడ్డీ డబ్బులు త్వరగా విడుదల చేసేలా కృషి చేయాలని మహిళలు కోరుతున్నారు. త్వరలో విడుదలవుతాయి మహిళా సంఘాలు తీసుకున్న రుణాలు చెల్లించిన వారికి వడ్డీ ప్రభుత్వం ఇస్తుంది. జిల్లాలోని అన్ని సంఘాలకు సంబంధించిన వడ్డీ బకాయిలు విడుదల చేయాలని ఉన్నతాధికారులకు వివరించాం. ప్రభుత్వం నుంచి వడ్డీ డబ్బులు త్వరలో విడుదలవుతాయి. నేరుగా బ్యాంకుల ద్వారా వారి అకౌంట్లలో జమ చేసేలా చర్యలు తీసుకుంటాం. – స్వామి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రూ.4 లక్షల అప్పు తీసుకున్నం.. మాది వర్షం మహిళా గ్రూపు. మా సంఘంలో సభ్యులంతా కలిసి బ్యాంకుల రూ.4 లక్షల అప్పు తీస్కున్నం. నెలనెలా క్రమం తప్పకుండా వడ్డీలు చెల్లించాం. సక్రమంగా చెల్లించిన రుణాలకు వడ్డీ మాఫీ అన్నరు. మూడెండ్లవుతున్నా ఇప్పటి వరకు వడ్డీ మాఫీ అయినా పైసల్ మా ఖాతాల జమ కాలేదు. మాఫీ అయిన వడ్డీ రుణాలను ఎప్పుడిస్తరని ఐకేపీ సార్లను, బ్యాంకు సార్లను అడిగినా ఫలితం లేకుండే. – ఎర్రోల్ల ఎల్లవ్వ, మహిళా గ్రూపు సభ్యురాలు, మిరుదొడ్డి ఇప్పటి వరకు జమ కాలె.. బ్యాంకు రుణాలు ప్రతినెలా చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుందంటే మా మహిళా గ్రూపు సభ్యులమంతా కలిసి బ్యాంకుల రూ.5 లక్షల రుణం తీసుకున్నం. బ్యాంకుల తీసుకున్న రుణాలకు నెలనెలా అప్పు చెల్లించినం. చెల్లించిన రుణాలకు వడ్డీ మాఫీ చేస్తమన్నరు. మాఫీ అయిన వడ్డీ మా ఖాతాల జమ అయితయన్నరు. ఇప్పటికి మూడెళ్లయితుంది. మాఫీ అయిన వడ్డీ పైసలు ఇప్పటి వరకు జమకాలే. – సునంద, మహిళా గ్రూపు సభ్యురాలు, లింగుపల్లి -
‘వడ్డీ’కి సర్కారు ఎగనామం
70 లక్షల మంది మహిళలకు ఇక్కట్లు వడ్డీలేని రుణ పథకానికి సంబంధించి నాలుగు నెలలుగా బ్యాంకులకు వడ్డీ చెల్లించని ప్రభుత్వం రూ. 415 కోట్లకు చేరిన బకాయిలు మహిళా సంఘాల ముక్కుపిండి వసూలు చేస్తున్న బ్యాంకులు బడ్జెట్ కేటాయింపులోనే సర్కారు చిన్నచూపు రూ.1,600 కోట్లు అవసరమైతే రూ.700 కోట్లతో సరిపుచ్చిన వైనం ‘‘మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను సక్రమంగా అందిస్తున్నాం.. పథకాన్ని గ్రీన్‌చానల్‌లో పెట్టాం. ఏ నెలకు ఆ నెల ఆర్థిక శాఖ ఆమోదం అవసరం లేకుండానే నేరుగా నిధులు వెళ్తాయి. మహిళా సంఘాలు వడ్డీ లేకుండా కేవలం అసలు కడితే సరిపోతుంది..’ అని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనేకసార్లు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. కానీ బ్యాంకులు మహిళల ముక్కు పిండి మరీ వడ్డీ వసూలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి మాటలపై విశ్వాసంతో వడ్డీ చెల్లించని మహిళలు ఇప్పుడు బకాయిలు పేరుకుపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో బ్యాంకులు వడ్డీ ఒకేసారి చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయని ఫిర్యాదులున్నాయి. మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకుగాను నాలుగు నెలలుగా ప్రభుత్వం బ్యాంకులకు వడ్డీ చెల్లించకపోవడమే ఈ పరిస్థితికి కారణం. ప్రభుత్వం చెల్లించకపోవడంతో బ్యాంకులు మహిళా సంఘాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. విధిలేని పరిస్థితుల్లో మహిళా సంఘాల నాయకురాళ్లు సభ్యుల నుంచి అసలుకు వడ్డీ కలిపి బ్యాంకులకు కట్టిస్తున్నారు. నాలుగు నెలల వడ్డీ కింద ప్రభుత్వం సుమారు రూ.415 కోట్లు బ్యాంకులకు చెల్లించాల్సి ఉందని సమాచారం. ప్రభుత్వం తమను కేవలం అసలు మొత్తమే చెల్లించాలని చెప్పింది అని మహిళలు వాపోతున్నా బ్యాంకు అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఒక్కో సంఘంలో సగటున పది మంది సభ్యులు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల సంఘాల మహిళలు ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. 2012 జనవరి ఒకటో తేదీ నుంచి వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మహిళా సంఘాలు ప్రతినెలా నిర్ణీత గడువులోగా అసలు మొత్తం చెల్లిస్తేనే వడ్డీకి అర్హులవుతారని నిబంధన పెట్టింది. మరోవైపు ప్రభుత్వమే తాను చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని సక్రమంగా బ్యాంకులకు చెల్లించకుండా మహిళలను ఇక్కట్ల పాలు చేస్తోంది. వడ్డీ చెల్లింపులకు సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిందిగా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రెండుసార్లు ప్రభుత్వానికి నివేదికలు పంపినా. ఇప్పటివరకు విడుదల కాకపోవడం గమనార్హం. రూ.1600 కోట్లకు రూ.700 కోట్లే కేటాయింపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద వడ్డీ చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.700 కోట్లు మాత్రమే కేటాయించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పాత బకాయిలు కలుపుకొని రూ.506 కోట్లు మాత్రమే విడుదల చేసింది. జూలై నుంచి అక్టోబర్ వరకు చెల్లించాల్సిన దాదాపు రూ.415 కోట్ల బకాయిలు మాత్రం ఇప్పటివరకు విడుదల చేయలేదు. గతంలో ఆర్థికశాఖ పే అండ్ అకౌంట్స్ విభాగం నుంచి నిధుల విడుదలకు ఆనుమతించేది. ఇప్పుడా అధికారాన్ని ట్రెజరీ విభాగానికి బదలాయించారు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రుణాల కింద చెల్లించాల్సిన వడ్డీ దాదాపు రూ.1600 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడే చేతులెత్తేస్తే మున్ముందు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారవుతుందని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం రూ.1600 కోట్లు అవసరమైతే బడ్జెట్ కేటాయింపే రూ.700 కోట్లు ఉందని అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలేని రుణాలంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయకుండా చోద్యం చూస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ, పట్టణ సంఘాలకు వడ్డీ లేని రుణ పథకం అమలవుతుండగా ఎవరికీ వడ్డీ బకాయిలు విడుదల కాకపోవడం శోచనీయం.