సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. సమాజంలో మహిళల శక్తిని, పాత్రను తెలిపేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలన్నారు. వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు వైద్య, ఇతర అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాలని సూచించారు.
మహిళల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పురపాలికల్లో డ్రై కంపోస్ట్, కిచెన్ కాంపోస్టింగ్, నీటి సంరక్షణ తదితర రంగాల్లో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న పురపాలక సిబ్బంది లేదా పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి సన్మానించాలన్నారు.
పట్టణాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలని, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీల వంటి వాటిని వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించిన వీధి వర్తకులు మొదలుకొని వివిధ రంగాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వరకు ప్రత్యేకంగా గుర్తించాలని మంత్రి సూచించారు. కంటివెలుగు ద్వారా పురపాలక శాఖలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా రక్షణ, ఆరోగ్య సంరక్షణ, సాధికారికత వంటి అంశాలపై చర్చాగోషు్టలు నిర్వహించి అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు.
వారోత్సవాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా సిద్ధం చేయాలన్నారు. ఈ సంబరాలకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మహిళా జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, మహి ళా జడ్జీలను ప్రత్యేక అతిథులుగా ఆహా్వనించాలన్నారు. మంత్రి ఆదేశంతో పురపాలక శాఖ మహిళా వారోత్సవాల కార్యాచరణను ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment