Health camps
-
శ్రీకాకుళం జిల్లాలో ఒక్క రోజులోనే 32 హెల్త్ క్యాంపులు
-
AP: ఉదారంగా వరద సాయం
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను అత్యంత సమర్థంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వరద బాధితులకు మానవీయ కోణంలో సహాయం అందించాలని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా మానవత్వంతో పని చేయాలనే విషయాన్ని అంతా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఒక రూపాయి అదనంగా ఖర్చు అయినా సరే బాధితులకు అండగా ఉండాలన్నారు. కలెక్టర్లు మాకు మంచి చేశారనే మాటే వినిపించాలని, మన వల్ల జిల్లాకు మంచి జరిగిందని, మంచి కలెక్టర్ అనిపించుకునేలా పని చేయాలని సూచించారు. ప్రధానంగా ఐదు జిల్లాల్లో కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ శిబి రాల నుంచి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని, వ్యక్తులైతే రూ.1,000 చొప్పున అందచేయాలని ఆదేశించారు. కచ్చా ఇళ్లను నష్టపోయిన బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం అందించి ఆదుకోవాలని నిర్దేశించారు. శిబిరాల్లో తలదాచుకునే బాధితులకు మంచి సదుపాయాలను కల్పించడంతోపాటు ముంపు ప్రాంతాల్లో బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్ పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ, పునరావాస కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ఐదు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 49.60 అడుగులు ఉంది. శనివారం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, అవుట్ ప్లో 13 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇది రేపటికి (శనివారం) సుమారు 16 లక్షలకు చేరుకుని ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అంచనా. ప్రవాహం 17 లక్షల క్యూసెక్కులు ఉంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం రెండు, మూడు ప్రమాద హెచ్చరికల మధ్యలో అంటే 13 – 17 లక్షల క్యూసెక్కుల లోపే ప్రవాహం ఉంటుంది. గతేడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని చూశాం. శిబిరాల్లో మంచి సదుపాయాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే కొన్ని చోట్ల ఖాళీ చేశారు. 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే పరిస్థితిని అంచనా వేసి మిగిలిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధితులకు సహాయ శిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి. శిబిరాల్లో స్వయంగా అధికారులే ఉంటే ఎలాంటి సదుపాయాలను కోరుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కల్పించాలి. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చా ఇళ్లపై వర్గీకరణే వద్దు.. మరో ముఖ్యమైన అంశం.. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ ధృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలి. కచ్చా ఇళ్ల బాధితులను సహాయ శిబిరాల నుంచి తిరిగి పంపించేటప్పుడు రూ.10 వేల చొప్పున సాయంగా అందించాలి. అది వారికి తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకునేందుకు, మరమ్మతులు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. లేదంటే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు ఎదుర్కొంటారు. కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అనే వర్గీకరణే వద్దు. వారు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు ఇక వర్గీకరణ అనవసరం. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో ఉండాలని కలెక్టర్లను కోరుతున్నా. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్.. ముంపునకు గురైన ఇళ్లు, వరదనీరు ప్రవహించిన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలి. ఉదారంగా నిత్యావసరాలను అందించాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలి. మొత్తంగా బాధితుల పట్ల మరింత ఉదారంగా, మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలి. సచివాలయాల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ రాష్ట్రంలో నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటున్నాం. ఇప్పడు కూడా అప్రమత్తంగా ఉండాలి. కంట్రోల్ రూమ్స్‌కు సంబంధించి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఏర్పాటు చేయాలి. సచివాలయాల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందితో పాటు వలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. ముంపు గ్రామాలు, లంకలపై ప్రత్యేక దృష్టి ముంపు బాధిత గ్రామాలు, లంకలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై మరోసారి సమీక్షించి సిద్ధంగా ఉండాలి. లంక గ్రామాలలో జనరేటర్లు లాంటి వాటిని కూడా సిద్ధం చేసుకోండి. తాగునీటి కొరత లేకుండా.. తాగునీటి కొరత లేకుండా, సరఫరా వ్యవస్థలకు ఆటంకాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలి. తాగునీటి ప్యాకెట్లను సిద్ధం చేసుకోండి. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టండి. బ్లీచింగ్, ఫినాయిల్ లాంటివి సిద్ధంగా ఉంచాలి. ఆరోగ్య శిబిరాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాలి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలలో సరిపడా మందులను ఉంచాలి. వీటిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి. వరదల కారణంగా పాము కాట్లు లాంటి ఘటనలు జరిగితే అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. వరద తగ్గాక పంట నష్టం నమోదు వరద నీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలవాలి. అత్యంత పారదర్శక పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యం, మంచి సదుపాయాలు ఉన్నచోటకు ముందే తరలించాలి. ప్రతి విషయంలోనూ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్న సందేశాన్ని అందించాలి. సమావేశంలో హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి. సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఆర్ అండ్ బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జి.లక్ష్మీషా, ఏపీ విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల కోసం ప్రధాన నగరాల్లో ఉచిత హెల్త్ క్యాంప్‌లు
సాక్షి, అమరావతి/గుణదల(విజయవాడ తూర్పు): జర్నలిస్టుల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని చెప్పారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా ఇంజినీరింగ్ కాలే జీలో జర్నలిస్టులు, వారి కుటుంబసభ్యుల కోసం సమాచార శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రులు ప్రారంభించారు. మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు జర్నలిస్టులకు ప్రధాన నగరాల్లో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. త్వరలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతిలో కూడా నిర్వహిస్తామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా నిలిచే విషయలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ శిబిరాల ద్వారా ప్రతి ఒక్కరికీ రూ.10 వేల విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ సీఈవో హరీంధిరప్రసాద్, సమాచార శాఖ కమిషనర్ విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఈ ఉచిత హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏడాదిలో ఎన్నిసార్లు ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తినా.. ప్రతిసారి రూ.2 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు వీలుగా అతి తక్కువ ప్రీమియంతో జర్నలిస్టు హెల్త్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇందుకోసం జర్నలిస్టులు రూ.1,250 చెల్లిస్తే, ప్రభుత్వం మరో రూ.1,250 చెల్లిస్తోందని చెప్పారు. అనూహ్య స్పందన.. జర్నలిస్టుల ఉచిత హెల్త్ క్యాంపునకు మొదటి రోజు అనూహ్య స్పందన లభించింది. ఆంధ్ర హాస్పిటల్, అమెరికన్ అంకాలజీ అండ్ ఇండో బ్రిటిష్ హాస్పిటల్, ఉషా కార్డియాక్ సెంటర్, క్యాపిటల్, కామినేని, సెంటినీ, పిన్నమనేని, హెచ్‌సీజీ క్యూరీ సిటీ క్యాన్సర్ సెంటర్ అండ్ హార్ట్ కేర్ సెంటర్, సన్‌రైజ్, అను, స్వర ఆస్పత్రులకు చెందిన వైద్య నిపుణులు 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వెయ్యి మందికి పైగా అక్రిడిటెడ్ జర్నలిస్టులు తమ కుటుంబ స భ్యులతో పాల్గొని వివిధ పరీక్షలు చేయించుకున్నా రు. ఈ క్యాంప్ ఆదివారం కూడా కొనసాగనుంది. -
హెల్త్ క్యాంపులు, సన్మానాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 8 నుంచి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో మహిళా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అధికారులను ఆదేశించారు. సమాజంలో మహిళల శక్తిని, పాత్రను తెలిపేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలన్నారు. వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు వైద్య, ఇతర అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించాలని సూచించారు. మహిళల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. పురపాలికల్లో డ్రై కంపోస్ట్, కిచెన్ కాంపోస్టింగ్, నీటి సంరక్షణ తదితర రంగాల్లో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న పురపాలక సిబ్బంది లేదా పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి సన్మానించాలన్నారు. పట్టణాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాల క్యాంపులు నిర్వహించాలని, ప్రభుత్వ రుణాలు, సబ్సిడీల వంటి వాటిని వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించిన వీధి వర్తకులు మొదలుకొని వివిధ రంగాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల వరకు ప్రత్యేకంగా గుర్తించాలని మంత్రి సూచించారు. కంటివెలుగు ద్వారా పురపాలక శాఖలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళా రక్షణ, ఆరోగ్య సంరక్షణ, సాధికారికత వంటి అంశాలపై చర్చాగోషు్టలు నిర్వహించి అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. వారోత్సవాల్లో మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసే కార్యక్రమాలను కూడా సిద్ధం చేయాలన్నారు. ఈ సంబరాలకు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మహిళా జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, మహి ళా జడ్జీలను ప్రత్యేక అతిథులుగా ఆహా్వనించాలన్నారు. మంత్రి ఆదేశంతో పురపాలక శాఖ మహిళా వారోత్సవాల కార్యాచరణను ప్రకటించింది. -
అట్లాంటాలో అటా ఉచిత వైద్య శిబిరం..
అట్లాంటా: అమెరికన్ తెలుగు అసోసియేషన్(అటా)ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అక్టోబర్ 14న అట్లాంటాలోని హిందూ దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ క్యాంపులో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు, వ్యాధుల గురించి అవగాహన కార్యక్రమాలు చెపట్టారు. దీనికి సాయి హెల్త్ ఫేయిర్, జార్జియా ఇండియన్ నర్స్ అసోసియేషన్లు సహకారం అందించాయి. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రత్యేక విబాగాల్లో నిష్ణాతులైన 20 డాక్టర్లు, చాలామంది డాక్టర్లు, వాలంటీర్స్ పాల్లొని సేవలు అందించారు. ఈ వైద్య శిబిరానికి దాదాపుగా 200 మందికిపైగా పాల్గొని ఉచిత సేలు పొంది కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో డయాబెటిక్, న్యూట్రిషన్, హైపర్ టెన్షన్, ధూమపానం వల్ల వచ్చే నష్టాలను ఆ రంగంలో నిష్ణాతులైన డాక్టర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గొప్ప యోగ మాస్టర్‌తో యోగా సెషన్ కూడా పెట్టారు. ఈ కార్యక్రమం డాక్టర్ సుజాత రెడ్డి, డాక్టర్ సిమాలా ఎర్రమల్, డాక్టర్ శ్రీనిగంగాసనీ, దక్షిణ ప్రాంతంలోనే ప్రొఫెషనల్ డాక్టర్లు ఈ శిబిరాన్ని ముందుండి నడిపించారు. అంతేకాక గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, కార్డియాలజి, డెర్మటాలజీ వివిధ రంగాల్లో నిపుణులైనా 20 మంది డాక్టర్లు పరీక్షలు జరిపి సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో సంపూర్ణ ఆరోగ్యం అవగాహన కల్పించారు. ఈ శిబిరంలో పాల్గొన డాక్టర్లందరీకి అటా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. అంతేకాక ఈ కార్యక్రమానికి ఆడిటోరియం ఇచ్చిన హిందూ ఆలయ బోర్డు సభ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డు ధర్మకర్తలు అనిల్ బొడ్డిరెడ్డి, వేణు పిసికె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం చాలా విజయవంతం అయిందని అన్నారు. చాలా తక్కువ సమయంలోనే వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది ప్రజలు హాజరయ్యారని తెలిపారు. ఆటా అసోసియేషన్ ట్రేజరర్, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ కిరణ్ పాసం మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం వృద్దులకు, విద్యార్థులకు, గాయపడిన వారికి ఎంతో ఉపయోడపడిందని అన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు కరుణాకర్ అశిరెడ్డి మాట్లాడుతూ.. ఉచిత వైద్యశిబిరంలో పనిచేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సేవ కార్యక్రమాల్లో భాగంగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ డిసెంబర్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్యశిబిరాలు చేపడుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ రిజనల్ డైరెక్టర్ తిరుమల్ పిట్ట, రిజనల్ కో- అర్డినేటర్స్ ప్రశాంత్ పొద్దుటురి, శ్రావణి రచ్చకుల్లా, శ్రీరామ్, శ్రీనివాస్, హెల్త్ కమిటీ కో చైర్ రమణ రెడ్డి బాతుల, స్టాడింగ్ కమిటీ చైర్మన్లు శివ రామడుగు, నందా చాట్ల, శ్రీధర్, అటా వాలంటీర్స్‌లు పాల్గొన్నారు. -
అటా ఆధ్వర్యంలో డెట్రాయిట్లో ఉచిత వైద్య సేవలు
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్లో అమెరికా తెలుగు సంఘం(అటా) డెంటల్, యోగా, మెడిటేషన్ సెషన్లను నిర్వహించింది. డెట్రాయిట్ అటా ట్రస్టీ హరి లింగాల, టీం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 130 హెల్త్ స్క్రీనింగ్‌లను చేశారు. వీటిలో ఈకేజీ 70 డెంటల్ స్క్రీనింగ్స్, 25 ఎక్స్‌రేలు ఉన్నాయి. మెడిటేషన్, యోగా కార్యక్రమాలకు కూడా కొందరు హాజరయ్యారు. మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఎనిమిది మంది టెక్నీషియన్లు, 20 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డా. అశోక్ కొండూరు, సన్నీ రెడ్డిలకు కార్యక్రమ నిర్వహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
మంచంపట్టిన బోడగుట్టపల్లి
నెల రోజుల్లో రెండోసారి ప్రబలిన విషజ్వరాలు ముగ్గురికి డెంగీ లక్షణాలు తాజాగా 20 మందికి జ్వరం ఆందోళనలో గ్రామస్తులు మొక్కుబడిగా వైద్యశిబిరాలు తూతూమంత్రంగా పారిశుధ్య పనులు బసంత్‌నగర్ : పాలకుర్తి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని బోడగుట్టపల్లి మళ్లీ మంచంపట్టింది. గ్రామంలోని బీసీ కాలనీలో విషజ్వరాలు ప్రబలుతున్నారుు. తాజాగా 20మంది జ్వరంతో బాధపడుతున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండోసారి జ్వరాలు విజృంభిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన గణపతి అనసూర్యకు పది రోజుల క్రితం జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించారు. అరుునా తగ్గకపోవడంతో గోదావరిఖని, పెద్దపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. ఫలితం లేకపోవడంతో కరీంనగర్‌లోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. వారం రోజుల చికిత్స అనంతరం రెం డు రోజుల క్రితం అనసూర్యను వైద్యులు ఇంటికి పంపించారు. గత నెలలో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ మల్లేశం, బీసీ కాలనీకి చెందిన పూరెళ్ల రాజు కూడా డెంగీతో ఆస్పత్రుల్లో చేరారు. పది రోజలు కరీంనగర్లో చికిత్స పొందారు. నెలరోజుల్లో గ్రామంలో సుమారు 50 మంది జ్వరంతో ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో ముగ్గురు డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అరుుంది. నెల రోజులైనా గ్రామాన్ని జ్వరాలు వీడకపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది డిసెంబర్లో కన్నాల ఎస్సీ కాలనీకి చెందిన ఎల్కటూరి మల్లయ్య, అనసూర్య దంపతులు వారం రోజుల వ్యవధిలో మృతిచెందారు. ప్రస్తుతం గ్రామానికి చెందిన ముక్కెర అజయ్ విషజ్వరంతోపాటు రక్తకణాలు తగ్గడంతో కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అదే గ్రామానికి చెందిన వేముల రాణి వరంగల్‌లోని ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. మొక్కుబడిగా వైద్య శిబిరాలు.. గ్రామంలో జ్వరపీడితులు ఎక్కువవుతున్నారనే స్థానికుల ఫిర్యాదు మేరకు బోడగుట్టపల్లిలో కమాన్‌పూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యం లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయితే ఈ శిబిరంలో హెల్త్ సూపర్ వైజర్ సీతారామయ్యతో పాటు ఏఎన్ఎం మెటీల్డా, ఆశ వర్కర్లు మాత్రమే పాల్గొని జర్వపీడితులకు మందులు పంపి ణీ చేశారు.గ్రామంలో పరిస్థితి తీవ్రంగా ఉ న్నా వైద్యులు హాజరు కాకపోవడంపై స్థాని కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డ్రెరుునేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. లోపం ఎక్కడ? కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తరచూ విషజ్వరాలు విజృంభించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. లోపం ఎక్కడుందో తెలుసుకోవాల్సిన అధికారులు, పాలకులు అదిశగా చర్యలు చేపట్టడంలేదని విమర్శిస్తున్నారు. కేవలం పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడే అధికారులు మొక్కుబడిగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు సమస్యకు కారణాలు విశ్లేషించడం లేదని పేర్కొంటున్నారు. దసరా పండుగ సందర్భంగా గ్రామంలో డ్రెరుునేజీలన్నీ శుభ్రం చేరుుంచారు. బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. అయితే గ్రామంలో రక్షిత మంచినీటి ట్యాంక్ లేకపోవడంతో డెరైక్ట్ పంపింగ్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో తాగునీరు కలుషితమై విషజ్వరాలు ప్రబలుతున్నాయనే అభిప్రాయాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. జ్వరాలకు కారణం పారిశుధ్య లోపమా లేక కలుషిత నీరే కారణమా అనే విషయం తేల్చి జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులు, పాలకులపై ఉంది. రూ.70 వేలు కర్సయినయ్ నా భార్య పది రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. గోదావరిఖని, పెద్దపల్లి ఆసుపత్రులలో చూపించినా తగ్గలేదు. ఈనెల 7వ తేదీన కరీంనగర్‌కు తీసుకెళ్లినం. పరీక్షించిన వైద్యులు డెంగీ అని చెప్పిండ్రు. నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉంచినం. వైద్యానికి రూ.70 వేలు కర్సయినయ్. -
పుష్కరాలకు ‘డయేరియా’ ముప్పు!
* మూడో రోజులు 604 కేసుల గుర్తింపు * రోజురోజుకు పెరుగుతున్న వైనం * అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు గుంటూరు మెడికల్: మీరు కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరాలకు వెళ్తున్నారా... అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే పుణ్యం కోసం వెళ్లే పుష్కరాల్లో రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని వైద్యాధికారులు అధికారికంగా అందజేసిన పుష్కరాల వైద్యశిబిరాల్లో వైద్యం చేయించుకున్న రోగుల వివరాల్లో స్పష్టంగా ధ్రువీకరిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏదైనా అనారోగ్యం వస్తే ఉచితంగా వైద్యసేవలను అందించేందుకు ఏర్పాటుచేసినన వైద్యశిబిరాల్లో 12వ తేదీ నుంచి 14 వరకు 26,887 మంది వైద్యసేవలను వినియోగించుకున్నారు. నమోదవుతున్న కేసులు ఇవే.. జ్వరాలతో బాధపడుతున్నవారు తొలిరోజు 123 మంది రెండోరోజు 300 మంది, మూడోరోజు ఆదివారం 359 మంది వైద్యసేవలను పొందారు. వివిధ రకాల అలర్జీలతో బాధపడేవారు శుక్రవారం 342 మంది, శనివారం 745 మంది, ఆదివారం 985 మంది, ఆస్తమాతో బాధపడేవారు మూడు రోజులు వరుసగా 118 మంది, 177 మంది, 215 మంది వైద్యసేవలు వినియోగించుకున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తొలిరోజు 943 మంది, రెండోరోజు 1774 మంది, మూడోరోజు 1478 మంది, చెవి, ముక్కు, గొంతు, కంటి సమస్యలతో బాధపడేవారు శుక్రవారం 190 మంది, శనివారం 365 మంది, ఆదివారం 604 మంది చికిత్స చేయించుకున్నారు. పెరిగిన డయేరియా కేసులు.. డయేరియా కేసులు తొలిరోజు 52, రెండోరోజు 104 , మూడోరోజు 604 నమోదయ్యాయి. రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్లోరినేషన్ సక్రమంగా చేయకపోతే నీటి కాలుష్యంతో రోజురోజుకు డయేరియా కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు త్వరితగతిన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. పలు ఘాట్లలో నీటిని పరిశుభ్రం చేసేందుకు వినియోగించే క్లోరినేషన్ ప్రక్రియ నత్తనడకన జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోయినా, భక్తులు అప్రమత్తంగా లేకపోయినా వ్యాధులు ప్రభలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఫుడ్, వాటర్ శాంపిల్స్‌కు ఆదేశించాం... పుష్కరాల్లో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఫుడ్, వాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే భక్తులు తాగాలి. ఆహారం ఎక్కడపడితే అక్కడ తినకుండా నిర్దేశిత ఆహార విక్రయ కేంద్రాల్లోనే తినాలి. అన్ని రకాల వ్యాధులకు 24 గంటలు వైద్యసేవలను అందించేందుకు వైద్యశిబిరాలను ఏర్పాటుచేశాం. - డీఎంహెచ్‌వో డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి -
వ్యాధులపై అప్రమత్తం
- గ్రామాల వైద్య శిబిరాల ఏర్పాటు - వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన - డీఎంహెచ్ఓ సాంబశివరావు డెంగీపై ప్రత్యేక దృష్టి గత సంవత్సరం జిల్లాలో 244 డెంగీ కేసులు నమోదయ్యాయి. సమస్యాత్మకంగా గుర్తించిన హసన్‌పర్తి, గూడూరు, ఆజంనగర్, ములుగు, కంబాలపల్లి, వరంగల్ అర్బన్ పీహెచ్‌సీల పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టాం. వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాం. ఎంజీఎం : వర్షకాలం ప్రారంభం కాగానే సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. జిల్లాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా గిరిజన, ఆదివాసీలు నివసించే తండాల్లో వ్యాధులు ప్రబలుతుంటాయి. అయితే గత సంవత్సరం ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల నివారణకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి సాంబశివరావు చెపుతున్నారు. గ్రామాల్లో వైద్యశిబిరాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశామని, క్షేత్రస్థాయిలో సేవలందించేలా సిబ్బందిని అప్రమత్తం చేశామని అంటున్నారు. వ్యాధుల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను ఆదివారం డీఎం హెచ్ఓ ‘సాక్షి’కి వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. వర్షాకాలంలో సీజనల్ వ్యాదులు ప్రబలే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశాం. ప్రతీ సంవత్సరం గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు విస్తారంగా విజృంభించి ప్రజలు మంచం పట్టే పరిస్థితులు నెలకొంటున్నారుు. ఈ ఏడాది అలా జరుగకుండా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. మలేరియా నివారణ మాసోత్సవంలో భాగంగా జూన్‌లో కీటక జనిత వ్యాధుల పట్ల అవగాహన ర్యాలీలు, నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మలేరియా వ్యాధి- తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ గ్రామాల్లో 1.50 లక్షల కరపత్రాలు పంపిణీ చేశాం. ఏజెన్సీ ప్రాంతాల్లో ముందస్తు వైద్య శిబిరాలు... జిల్లాలో గతంలో వ్యాధులు విజృంభించిన ప్రదేశాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందించేవాళ్లం. అయితే కలెక్టర్ వాకాటి కరుణ అదేశాలతో ప్రతి గురువారం ఆయా క్లస్టర్ పరిధిలో ఎంపిక చేసిన గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి, సలహాలు, సూచనలతో పాటు అవసరమైన చికిత్స అందించేలా ప్రణాళిక రూపొందించాం. జిల్లాలో గత ఏడాది 336 మలేరియా పాజిటివ్ కేసులు నమోదు కాగా అందులో 241 కేసులు ఏజెన్సీ ప్రాంతాల్లోనే. ఈ సంవత్సరం ఏజెన్సీలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాం. 165 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ముందస్తుగా స్ప్రే చేశాం. గ్రామ పంచాయతీ, పారిశుధ్య నిధులతోయాంటీ లార్వాల్ చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో ఉన్న 590 మంది సూపర్వైజర్లు, 1100 మంది ఏఎన్ఎంలు, 3174 మంది ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యాధి నివారణ చికిత్సకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాం. ప్రతి శుక్రవారం డ్రై డే.. జిల్లాలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పట్టణాలు, గ్రామాల్లో నీరు నిల్వ లేకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరిస్తున్నాం. డ్రమ్ములు, నిరుపయోగంగా ఉన్న కూలర్లు, తాగిపడేసిన కొబ్బరి బొండాలు, పాతటైర్లలో నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియూమకం.. ఈ సంవత్సరం ఏజెన్సీ ప్రాంతంలో 26 మంది పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులు విధులు నిర్వర్తిస్తారు. కలెక్టర్ అదేశాలతో ఏజెన్సీలో కాంట్రాక్ట్ పద్ధతిలో వైద్యుల నియూమకానికి ప్రయత్నిస్తున్నాం. రాష్ట్రీయ బాల స్వస్తా కార్యక్రమంలో చేపట్టిన సిబ్బందితో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు వైద్యచికిత్సలు అందిస్తున్నాం. వివిధ శాఖల సహకారంతో... సమస్యాత్మక గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహణకు పీహెచ్సీ, పారామెడికల్ సిబ్బందితో పాటు శిశు సంక్షేమ, గ్రామీణ నీటి పారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహకారం తీసుకుంటున్నాం. ఈ శిబిరాల ద్వారా గర్భిణులు, బాలలకు పౌష్టికాహారం, శుద్ధి చేసిన తాగునీటి సరఫరా, గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత, క్లోరినేషన్, దోమల నివారణ వంటి అంశాలపై వివరిస్తాం. -
మహిళా సాధికారతకు భారతీయ పరిశ్రమ బాసట
♦ 2 వినూత్న కార్యక్రమాలను ♦ ప్రకటించిన ఐసీఐసీఐ బ్యాంక్ ♦ 100 హెల్త్ క్యాంపులను ♦ నిర్వహించనున్న ఎస్బీఐ ♦ మహిళా సిబ్బంది పెంపుపై కెనాన్ దృష్టి ముంబై: భారతీయ కంపెనీలు మహిళా సాధికారకతకు చేయూతనందిస్తామని ఉద్ఘాటించాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంకు లు సహా ఇతర కంపెనీలు మహిళల కోసం పలు ప్రోత్సాహకాలను ప్రకటించాయి. మహిళల కోసం 100 ఉచిత హెల్త్ చెకప్ క్యాంపులను నిర్విహ స్తామని దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ ప్రకటించింది. ఇందులో కంటి పరీక్షలు, కాన్సర్ డిటెక్షన్, డయాబెటిక్ చెకప్ వంటి తదితర ఆరోగ్య పరీక్షల ఉంటాయని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య తెలిపారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించలేని ఏ సమాజం కూడా అభివృద్ధి దిశగా పయనించలేదని పేర్కొన్నారు. ప్రైవే ట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్.. మహిళలు ఏడాదిపాటు ఇంటి వద్ద నుంచే పనిచేసే వె సులుబాటు కల్పిస్తూ ‘ఐవర్క్ఃహోమ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అలాగే మూడేళ్లలోపు పిల్లలను కలిగిన మహిళా ఉద్యోగులు పని నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్లాల్సి వస్తే వారు వారి పిల్లలను కూడా తమతోపాటు తీసుకెళ్లే వెసులుబాటు కల్పించింది. జీవితంలో కాలానుగుణంగా కలిగే వివిధ పరిణామాల వల్ల (మాతృత్వం, పిల్లల సంరక్షణ) మహిళలు బలవంతంగా ఉద్యోగాలను వదిలేయవలసి వస్తోందని, అందుకే ఇలాంటి సమయాల్లో వారికి ఇంటి వద్ద నుంచే పనిచేసే వెసులుబాటు కల్పిస్తున్నామని ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చందా కొచర్ చెప్పారు. ముంబైలో విల్లే పార్లే వాయువ్య ప్రాంతంలో మహిళల కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తున్నట్లు యస్ బ్యాంక్ పేర్కొంది. 2018 నాటికి ఉద్యోగ సిబ్బందిలో మహిళల వాటాను 20 శాతానికి పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కెనాన్ తెలిపింది. -
విజృంభిస్తున్న విషజ్వరాలు
రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య 30 పడకల ఆస్పత్రిలో సరిపోని బెడ్లు రోగులకు తప్పని అవస్థలు వైద్య శిబిరాలు నిర్వహించాలంటున్న ప్రజలు ఆదిలాబాద్(సిర్పూర్-టి) : మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పది రోజులుగా ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. మండలంలోని శివపూర్, లక్ష్మీపూర్, చీలపల్లి, భూపాలపట్నం, చింతకుంట, టోంకిని గ్రామాల్లో అధికంగా విషజ్వరాల బారిన పడ్డారు. రోజురోజుకు విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నారు. మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రోజుకు వందకుపైగా రోగులు వస్తున్నారు. రోగులకు సరిపడా బెడ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బెడ్లు లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలోని కుర్చీలపైనే వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ లేకపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. కానరాని వైద్య శిబిరాలు ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నా అధికారులు స్పందించడం లేదు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం లేదు. వర్షాకాలం కావడంతో మండలంలో విషజ్వరాలతో పాటు అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నారుు. ఇటిక్యాలపహడ్, భూపాలపట్నం, లక్ష్మీపూర్, శివపూర్, హీరాపూర్ తదితర గ్రామాలకు అంబులెన్సులు సైతం వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఆయా గ్రామాల రోగులు ఆస్పత్రులకు రావడంలేదు. స్థానికంగానే వైద్యం చేయించుకుంటున్నారు. వారికి మెరుగైన వైద్యం అందకపోవడంతో ఆరోగ్య పరిస్థితి దిగజారుతోంది. అంబులెన్సులు రాని గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి వైద్యశిబిరాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. -
స్వచ్ఛమైన మనసులకు ఆలంబన
‘చదివిన చదువుకు సార్థ్ధకత చేకూరాలి. అలాగే చేసే పని మనసుకు సంతృప్తినివ్వాలి. మానసికంగా ఎదగని పిల్లలకు పాఠాలు చెబుతూ అందులోనే సంతృప్తిని వెదుక్కుంటున్నాను’ అంటున్నారు హైదరాబాద్‌లోని కూకట్పల్లి ప్రగతినగర్‌కు చెందిన 35 ఏళ్ల బబిత. మానసికంగా ఎదగని, అలాగే చదువులో వెనకబడిన పిల్లల కోసం ‘శ్రేయా ఇన్స్టిట్యూట్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్’ పేరుతో స్కూల్‌ను నడుపుతున్నారు బబిత. అదీ తన ఇంటి లోగిలిలోనే! ఫీజులతో నిమిత్తం లేకుండా సేవే పరమావధిగా సామాజిక వెలుగుకోసం నేనూ ఓ చిరుదివ్వెను వెలిగిస్తాను’ అంటున్న 35 ఏళ్ల బబిత ఏం చేస్తున్నారో ఆమె మాటల్లోనే... ఇంటింటికి వెళ్లి... ‘‘చిన్నప్పటి నుంచి టీచర్ కావాలనే ఆలోచన అమితంగా ఉండేది. అయితే ‘అన్నీ సక్రమంగా ఉన్న పిల్లలకంటే బతికినన్నాళ్లూ కుటుంబసభ్యులపై ఆధారపడే బుద్ధిమాంద్యం గల పిల్లలకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తే బాగుంటుంది’అనుకునేదాన్ని. అందుకు కారణం మా మేనమామ. ఆయన మెంటల్లీ హ్యాండికాప్డ్. శారీరకంగా ఎదిగినా, మానసికంగా రెండేళ్ల పిల్లవాడిలా ఉండేవాడు. కుటుంబసభ్యులు ఎంతో ఇబ్బంది పడుతూనే ఆయనకి సేవలు చేసేవారు. చిన్నప్పటి నుంచి ఆయన్ని చూస్తూ పెరగడం వల్లనేమో ఈ తరహా ఆలోచన నాతోపాటు వృద్ధి చెందింది. అందుకే స్పెషల్ చిల్డ్రన్ కోసం 2007లో ప్రత్యేక కోర్సు చేశాను. అప్పటికే నాకు పెళ్లై, ఓ పాప కూడా ఉంది. పాప బాగోగులు చూసుకుంటూనే మానసికంగా ఎదగని పిల్లలు ఉన్న ఇళ్లకు వెళ్లి వారికి క్లాసులు తీసుకునేదాన్ని. మా వారు డా.కులశేఖర్, ఇఎస్ఐ ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్! తనకీ సమాజసేవ అంటే చాలా ఇష్టం. వారాంతంలో స్లమ్ ఏరియాలో హెల్త్‌క్యాంపులు నడుపుతుంటారు. ఆయనలో ఆ దృక్పథం ఉండటం వల్లేనేమో నా ఆలోచనకు ఊతం ఇస్తుంటారు. ఇద్దరు ముగ్గురి నుంచి ఇరవై మంది వరకు.... మానసికంగా ఎదగని ఒకరిద్దరు పిల్లలకే ఇస్తున్న ఈ శిక్షణ మరికొంత మంది పిల్లలకు కూడా అందితే బాగుంటుంది అనుకున్నాను. ఆ ఆలోచనతోనే మూడేళ్ల క్రితం శ్రేయ పేరుతో ఇంట్లోనే స్పెషల్ స్కూల్‌ను మొదలుపెట్టాను. మొదట ఇద్దరు, ముగ్గురు పిల్లలు వచ్చేవారు. ఇప్పుడు 20 మంది వరకు ఉన్నారు. వారికై వారు శుభ్రంగా ఎలా ఉండాలి? చిన్న చిన్న పనులు తమకు తామే ఎలా పూర్తి చేసుకోవాలి? వారి వస్తువులు వారే ఎలా గుర్తుపట్టాలో నేర్పిస్తూనే ఆ తర్వాత వృత్తివిద్యాకోర్సులకు అనుబంధిత సంస్థలతో కలిసి శిక్షణ ఇప్పిస్తుంటాను. వీరిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పదిమంది పిల్లలు, సాయంత్రం 5-7 వరకు మరో పదిమంది పిల్లలు వస్తారు. వీరికి శిక్షణ ఇవ్వడానికి మరొక టీచర్ సాయం కూడా తీసుకున్నాను. ఆటపాటలతో... మానసికంగా ఎదగని చిన్నారులను బుద్ధిగా కూర్చోబెట్టాలంటే వారి కళ్లకు అంతా కలర్ఫుల్గా ఉండాలి. అందుకోసం ఇంట్లోనే ఓ రెండు గదులను రంగురంగులుగా తీర్చిదిద్దాను. అలాగే వారికి బోర్ కొట్టకుండా ఉండటం కోసం వారికి ఆటపాటలను నిర్వహిస్తుంటాను. వారి పుట్టినరోజులు, ఇతర ముఖ్యమైన తేదీలు వేడుకగా జరుపుతాను. స్వచ్ఛమైన మనసులు ఉన్న చోట ఎంత మంది ఉన్నా ఇబ్బంది ఉండదు. అందుకే ఈ చిన్నారులతో ఎంత సేపు ఉన్నా సమయమే తెలియదు’’ అని తెలిపారు ఆమె. సమాజసేవలో పాలుపంచుకోవాలంటే పోగేసుకున్న డబ్బులే అవసరం లేదు. మనసులో ఓ మంచి ఆలోచన, చేయగలను అనే సంకల్పం ఉంటే చాలు ఇంటి నుంచే సేవను మొదలుపెట్టవచ్చు అని నిరూపిస్తున్నారు బబిత. - నిర్మలారెడ్డి