- రోజురోజుకు పెరుగుతున్న రోగుల సంఖ్య
- 30 పడకల ఆస్పత్రిలో సరిపోని బెడ్లు
- రోగులకు తప్పని అవస్థలు
- వైద్య శిబిరాలు నిర్వహించాలంటున్న ప్రజలు
ఆదిలాబాద్(సిర్పూర్-టి) :
మండలంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పది రోజులుగా ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. మండలంలోని శివపూర్, లక్ష్మీపూర్, చీలపల్లి, భూపాలపట్నం, చింతకుంట, టోంకిని గ్రామాల్లో అధికంగా విషజ్వరాల బారిన పడ్డారు. రోజురోజుకు విషజ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నారు. మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రోజుకు వందకుపైగా రోగులు వస్తున్నారు. రోగులకు సరిపడా బెడ్లు లేక రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బెడ్లు లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలోని కుర్చీలపైనే వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ లేకపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లలో పరీక్షలు నిర్వహించుకుంటున్నారు.
కానరాని వైద్య శిబిరాలు
ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నా అధికారులు స్పందించడం లేదు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడం లేదు. వర్షాకాలం కావడంతో మండలంలో విషజ్వరాలతో పాటు అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నారుు. ఇటిక్యాలపహడ్, భూపాలపట్నం, లక్ష్మీపూర్, శివపూర్, హీరాపూర్ తదితర గ్రామాలకు అంబులెన్సులు సైతం వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో ఆయా గ్రామాల రోగులు ఆస్పత్రులకు రావడంలేదు. స్థానికంగానే వైద్యం చేయించుకుంటున్నారు. వారికి మెరుగైన వైద్యం అందకపోవడంతో ఆరోగ్య పరిస్థితి దిగజారుతోంది. అంబులెన్సులు రాని గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి వైద్యశిబిరాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.