పుష్కరాలకు ‘డయేరియా’ ముప్పు!
పుష్కరాలకు ‘డయేరియా’ ముప్పు!
Published Sun, Aug 14 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM
* మూడో రోజులు 604 కేసుల గుర్తింపు
* రోజురోజుకు పెరుగుతున్న వైనం
* అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
గుంటూరు మెడికల్: మీరు కుటుంబ సభ్యులతో కలిసి పుష్కరాలకు వెళ్తున్నారా... అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే పుణ్యం కోసం వెళ్లే పుష్కరాల్లో రోగాలు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని వైద్యాధికారులు అధికారికంగా అందజేసిన పుష్కరాల వైద్యశిబిరాల్లో వైద్యం చేయించుకున్న రోగుల వివరాల్లో స్పష్టంగా ధ్రువీకరిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఏదైనా అనారోగ్యం వస్తే ఉచితంగా వైద్యసేవలను అందించేందుకు ఏర్పాటుచేసినన వైద్యశిబిరాల్లో 12వ తేదీ నుంచి 14 వరకు 26,887 మంది వైద్యసేవలను వినియోగించుకున్నారు.
నమోదవుతున్న కేసులు ఇవే..
జ్వరాలతో బాధపడుతున్నవారు తొలిరోజు 123 మంది రెండోరోజు 300 మంది, మూడోరోజు ఆదివారం 359 మంది వైద్యసేవలను పొందారు. వివిధ రకాల అలర్జీలతో బాధపడేవారు శుక్రవారం 342 మంది, శనివారం 745 మంది, ఆదివారం 985 మంది, ఆస్తమాతో బాధపడేవారు మూడు రోజులు వరుసగా 118 మంది, 177 మంది, 215 మంది వైద్యసేవలు వినియోగించుకున్నారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తొలిరోజు 943 మంది, రెండోరోజు 1774 మంది, మూడోరోజు 1478 మంది, చెవి, ముక్కు, గొంతు, కంటి సమస్యలతో బాధపడేవారు శుక్రవారం 190 మంది, శనివారం 365 మంది, ఆదివారం 604 మంది చికిత్స చేయించుకున్నారు.
పెరిగిన డయేరియా కేసులు..
డయేరియా కేసులు తొలిరోజు 52, రెండోరోజు 104 , మూడోరోజు 604 నమోదయ్యాయి. రోజు రోజుకు డయేరియా కేసులు పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగించే అంశం. క్లోరినేషన్ సక్రమంగా చేయకపోతే నీటి కాలుష్యంతో రోజురోజుకు డయేరియా కేసులు పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు త్వరితగతిన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. పలు ఘాట్‌లలో నీటిని పరిశుభ్రం చేసేందుకు వినియోగించే క్లోరినేషన్ ప్రక్రియ నత్తనడకన జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోయినా, భక్తులు అప్రమత్తంగా లేకపోయినా వ్యాధులు ప్రభలే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఫుడ్, వాటర్ శాంపిల్స్‌కు ఆదేశించాం...
పుష్కరాల్లో డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా ఫుడ్, వాటర్ శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాం. క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే భక్తులు తాగాలి. ఆహారం ఎక్కడపడితే అక్కడ తినకుండా నిర్దేశిత ఆహార విక్రయ కేంద్రాల్లోనే తినాలి. అన్ని రకాల వ్యాధులకు 24 గంటలు వైద్యసేవలను అందించేందుకు వైద్యశిబిరాలను ఏర్పాటుచేశాం.
- డీఎంహెచ్‌వో డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి
Advertisement
Advertisement