Puskaras
-
నట్టేట మునిగిన నాణ్యత
* ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణాల్లో అక్రమాలు * రోజుల వ్యవధిలోనే దెబ్బతింటున్న వైనం * రూ.కోట్ల నిధులు తారుమారు కృష్ణా పుష్కరాల్లో భాగంగా కొల్లూరు మండలంలో చేపట్టిన ఆర్అండ్బీ రహదారుల నిర్మాణంలో నాణ్యత నట్టేట కలిపేశారు. మండల వ్యాప్తంగా రూ.15.30 కోట్లతో చేపట్టిన పనులు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. ఏ ఒక్క రహదారీ మన్నికగా లేదనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పనులు దక్కించుకున్న టీడీపీ నేతలు తమ ఇష్టానుసారంగా రోడ్ల నిర్మాణాలు చేపట్టి బిల్లులు తీసుకొని చేతులు దులుపేసుకున్నారు. కొల్లూరు: పవిత్ర కృష్ణా పుష్కరాల మాటున టీడీపీ నేతలు సాగించిన అక్రమాల డొంక రోజుల వ్యవధిలోనే బట్టబయలైంది. మండలంలో రూ. 15.30 కోట్లతో నిర్మించిన రహదారుల్లో నాణ్యతకు మంగళం పాడి కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకున్నారన్న విషయం రహదారుల దుస్థితి చూస్తే బహిర్గతమవుతుంది. రోజుల వ్యవధిలోనే రూ. 5.69 కోట్లతో నిర్మించిన కొల్లూరు–గాజుల్లంక, పెసర్లంక– కొత్తూరులంక రహదారులు దెబ్బతిన్నాయి. తాజాగా మరో రెండు రోడ్లు కాంట్రాక్టర్ల అవినీతికి ఛిద్రమై ఎందుకూ పనికిరా>కుండా పోతున్నాయి. ఏ ఒక్క రోడ్డూ నిర్మాణంలోనూ నాణ్యత పాటించకపోవడంతో రహదారులు నిర్మించి ప్రయోజనం లేకుండా పోయింది. రహదారులపై తారు లేయర్లు తొలగిపోవడం, అంచుల వెంబడి బీటలు వారడం, రహదారి కుంగిపోవడం వంటి లోపాలు బహిర్గతమయ్యాయి. రూ. 3.15 కోట్ల వ్యయంతో కొల్లూరు–కొల్లిపర మండలాల నడుమ 8.12 కిలోమీటర్ల పొడవున చేపట్టిన రహదారి నిర్మాణం, మరమ్మతులు కాంట్రాక్టర్ల అక్రమాలకు వేదికగా మారాయి. నెలలోనే అధ్వానం.. ఈపూరు నుంచి చిలుమూరు మధ్య నూతనంగా నిర్మించిన రహదారి పొడవునా తారు తొలగిపోయి రోడ్డు ఎందుకూ పనికిరాకుండా పోయింది. కనీసం 15 ఏళ్ల పాటు మన్నాల్సిన బీటీ రోడ్డు నెల రోజుల వ్యవధిలో అధ్వాన స్థితికి చేరడం పనుల్లో ఏమేరకు ప్రమాణాలు పాటించారో తేటతెల్లమవుతుంది. కొల్లూరు వద్ద చేపట్టిన రోడ్డు అంచుల పటిష్టత మట్టితో చేపట్టాల్సి ఉండగా ఇసుకతో తూతూ మంత్రంగా ముగించారు. దీంతో అంచులు కోతకు గురై రోడ్డు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాంట్రాక్టర్ కక్కుర్తి... రూ. 3.15 కోట్లు వెచ్చించి నిర్మించిన గాజుల్లంక–చింతమోటు రహదారి నిర్మాణంలో కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగా రహదారి పాడై పాత రోడ్డులా తయారవుతుంది. పోతార్లంక సమీపంలో రోడ్డు పగుళ్ళిచ్చి కుంగిపోయింది. కిష్కిందపాలెం–తడికలపూడి మధ్యలో సైతం రోడ్డు అంచుల్లో తారు పొరలు తొలగిపోవడం, అంచులు పగిలిపోవడం పనుల జరిగిన తీరుకు అద్దం పడుతుంది. రూ. 3.31 వ్యయంతో 6 కిలోమీటర్ల నిర్మించిన తెనాలి–వెల్లటూరు మార్గంలో సైతం లోపాలు బహిర్గతమవుతున్నాయి. క్రాప అడ్డరోడ్డు రోడ్డు అంచులు కుంగి బీటలువారాయి. లోపాలను కప్పిపుచ్చుకునేందుకు అతుకులతో సరిపెట్టారు. పనులు పూర్తవ్యకముందే బిల్లులు చెల్లించి తమ వాటాలు అందుకున్న విశ్వాసాన్ని అధికారులు ప్రదర్శిస్తున్నారు. డీఈ దృష్టికి తీసుకెళ్ళండి.. రహదారుల దుస్థితి, నాణ్యతా ప్రమాణాలపై ఆర్ అండ్ బీ ఈఈ పకీర్బాబును సాక్షి వివరణ కోరగా డీఈ దృష్టికి తీసుకువెళితే అయన ఆ వ్యవహారం ఏమిటో చూస్తారని పేర్కొన్నారు. – పకీర్‌బాబు, ఈఈ -
రహదారులకూ ‘అవినీతి’ మరకలు
* జిల్లాలో దాదాపు రూ.300 కోట్లకు పైగా పనులు * అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో నిర్వహణ * కాంట్రాక్టుల కోసమే అన్నట్టు మంజూరు * పుష్కరాలు పూర్తయ్యేసరికి దెబ్బతిన్న రోడ్లు * నగరంలో అసంపూర్తిగా రోడ్ల పనులు సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా పుష్కరాల సందర్భంగా జిల్లాలో నిర్మించిన రోడ్ల పనుల్లో అవినీతి పగుళ్ల రూపంలో బట్టబయలవుతోంది. పనుల నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, విజిలెన్స్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామని పదేపదే చెప్పిన ముఖ్యమంత్రి మాటలు నీటి మూటల య్యాయి. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఘాట్ల అనుసంధానం కోసం లింక్ రోడ్లు, భవన నిర్మాణాలకు సంబంధించి దాదాపు 100 పనులను రూ.66.76 కోట్లతో చేపట్టారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో 83 పనులను రూ.170.37 కోట్లతో పనులు చేశారు. గుంటూరు కార్పొరేషన్లో 94 పనులను రూ.40.02 కోట్లతో, తాడేపల్లి మున్సిపాలిటిలో 42 పనులు రూ.18.25, రేపల్లెలో 7 పనులు రూ.కోటితో, మంగళగిరి మున్సిపాలిటీలో నాలుగు పనులు రూ.2 కోట్లతో చేపట్టారు. పనులు హడావుడిగా మంజూరు చేసి పుష్కరాలు ప్రారంభమయ్యేలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులు, కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చింది. ఎక్కువ శాతం కాంట్రాక్టు పనులు పచ్చ నేతలే దక్కించుకోవటంతో వారు అందివచ్చిన అవకాశాన్ని సద్వినిమోగం చేసుకొన్నారు. నాణ్యతకు తూట్లు పొడిచి, కోట్ల రూపాయల సొమ్మును కొల్లగొట్టారు. ఈ పనుల్లో సైతం చినబాబుకు వాటాలు ఉండటంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోయారు. సిమెంటు పనులు నాసిరకంగా చేసి, కనీసం క్యూరింగ్ కూడా చేయలేదు. మట్టి, మెటల్ రోడ్లు కనీసం కన్సాలిడేషన్ లేకుండా తూతూమంత్రంగా చేయడంతో రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షాలకు కొన్ని రోడ్లు కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల రోడ్లపై కంకర తేలింది. కొన్ని రోడ్లు పగిలిపోయాయి. గుంటూరు నగరంలో డ్రెయిన్లు, కాలువలు, రోడ్లు అప్పుడే దెబ్బతింటున్నాయి. నగరంలో ఆర్అండ్బీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులు అసంపూర్తిగా ఉన్నాయి. కంకర వేసి వదిలి వేయడంతో నగర ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. పుష్కరాల్లో రోడ్లు, డ్రెయిన్లు, సిమెంట్ రోడ్డు పనులకు దాదాపు రూ.300 కోట్ల పనులు చేపట్టారు. పనుల్లో నాణ్యత డొల్లతనం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. లింక్ రోడ్ల పేరుతో... పల్నాడు ప్రాంతంలో కాంట్రాక్టు పనుల కోసమే అన్నట్లు కోట్ల రూపాయల పనుల్లో తెలుగు తమ్ముళ్లు దోచుకున్నారు. దాచేపల్లి మండలంలోని రామాపురంలో రూ.1.05 కోట్లతో వేసిన సిమెంట్ రోడ్డు పగుళ్లు వచ్చింది. అద్దంకి హైవే నుంచి పొందుగలకు వేసిన రోడ్డు ప్రస్తుత వర్షాలకు కోతకు గురైంది. రూ.1.20 కోట్లలో నిర్మించిన చెన్నాయపాలెం రోడ్డు దుస్థితీ అంతే. గురజాల నుంచి దైదకు రూ.3.20 కోట్లతో వేసిన రోడ్డు అంతంతమాత్రంగానే ఉంది. అమరావతిలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ.4 కోట్లతో అప్రోచ్ రోడ్లను తూతూమంత్రంగా వేశారు. ప్రస్తుతం కురిసిన వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ధరణికోట నుంచి సత్తెనపల్లి ఆర్అండ్బీ రోడ్టును అనుసంధానం చేసేందుకు రూ.1.90 కోట్లతో వేశారు. అమరావతిలో పుష్కర ఘాట్లను అనుసంధానిస్తూ రూ.కోటితో, ధ్యానబుద్ధ ఘాట్ వద్ద రూ.50 లక్షలతో రోడ్లు వేశారు. కొల్లూరు, కొల్లిపర మండలాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెనుమూడి–రేపల్లె రోడ్డు హడావుడిగా రూ.4 కోట్లతో చేశారు. పెనుమూడిలో వీఐపీ ఘాట్ రోడ్డు, మైనేనిపాలెం అప్రోచ్ రోడ్డు పనులు నాసిరకంగా చేశారు. ఇలా జిల్లాలో జరిగిన పుష్కర రోడ్డు పనులు అవినీతికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. మొత్తం పనులపై విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. -
నాణ్యతకు కోత
* పుష్కరాలకు నాసిరకంగా రోడ్డు నిర్మాణం * ఒక్క వర్షంతోనే కోతకు గురైన మార్జిన్లు * వాహనాలు రోడ్డు అంచుకు వెళ్తే ముప్పే * రూ.2 కోట్ల పనుల తీరిదీ తమ్ముళ్ల జేబులు నింపడానికి ప్రభుత్వం పుష్కర పనుల పేరిట కోట్లాది రూపాయలు వెదజల్లింది. కాంట్రాక్టర్లు నాణ్యతకు పాతర వేసినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో నెల రోజులు కూడా గడవక ముందే పనుల్లో డొల్లతనం బయట పడుతోంది. క్రోసూరు: కోట్ల రూపాయల నిధులతో చేపడుతున్న అభివద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చేస్తున్నారు. తమకు అధికారపార్టీ అండదండలుంటే చాలన్న చందంగా ఆర్‌అండ్‌బీశాఖ అధికారులు వ్యవహరిస్తుండటంతో రోడ్ల నిర్మాణాలు నాసిరకంగానే పూర్తవుతున్నాయి. పుష్కరాల పనుల్లో భాగంగా రూ.2 కోట్ల నిధులతో క్రోసూరు మండలంలోని బయ్యవరం నుంచి క్రోసూరు వరకు 10 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు వేశారు. మంగళవారం కురిసిన భారీ వర్షానికి రోడ్డు నాణ్యతలో డొల్లతనం బయట పడింది. వర్షానికి విప్పర్ల చెక్‌డ్యాం వద్ద రోడ్డు మార్జిన్లు భారీగా కోత గురయ్యాయి. రోడ్డు మార్జిన్లో ఉన్న చౌడు మట్టి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో మార్జిన్ వద్ద మట్టి అంచు కొంత మేర కూలిపోయింది. రోడ్డు మార్జిన్లో వేసిన రాళ్లను కనీసం రోలర్‌తో చదును చేయకుండా వదిలేయడంతో రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. రోడ్డు మార్జిన్లు అల్పంగా ఉండటంతో ఏదైనా పెద ్దవాహనం వచ్చినా పక్కకు ఒరిగిపోయే ముప్పు కూడా పొంచి ఉంది. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా మళ్లీ మళ్లీ పనులు చేయిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగచేస్తున్నారని ప్రజలంటున్నారు. బాగు చేయిస్తాం.. రోడ్డు పని పూర్తి కాలేదు. నార్మ్స్ ప్రకారం రోడ్డు షోల్డర్స్‌కు బలం కొరకు సైడు మట్టితోనే వేయాల్సి ఉంది. వర్షానికి కోతకు గురైన రోడ్డును కాంట్రాక్టరే బాగు చేయాలి. లేకుంటే బిల్లులు మంజూరు చేయం. రోడ్డు గట్టితనం కోసమే షోల్డర్స్‌కు మాత్రం రాళ్లు వేసాం. పెద్దసైజు రాళ్లు తొలగిస్తాం. దానిపై తిరిగి కంకర వేసి రోలర్‌తో చదును చేస్తాం. కొద్దిగా తెరపి ఇచ్చిన వెంటనే పనులు చేస్తాం. – అబ్బాస్ కెనడీ, ఆర్అండ్బీ ఏఈ -
పుష్కర రోడ్డుకు పురిట్లోనే పగుళ్లు
* నాణ్యతా లోపంతో రహదారి నిర్మాణం * రోజుల వ్యవధిలోనే దెబ్బతిన్న వైనం * అతుకులతో కప్పిపెట్టే యత్నం పుష్కర పనులు పురిట్లోనే పనికిరాకుండా పోతున్నాయి. ఘాట్లు, అప్రోచ్‌రోడ్లు, తారు రోడ్లు, అంతర్గత రహదారులు నెలరోజులు కూడా గడవకముందే అధ్వానంగా మారాయి. వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుచేసి చేపట్టిన అనేక పనుల్లో నాణ్యత నాసిరకంగా ఉంది. కొల్లూరు: కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రభుత్వం హడావుడిగా చేపట్టిన అనేక పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నాణ్యతకు పాతరేశారు. ఏ మాత్రం ప్రమాణాలు పట్టించుకోకుండా పనులు చేయడం విమర్శలకు దారితీస్తోంది. అడుగేస్తేనే బీటీ రోడ్డు బెతెకలు కాలి వెంట లేసి వచ్చేలా ఉన్నాయంటే ఎలా చేశారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రూ. 3.3 కోట్లు వెచ్చించి చేపట్టిన రహదారి పనులు జరగుతుండగానే తారు బెతెకలు ఊyì పోవడం, నాణ్యతా లోపాలు బహిర్గతమయిన చోట గుత్తేదారు తిరిగి అతుకులు వేసినా పలితం కనిపించడంలేదు. అతుకులు వేసిన ప్రాంతంతో తిరిగి రహదారి ఛిద్రమవుతుండటం రహదారి మన్నికకు ప్రశ్నార్థకంగా మారింది. చెక్కుచెదరకుండా లక్షణంగా ఉన్న పాత రోడ్డును పెకిలించి పుష్కర నిధులతో నిర్మిస్తున్న రోడ్డులో నాణ్యతా ప్రమాణాల లోపం కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలతో కలసి ఉన్న పది లంక గ్రామాల ప్రజలకు కొత్తగా నిర్మించిన రహదారి కన్నీటిని మిగుల్చుతోంది. నాణ్యతకు తిలోదకాలు... 10.08 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రహదారి పనులు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కొల్లూరు మండలంలోని పెసర్లంక నుంచి జిల్లాలోని వేమూరు, తెనాలి నియోజకవర్గ గ్రామాలు, కృష్ణా జిల్లాలోని మరో రెండు గ్రామాలను కలుపుకుంటూ వెళ్లే మార్గ నిర్మాణ పనులు నీటి పాలయ్యాయి. పుష్కరాలకు ముందు హడావిడిగా రోడ్డు పనులు జరుగుతుండగానే వేసిన రోడ్డు వేసినట్లు బీటలు వారి తారు బెతెకలు ఊడి మెటల్ బయట పడటం రహదారి నిర్మాణంలో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాల బాగోతం తేటతెల్లమైంది. కొల్లిపర మండలం అన్నవరపులంక, కృష్ణా జిల్లా కనిగిరిలంక వద్ద రహదారి నిర్మించి నాలుగు రోజులు గడకుండానే రోడ్డు అంచులు వెంబడి మొదలయ్యి రోడ్డు మొత్తం ఛిద్రమైపోవడం ఆరంభమైంది. చెక్కుచెదరని రోడ్డును పెకిలించారు.. గతంలో ఆరేళ్ళ కిందట నిర్మించిన రహదారి చింతర్లంక, చిలుమూరులంక, అన్నవరపులంక ప్రాంతాల్లో కిలోమీటరున్నర మినహా ఎక్కడా చెక్కుచెదరకుండా లక్షణంగా ఉంది. సవ్యంగా ఉన్న రోడ్డును నూతన రోడ్డు పేరుతో పెకిలించేసి తూతూ మంత్రంగా ముగించడంపై ఆప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పంటలకు నెలవైన ఈ ప్రాంతంలో ఈ మార్గం ద్వారా కంద, అరటి, పసుపు, వంటి వాణిజ్య పంటల తరలింపుకు అధిక బరువులతో వాహనాలు తిరగాల్సి ఉంది. సుమారు ఆరువేల మంది జనాభా నివసిస్తున్న లంక గ్రామాల్లో రవాణా సౌకర్యంకు ఏకైక ప్రధాన మార్గపు పనులు తీసికట్టుగా మారాయి. రెండు లేయర్లతో బీటీ రోడ్డు వేశాం.. రహదారి పనుల్లో ఎటువంటి లోపం తలెత్తకుండా పర్యవేక్షించాం. గ్రామాలున్నంత వరకూ రహదారి పాడవకుండా రెండులేయర్లతో బీటీ రోడ్డు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఒకే లేయర్‌తో రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతంలో రహదారి పాడవడానికి అవకాశం లేదు. రహదారిని పరిశీలించి తక్షణం లోపాలను సవరిస్తాం. – మల్లికార్జునరావు, ఆర్ అండ్‌బీ డీఈ, తెనాలి -
ప్రచార ఆర్భాటానికి రూ.కోట్ల ఖర్చు
పుష్కర పనుల్లో అవినీతి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి ధ్వజం చంద్రబాబు సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ గుంటూరు (పట్నంబజారు): కేవలం ప్రచారార్భాటాల కోసం పవిత్ర కృష్ణా పుష్కరాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు సర్కార్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ఖర్ఛు చేసిన నిధులు, అభివృధ్ధి పనులపై తక్షణమే శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పుష్కరాల కోసం రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తే, 2 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించి, పిండ ప్రదానాలు చేశారని, అంటే ఒక్కొక్క మనిషి కోసం రూ.1000 ప్రభుత్వం వెచ్చించిందా అని ప్రశ్నించారు. శాశ్వత నిర్మాణాల కోసం ప్రభుత్వం అన్ని వేల కోట్లు ఖర్చు చేస్తే తాము కూడా హర్షించేవారమన్నారు. అవకతవకలు జరిగాయని మీడియాలో ఘోషిస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వేలాది కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు సర్కార్ ప్రత్యక్షంగా, పరోక్షంగా 22 మంది మృతికి కారణమైందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రూ.800 కోట్లతో పుష్కరాలను నిర్వహిస్తే, ఇక్కడికంటే అధికంగా 5 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారని, ఏ ఒక్క ప్రమాదం జరలేదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్నారు. పుష్కరాలను సైతం రాజకీయ వేదికగా మార్చుకుని గంటల కొద్దీ ప్రసంగాలు చేయడం హాస్యాస్పదమన్నారు. భక్తులను పోలీసులతో నిర్బంధించి, ఎటువైపు కదలనివ్వకుండా నిలువరించి ప్రసంగాలు చేశారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము) రేపల్లె నియోజకవర్గ గడపగడపకు వైఎస్సార్ పరిశీలకుడు మోదుగుల బసవపున్నారెడ్డి, మైనారిటీ విభాగం గుంటూరు నగరాధ్యక్షుడు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. -
యాత్రికుల సేవలో ఆంధ్రాశ్రమం
సాక్షి, విజయవాడ : కృష్ణా పుష్కరాల సందర్భంగా వారణాసిలోని శ్రీరామతారకాంధ్రాశ్రమం విజయవాడలో పుష్కర యాత్రికులకు ఇతోధికంగా సేవలందించింది. పుష్కరాలు జరిగిన 12 రోజులూ విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూం సమీపంలో యామిజాల రామం మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు సహకారంతో సుమారు 50 వేల మంది యాత్రికులకు నిత్యాన్నదానం జరిపింది. ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వేమూరి వేంకట సుందరశాస్త్రి, ఆయన కుటుంబీకులు, ఆశ్రమ వైస్ చైర్మన్ ముక్తేవి సీతారామయ్య, ట్రస్టీ పురాణం శ్రీనివాస్, సిబ్బంది పెద్ద సంఖ్యలో పుష్కర యాత్రికుల సేవలో పాల్గొన్నారు. పుష్కరాల చివరి రోజైన మంగళవారం కృష్ణవేణికి ఘనంగా ముగింపు హారతి కార్యక్రమం కూడా నిర్వహించారు. -
పుష్కరాల ముసుగులో దోపిడీ
వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి అచ్చంపేట: గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో చంద్రబాబు తన కార్యకర్తలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టారని పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్యయకర్త కావటి శివనాగ మనోహరనాయుడు ఆరోపించారు. బుధవారం ఆయన పార్టీ మండల కన్వీనర్ సందెపోగు సత్యం నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు రూ.1800 కోట్లు, కృష్ణా పుష్కరాలకు రూ.1300 కోట్లు వెచ్చించి వేసిన రోడ్లు, దేవాలయాల మరమ్మతులు, çపుష్కరఘాట్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందన్నారు. నియోజకవర్గంలో క్రోసూరు నుంచి అమరావతి, అచ్చంపేట నుంచి ఊటుకూరు వరకు, అచ్చంపేట నుంచి మాదిపాడు వరకు వేసిన రోడ్ల నిర్మాణాల్లో నాణ్యత లేదన్నారు. పుష్కర ఘాట్ల నిర్మాణాలకు ముందుగా అంచనాలు తయారు చేయకుండా, టెండర్లు పిలవకుండా పైపై పూతలతో దోచుకోవాలని చూస్తే వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. దీనిపై సమాచార హక్కు చట్టం ప్రకారం ఏ ఘాట్‌కు ఎంత వెచ్చించారు, నాణ్యాతా పరమైన సమాచారాన్ని రాబడతామన్నారు. ఎంత వరకు ఖర్చు చేశారో అంతే బిల్లు చేసుకోవాలి తప్ప దోచుకోవాలని చూస్తే విజలెన్స్, క్యాలిటి కంట్రోల్‌కు ఫిర్యాదు చేసి న్యాయపోరాటం చేస్తామన్నారు. -
ఆణిముత్యాలకు పుష్కర నివాళి
అమరావతి : దివికేగిన తెలుగుజాతి ఆణిముత్యాలకు మంగళవారం స్థానిక ధ్యానబుద్ధ పుష్కరఘాట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) ప్రతినిధులు పిండ ప్రదానం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ, అల్లూరి సీతారామరాజు, పింగళి వెంకయ్య, పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం, నీలం సంజీవరెడ్డి, పి.వి.నరసింహారావు, ఎన్‌టి రామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, సినీ నటీనటులు సావిత్రి, ఎస్వి రంగారావులతో పాటు పలు రంగాల్లో ప్రముఖులైన తెలుగువారికి నివాళి అర్పించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పీఆర్టీయూ అధ్యక్షులు టీవీఎస్ మణి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పుష్కర సందడి
-
రాత్రిళ్లూ బస్సు సర్వీసులు
ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి గుంటూరు (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులు, ఉచిత బస్సుల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయనే దానిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి శనివారం స్వయంగా పుష్కర్నగర్లోని బస్సుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రయాణీకులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి పది గంటల నుంచి సత్తెనపల్లి, పెదకూరపాడుతోపాటు ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేందుకు బస్సులు అందుబాటులో ఉండటం లేదని వారు చెప్పారు. రాత్రి వేళల్లో కూడా పుష్కరనగర్ల వద్ద అన్ని ప్రాంతాలకు బస్సులను అందుబాటులో ఉంచాలని కోరారు. దీంతో స్పందించిన ఆర్ఎం శ్రీహరి రాత్రి వేళల్లో 50 బస్సులు అదనంగా ఉంచి అవసరమైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రి వేళల్లో కూడా పుష్కరనగర్ వద్ద కంట్రోలర్‌ను ఏర్పాటు చేశామన్నారు. -
సాంస్కృతిక సందడి
సీతానగరం (తాడేపల్లి రూరల్): సీతానగరం పుష్కరఘాట్‌లో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా శనివారం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి చేరుకున్న కళాకారులు కూచిపూడి నృత్యాలు, భరత నాట్యం, కోలాటం, లఘునాటికలు ప్రదర్శించారు. కృష్ణమ్మ గొప్పదనాన్ని వర్ణిస్తూ కీర్తనలు, గేయాలు, పద్యాల రూపంలో కళాకారులు తమదైన శైలిలో తెలియజేస్తున్నారు. పుష్కర ఘాట్‌లో ప్రదర్శనలను భక్తులు తిలకించారు. కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విశేషంగా ఆకట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి బెజ్జం విజయభాస్కర్, ఎంఈవో రాయల సుబ్బారావు, మునిసిపల్ కమిషనర్ బిక్కిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు. -
‘బాల’కృష్ణం వందే జగద్గురుం..
-
స్మైల్ ప్లీజ్!
గుంటూరు రూరల్ (అమరావతి) : ‘పుష్కర స్నానం చేశాం. అద్భుతంగా ఉన్న బుద్ధుడి విగ్రహం వద్ద ఫొటోలు దిగితే సూపర్‌గా ఉంటుంది. గుర్తుగా మిగిలిపోతుంది..’ అన్న మాటలు అమరావతిలోని పుష్కర ఘాట్ల వద్ద తరచూ వినిపిస్తున్నాయి. ఆ మాట వినపడగానే లోకల్ ఫొటోగ్రాఫర్లు వారిముందు ప్రత్యక్షమవుతున్నారు. ‘స్మైల్ ప్లీజ్..’ అంటూ ఫొటో తీసి చేతిలో పెట్టి రూ.35 నుంచి రూ.50 వరకు చార్జ్ చేస్తున్నారు. -
కృష్ణ తీరం.. జన సంద్రం
-
పుష్కరాలకు రూ. కోట్లు వృథా
వైఎస్సార్ సీపీ నేత మేరుగ నాగార్జున కొల్లూరు: పుష్కరాల పనుల్లో ప్రభుత్వం రూ. కోట్లు వృథా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ నాగార్జున విమర్శించారు. గురువారం కొల్లూరు మండలంలోని పోతార్లంకలో కుటుంబ సభ్యులతో కలసి ఆయన పుష్కర స్నానమాచరించి పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గ పరిధిలో నిర్మించిన 12 పుష్కర ఘాట్లలో రెండు మూడు మినహా మిగిలిన ఘాట్లు నిరుపయోగంగా మారడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువుటద్దం అన్నారు. ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి అభివృద్ధిని విస్మరించడం హేయమని ధ్వజమెత్తారు. సరైన ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తూ వేల కోట్లు స్వాహా చేయడం బాధాకరమన్నారు. ప్రణాళికేతర వ్యయం కారణంగా ఇప్పటికే ప్రభుత్వం రూ.80 వేలSకోట్లు అప్పులు చేసిందని గుర్తుచేశారు. పుష్కర పనుల్లో వందల కోట్లు అవినీతి జరిగిందని ప్రభుత్వ అవినీతిపై సరైన విచారణ జరిపితే టీడీపీ ప్రభుత్వంలోని అవినీతి పరుల జాబితా బయటకి వస్తుందన్నారు. ఆయన వెంట కొల్లూరు ఉప సర్పంచి కఠెవరపు జేసుదాసు, దుగ్గిరాల మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్ బిట్రగుంట సత్యనారాయణ, మండల ఎస్సీ సెల్ ప్రదాన కార్యదర్శి కాలం రాజేంద్ర, స్థానిక నాయకులు పరిశ రంగారావు తదితరులున్నారు. -
పుష్కర ఉషోదయం
కొల్లిపర: కృష్ణా పుష్కరాలు ప్రారంభమైనప్పటి నుంచి ఎండలు మండి పోతున్నాయి. సూర్యోదయం వేళ మాత్రం వాతావరణ ఆహ్లాదంగా ఉంటుంది. దీంతో భక్తులు ఉదయం వేళ నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూర్యోదయాన భక్తుల రద్దీ నది వద్ద కొనసాగుతోంది. -
వయసులో చిన్న... సేవలో మిన్న
భక్తుల సేవలో తరిస్తున్న విద్యార్థులు వయసులో చిన్న అయినా... వారు సేవలో మిన్న... పుష్కరాలకు వచ్చిన భక్తులు... అందునా ముఖ్యంగా వృద్ధులకు వారు సొంత మనవళ్లు, మనవరాళ్లలా ఎంతో ఆప్యాయంగా సేవలందిస్తున్నారు. వికలాంగులకు ఊతకర్ర అవుతున్నారు. వ్యాధిగ్రస్తులకు నైటింగేళ్లవుతున్నారు. రెడ్‌క్రాస్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రామకృష్ణ మిషన్ వంటి సంస్థలకు చెందిన విద్యార్థులకు వారి సేవాభావాన్ని నిరూపించుకునేందుకు 12 ఏళ్లకు వచ్చే పుష్కరాల్లో ఈ 12 రోజులు ఒక అవకాశంగా మారాయి. పట్నంబజారు : గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు అనేక జిల్లాల నుంచి తరలివచ్చిన విద్యార్థులు చేస్తున్న సేవలు కృష్ణా పుష్కరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రెడ్‌క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు రోహిణి కళాశాలకు చెందిన 80 మంది విద్యార్థులు ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్‌లో వీల్చైర్లలో సుమారు కిలో మీటరు దూరం నుంచి వృద్ధులు, వికలాంగులను ఘాట్ వద్దకు చేరుస్తూ..తిరిగి ఉచిత బస్సులు నిలిచే దుర్గా విలాస్ హోటల్ వరకు వదలిపెడుతున్నారు. ఘాట్లలో భక్తులకు సహాయ సహాకాలు అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్ధానం ఆధ్వర్యంలో గుంటూరులోని బండ్లమూడి హనుమాయమ్మ కళాశాల (బీహెచ్)కు విద్యార్థినులు భక్తుల సేవల్లో పాలుపంచుకుంటున్నారు. రామకృష్ణ హిందూ హైస్కూల్లో 35 మంది విద్యార్థినులు నిత్యం వచ్చే వేలాది మంది ఉదయం సమయంలో అల్పాహార కార్యక్రమం నుంచి రాత్రి భోజన కార్యక్రమం వరకు వడ్డన చేయటంతో పాటు...ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అమరేశ్వరుని ఆలయంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీటి సౌకర్యం, తదితర సేవలు చేపడుతున్నారు. స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్థులు పిల్ల పోలీసుల్లా అమరావతిలో భక్తుల నియంత్రణలో కీలకపాత్ర వహిస్తున్నారు. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో సేవలు అందించేందుకు వచ్చిన విద్యార్థులు వీపునకు నీటి డబ్బాను తగిలించుకుని పుష్కర ప్రాంగణంలో పాదచారులకు, భక్తులకు తాగునీటిని అందించడంతో పాటు, ఈ సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమంలో విశేషంగా పాటుపడుతున్నారు. ఉచిత క్లోక్ రూం వద్ద కూడా వారు సేవలు అందిస్తున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా మండుటెండల్లో సైతం సేవలు అందిస్తున్న విద్యార్థులను అభినందించి తీరాల్సిందే. -
పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తం
రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ పొందుగల (దాచేపల్లి): కృష్ణా పుష్కరాలకు భక్తులు అధికంగా తరలివస్తున్నారని, భక్తులకు ఇబ్బంది కలుగకుండా పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రూరల్ ఎస్పీ కె. నారాయణ నాయక్ పోలీసులకు సూచించారు. మండలంలోని పొందుగల పుష్కరఘాట్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసే ప్రదేశాలను పరిశీలించారు. ఘాట్ల వద్ద ఏర్పాట్లు పట్ల ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. మరో ఆరురోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయని, సెలవు దినాల్లో, పుష్కరాల చివరి రెండు రోజుల్లో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఎస్పీ చెప్పారు. భక్తులు పుష్కరస్నానం చేసి క్షేమంగా ఇంటికి వెళ్లేలా చూడాలని, ఆటంకాలు కలుగకుండా భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఇ. శ్రీనివాసరావు, ఎస్ఐ కట్టా ఆనంద్, ఎంపీపీ అంబటి నవకుమార్, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య తదితరులున్నారు. -
పుష్కరాలకు ఆర్టీసీ సేవలు భేష్!
* పుష్కర నగర్ల నుంచి ఘాట్ల వరకు ఉచిత ప్రయాణం * 150 బస్సులను తిప్పుతున్న అధికారులు * ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న ఆర్టీసీ ఆర్ఎం * దూరప్రాంతాలకు సర్వీసుల పెంపు అమరావతి (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు భక్తులు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలకు 905 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు, మరో 500 బస్సులను అదనంగా అందుబాటులో ఉంచుకున్నారు. పుష్కరనగర్ల ఏర్పాటుతో బస్సులన్నీ సుమారు 2 లేదా 3కిలో మీటర్లు దూరంలోనే నిలిచిపోతున్నాయి. దీనిని గమనించిన ఏపీఎస్ ఆర్టీసీ రీజయన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి పుష్కరనగర్ల నుంచి ప్రయాణికులు, భక్తులను ఘాట్ల వద్దకు ఉచితంగా దింపేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే అమరావతిలోని పుష్కర నగర్ల నుంచి ఘాట్‌కు 60 బస్సులు, మంగళగిరి నుంచి ఎయిమ్స్, తాడేపల్లికి 30 బస్సులు, ఎయిమ్స్ నుంచి ఉండవల్లికి 15, విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి 15, కేసీ కెనాల్ రైల్వేస్టేషన్ నుంచి తాడేపల్లి, ఉండవల్లికి 30 బస్సులను తిప్పుతున్నారు. భక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దూరప్రాంతాలకు ప్రత్యేక బస్సులు... నిత్యం తిరిగే సర్వీసులతో పాటు బెంగళూరుకు 7, చెన్నైకి 9, హైదరాబాద్‌కు 25, తిరుపతికి 2 సర్వీసులతో పాటు కర్నూలు, కడప, చిత్తూరు. విశాఖపట్నంలకు అవసరాన్ని బట్టి బస్సుల సంఖ్యను పెంచేందుకు ఏర్పాట్లు చేశారు. ఆన్లైన్ ద్వారా పుష్కర స్పెషల్ టికెట్ ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. వీటితో పాటుగా ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
పుష్కరాల్లోనూ ప్రచార ఆర్భాటం
* టీడీపీ నేతల ఫ్లెక్సీ విరిగి ఇద్దరికి గాయాలు * పూజా సామగ్రి బ్యాగులపైనా సీఎం ఫొటోలు * భక్తుల విమర్శలు అమరావతి (గుంటూరు రూరల్) : తెలుగుదేశం పార్టీ నాయకుల అత్యుత్సాహం అమరావతిలో కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు శాపంగా మారింది. టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు గాలికి పడిపోయి ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి పంపిన సంఘటన సోమవారం అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్ సమీపంలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన పూసల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి అమరావతిలోని ధ్యానబుద్ధ ఘాట్‌లో పుణ్య స్నానం చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేసి దైవసన్నిధిలో దేవుని దర్శించుకుని ఇంటికి బయలుదేరారు. ఘాట్‌నుంచి బయటకు వచ్చిన తరువాత బస్‌ల కోసం కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై నిలబడ్డారు. అదే సమయంలో గాలి తీవ్రంగా వీయటంతో ఒక్కసారిగా ఘాట్‌కు వెళ్లే మార్గంలో స్థానిక టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ముఖ ద్వారం ఫ్లెక్సీ విరిగి రోడ్డు పక్కేనే నిలబడి ఉన్న భక్తులపై పడింది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు, ఆయన కుమారుడు నవీన్‌కు తలకు ఫ్లెక్సీ రేకులు గీసుకుని గాయాలయ్యాయి. అక్కడే డ్యూటీ చేస్తున్న పోలీసులు అప్రమత్తమై సమీపంలోని ప్రథమ చికిత్స కేంద్రానికి బాధితులను తీసుకెళ్లారు. వైద్య చేయించి వెంటనే వెళ్లిపోవాలని చెప్పి ఆటోలో గుట్టు చప్పుడు కాకుండా తరలించారు. దీంతో బాధితుడు గ్రామశివారులోని పుష్కరనగర్‌లో బస్‌ఎక్కి గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది వెళ్లినట్లు తెలిసింది. పిండ ప్రదానం, పూజా సామగ్రికీ పార్టీ రంగు... భక్తులు పితృదేవతలకు పెట్టే పిండ ప్రదాన సామాగ్రి నుంచి అమ్మవారికి పూజలు చేసుకునే పూజా సామాగ్రి వరకూ ప్రతి విషయానికి చంద్రబాబు స్తుతి సూక్తులతో కూడిన పార్టీ ప్రచార రంగును పులిమారు. చంద్రబాబునాయుడు ఫొటో ముద్రించిన∙సంచుల్లో పిండ ప్రదాన వస్తువులను పెట్టి విక్రయిస్తున్నారు. చంద్రబాబు స్తుతి గీతాలు.... ఘాట్ల నిండా పార్టీ రంగులతో చంద్రబాబు, లోకేష్ ఫొటోలతో బెలూన్లను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎక్కడ చూసినా పుష్కరాలకు చెందిన ప్లెక్సీలను ఎక్కడా ఏర్పాటు చేయక పోగా టీడీపీ నాయకుల ప్లెక్సీలను మాత్రం వీధి వీధిలో ఏర్పాటు చేశారు. ప్రతి విద్యుత్ పోలుకు మైకులను ఏర్పాటు చేశారు. పవిత్ర పుష్కరాలలో దేవుని గీతాలను భక్తులకు వినిపించాల్సింది పోయి నిత్యం చంద్రబాబు స్తుతి గీతాలు, పార్టీ పాటలను వినిపిస్తూ భక్తులకు విసుగు తెప్పించారు. ఆలయాల్లో దేవుని గీతాలు వినిపిస్తారు కానీ పార్టీ గీతాలు ఏర్పాటు చేశారేంటని భక్తులు విస్మయం చెందారు. -
అమరావతికి భక్త వాహిని
* పెద్ద సంఖ్యలో అమరలింగేశ్వరుని దర్శించుకున్న భక్తులు * క్రమంగా పెరుగుతున్న రద్దీ సాక్షి, అమరావతి: పంచారామాల్లో ప్రథమా రామం అమరావతి అమరలింగేశ్వర ఆలయం. దీనికితోడు చల్లని వాతావరణం, ఆహ్లాదపరిచే కృష్ణవేణి ప్రవాహం,శివయ్యకు ప్రీతిపాత్రమైన సోమవారం అన్నీ కలిసి రావడంతో పుష్కర స్నానాలు చేసేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళలు కృష్ణమ్మకు పసువు, కుంకుమలు పెట్టి పూజలు చేశారు. పలువురు పితృదేవతలకు పిండ ప్రదానాలు చేశారు. ఎండ వేడిమితో అల్లాడిన భక్తులకు, ఈ రోజు వాతావరణం అనుకూలించడంతో కృష్ణమ్మ చెంతనే ఎక్కువ సేపు సేద తీరారు.ధ్యాన బుద్ధ విగ్రహం దగ్గర పిల్లల ఆటలతో పాటు, సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు. నమూనా ఆలయాల్లో సైతం భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. అమరలింగేశ్వరుని దర్శించుకునేందుకు.. కృష్ణమ్మ ఒడిలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు, అమరలింగేశ్వరుని దర్శించుకొన్నారు. అమరేశ్వరుని వద్ద క్యూలైన్లు కిటకిటలాడాయి. పోస్టాఫీసు వరకు క్యూలైన్ ఏర్పాటు చేసినా, సగభాగం మాత్రమే షామియానాలు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వీఐపీ దర్శనానికి గంట, రూ.100 దర్శనం రెండు గంటలు, ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. పుష్కరాల డ్యూటీలకు వచ్చిన ఉద్యోగులు, కొంతమంది పోలీసులు తమ కుటుంబ సభ్యులను వీఐపీ దర్శనానికి పంపడంతో ఉచిత దర్శనానికి ఆలస్యమవుతోంది. ఆలయ అధికారులు వీఐపీల సేవతో తరిస్తూ సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని భక్తులు మండిపడ్డారు. -
పుష్కర భక్తులకు వడదెబ్బ
ఏడుగురు బాధితులకు వైద్యం నాలుగోరోజు శిబిరాల్లో 15,136 మందికి వైద్యం గుంటూరు మెడికల్: జిల్లాలో ఈ నెల 12 నుంచి జరుగుతున్న కృష్ణాపుష్కరాల్లో ఒక పక్క డయేరియా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. దీనికితోడు సోమవారం వడదెబ్బ కేసులు కూడా నమోదవటంతో భక్తుల్లో భయం మరింత తీవ్రంగా పెరిగింది. పుణ్యస్నానమాచరించటానికి వస్తే వివిధ రకాల రోగాలు (అంటురోగాలు) వ్యాపిస్తూ ఉండటంతో వైద్యాధికారులు అప్రమత్తమై క్యాంపుల్లో వైద్యసేవలను అందించటంతోపాటుగా అప్రమత్తంగా ఉండాలని భక్తులకు కరపత్రాలు అందించటం, మైక్‌లలో ప్రచారం చేయటం ద్వారా ముందస్తు జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. సన్‌స్ట్రోక్( వడదెబ్బకు) గురైన ఏడుగురికి జిల్లా వైద్యాధికారులు ఏర్పాటుచేసిన వైద్యశిబిరాల్లో సేవలను అందించినట్లు అధికారులు తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న 441 మందికి, వివిధ రకాల ఎలర్జీలతో బాధపడుతున్న 840 మందికి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 2107 మందికి, ఆస్తమాతో బాధపడుతున్న 271 మందికి, కన్ను, చెవి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 488 మందికి, డయేరియాతో బాధపడుతున్న 97 మందికి వైద్యసేవలను అందించినట్లు జిల్లా ౖÐð ద్య ఆరోగ్యశాకాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి వెల్లడించారు. -
పసి మొగ్గలకు కృష్ణమ్మ లాల!
-
వాళ్లకో రూల్.. వీళ్లకో రూల్!
* అడుగడుగునా భక్తులకు ఆంక్షలు * ఏం చేయాలో పాలుపోక భక్తుల పాట్లు * వీఐపీలు, పోలీసులకు మాత్రం నో రూల్స్ * ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు అమరావతి (గుంటూరు రూరల్/ పట్నంబజారు): ‘సారూ.. మేము దూరప్రాంతాల నుంచి అమరావతికి పుణ్య స్నానం చేద్దామని వచ్చామయ్యా... ఆ దారిలో వెళితే..ఆ పోలీసాయన ఇటు పొమ్మన్నడూ.. ఇక్కడకు వస్తే మీరేమో.. ఇటు కాదంటున్నారు.. ఇంతకీ మా దారేది.. ఎటు వెళ్లాలి...’ అంటూ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు వాపోతున్నారు. అమరావతిలోని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఏ దారిన వెళితే.. ఏ ఘాటు వస్తుందో తెలియక భక్తులు సతమతమవుతున్నారు. అడుగడుగునా.. అడ్డంకులే... అమరలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చేది ప్రధాన రహదారి కావడంతో 90 శాతం మంది భక్తులు ఈ దారినే వస్తున్నారు. ఈ దారిలో పోలీసులు మొత్తం.. అష్ట దిగ్బంధనం చేశారు. కేవలం ప్రధాన రహదారిలోనే ఐదు ప్రాంతాల్లో బారికేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతో పుష్కర యాత్రికులు అవస్థలకు గురవుతున్నారు. మండుటెండల్లో పోలీసుల ఆంక్షలు తప్పుకుని మూడు కిలోమీటర్లు నడుస్తూ వచ్చే భక్తులకు ఆలయానికి రాకముందే దేవుడు కనిపిస్తున్నాడు. యాత్రికులే కాకుండా అమరావతిలో నివాసం ఉన్న వారిని, చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ అవసరాల కోసం అమరావతి వచ్చి వెళుతుంటారు. గ్రామస్తులు, స్థానికంగా నివాసం ఉండే వారిని కూడా పోలీసులు లేనిపోని ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసు వాహనాలు యథేచ్ఛగా... ప్రధాన రహదారిలో నడచి వెళుతున్న భక్తులను కూడా వెళ్లనివ్వని పోలీసులు..వారి వాహనాలను మాత్రం యథేచ్ఛగా వదిలి పెడుతున్నారు. కనీసం వాహనాలపై డ్యూటీ పాసు కూడా ఉండడం లేదు. తీరా ఆరా తీస్తే.. ఆ వాహనాల్లో ఎస్ఐ స్థాయి నుంచి జిల్లా స్థాయి పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు, మిత్రులు, వారి సపరివారం, స్థానిక అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు దర్జాగా వీఐపీ ఘాట్లకు వస్తున్నారు. ఈ విషయమై మీడియా శనివారం ఎస్పీ కె.నారాయణ్‌నాయక్ దృష్టికి తీసుకుని వెళ్లగా, భక్తులకు ఇబ్బందులు కలిగే ఆంక్షలు విధించరాదని, సమన్వయంతో పని చేయాలని సిబ్బందికి చెప్పినా క్షేత్రస్థాయిలో ఆచరించడం లేదనడం గమనార్హం. కనీసం కూర్చునేందుకు.. అనుమతివ్వరు.. పుష్కర స్నానం చేసిన అనంతరం ఓ వృద్ధురాలు అమరేశ్వరుని దర్శనం కోసం ఆలయం వద్దకు వస్తుంటే.. అలుపు వచ్చి ఆలయం పక్కనే మెట్లపై కూర్చుంది. కనీసం వృద్ధురాలనే జాలి కూడా లేకుండా ఆమెను పోలీసులు పక్కకు పంపిన వైనాన్ని చూసి భక్తులు అయ్యో పాపం అనుకున్నారు. అధికారుల ఆదేశాలతోనే..? పుష్కర ట్రాఫిక్ బందోబస్తులో భాగంగా బారికేడ్ల వద్ద సీఐ స్థాయి అధికారికి విధులు అప్పజెప్పారు. సదరు అధికారి మాత్రం సిబ్బందికి స్పష్టంగా పోలీసు వాహనం మినహా ఎవరినీ లోపలికి వెళ్లనివ్వద్దని చెప్పడంతో సిబ్బంది రెచ్చిపోతున్నారు. దీంతో నిత్యం బారికేడ్ల వద్ద భక్తులు, ఇతర శాఖల అధికారులు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతా«ధికారులు స్పందించి ట్రాఫిక్ ఆంక్షలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరుతున్నారు. -
ఆర్టీసీ పుష్కర సేవలు భేష్!
పాత గుంటూరు: కృష్ణా పుష్కరాల మూడో రోజు ఏపీఎస్ఆర్టీసీ గుంటూరు రీజియన్ పరిధిలో పుష్కర యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉదయం నుంచే బస్సు సర్వీసులను పెంచి భక్తులను పుష్కర ఘాట్లకు చేరవేశారు. వరుస సెలవు దినాలు, ఆదివారం కావడంతో ఉద్యోగ, వ్యాపార వర్గాలు, భక్తులు, పాఠశాలల విద్యార్థులతోపాటు ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు స్టాఫ్లు కిటకిటలాడాయి. ప్రముఖ ఘాట్లు అమరావతి, సీతానగరంలకు వెళ్లేందుకు యాత్రికులకు సరిపడా బస్సులు అందుబాటులో ఉంచినట్లు రీజనల్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి తెలిపారు. అవసరమైన చోట బస్సుల సంఖ్యను పెంచి యాత్రీకులకు అందుబాటులో ఉంచారు. ఆదివారం మొత్తం 1105 బస్సులతో 9338 ట్రిప్పులను నడిపి 3,26,376 మంది యాత్రికులను జిల్లాలోని వివిధ పుష్కర స్నాన ఘాట్లకు చేరవేసినట్లు తెలిపారు. వీటిలో మొత్తం 4791 ట్రిప్పులు ఉచితంగా నడిపి 1,63,520 మంది యాత్రికులను అమరావతిలోని పుష్కర ఘాట్లకు, ఎయిమ్స్ నుంచి సీతానగరం, మహానాడు స్నానఘట్టాలకు చేరవేసినట్లు వెల్లడించారు. యాత్రికులు ప్రై వేటు వాహనాలను ఆదరించకుండా ఆర్టీసీని ఆదరించి సంస్థ పురోభివృద్ధికి చేయూతనందించాలని ఆయన కోరారు.