అతిథి మర్యాదల్లో లోటు రాకూడదు
Published Sun, Aug 7 2016 7:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM
గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్
సాక్షి, గుంటూరు : పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులను అతిథులుగా భావించి వారికి ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా సేవలందించాలని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ కోరారు. గుంటూ రు నగరంలోని పోలీసు కల్యాణ మండపంలో శనివారం వలంటరీ ఫోర్స్ ప్రతినిధులు– పోలీసుల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి పౌరుడు బాధ్యతగల పోలీసుగా వ్యవహరించాలని సూచించారు. యాత్రికులకు దారి చూపడం, ట్రాఫిక్, దేవాలయాలు, ఘాట్‌లు, పార్కింగ్ స్థలాల్లో పోలీసులకు తోడుగా సేవలు అందించేందుకు వలంటరీ ఫోర్స్‌ను వినియోగించనున్నట్లు తెలిపారు. యాత్రికులతో దురుసుగా ప్రవర్తించకుండా గౌరవ భావంతో పలుకరిస్తూ సేవ చేయాలని సూచించారు. ఎక్కడైనా తోపులాట జరుగుతుందని ముందుగా వలంటీర్లు గుర్తిస్తే దగ్గర్లోని పోలీసు అధికారులకు విషయాన్ని తెలపాలని చెప్పారు. వలంటీర్లకు ప్రత్యేకమైన టీషర్టులు అందిస్తామని, పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు పోలీసులతో సమానంగా వారిని గుర్తిస్తామన్నారు. పుష్కరాలు పూర్తయ్యేవరకు చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీసు శాఖ తరఫున అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టామని, వలంటీర్లు సహకరిస్తే ఈ మహాయజ్ఞాన్ని ప్రశాంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ రామాంజనేయులు, గుంటూరు అర్బన్ ఎస్‌బీ డీఎస్పీ నాగేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ పాల్‌కుమార్, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాసులు, ఎన్‌సీసీ కమాండర్ శ్రీనివాస్, రెడ్‌క్రాస్ సెక్రటరీ బాబు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వలంటీర్లతో కలిసి నగరంలో ర్యాలీ చేపట్టారు.
Advertisement
Advertisement