Rural SP Narayana Nayak
-
పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తం
రూరల్ ఎస్పీ నారాయణ్ నాయక్ పొందుగల (దాచేపల్లి): కృష్ణా పుష్కరాలకు భక్తులు అధికంగా తరలివస్తున్నారని, భక్తులకు ఇబ్బంది కలుగకుండా పుష్కరాలు ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా రూరల్ ఎస్పీ కె. నారాయణ నాయక్ పోలీసులకు సూచించారు. మండలంలోని పొందుగల పుష్కరఘాట్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఘాట్‌లో భక్తులు స్నానాలు చేసే ప్రదేశాలను పరిశీలించారు. ఘాట్ల వద్ద ఏర్పాట్లు పట్ల ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. మరో ఆరురోజుల పాటు పుష్కరాలు జరగనున్నాయని, సెలవు దినాల్లో, పుష్కరాల చివరి రెండు రోజుల్లో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఎస్పీ చెప్పారు. భక్తులు పుష్కరస్నానం చేసి క్షేమంగా ఇంటికి వెళ్లేలా చూడాలని, ఆటంకాలు కలుగకుండా భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఇ. శ్రీనివాసరావు, ఎస్ఐ కట్టా ఆనంద్, ఎంపీపీ అంబటి నవకుమార్, డీసీ చైర్మన్ నర్రా పుల్లయ్య తదితరులున్నారు. -
అతిథి మర్యాదల్లో లోటు రాకూడదు
గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ సాక్షి, గుంటూరు : పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులను అతిథులుగా భావించి వారికి ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా సేవలందించాలని గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ కోరారు. గుంటూ రు నగరంలోని పోలీసు కల్యాణ మండపంలో శనివారం వలంటరీ ఫోర్స్ ప్రతినిధులు– పోలీసుల సమన్వయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ప్రతి పౌరుడు బాధ్యతగల పోలీసుగా వ్యవహరించాలని సూచించారు. యాత్రికులకు దారి చూపడం, ట్రాఫిక్, దేవాలయాలు, ఘాట్లు, పార్కింగ్ స్థలాల్లో పోలీసులకు తోడుగా సేవలు అందించేందుకు వలంటరీ ఫోర్స్‌ను వినియోగించనున్నట్లు తెలిపారు. యాత్రికులతో దురుసుగా ప్రవర్తించకుండా గౌరవ భావంతో పలుకరిస్తూ సేవ చేయాలని సూచించారు. ఎక్కడైనా తోపులాట జరుగుతుందని ముందుగా వలంటీర్లు గుర్తిస్తే దగ్గర్లోని పోలీసు అధికారులకు విషయాన్ని తెలపాలని చెప్పారు. వలంటీర్లకు ప్రత్యేకమైన టీషర్టులు అందిస్తామని, పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు పోలీసులతో సమానంగా వారిని గుర్తిస్తామన్నారు. పుష్కరాలు పూర్తయ్యేవరకు చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీసు శాఖ తరఫున అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టామని, వలంటీర్లు సహకరిస్తే ఈ మహాయజ్ఞాన్ని ప్రశాంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా అదనపు ఎస్పీ రామాంజనేయులు, గుంటూరు అర్బన్ ఎస్బీ డీఎస్పీ నాగేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ పాల్‌కుమార్, స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీనివాసులు, ఎన్సీసీ కమాండర్ శ్రీనివాస్, రెడ్‌క్రాస్ సెక్రటరీ బాబు పాల్గొన్నారు. సమావేశం అనంతరం వలంటీర్లతో కలిసి నగరంలో ర్యాలీ చేపట్టారు. -
సమన్వయంతోనే భద్రత
గుంటూరు రూరల్ ఎస్పీ కె.నారాయణ నాయక్ అధికారులకు సూచన పాతగుంటూరు: సమన్వయంతో పనిచేసి కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలని గుంటూరు రూరల్ ఎస్పీ కె.నారాయణనాయక్ ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ అధికారులు, రైల్వే అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్ చంద్రకాన్ఫెరెన్స్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన పుష్కరాలకు సంబంధించి ట్రాఫిక్, సౌకర్యాల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ నారాయణనాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఏయే ఘాట్లకు ఎన్నెన్ని బస్సులు నడుపుతున్నారు.. ఎన్ని రైళ్లు నడుపుతున్నారు..ఎన్ని నిమిషాలకు ఒక బస్సు ఆయా ఘాట్లకు వస్తుంది అనే విషయాలపై సూచనలు చేశారు. అలాగే బస్సు పార్కింగ్, ఆయా బస్సులు ఎక్కడెక్కడ మరల్చుకోవాలి అనేదానిపై ఆయా ఘాట్ల వద్ద ఇన్చార్జిలుగా ఉన్న ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. బస్సు టైమింగ్‌లను డీస్ప్లే చేయాలని సూచించారు. అదేవిధంగా భక్తుల రద్దీ ఉన్న ఘాట్ల వద్ద బస్సులను ఎటువైపు నుంచి మళ్ళించాలో ఆర్టీసీ అధికారులకు సూచించారు. పుష్కరాల నిమిత్తం రైల్వే అధికారులు జిల్లాలోని విష్ణుపురం, పొందుగల, పెదకూరపాడులకు ఎన్ని అదనపు రైళ్ళు నడుపుతున్నారు, ఆయా రైళ్ళల్లో ఎన్ని బోగీలు ఉంటాయి, ఒక్కొక్క రైలులో ఎంత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. రైల్వేస్టేషన్లలో భక్తులకు తగిన సదుపాయాలను కల్పించాల్సిందిగా సూచించారు. మాచర్ల, పొందుగల, విష్ణుపురం, పెదకూరపాడు, తెనాలి, రేపల్లె రైల్వే లైన్లలోని అన్ని స్టేషన్లలో రైల్వే టికెట్ కౌంటర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, అమరావతిలోని పుష్కర నగర్ వద్ద రైల్వే టికెట్ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అంతా సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకట నారాయణ, డీసీఆర్బీ లక్ష్మయ్య, సూర్యనారాయణరెడ్డి, సత్యనారాయణ, ఎస్బీసీఐ చిన మల్లయ్య, గుంటూరు రూరల్ జిల్లాలోని ఎంవీఐలు, ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి, అధికారులు పాల్గొన్నారు.