సమన్వయంతోనే భద్రత
సమన్వయంతోనే భద్రత
Published Mon, Aug 1 2016 10:10 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM
గుంటూరు రూరల్ ఎస్పీ కె.నారాయణ నాయక్
అధికారులకు సూచన
పాతగుంటూరు: సమన్వయంతో పనిచేసి కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలని గుంటూరు రూరల్ ఎస్పీ కె.నారాయణనాయక్ ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ అధికారులు, రైల్వే అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్ చంద్రకాన్ఫెరెన్స్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన పుష్కరాలకు సంబంధించి ట్రాఫిక్, సౌకర్యాల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ నారాయణనాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఏయే ఘాట్లకు ఎన్నెన్ని బస్సులు నడుపుతున్నారు.. ఎన్ని రైళ్లు నడుపుతున్నారు..ఎన్ని నిమిషాలకు ఒక బస్సు ఆయా ఘాట్‌లకు వస్తుంది అనే విషయాలపై సూచనలు చేశారు. అలాగే బస్సు పార్కింగ్, ఆయా బస్సులు ఎక్కడెక్కడ మరల్చుకోవాలి అనేదానిపై ఆయా ఘాట్‌ల వద్ద ఇన్‌చార్జిలుగా ఉన్న ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. బస్సు టైమింగ్‌లను డీస్‌ప్లే చేయాలని సూచించారు. అదేవిధంగా భక్తుల రద్దీ ఉన్న ఘాట్‌ల వద్ద బస్సులను ఎటువైపు నుంచి మళ్ళించాలో ఆర్టీసీ అధికారులకు సూచించారు. పుష్కరాల నిమిత్తం రైల్వే అధికారులు జిల్లాలోని విష్ణుపురం, పొందుగల, పెదకూరపాడులకు ఎన్ని అదనపు రైళ్ళు నడుపుతున్నారు, ఆయా రైళ్ళల్లో ఎన్ని బోగీలు ఉంటాయి, ఒక్కొక్క రైలులో ఎంత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. రైల్వేస్టేషన్‌లలో భక్తులకు తగిన సదుపాయాలను కల్పించాల్సిందిగా సూచించారు. మాచర్ల, పొందుగల, విష్ణుపురం, పెదకూరపాడు, తెనాలి, రేపల్లె రైల్వే లైన్‌లలోని అన్ని స్టేషన్‌లలో రైల్వే టికెట్ కౌంటర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, అమరావతిలోని పుష్కర నగర్ వద్ద రైల్వే టికెట్ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అంతా సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకట నారాయణ, డీసీఆర్బీ లక్ష్మయ్య, సూర్యనారాయణరెడ్డి, సత్యనారాయణ, ఎస్‌బీసీఐ చిన మల్లయ్య, గుంటూరు రూరల్ జిల్లాలోని ఎంవీఐలు, ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి, అధికారులు పాల్గొన్నారు.
Advertisement