co-operation
-
ఆర్బీకేలతో ‘సహకారం’
సహకార బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను మరింతగా బలోపేతం చేయడానికి ఆర్బీకే వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇందుకు ఆర్బీకేల్లో ఉన్న కియోస్క్‌లను సద్వినియోగం చేసుకోవాలి. రైతులకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసేలా కియోస్క్‌ల్లో మార్పులు చేయాలి. అటు ఖాతాదారులు, ఇటు బ్యాంకులకు మేలు జరిగేలా పటిష్టమైన ఎస్ఓపీలు రూపొందించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్)ను ఆర్బీకేలతో అనుసంధానం చేయడం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రతి మండలంలో పీఏసీఎస్‌లను మ్యాపింగ్ చేసి, వాటి పరిధిలోకి ఏయే ఆర్బీకేలు వస్తాయో నిర్ణయించాలని చెప్పారు. తద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలు ఆర్బీకేల ద్వారా సాగుతాయని, రైతులకు రుణ సదుపాయం మరింత అందుబాటులోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో సహకార శాఖ కార్యకలాపాలకు సంబంధించి జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరుపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు రైతులకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించాలన్నారు. అంతిమంగా ఆర్బీకేలు, ఆర్బీకేల్లోని బ్యాంకింగ్ కరస్పాండెంట్లు.. రైతులకు, బ్యాంకులకు మధ్య ప్రతినిధులుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఈ వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై అధికారులు బ్యాంకింగ్ నిపుణులతో మాట్లాడి స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. పోటీకి తగ్గట్టుగా తీర్చిదిద్దాలి ► బ్యాంకింగ్ రంగంలో పోటీని ఎదుర్కొనేలా జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను మరింత బలోపేతం చేయాలి. పోటీని తట్టుకునేందుకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో రుణాలు ఇవ్వాలి. ► నాణ్యమైన రుణ సదుపాయం ఉంటే బ్యాంకులు బాగా వృద్ధి చెందుతాయి. మంచి ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)లను పాటించేలా చూడటంతో పాటు డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకోవాలి. డీసీసీబీలు పటిష్టంగా ఉంటేనే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుంది. సహకార బ్యాంకులను కాపాడుకోవాలి ► సహకార బ్యాంకులు మన బ్యాంకులు. వాటిని మనం కాపాడుకోవాలి. తద్వారా తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి. దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది. ఎంత వీలైతే అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి. బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపార పరంగా లబ్ధి పొందుతున్నాయి. ఈ రుణాలపై కచ్చితమైన భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోంది. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులూ సద్వినియోగం చేసుకోవాలి. వాణిజ్య బ్యాంకులు, ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలిలిచ్చి ఖాతాదారులను తమ వైపునకు తిప్పుకోవచ్చు. తద్వారా అటు ఖాతాదారులకు, ఇటు సహకార బ్యాంకులకు మేలు జరుగుతుంది. ప్రతి రైతుకూ మేలు జరగాలి ► జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల్లో చక్కటి యాజమాన్య విధానాలను తీసుకురావాలి. అంతిమంగా ప్రతి ఎకరా సాగు చేస్తున్న ప్రతి రైతుకూ మేలు జరగాలి. ఈ లక్ష్యం దిశగా సొసైటీలను నడిపించాలి. ఈ మేరకు ప్రతిపాదనలను మరింత మెరుగ్గా తయారు చేసి నాకు (సీఎంకు) నివేదించాలి. ► వ్యవసాయ సలహా మండళ్ల సమావేశాల్లో బ్యాంకింగ్ రంగంపై రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సలహాలు, సూచనలు కూడా స్వీకరించి వాటిపై తగిన విధంగా చర్యలు తీసుకోవాలి. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ అగ్రికల్చ ర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖాతాదారులకు విశ్వాసం కలిగించాలి ► వ్యవసాయ రంగంలో ఆర్బీకేల్లాంటి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. రుణాల మంజూరులో రాజీ వద్దు. రాజకీయాలకు చోటు ఉండకూడదు. ► అవినీతికి, సిఫార్సులకు తావు లేకుండా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల కార్యకలాపాలు సాగాలి. నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది చాలా ముఖ్యం. పాలనలో సమర్థతతో పాటు, అవినీతి రహిత, నాణ్యమైన సేవలు అందితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. లేదంటే ప్రజలకు నష్టం వాటిల్లుతుంది. -
సమన్వయంతోనే భద్రత
గుంటూరు రూరల్ ఎస్పీ కె.నారాయణ నాయక్ అధికారులకు సూచన పాతగుంటూరు: సమన్వయంతో పనిచేసి కృష్ణా పుష్కరాలను విజయవంతం చేయాలని గుంటూరు రూరల్ ఎస్పీ కె.నారాయణనాయక్ ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖ అధికారులు, రైల్వే అధికారులకు సూచించారు. గుంటూరు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఉమేష్ చంద్రకాన్ఫెరెన్స్ సమావేశ మందిరంలో సోమవారం ఆయన పుష్కరాలకు సంబంధించి ట్రాఫిక్, సౌకర్యాల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ నారాయణనాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఏయే ఘాట్లకు ఎన్నెన్ని బస్సులు నడుపుతున్నారు.. ఎన్ని రైళ్లు నడుపుతున్నారు..ఎన్ని నిమిషాలకు ఒక బస్సు ఆయా ఘాట్లకు వస్తుంది అనే విషయాలపై సూచనలు చేశారు. అలాగే బస్సు పార్కింగ్, ఆయా బస్సులు ఎక్కడెక్కడ మరల్చుకోవాలి అనేదానిపై ఆయా ఘాట్ల వద్ద ఇన్చార్జిలుగా ఉన్న ఆర్టీసీ అధికారులకు సూచనలు చేశారు. బస్సు టైమింగ్‌లను డీస్ప్లే చేయాలని సూచించారు. అదేవిధంగా భక్తుల రద్దీ ఉన్న ఘాట్ల వద్ద బస్సులను ఎటువైపు నుంచి మళ్ళించాలో ఆర్టీసీ అధికారులకు సూచించారు. పుష్కరాల నిమిత్తం రైల్వే అధికారులు జిల్లాలోని విష్ణుపురం, పొందుగల, పెదకూరపాడులకు ఎన్ని అదనపు రైళ్ళు నడుపుతున్నారు, ఆయా రైళ్ళల్లో ఎన్ని బోగీలు ఉంటాయి, ఒక్కొక్క రైలులో ఎంత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. రైల్వేస్టేషన్లలో భక్తులకు తగిన సదుపాయాలను కల్పించాల్సిందిగా సూచించారు. మాచర్ల, పొందుగల, విష్ణుపురం, పెదకూరపాడు, తెనాలి, రేపల్లె రైల్వే లైన్లలోని అన్ని స్టేషన్లలో రైల్వే టికెట్ కౌంటర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయని, అమరావతిలోని పుష్కర నగర్ వద్ద రైల్వే టికెట్ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అంతా సమన్వయంతో పనిచేసి పుష్కరాలను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు వెంకట నారాయణ, డీసీఆర్బీ లక్ష్మయ్య, సూర్యనారాయణరెడ్డి, సత్యనారాయణ, ఎస్బీసీఐ చిన మల్లయ్య, గుంటూరు రూరల్ జిల్లాలోని ఎంవీఐలు, ఆర్టీసీ ఆర్ఎం జ్ఞానంగారి శ్రీహరి, అధికారులు పాల్గొన్నారు. -
అన్నదాతకు ‘సహకారం’
♦ ఖరీఫ్‌కు సరిపడా విత్తనాలందిస్తాం ♦ డ్రిప్పులో జిల్లాకే అధిక ప్రాధాన్యం ♦ రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ♦ గంగాపూర్, జగదేవ్‌పూర్ సొసైటీల్లో విత్తనాల పంపిణీ చిన్నకోడూరు/జగదేవ్‌పూర్: రైతులకు అందుబాటులో ఉండేలా సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలోని గంగాపూర్ సహకారం సంఘంలో, మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో విత్తన విక్రయ కేంద్రాలను ప్రారంభించి సబ్సిడీ విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఒకప్పుడు సరిపడా విత్తనాలు, ఎరువులు అందక రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. ఇప్పుడు అలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేస్తూ.. వారికి సరిపడా విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. వ్యవసాయ శాఖ, సహకార శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. విత్తనాల అవసరాన్ని గుర్తించాలి... గ్రామాల్లో విత్తనాలు ఏ మేరకు అవసరమో అధికారులు గుర్తించాలని మంత్రి సూచిం చారు. కాకి లెక్కలు చెప్పకుండా.. రైతులు ఎంత మేర పంట సాగు చేస్తున్నారో పరిశీ లించి, రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. రికార్డుల ప్రకారం విత్తనాలు, ఎరువులు తెప్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం 60 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. విత్తన, ఎరువుల సరఫరాలో సహకార సంఘాల పాత్ర అమోఘమన్నారు. ఈ ఖరీఫ్ కు 8.16 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 906 సహకార సంఘాలు పని చేస్తున్నాయని, 3,074 మంది సిబ్బంది పనిచేస్తున్నట్టు చెప్పారు. 470 మంది ఏఓలు,1117మంది ఏఈఓలు, 170 మంది ఏడీలు పని చేస్తున్నారన్నారు. జిల్లాలో 24,500 హెక్టార్లకు డ్రిప్పు సౌకర్యం కల్పించి నట్టు మంత్రి తెలిపారు. అలాగే 15 వేల హెక్టార్లకు పాలీహౌస్ అందించామని వివరించారు. రాష్ట్రంలోనే మెదక్ జిల్లాకు అధికంగా డ్రిప్పు అందించామన్నారు. అంతకుముందు గంగారంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సొసైటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. జగదేవ్‌పూర్ రైతులకు ట్రాక్టర్లు అందించే విధంగా కృషి చేస్తామని, అలాగే మార్కెట్ యార్డు కోసం మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకపోతామని హామీ ఇచ్చారు. త్వరలోనే 24 గంటల కరెంట్ సరఫరా చేయనున్నట్లు చెప్పారు. జగదేవ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో సీడ్స్ కార్పొరేషన్ ఎండీ మురళి, హార్టికల్చరల్ కమిషనర్ వెంకట్రాంరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ సురేంద్ర, బ్యాంకు సీఈఓ శ్రీనివాస్‌రావు, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జేడీఏ మాధవి శ్రీలత, ఉద్యాన శాఖ డీడీ రామలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, గఢా ఓఎస్డీ హన్మంతరావు, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ రామచంద్రం, జగదేవ్‌పూర్ ఎంపీపీ రేణుక, సర్పంచ్ కరుణాకర్, ఎంపీటీసీలు వెంకటయ్య, బాలేషంగౌడ్, ఏడీఏ శ్రావణ్‌కుమార్, ఏఓ నాగరాజు, సురేశ్‌కుమార్, చక్రపాణి, తహసీల్దార్ పరమేశం, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గంగాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ నమూండ్ల కమల రామచంద్రం, పీఏసీఎస్ చైర్మన్లు మూర్తి బాల్‌రెడ్డి, కీసరి పాపయ్య పాల్గొన్నారు. -
ఎరువుల కోసం పడిగాపులు
తొగుట, న్యూస్‌లైన్: తొగుట ప్రాథమిక సహకార కేం ద్రానికి చేరిన యూరియాను శనివారం అధికారులు పోలీస్ పహారాలో పంపిణీ చేశారు. సహకార సంఘం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎరువుల కోసం వచ్చిన రైతులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి సహకార సంఘానికి 440 బస్తాల యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మండల రైతులు ఉదయం 8 గంటకే తొగుట వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు. 8.30 గంటలకు అధికారులు మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సహకార సంఘం సీఈఓ రాంరెడ్డి, ఇతర సిబ్బంది 10 గంటల వరకు కార్యాలయానికి రాలేదు. దీంతో రైతులు, వ్యవసాయాధికారులు సహకార సంఘం అధికారుల రాక కోసం గంటల కొద్ది వేచిచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు 10.30 గంట లకు సహకార సంఘం అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు. యూరి యా పంపిణీని ప్రారంభించారు. అప్పటికే భారీగా రైతులు తరలిరావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు పొందిన రైతులు, టోకెన్లు చిక్కని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ కూరాకుల మల్లేశం అక్కడికి చేరుకొని టోకెన్లు పొందిన రైతులకు ఎరువుల బస్తాలను ఇప్పిస్తామని గొడవలు వద్దని నచ్చజెప్పారు. కొంతమంది రైతులు సహకార పరపతి కేంద్రం వద్ద నెలకొన్న పరిస్థితిని ఫోన్ ద్వారా పోలీసులకు తెలియజేశారు. స్పందించిన ట్రైనీ ఎస్ఐ రంజిత్ తోపాటు ఏఎస్ఐ హబీబ్ మరో ఇద్దరు కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్ యూరియా పంపిణీ చేసే చోటికి చేరుకున్నారు. టోకెన్లు పొందిన రైతులకు ఎరువుల బస్తాలను ఇప్పించారు. రెండు గంటల్లో 440 బస్తాల యూరియాను పంపిణీ చేసేశారు. దీంతో ఎరువులు దొరకక కొంతమంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.