తొగుట, న్యూస్‌లైన్: తొగుట ప్రాథమిక సహకార కేం ద్రానికి చేరిన యూరియాను శనివారం అధికారులు పోలీస్ పహారాలో పంపిణీ చేశారు. సహకార సంఘం అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎరువుల కోసం వచ్చిన రైతులు గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. శుక్రవారం రాత్రి సహకార సంఘానికి 440 బస్తాల యూరియా వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మండల రైతులు ఉదయం 8 గంటకే తొగుట వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు. 8.30 గంటలకు అధికారులు మార్కెట్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే సహకార సంఘం సీఈఓ రాంరెడ్డి, ఇతర సిబ్బంది 10 గంటల వరకు కార్యాలయానికి రాలేదు.
దీంతో రైతులు, వ్యవసాయాధికారులు సహకార సంఘం అధికారుల రాక కోసం గంటల కొద్ది వేచిచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు 10.30 గంట లకు సహకార సంఘం అధికారులు కార్యాలయానికి చేరుకున్నారు. యూరి యా పంపిణీని ప్రారంభించారు. అప్పటికే భారీగా రైతులు తరలిరావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టోకెన్లు పొందిన రైతులు, టోకెన్లు చిక్కని రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పీఏసీఎస్ చైర్మన్ కూరాకుల మల్లేశం అక్కడికి చేరుకొని టోకెన్లు పొందిన రైతులకు ఎరువుల బస్తాలను ఇప్పిస్తామని గొడవలు వద్దని నచ్చజెప్పారు. కొంతమంది రైతులు సహకార పరపతి కేంద్రం వద్ద నెలకొన్న పరిస్థితిని ఫోన్ ద్వారా పోలీసులకు తెలియజేశారు. స్పందించిన ట్రైనీ ఎస్‌ఐ రంజిత్ తోపాటు ఏఎస్‌ఐ హబీబ్ మరో ఇద్దరు కానిస్టేబుల్స్, మహిళా కానిస్టేబుల్ యూరియా పంపిణీ చేసే చోటికి చేరుకున్నారు. టోకెన్లు పొందిన రైతులకు ఎరువుల బస్తాలను ఇప్పించారు. రెండు గంటల్లో 440 బస్తాల యూరియాను పంపిణీ చేసేశారు. దీంతో ఎరువులు దొరకక కొంతమంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.
ఎరువుల కోసం పడిగాపులు
Published Sun, Aug 11 2013 3:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement