బహిరంగ మార్కెట్లోకి యూరియా
* కరువు కారణంగా భారీగా పేరుకుపోయిన నిల్వ
* 1.75 లక్షల టన్నులు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్న వ్యవసాయశాఖ
సాక్షి, హైదరాబాద్: యూరియా కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలు.. రాత్రీపగలూ పడిగాపులు కాచే రైతన్నలు.. కొన్నిచోట్ల పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసుల లాఠీచార్జీలు.. మరి ఇప్పుడు యూరియా కొనే దిక్కే లేకుండా పోయింది. కరువు పరిస్థితుల కారణంగా మూడేళ్లుగా యూరియా మిగిలిపోతోంది. నిల్వ ఉంచడంతో గడ్డ కడుతోంది. ఇంకా అలాగే ఉంచితే పనికిరాకుండా పోయే పరిస్థితి నెలకొంది.
మరోవైపు జిల్లాల్లోని గోదాముల్లో నిల్వ ఉంచిన యూరియా నిర్వహణ ఆర్థిక భారంగా పరిణమించింది. దీంతో తొలిసారిగా యూరియా స్టాక్‌ను బహిరంగంగా అమ్మకానికి పెట్టాలని వ్యవసాయశాఖ నిర్ణయించి.. ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మిక్చర్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలకు, వ్యాపారులకు సాధారణ ధరకే విక్రయిస్తామని పేర్కొంది.
1.75 లక్షల టన్నుల బేరం
రాష్ట్రాన్ని 2014-15 నుంచి కరువు పీడిస్తోంది. దీంతో రైతులు పంటలు వేయకపోవడం, వేసినా మధ్యలోనే ఎండిపోవడంతో యూరియా వినియోగం బాగా తగ్గింది. మార్క్‌ఫెడ్ నిర్వహిస్తోన్న గోదాముల్లో 2014 నుంచి ఇప్పటివరకు 2.77 లక్షల టన్నుల యూరియా పేరుకుపోయింది. 2014-15కి సంబంధించిన యూరియా 10,769 టన్నులు, 2015-16కు చెందిన 1.63 లక్షల టన్నులు, 2016-17కు చెందిన 1.02 లక్షల టన్నుల యూరియా నిల్వ ఉంది. అందులో ఈ ఏడాది యూరియాను మినహాయించి.. గత రెండేళ్ల స్టాక్‌ను విక్రయించాలని నిర్ణయించారు.