సాక్షి, హైదరాబాద్: ఆగ్రోస్‌లో టార్పాలిన్ల విక్రయాలపై దుమారం చెలరేగుతోంది. సర్కారు నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా టార్పాలిన్లను సబ్సిడీపై రైతులకు సరఫరా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. సబ్సిడీని నిర్ణయించడంలో కానీ, వాటి ని రైతులకు సరఫరా చేసే అంశంపైకానీ ఏదీ ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదని తెలుస్తోంది. దీంతో రైతులకు ఇచ్చిన సబ్సిడీని ఎవరు చెల్లించాలి, దీనికి ఎవరు బాధ్యులన్నది చర్చనీయాంశమవుతోంది. సరఫరా కంపెనీలతో కొందరు కుమ్మక్కు కావడం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
టార్పాలిన్ల విలువ రూ. 5.4 కోట్లు...
ఈ ఏడాది రైతులకు రూ.5.4 కోట్ల విలువైన టార్పాలిన్లను సబ్సిడీపై సరఫరా చేయాలని ఆగ్రోస్‌లో కొందరు నిర్ణయానికి వచ్చారు. వచ్చిందే తడవుగా జాబితాల్లో ఉన్న కంపెనీలతో మాట్లాడారు. సాధారణంగా బయట ఒక్కో టార్పాలిన్ ధర రూ. 2,500 కాగా, ఆగ్రోస్ ద్వారా రూ. 2,350కే రైతులకు ఇవ్వాలనుకున్నారు. అంటే బయటకంటే రూ. 150 తక్కువకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అందులో రైతులకు సగం సబ్సిడీ ఇచ్చారు. అంటే వారికి రూ. 1175కు ఒక్కో టార్పాలిన్‌ను విక్రయించారు. మిగిలి న సగం ప్రభుత్వం భరించాలన్నమాట.
ఈ వ్యవహా రానికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు. అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నాక, వ్యవసాయశాఖకు చెందిన మండల ఏవోల ద్వారా వాటిని రైతులకు విక్రయించారు. రైతుల వాటా సొమ్ము రూ. 2.70 కోట్లు కంపెనీలకు చెల్లించారు. ప్రభుత్వ వాటాగా మరో రూ. 2.70 కోట్లు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో ఆ సొమ్మును చెల్లింపులపై ఇప్పుడు ఆగ్రోస్‌లో అంతర్మథనం మొదలైంది. అలాగనీ ఆగ్రోస్ భరించే స్థితిలో లేదు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి కోరినా లభించే అవకాశాలు లేవు.దీంతో ఆగ్రో చిక్కుల్లో పడింది.
అవును నిజమే: ఆగ్రోస్ ఎండీ
ఈ విషయంపై ప్రస్తుత ఆగ్రోస్ ఎండీ సురేందర్‌ను వివరణ కోరగా, అనుమతి లేకుండా టార్పాలిన్లు విక్రయించిన మాట వాస్తవమేనని స్పష్టంచేశారు. తాను ఇటీవలే ఆగ్రోస్ బాధ్యతలు తీసుకున్నానని, తనకు పూర్తి వివరాలు తెలియవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment