యూరియా లేదు.. జిల్లాలో చాలా వరకు ఎరువుల దుకాణాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఖరీఫ్ మిగిల్చిన అప్పుల నుంచి బయట పడేందుకు ఎంతో ఆశగా రబీలోకి అడుగుపెట్టిన రైతన్నకు ఇప్పుడు యూరియా కష్టాలు మొదలయ్యాయి. యూరియాకు కొదవలేదని ఓ వైపు అధికారులు చెబుతున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించి అందినకాడికి దండుకుంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో బస్తా యూరియా ధర ప్రస్తుతం రూ.370 పలుకుతుంది. ఇంత జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు నోరు మొదపకపోవడం గమనార్హం.
హాలియా : జిల్లాలో రబీలో రైతులు లక్ష హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అందులో నాగార్జునసాగర్ ఎడమ కాల్వతో పాటు, బోరు బావుల కింద ఇప్పటి వరకు 85 వేల హెక్టార్లలో వరి సాగు చేయగా మరో 15 వేల హెక్టార్లలో ఆరుతడి పంటలు వేశారు. ఈ నెలాఖరు నాటికి వరి మరో 30 నుంచి 50 వేల హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉంది. అందుకు గాను జిల్లాకు 9నుంచి 10 లక్షల బస్తాల యూరియా అవసరం. అదే విధంగా జిల్లాలో లక్ష ఎకరాల్లో పండ్ల తోటలున్నాయి. వాటికి 20 వేల టన్నుల యూరియా అంటే 4 లక్షల బస్తాల యూరియా అవసరం. ఇదే అదునుగా భావించిన హోల్‌సేల్ డీలర్లు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బస్తా యూరియా రూ. 282 ఉండగా ప్రస్తుతం రూ.370కు విక్రయిస్తున్నారు. రూ. 295 ఎమ్మార్పీ ఉన్న నీమ్ యూరియా రూ.385 కు అమ్ముతున్నారు. ఫర్టిలైజర్ దుకాణ వ్యాపారులు రైతులను నిలువుదోపిడీ చేస్తున్న సంబంధిత అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హోల్‌సేల్ డీలర్లదే హవా..!
జిల్లాలో ఆరుగురు హోల్‌సెల్ డీలర్లు ఉన్నారు. యూరియా అమ్మకంలో జిల్లాలో వీరిదే హవా. కంపెనీ నుంచి రైల్ ర్యాక్ రాగానే వ్యవసాయశాఖ అధికారులు హోల్‌సెల్స్ డీలర్ల ద్వారా రిటైల్డ్ డీలర్‌కు యూరియా విక్రయించాల్సి ఉంది. కానీ హోల్‌సేల్ డీలర్లు కంపెనీ సేల్స్ ఆఫీసర్‌ను, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను మేనేజ్ చేసి రిటైల్డ్ డీలర్లకు విక్రయిస్తున్నట్లు చూపించి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బస్తాకు రూ.10 నుంచి రూ.20 పైన లాభం చూసుకొని మధ్య దళారులకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. వారు తమ లాభం తాము చూసుకొని రిటైల్డ్ వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. రిటైల్డ్ వ్యాపారులు ర్యాక్ పాయింట్ నుంచి తమ దుకాణానికి రవాణా, హమాలీ ఖర్చు, లాభం చూసుకొని యూరియా విక్రయిస్తుండటంతో బస్తా యూరియా రూ.370 పలుకుతుంది.
సహకార సంఘాల ద్వారా
విక్రయించాలని రైతుల డిమాండ్
బహిరంగ మార్కెట్‌లో యూరియా ధరకు రెక్కలు రావడంతో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సహకార సంఘాల ద్వారా విక్రయించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫర్టిలైజర్‌ల ద్వారా విక్రయిస్తే వ్యాపారులు హోల్‌సెల్ ట్రేడర్లు, మద్యదళారీ, ఎగుమతి, దిగుమతి, హమాలీ, ట్రాన్స్‌పోర్ట్ ఇతరత్ర లాభం చూసుకొని విక్రయిస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అదే సహకార సంఘాల ద్వారా విక్రయిస్తే ఎమ్మార్పీ రేట్‌కు విక్రయించవచ్చని, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అధిక ధరలకు విక్రయిస్తున్నారు
- అలుగుల రమణారెడ్డి, రైతు, కొత్తపల్లి
హాలియాలో యూరియాను వ్యాపారులు అధిక ధరకు విక్రయిస్తున్నారు. నాగార్జున యూరియా బస్తాకు రూ. 350 పైమాలే. బిల్లులో మాత్రం ఎమ్మార్పీ రేట్ రాస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మా వద్ద యూరియా లేదంటూ వ్యాపారులు సమాధానం ఇస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎమ్మార్పీ ధరలకు యూరియా అమ్మేవిధంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా సహకార సంఘాల ద్వారా యూరియా విక్రయిస్తే రైతులకు ప్రయోజనంగా ఉంటుంది.
యూరియా.. బ్లాక్..!
Published Mon, Feb 2 2015 5:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement