యూరియా.. ఎమ్మార్పీకి ఇస్తే ఒట్టు
నంద్యాల: మహో ప్రభో యూరియా లభించడం లేదు.. వ్యాపారులు బ్లాక్‌లో విక్రయిస్తున్నారు చర్యలు తీసుకోండి అంటూ.. రైతులు గగ్గోలు పెడుతున్నా అధికారులు చలించడం లేదు. నంద్యాల పరిధిలో యూరియా డీలర్లు, వ్యాపారులు యథేచ్ఛగా బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె, నంద్యాల పట్టణంలో దాదాపు 20కి పైగా ఎరువుల దుకాణాల్లో యూరియాను విక్రయిస్తున్నారు. రబీలో వరిసాగును చేయరాదని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులు జారిచేసింది.
దీంతో రైతులు కూడా ఆవాలు, కొర్ర, మినుము, రాగి, మొక్కజొన్న తదతర పంటలను సాగు చేస్తున్నారు. నంద్యాల ఏడీఏ పరిధిలోని నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, గడివేముల, పాణ్యం, బనగానపల్లె మండలాల్లో దాదాపు లక్షకు పైగా ఎకరాల్లో ఆరుతడి పంటలను సాగుచేస్తున్నారు. అత్యవసరంగా ఒక్కొక్క ఎకరాకు కనీసం 3,4 బస్తాల యూరియాను అత్యవసరంగా సరఫరా చేస్తేతప్ప రబీ సీజన్‌ను గట్టెక్కలేమని రైతులు పేర్కొంటున్నారు.
కేటాయింపు ఎంత.. అమ్మేది ఎంత
ఏ సొసైటీకి ఎంత యూరియా కేటాయించింది వ్యవసాయాధికారులు ప్రజలకు చెప్పడంలో విఫలమయ్యారు. ఈ విషయం బయటికి పొక్కితే సంబంధిత గ్రామాలకు చెందిన రైతులు సొసైటీ దగ్గరికి వెళ్లి నిలదీసే అవకాశం ఉంటుందని భావిస్తూ నంద్యాల ప్రాంతంలోని అధికార పార్టీకి చెందిన సొసైటీ సభ్యులు అధికారుల నోరును నొక్కినట్లు తెలుస్తుంది.
గతంలో అక్రమార్కులపై నమోదు అయిన కేసుల పట్ల అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో అక్రమార్కులకు ఎలాంటి భయం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారులు మాత్రం ఆరు దుకాణాల్లో యూరియ అక్రమ వ్యాపారంపై తీవ్రస్థాయిలో స్పందించి శాశ్వతంగా వాటిని రద్దుచేయాలని సిఫారసు చేసినా ఉన్నతాధికారుల నుంచి స్పందన లేకపోవడంతో అనుమానాలకు దారితీస్తోంది.
తూతూ మంత్రంగా దాడులు: యూరియా 50 కేజీల బస్తాను రూ.284కు విక్రయించాలని కంపెనీలు నిర్ణయించాయి. ఈ ధరకు ఏ ఒక్క వ్యాపారి విక్రయించడం లేదు. అధికారులు కూడా దుకాణాలకు యూరియాను కేటాయించలేదు. కేవలం సహకార సంఘాలకు మాత్రమే కేటాయించారు. రెండు, మూడు సహకార సంఘాలు మినహాయిస్తే మిగిలిన సహకార సంఘాలు తమకు కేటాయించిన 40 టన్నుల యూరియాను నంద్యాల పట్టణంలోని ఎరువుల దుకాణాల యజమానులకు రూ.40 నుంచి రూ.50ల మధ్యన అధిక ధరలను తీసుకొని విక్రయించారు.
దీనిపై వ్యాపారి మరో రూ.50లు అదనంగా చేర్చడంతో మొత్తం రూ.100కు పైగా అధిక ధర చేరుకుంది. రెండు రోజుల క్రితం రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి మాణిక్యాలరావుకు స్థానిక బీజేపీ నాయకుడు తూము శివారెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు కూడా చేశారు. అధిక దరలకు యూరియాను విక్రయిస్తున్నారని గతంలో జేడీఏకు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల్లో స్పందన లేదు.
మంగళవారం తహశీల్దార్ శివరామిరెడ్డి, ఏడీఏ సుధాకర్, ఏఓ చెన్నయ్య ఆధ్వర్యంలో దాడులను నిర్వహించారు. అయితే విక్రయాలు జరిగే దుకాణాలు కాకుండా లేని దుకాణాలను తనిఖీ చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్ని స్థానిక ఏడీఏ సుధాకర్‌ను ప్రశ్నించగా యూరియా అక్రమ అధిక ధరలను నివారించడానికి దాడులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.