పోలీసు వాహనంలో వస్తున్న ప్రైవేటు వ్యక్తులు
* అడుగడుగునా భక్తులకు ఆంక్షలు
* ఏం చేయాలో పాలుపోక భక్తుల పాట్లు
* వీఐపీలు, పోలీసులకు మాత్రం నో రూల్స్
* ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
అమరావతి (గుంటూరు రూరల్/ పట్నంబజారు): ‘సారూ.. మేము దూరప్రాంతాల నుంచి అమరావతికి పుణ్య స్నానం చేద్దామని వచ్చామయ్యా... ఆ దారిలో వెళితే..ఆ పోలీసాయన ఇటు పొమ్మన్నడూ.. ఇక్కడకు వస్తే మీరేమో.. ఇటు కాదంటున్నారు.. ఇంతకీ మా దారేది.. ఎటు వెళ్లాలి...’ అంటూ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు వాపోతున్నారు. అమరావతిలోని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఏ దారిన వెళితే.. ఏ ఘాటు వస్తుందో తెలియక భక్తులు సతమతమవుతున్నారు.
అడుగడుగునా.. అడ్డంకులే...
అమరలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చేది ప్రధాన రహదారి కావడంతో 90 శాతం మంది భక్తులు ఈ దారినే వస్తున్నారు. ఈ దారిలో పోలీసులు మొత్తం.. అష్ట దిగ్బంధనం చేశారు. కేవలం ప్రధాన రహదారిలోనే ఐదు ప్రాంతాల్లో బారికేడ్లు, చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంతో పుష్కర యాత్రికులు అవస్థలకు గురవుతున్నారు. మండుటెండల్లో పోలీసుల ఆంక్షలు తప్పుకుని మూడు కిలోమీటర్లు నడుస్తూ వచ్చే భక్తులకు ఆలయానికి రాకముందే దేవుడు కనిపిస్తున్నాడు. యాత్రికులే కాకుండా అమరావతిలో నివాసం ఉన్న వారిని, చుట్టుపక్కల గ్రామాల నుంచి వివిధ అవసరాల కోసం అమరావతి వచ్చి వెళుతుంటారు. గ్రామస్తులు, స్థానికంగా నివాసం ఉండే వారిని కూడా పోలీసులు లేనిపోని ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
పోలీసు వాహనాలు యథేచ్ఛగా...
ప్రధాన రహదారిలో నడచి వెళుతున్న భక్తులను కూడా వెళ్లనివ్వని పోలీసులు..వారి వాహనాలను మాత్రం యథేచ్ఛగా వదిలి పెడుతున్నారు. కనీసం వాహనాలపై డ్యూటీ పాసు కూడా ఉండడం లేదు. తీరా ఆరా తీస్తే.. ఆ వాహనాల్లో ఎస్‌ఐ స్థాయి నుంచి జిల్లా స్థాయి పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు, మిత్రులు, వారి సపరివారం, స్థానిక అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు దర్జాగా వీఐపీ ఘాట్‌లకు వస్తున్నారు. ఈ విషయమై మీడియా శనివారం ఎస్పీ కె.నారాయణ్‌నాయక్ దృష్టికి తీసుకుని వెళ్లగా, భక్తులకు ఇబ్బందులు కలిగే ఆంక్షలు విధించరాదని, సమన్వయంతో పని చేయాలని సిబ్బందికి చెప్పినా క్షేత్రస్థాయిలో ఆచరించడం లేదనడం గమనార్హం.
కనీసం కూర్చునేందుకు.. అనుమతివ్వరు..
పుష్కర స్నానం చేసిన అనంతరం ఓ వృద్ధురాలు అమరేశ్వరుని దర్శనం కోసం ఆలయం వద్దకు వస్తుంటే.. అలుపు వచ్చి ఆలయం పక్కనే మెట్లపై కూర్చుంది. కనీసం వృద్ధురాలనే జాలి కూడా లేకుండా ఆమెను పోలీసులు పక్కకు పంపిన వైనాన్ని చూసి భక్తులు అయ్యో పాపం అనుకున్నారు.
అధికారుల ఆదేశాలతోనే..?
పుష్కర ట్రాఫిక్ బందోబస్తులో భాగంగా బారికేడ్ల వద్ద సీఐ స్థాయి అధికారికి విధులు అప్పజెప్పారు. సదరు అధికారి మాత్రం సిబ్బందికి స్పష్టంగా పోలీసు వాహనం మినహా ఎవరినీ లోపలికి వెళ్లనివ్వద్దని చెప్పడంతో సిబ్బంది రెచ్చిపోతున్నారు. దీంతో నిత్యం బారికేడ్ల వద్ద భక్తులు, ఇతర శాఖల అధికారులు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతా«ధికారులు స్పందించి ట్రాఫిక్ ఆంక్షలపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని, భక్తులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరుతున్నారు.