దిండుగల్ జిల్లా పళనిలో కొలువు దీరిన సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిగా భక్తులు పోటెత్తుతూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడికి పాదయాత్రతో వచ్చే భక్తుల సంఖ్య మరీ ఎక్కువే. పచ్చటి పొలాలు, చుట్టూ కొండలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే పళని వైపు మార్గాల్లో అనేక మంది భక్తి భావంతో పాదయాత్రలు చేస్తుంటారు. అయితే, రోడ్ల అభివృద్ధి అంతంత మాత్రమే కావడంతో పాదయాత్రతో అడుగులు వేసే భక్తులకు ప్రమాదాలు తప్పడం లేదు. తాజాగా, రాష్ట్రంలో వాతావరణంలో నెలకొన్న మార్పులతో మంచు దుప్పటి అనేక ప్రాంతాల్ని కప్పేస్తోంది. పొగమంచు ప్రభుత్వ బస్సు రూపంలో పాదయాత్రగా వెళ్తున్న భక్తుల పాలిట యమపాశం అయింది.
సాక్షి, చెన్నై: మంచు దుప్పటి భక్తుల పాలిట మృత్యుపాశంగా మారింది. దట్టమైన పొగ మంచు రోడ్డును కప్పేసినా డ్రైవర్ ఏ మాత్రం తగ్గని దృష్ట్యా, ఆరుగురు విగత జీవులయ్యారు. భక్తి పారవశ్యంలో మునిగి పాదయాత్రతో అడుగులువేస్తూ, మరికొన్ని గంటల్లో సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకుంటామనే ఆనందంలో ఉన్న భక్త బృందాన్ని విషాదం చుట్టుముట్టింది. తిరుప్పూర్ జిల్లా వలయం కాడు సమీపంలోని మురుగ పాళయంకు చెందిన అన్భళగన్ బీజేపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
తరచూ ఈయన నేతృత్వంలో భక్త బృందాలు పళనికి పాదయాత్రగా వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన బంధువులతో పాటు ఆ గ్రామానికి చెందిన 50 మంది పళనికి పాదయాత్రగా బయలుదేరారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి యాత్రను ప్రారంభించారు. మార్గం మధ్యలోని ఆలయాల వద్ద పూజల్ని నిర్వహిస్తూ పళని వైపు సాగుతున్న ఈ యాత్ర రాత్రి తారాపురానికి చేరుకుంది. అక్కడి కుప్పన్నన్ కోయిల్ గ్రామంలోని ఓ సత్రంలో భక్తులంతా బసచేశారు.
మంగళవారం వేకువజామున ఐదున్నర గంటలకు ఎనిమిది మంది ఓ జట్టుగా, పదిమంది మరో జట్టుగా ఏర్పడి ముందుకు అడుగులు వేస్తూ పళని వైపు కదిలారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు ఎనిమిదిమంది, కాదపుల్లపట్టి వద్ద భక్తితో, హరో..హర నినాదంతో ముందుకు సాగుతుండగా ఆ బృందం పాలిట ప్రభుత్వ బస్సు యమ శకటంగా మారింది.
ఆరుగురు బలి
తిరుప్పూర్ నుంచి మదురైకి వెళుతున్న ప్రభుత్వ బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి పాదయాత్రగా వెళుతున్న భక్తుల మీదకు దూసుకొచ్చింది. ఈ హఠాత్పరిణామంతో ఆ పరిసరాలు రక్తపు టేరుగా మారాయి. బస్సు చక్రాల కింద నలిగిన వాళ్లు కొందరు అయితే, అల్లంత దూరాన ఎగిరి పడ్డ వారు మరి కొందరు. ఈ ఘటనతో ఆ పరిసర వాసులు, ఆ మార్గంలో వెళ్లే వాహన దారులు ఎక్కడికక్కడ ఆపేసి భక్తుల్ని రక్షించేందుకు పరుగులు తీశారు. అయితే, సంఘటన స్థలంలోనే తిరుప్పూర్ వలయంకాడుకు చెందిన రాజేంద్రన్ భార్య విజయ (54), కాలిముత్తు (35), నటరాజ్ (30), మురుగ పాళయం టాస్మాక్ సూపర్ వైజర్ గోపాల్ భార్య మహేశ్వరి (30), అవినాశి నాదపాళయం చెందిన రాజామణి (42) మరణించారు.
తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న భవన నిర్మాణ కార్మికుడు జయప్రకాశ్ భార్య శాంతి (45)ని చికిత్స నిమిత్తం కోయంబత్తూరుకు తరలిస్తుండగా ఆమె మార్గం మధ్యలో మరణించారు. అలాగే, మరో ఇద్దరు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కన్నీటి సంద్రం
ప్రమాదంతో ఆ భక్త బృందం పాదయాత్ర ఆగింది. తమ వాళ్ల మరణంతో కన్నీటి సంద్రంలో మునిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆరుగురి మృతదేహాలను శవపంచనామా నిమిత్తం తారాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి కారకుడైన ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఆరప్పాళయంకు చెందిన తమిళరసన్ (35) పోలీసులకు లొంగిపోయాడు.
కప్పేసిన పొగ మంచు
ఈ ప్రమాదం గురించి బస్సులో పయణించిన ప్రయాణికులు మాట్లాడుతూ తారాపురం–పళని రోడ్డుపై తీవ్ర పొగ మంచు కప్పుకుని ఉందని, ఎదురుగా ఏ వాహనం వస్తోందో కనిపించని పరిస్థితి ఉన్నట్టు వివరించారు. అయితే, బస్సు డ్రైవర్ ఏ మాత్రం తగ్గ లేదని పేర్కొన్నారు. ఆ పొగ మంచులోనూ ముందు వెళుతున్న లారీని అధిగమించేందుకు వేగంగా ముందుకు వెళ్లి హఠాత్తుగా ఎదురుగా ఓ కారు రావడంతో, దానిని తప్పించే క్రమంలో అదుపు తప్పిన బస్సు భక్తుల బృందం వైపు దూసుకెళ్లినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment