ఆరుగురు బిడ్డలున్నా.. అనాథలే! | - | Sakshi
Sakshi News home page

ఆరుగురు బిడ్డలున్నా.. అనాథలే!

Published Thu, Sep 26 2024 2:50 AM | Last Updated on Thu, Sep 26 2024 7:56 AM

-

భార్య అనారోగ్య సమస్యలను చూడలేక హత్య చేసిన వృద్ధ భర్త 

 ఆపై తానూ గొంతు కోసుకుని ఆస్పత్రి పాలు 

సాక్షి, చైన్నె: ఆరుగురు పిల్లలు ఉన్నా, అనాథలుగా జీ వించాల్సి రావడం ఆ వృద్ధ జంటను తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది. ఒక్కోనెల ఒకొక్కరి ఇంటి నుంచి ఆహారం వస్తున్నా, తమతో ప్రేమగా మా ట్లాడే వారు లేక, అనారోగ్యంతో భార్య పడుతున్న వేదనను చూడ లేక ఆమెను హత్య చేశాడు. బుధ వారం కన్యాకుమారి జిల్లా కురుందన్‌ కోడు ఆచారి పల్లం గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ ప్రాంతానికి చెందిన చంద్రబోస్‌(83), లక్ష్మీ(75) దంపతులకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 

వీరంతా ఆ పరిసర గ్రామాలలో తమ తమ కుటుంబాలతో ఉంటున్నారు. నెలకు ఒక ఇంట్లో నుంచి ఆహారం మాత్రం ఈ దంపతులకు వచ్చి చేరుతుండేది. అయితే వృద్ధాప్యంతో వీరు పడుతున్న బాధలు, ఆరోగ్య సమస్యలు ఆ కుమారులు, కుమార్తెల కంట పడ లేదు. మధుమేహం మరీ ఎక్కవ కావడంతో భార్య లక్ష్మి మూడు నెలలుగా మంచానికే పరిమితం కావడం చంద్రబోస్‌ను మరింత వేదనకు గురి చేసింది. తనకు సైతం చూపు మందగించడంతో ఆమెను చూసుకోలేని పరిస్థితి. 

మంచానికి పరిమితమైన ఆమె వీపు భాగం అంతా పుండు ఏర్పడి ఆ నొప్పితో లక్ష్మీపడుతున్న బాధ ఆయనను కలచి వేసింది. తమను చూసుకునే వారు లేక పోవడంతో ఇంట్లో ఉన్న కత్తి ద్వారా లక్ష్మి గొంతు కోసేశాడు. ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుని ఇంటి గుమ్మం ముందు బైటాయించాడు. బుధవారం ఉదయం అటు వైపుగా వచ్చిన చిన్నకుమార్తె చంద్రకుమారి తండ్రి గొంతు భాగం నుంచి రక్తం కారుతుండటం, లోపల తల్లి గొంతు కోయబడ్డ స్థితిలో మరణించడం చూసి ఆందోళనతో అన్నలు, అక్కలకు సమాచారం అందించింది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న లక్ష్మీ మృతదేహాన్ని పోస్టుమార్టంకు, గాయాలతో పడి ఉన్న చంద్రబోస్‌ను ఆస్పత్రికి తరలించారు. చంద్రబోస్‌ వద్ద జరిపిన విచారణలో తన భార్య పడుతున్న వేదనతో హత్య చేసినట్టు, తాను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు గొంతు కోసుకున్నట్టు పోలీసులకు వివరించారు. పొడి పొడి మాటలతో ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరుగురు బిడ్డలు ఉన్నా అనాథగా బతికి , చివరకు తన భార్యను హత్య చేసి, ఆతర్వాత తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఈ వృద్ధుడి దీన గాథ ఆ పరిసర వాసులను కలచి వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement