పుష్కరాల్లో ఆరోగ్యం జాగ్రత్త!
Published Thu, Aug 11 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
డీఎంహెచ్ డాక్టర్ పద్మజారాణి
కరపత్రాలు ఆవిష్కరణ
గుంటూరు మెడికల్ : జిల్లాలో పుష్కరాలకు వచ్చే భక్తులు తమ ఆరోగ్య సంరక్షణ కోసం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి చెప్పారు. పుష్కర యాత్రికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ రూపొందించిన కరపత్రాన్ని గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు, ఫిట్స్, శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలతో బాధపడేవారు ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బహిరంగంగా మల, మూత్ర విసర్జన చేయరాదని, పవిత్ర కృష్ణా జలంలో ఏ విధమైన వ్యర్థాలు, మల మూత్రాలు విసర్జించరాదని స్పష్టం చేశారు. భక్తులకు మంచినీరు అందించేందుకు ప్రత్యేకంగా మంచినీటి కేంద్రాలు ఏర్పాటుచేశారని, అక్కడ అందించే పరిశుభ్రమైన నీటిని కాని, కాచి చల్లార్చిన నీటిని లేదా క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలన్నారు. అనారోగ్యం ఏదైనా వస్తే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేశామని, అక్కడకు వైద్య సహాయం కోసం వెళ్లాలని తెలిపారు. అపరిచితులు ఇచ్చే తినుబండారాలు, ఆహార పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని చెప్పారు. ఆహారం కోసం నిర్దేశిత ఆహార విక్రయ కేంద్రాలకు మాత్రమే వెళ్లాలన్నారు. ఆహార పదార్ధాలు తీసుకునే ముందు ప్రతిసారీ చేతులు శుభ్రం చేసుకోవాలన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా ఒకవేళ నీటిలో మునిగితే వెంటనే అతడిని నీటి నుంచి బయటకు తెచ్చి బోర్లా పడుకోబెట్టి, మింగిన నీటిని బయటకు వచ్చేలా ప్రాథమిక చికిత్స అందించాలన్నారు.
Advertisement
Advertisement