రాత్రిళ్లూ బస్సు సర్వీసులు
ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి
గుంటూరు (పట్నంబజారు) : కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు దృష్టి సారించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణీకులు, ఉచిత బస్సుల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయనే దానిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమయ్యారు. ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి శనివారం స్వయంగా పుష్కర్‌నగర్‌లోని బస్సుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రయాణీకులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి పది గంటల నుంచి సత్తెనపల్లి, పెదకూరపాడుతోపాటు ఇతర గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేందుకు బస్సులు అందుబాటులో ఉండటం లేదని వారు చెప్పారు. రాత్రి వేళల్లో కూడా పుష్కరనగర్‌ల వద్ద అన్ని ప్రాంతాలకు బస్సులను అందుబాటులో ఉంచాలని కోరారు. దీంతో స్పందించిన ఆర్‌ఎం శ్రీహరి రాత్రి వేళల్లో 50 బస్సులు అదనంగా ఉంచి అవసరమైన గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రి వేళల్లో కూడా పుష్కరనగర్ వద్ద కంట్రోలర్‌ను ఏర్పాటు చేశామన్నారు.