పుష్కరాలకు 905 బస్సులు
పుష్కరాలకు 905 బస్సులు
Published Sun, Aug 7 2016 9:05 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM
అదనంగా అందుబాటులో మరో 500 బస్సులు
3,500 మంది సిబ్బందితో విధులు నిర్వహణ
ఆర్టీసీ ఆర్‌ఎం జ్ఞానంగారి శ్రీహరి వెల్లడి
కృష్ణా పుష్కరాల్లో ప్రయాణికులకు సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి నది పరీవాహక ప్రాంతాలకు బస్సు సర్వీసులను నడపనున్నది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను సంస్థ అధికారులు పూర్తి చేశారు.
పట్నంబజారు (గుంటూరు) : పుష్కరాల సందర్భంగా 905 బస్సులతో సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ రీజియన్ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. అదనంగా రీజయన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి 500 బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. గుంటూరు రీజియన్‌లోని డిపో 1, సత్తెనపల్లి, క్రోసూరు, మంగళగిరి నుంచి అమరావతికి 193 బస్సు సర్వీసులు నడపనున్నారు. అన్ని డిపోల నుంచి విజయవాడకు 140 బస్సులు, విజయపురి సౌత్‌కు 110, తాళ్ళాయపాలెంకు 26, కష్ణా గోదావరి సంగమ ప్రదేశానికి 20, శ్రీశైలానికి 79, పెనుమూడికి 10, చిన్న చిన్న ఘాట్‌ల వద్దకు 201 బస్సులను నడపనున్నారు. నెల్లూరు, ఒంగోలు, చిత్తూరు, కడప రీజియన్‌ల నుంచి మరో 300 బస్సులు రానున్నాయి.
3,500 మంది సిబ్బంది సేవలు..
బస్సు సర్వీసులను నడిపేందుకు 3,500 మంది సిబ్బందిని సంస్థ కేటాయించింది. దీంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వినియోగించటానికి మరో 500 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే సిబ్బందికి ఎక్కడికక్కడ పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
తాత్కాలిక బస్‌స్టేషన్‌లు..
ప్రయాణికులకు మార్గ సూచన, మరుగుదొడ్లు వినియోగం, తాగునీటి సౌకర్యాలు, విశ్రాంతి కోసం ఆర్టీసీ రీజియన్ అధికారులు తాత్కాలిక బస్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. గుంటూరు నగరంలోని పాత ఆర్‌ఎం కార్యాలయం, ఉల్ఫ్ హాల్ గ్రౌండ్స్, గోరంట్ల, అమరావతిలో 3, విజయవాడలో 3, సత్తెనపల్లిలో 3 తాత్కాలిక బస్ స్టేషన్‌లు ఉంటాయి. వీటితో పాటుగా తాత్కాలిక కంప్యూటర్ కేంద్రాలు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అప్పటికప్పుడు టిక్కెట్ ఇచ్చే విధంగా ఆంధ్ర ముస్లిం కళాశాల, పెదకాకాని, చినకాకానితో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు.
నిమిషానికో బస్సు సర్వీసు..
గుంటూరు జిల్లాలోని కష్ణా పరీవాహక ప్రాంతాలకు 12 రోజుల పాటు నిమిషాల వ్యవధిలో బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. విజయవాడ, అమరావతి, విజయపురిసౌత్, సీతానగరాలకు ప్రతి నిమిషానికి ఒక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది. గుంటూరు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి రోజుకు సగటున 2 లక్షలకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పుష్కరాలకు సిద్ధంగా ఉన్నాం..
ఈ నెల 12న ప్రారంభం కానున్న కష్ణా పుష్కరాలకు ఆర్టీసీ సిద్ధంగా ఉంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని కష్ణా పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశాం. ఆయా ఘాట్‌లకు ఉన్న రద్దీలను బట్టీ బస్సులను అందుబాటులో ఉంచుతున్నాం. ప్రతి ఘాట్ వద్ద ఉన్నతాధికారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుని ముందుకు సాగుతాం. సిబ్బందికి సైతం శిక్షణా తరగతులు నిర్వహించాం. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు, సిబ్బంది సన్నద్ధమయ్యారు.
– జ్ఞానంగారి శ్రీహరి, ఆర్టీసీ ఆర్‌ఎం
Advertisement