ఒప్పంద పత్రాలపై సంతకాలు చేస్తున్న ద్వారకా తిరుమలరావు, అంబుకుమార్
సాక్షి, అమరావతి: కర్ణాటకకు మరిన్ని బస్ సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్ సర్వీసుల నిర్వహణ అంశంపై కర్ణాటక ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ గురువారం ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, కేఎస్ ఆర్టీసీ ఎండీ వి అంబుకుమార్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
2014లో రాష్ట్ర విభజన అనంతరం కేఎస్ ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ తొలిసారిగా గురువారం ఈ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఏపీఎస్ ఆర్టీసీ కర్ణాటకలో అదనంగా రోజూ 327 బస్ సర్వీసులను 69,284 కి.మీ. మేర నడుపుతుంది. దీంతో మొత్తమ్మీద ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 1,322 బస్సులు కర్ణాటకలో రోజూ 2,34,762 కి.మీ. మేర నడుస్తాయి.
ఇక కేఎస్ ఆర్టీసీ ఏపీలో అదనంగా రోజూ 496 బస్ సర్వీసులను 69,372 కి.మీ. మేర నడపాలని నిర్ణయించారు. దీంతో మొత్తమ్మీద కేఎస్ ఆర్టీసీకి చెందిన 1,489 బస్సులు ఏపీలో రోజూ 2,26,044 కి.మీ. నడుస్తాయి. ఆర్టీసీ భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, పి.కృష్ణమోహన్, కేఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఆంథోని జార్జ్, ఎస్.రాజేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment