KSRTC
-
ఉచిత బస్సును సమీక్షిస్తాం: శివకుమార్
బెంగళూరు: కర్నాటక మహిళలకు కల్పిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని సమీక్షిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. టికెట్లు కొనుక్కొని ప్రయాణించేందుకు పలువురు మహిళలు ముందుకు వస్తున్నందున ఈ పథకాన్ని సమీక్షిస్తామని తెలిపారు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఐరావత క్లబ్ క్లాస్ 2.0 బస్సులను బుధవారం ప్రవేశపెట్టాక శివకుమార్ మాట్లాడారు. ‘సోషల్ మీడియా ద్వారా, ఈ–మెయిళ్ల ద్వారా చాలామంది మహిళలు టికెట్లకు డబ్బులు చెల్లించి ప్రయాణిస్తామని మమ్మల్ని సంప్రదిస్తున్నారు. దీనిపై చర్చిస్తాం’ అని శివకుమార్ తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే శక్తి పథకం కాంగ్రెస్ కన్నడనాట ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో ఒకటనే విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కిందటేడాది జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈనెల 18 నాటికి 311 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగ్గా.. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,507 కోట్లను దీనిపై వెచ్చించింది. ‘‘ 5 నుంచి 10 శాతం మంది మహిళలు టికెట్లకు డబ్బు చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నా.. కండక్టర్లు తీసుకోవడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. రవాణా మంత్రి రామలింగా రెడ్డితో దీనిపై చర్చిస్తాను’’ అని శివకుమార్ వివరించారు. -
టోల్ ఫీజుకు డబ్బులు లేక.. రాంగ్రూట్లో ప్రయాణించిన ఆర్టీసీ బస్సు
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దుబారి టోల్ ఫీజు చెల్లించలేని కేఎస్ ఆర్టీసీ బస్సు వెనక్కు వెళ్లి పోయిన సంఘటన బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేపై చోటుచేసుకుంది. బుధవారం బెంగళూరు నుండి మైసూరు వెళ్తున్న బస్సుకు ఫాస్ట్‌ట్యాగ్ లేకపోవడంతో రామనగర తాలూకా శేషగిరి టోల్ వద్ద డబుల్ చార్జ్ చెల్లించాలని టోల్ సిబ్బంది చెప్పారు. దీంతో డ్రైవర్ అంత డబ్బులు తన వద్ద లేవని బస్సు వెనక్కు తీసుకుని కొన్ని కిలోమీటర్ల దూరం రాంగ్ రూట్లోనే వచ్చాడు. అనంతరం సర్వీస్ రోడ్ ద్వారా ప్రయాణించాడు. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసుకున్నారు. చదవండి మణిపూర్ ఘటన:. ప్రధాన నిందితుడి ఇంటి తగలబెట్టి.. కుటుంబాన్ని బహిష్కరించిన గ్రామస్తులు -
5 గంటల్లో రూ.40.. కర్ణాటక ఆటో డ్రైవర్ల దయనీయ స్థితి..
బెంగుళూరు: ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఒకటి. ఈ పథకం అమల్లోకి రావడంతో మా జీవితాలు పెనం మీద నుంచి వెళ్లి పొయ్యిలో పడ్డాయని వాపోతూ కన్నీటి పర్యంతమయ్యాడు ఒక ఆటో డ్రైవర్. ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆటో నడిపినా రూ. 40 కూడా రాలేదన్నాడు. దయనీయం.. ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ తీశారో తెలియదు కానీ ఇప్పుడైతే బాగా వైరల్ గా మారింది. ఓ మీడియా ప్రతినిధి బెంగుళూరులోని ఒక ఆటో వద్దకు వెళ్లి డ్రైవరుతో మాటామంతీ కలపగా.. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఇచ్చాక ఎవ్వరూ ఆటోలను పట్టించుకోవడమే లేదని ఆవేదన చెందాడు. ఉదయం నుండి ఐదు గంటలపాటు ఏకధాటిగా ఆటో నడిపినా పట్టుమని రూ.40 కూడా మిగలలేదని జేబులో నుంచి రెండు 20 రూపాయల నోట్లు చూపించి.. ఆటో బండి సంగతిలా ఉంటే మేము బ్రతుకు బండిని నడిపేదెలా అంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఓ పెద్దాయన ఈ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. A Bengaluru auto driver in tears after collecting just Rs 40/- from 8 am to 1 pm. This is the result of free bus rides given by the new Cong govt in Karnataka. Pushing people into poverty. pic.twitter.com/2RZEjA9pw8 — Zavier (@ZavierIndia) June 25, 2023 ఎవరి దారి వారిది.. ఈ వీడియోకు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా ఉచితాలు ప్రకటించిందని.. వాటికి ఆకర్షితులై ప్రజలు ఓట్లేశారని.. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఇవి ప్రభావ చూవుతాయని ఒకరు అభిప్రాయాపడగా, ఆడవాళ్ళంతా బస్సుల్లో ఉంటే మగవాళ్ళంతా ఇళ్లల్లో దూరి తలుపులు వేసుకున్నారా? అని మరొకరు.. గతవారం జయదేవ నుండి మల్లేశ్వరం వెళదామంటే ఆటోస్టాండ్‌లో అందరూ ఖాళీగానే ఉన్నారు కానీ ఒక్క డ్రైవర్ కూడా రాలేదు.. రెట్టింపు చార్జీ ఇస్తామన్నా కూడా కనికరించలేదు. వీళ్లకు ఇదే తగిన శాస్తి అని వేరొకరు స్పందించారు. ఇది కూడా చదవండి: కంటతడి పెట్టిస్తున్న జొమాటో డెలివరీ బాయ్ వీడియో -
మహిళా ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన కేఎస్ ఆర్టీసీ బస్సులు
-
ఒలెక్ట్రా జోరు.. కేఎస్ఆర్టీసీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు సరఫరా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ తాజా గా కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు(కేఎస్ఆర్టీసీ) 25 ఈ–బస్‌లను సరఫరా చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విధానసౌధ ఆవరణలో ఈ బస్సులను సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. తొమ్మిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో కంపెనీ తయారీ బస్‌లు సేవలు అందిస్తున్నాయని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సీఎండీ కె.వి.ప్రదీప్ తెలిపారు. 1,100 పైగా ఈ–బస్‌లు 10 కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని చెప్పారు. -
ఏపీ, కర్ణాటక మధ్య మరిన్ని బస్ సర్వీసులు
సాక్షి, అమరావతి: కర్ణాటకకు మరిన్ని బస్ సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్ సర్వీసుల నిర్వహణ అంశంపై కర్ణాటక ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ గురువారం ఒప్పందం చేసుకుంది. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, కేఎస్ ఆర్టీసీ ఎండీ వి అంబుకుమార్‌లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం కేఎస్ ఆర్టీసీతో ఏపీఎస్ ఆర్టీసీ తొలిసారిగా గురువారం ఈ ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఏపీఎస్ ఆర్టీసీ కర్ణాటకలో అదనంగా రోజూ 327 బస్ సర్వీసులను 69,284 కి.మీ. మేర నడుపుతుంది. దీంతో మొత్తమ్మీద ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 1,322 బస్సులు కర్ణాటకలో రోజూ 2,34,762 కి.మీ. మేర నడుస్తాయి. ఇక కేఎస్ ఆర్టీసీ ఏపీలో అదనంగా రోజూ 496 బస్ సర్వీసులను 69,372 కి.మీ. మేర నడపాలని నిర్ణయించారు. దీంతో మొత్తమ్మీద కేఎస్ ఆర్టీసీకి చెందిన 1,489 బస్సులు ఏపీలో రోజూ 2,26,044 కి.మీ. నడుస్తాయి. ఆర్టీసీ భవన్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు, పి.కృష్ణమోహన్, కేఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఆంథోని జార్జ్, ఎస్.రాజేశ్ పాల్గొన్నారు. -
శభాష్ డ్రైవరన్న.. చెరువులో మునిగిపోతున్న బాలికలను రక్షించి..
సాక్షి, బెంగళూరు: చెరువులో మునిగిపోతున్న ఇద్దరు బాలికలను ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలతో కాపాడిన ఘటన ఆదివారం సాయంత్రం తుమకూరు జిల్లా శిర తాలూకా హందికుంటె అగ్రహరలో చోటుచేసుకుంది. వివరాలు.. కేఎస్‌ఆరీ్టసీ డిపోకు చెందిన డ్రైవర్ మంజునాథ్ ఆదివారం సాయంత్రం ప్రయాణికులతో నాగప్పనకహళ్లి గేట్ మార్గంలో వస్తుండగా సుదూరంలో ఉన్న చెరువులో ఇద్దరు బాలికలు మునిగిపోతున్నట్లు గుర్తించాడు. వెంటనే బస్సును పక్కకు నిలిపి నీటిలో దూకాడు. ఇద్దరిని పట్టుకుని ఒడ్డుకు చేర్చాడు. డ్రైవర్ సాహసాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. డ్రైవర్ మంజునాథ్ మాట్లాడుతూ... పిల్లలు మునిగిపోతుండగా అక్కడే చెరువు వద్ద తల్లి ఏడుస్తుండటాన్ని గమనించి వెంటనే బస్సు ఆపి చెరువులో దూకి చిన్నారులను రక్షించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంజునాథ్‌ను డిపో మేనేజర్, సిబ్బంది ఘనంగా సన్మానించారు. -
ప్యాసింజర్ దిగుతుండగా కదిలిన బస్.. ‘ఆర్టీసీ’కి రూ.1.30లక్షల ఫైన్
బెంగళూరు: ప్రయాణికురాలికి గాయాలయ్యేందుకు బస్సు కారణమైందంటూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ)కి రూ.1.30 లక్షల జరిమానా విధించింది కర్ణాటక హైకోర్టు. అధికారులు అశ్రద్ధతో డొక్కు బస్సులను తిప్పుతున్నారనే విషయాన్ని గ్రహించి ఈ మేరకు ఆర్టీసీకి షాక్ ఇచ్చింది కోర్టు. ప్రయాణికులు దిగుతుండగానే బస్‌ను ముందుకు కదిలించి గాయాలయ్యేందుకు కారణమైనట్లు తెల్చింది. 2021, ఆగస్టులో బస్ వల్ల మహిళకు గాయాలయ్యాయి. మైసూరుకు చెందిన 30 ఏళ్ల చంద్రప్రభ అనే ప్రభుత్వ పాఠశాల టీచర్ తన విధులు ముగించుకుని కేఎస్ఆర్టీసీలో ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలోనే ఇంజిన్‌లో మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు కిందకు దిగుతున్నప్పటికీ డ్రైవర్ బస్‌ను ముందుకుపోనిచ్చాడు. దీంతో చంద్రప్రభ కింద పడిపోయి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. దీంతో ఆర్టీసీపై కేసు వేసింది ఉపాధ్యాయురాలు. కానీ, ఆమె ఫిర్యాదును 2018లో తిరస్కరించింది మోటారు వాహనాల ప్రమాదాల ట్రైబ్యునల్. ఆమె దిగెప్పుడు బస్సు ఆగి ఉందని ఆర్టీసీ అధికారులు సైతం వాధించారు. ట్రైబ్యునల్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు టీచర్. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఆమెకు పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు వెలువరించింది. ‘బాధితురాలికి రూ.1,30,000 పరిహారం చెల్లించాల్సిందే. దాంతో పాటు ఏడాదికి 6 శాతం చొప్పున వడ్డీ ఇవ్వాలి. ’ అని స్పష్టం చేసింది హైకోర్టు. ఇదీ చదవండి: విద్యార్థిని బాల్కనీలోంచి తోసేసిన టీచర్.. ప్రశ్నించిన తల్లిపైనా దాడి -
సండే స్టోరీ: ఈ ప్రేమ బస్సు ఇలా సాగిపోనీ...
‘మరో చరిత్ర’ సినిమాలో కమల హాసన్, సరితల మధ్య సంవత్సరం ఎడబాటు పెడతారు తల్లిదండ్రులు ప్రేమను నిరూపించుకోమని. కేరళలో గిరి, తార ఏకంగా 20 ఏళ్లు ఎడబాటును పాటించారు– ఎందుకంటే వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్లడానికి జాతకాలు కలవలేదు గనక. కేరళ ఆర్.టి.సిలో ఒకే బస్సుకు అతను డ్రైవర్‌గా ఆమె కండక్టర్‌గా పని చేస్తారు. బస్సులో సొంత ఖర్చుతో అనేక హంగులు పెట్టారు. వారికీ, వారి బస్సుకీ ఫ్యాన్స్ బోలెడు. అజ్ఞాతంగా ఉన్న వీరి ప్రేమ సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు దేశాలు దాటుతోంది. సండే రోజు బస్సు ప్రేమను తెలుసుకోవచ్చు. ఈ ప్రేమ కథ 2000 వ సంవత్సరంలో మొదలైంది. ఆమె, అతడూ కాకుండా మధ్యలో ఒక బస్సు కూడా ముఖ్య పాత్ర ధరించింది. ‘నువ్వు ఎక్కవలసిన బస్సు ఇరవై ఏళ్లు లేటు’ అన్నట్టు పెళ్లి మాత్రం 2020లో జరిగింది. అయితే ఏమి వారు సంతోషంగా ఉన్నారు. ఒకరితో ఒకరు అంతే ప్రేమగా ఉన్నారు. ఒకరి కోసం ఒకరు ప్రాణం ఇచ్చేలా ఉన్నారు. అలెప్పీ.. ఒరు ప్రేమకథ గిరి గోపీనాథ్‌కు అప్పుడు 26. తారా దామోదరన్‌కు 24. ఆమె అలెప్పీకి సమీపంలోనే ఉండే ముత్తుకులం అనే పల్లె నుంచి సిఏ కోర్సుకు ఆడిటింగ్ నేర్చుకోవడానికి అలెప్పీలోని ఒక కోచింగ్ సెంటర్‌కు వచ్చేది. గిరి మేనమామది ఆ కోచింగ్ సెంటర్. అప్పటికి సరైన ఉద్యోగం లేని గిరి ఆ కోచింగ్ సెంటర్లో మేనమామకు సహాయంగా ఉండేవాడు. అతనికి తార నచ్చింది. తారకు గిరి. ‘మొదటిసారిగా వాలెంటైన్స్ డే రోజు ఒక గ్రీటింగ్ కార్డు ద్వారా నా ప్రేమను ఆమెకు తెలియచేశాను. ఆమె కూడా ఓకే అంది’ అంటాడు గిరి. కొన్నాళ్లు ఈ గ్రీటింగ్ కార్డులతోనే వాళ్ల సందేశాలు నడిచాయి. ‘పెళ్లి చేసుకుందాం’ అని గిరి అంటే ‘మా ఇంటికొచ్చి మాట్లాడు’ అని తారా అంది. గిరి పెద్దలతో కలిసి ఆమె ఇంటికెళ్లాడు. ‘మాకు ఓకే. కాని జాతకాలు కలవాలి’ అని అమ్మాయి తరఫువారు అన్నారు. జాతకాలు కలవలేదు. గిరి కుటుంబం కూడా కలవని జాతకాలను చూసి జంకింది. ఈ పెళ్లి ఏ మాత్రం జరగదు అని ఇరుపక్షాలు తేల్చి చెప్పారు. గిరి మనసు విరిగిపోయింది. తార కుంగిపోయింది. కాని ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గిరి కోచింగ్ సెంటర్లో పని మానేసి 2007లో కేరళ ఆర్టీసీలో డ్రైవర్ అయ్యాడు. తార కోసం పెళ్లాడకుండా ఉండిపోయాడు. ‘నా కోసం ఒకతను వేచి ఉండగా నేను మరొకరిని ఎలా చేసుకుంటాను..’ అని తార కూడా వచ్చిన సంబంధాలను తిరగ్గొట్టసాగింది. అంతేనా... తానూ ఎలాగో పరీక్షలు రాసి 2010లో ఆర్టీసి కండక్టర్ అయ్యింది. ఇద్దరూ అలెప్పీలోని హరిపాద్ బస్టాండ్‌లో రూట్ నంబర్ 220కు డ్రైవర్, కండక్టర్లుగా మారారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు మెల్లగా మొదట బస్సుకు, తర్వాత ఆర్టీసి స్టాఫ్‌కు, ఆపైన పై అధికారులకు తెలిసింది. ‘బస్సే మా ప్రేమ వారధి’ అనుకుని వారిద్దరూ పెళ్లి మాట ఎత్తకనే కొనసాగారు. 2020లో పెళ్లి 2019లో కరోనా లాక్డౌన్ వచ్చాక బస్సులు వాటితో పాటు వీరిరువురి ప్రేమ హాల్ట్ అయ్యింది. కలుసుకోవడం వీలు కాలేదు. కావడం లేదు. అప్పటికి వారి వయసు 46, 44లకు చేరాయి. పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయిన వీరిరువురి పట్టుదలకు పెద్దలు తల వంచారు. జాతకాలు ఓడిపోయాయి. ఏప్రిల్ 5, 2020న తమ హరిపాద్ ఆర్టీసి బస్టాండ్‌లో తమ రూట్ నం 220 బస్సును సాక్షిగా పెట్టి దండలు మార్చుకున్నారు. అంతేనా? పై అధికారులకు చెప్పి విహార అటవీ ప్రాంతమైన మలక్కపారాకు స్పెషల్ ట్రిప్ బుక్ చేసుకున్నారు. అలా ఒక బస్సులో ప్రేమించుకుని, ఆ బస్సు ఎదుట పెళ్లి చేసుకుని, దానిలోనే హనీమూన్‌కు వెళ్లిన జంటగా వీళ్లు రికార్డు స్థాపించారు. సోషల్ మీడియాలో వైరల్ పెళ్లి సమయంలో వీరి మీధ కథనాలు వచ్చినా వారం క్రితం వల్లికదన్ అనే ఒకతను ఇన్‌స్టాలో వీరి ప్రేమ కథను వీడియో తీసి పెట్టడంతో పెద్ద రెస్పాన్స్ వచ్చింది. పది లక్షల మంది వీరి ప్రేమ కథ చూశారు. వీరి ప్రేమ బలానికి ఫిదా అయ్యారు. అలెప్పీ వెళితే రోజూ ఉదయం 5.30కు హరిపాద్‌లో బయలుదేరే వీరి రూట్ నంబర్ 220 బస్ ఎక్కండి. ఆ ప్రేమ బస్సులో అలా సాగిపోండి. ఎన్నో హంగులు... డ్యూటీలో డ్రైవర్, కండెక్టర్లు అయినా వాస్తవానికి వారు ప్రేమికులే కదా. అందుకని పై అధికారుల పర్మిషన్తో ఒక మ్యూజిక్ సిస్టమ్ పెట్టారు. హాయిగా పాటలు వింటూ ప్రయాణిస్తారు. తాము ఉండే బస్సు అందంగా ఉండాలని సొంత ఖర్చుతో ప్రత్యేక అలంకరణలు చేశారు. నేరాలు జరిగి ఉద్యోగాలు దెబ్బ తినకుండా సిసి టీవీలు బిగించుకున్నారు. ఎల్ఇడి డిస్ప్లే కూడా. ఇవన్నీ ప్రయాణికులకు నచ్చాయి. హరిపాద్ బస్ స్టాండ్ నుంచి 220 రూట్లో తిరిగే పాసింజర్లు ఆ బస్సుకు– గిరి తారలకు ఫ్యాన్స్‌గా మారారు. అంతేనా... వారంతా ఒక అభిమాన సంఘంగా మారారు. ఈ ప్రేమ ఎక్కడిదాకా వెళ్లిందంటే ఈ సభ్యులు ‘లీజర్ ట్రిప్’ బుక్ చేసుకుని ఈ బస్సులో పిక్నిక్లకు వెళ్లేవారు. ప్రేమజంట గిరి తారలకు ఈ ట్రిప్పులే డ్యూయెట్లు. -
ఎటు చూసినా నీరే.. బస్సు టైరే ఆధారం.. వీడియో తీస్తున్న కండక్టర్..
తిరువనంతపురం: గత నాలుగు రోజులుగా దంచికొడుతున్న వానలతో కేరళలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ధాటికి వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇడుక్కి, కొట్టాయంలో కొండ చిరియలు విరిగిపడటంతో దాదాపు 26 మంది ప్రాణాలు విడిచారు. మట్టిలో కూరుకుపోయారని భావిస్తున్న 12 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే రాష్ట్రంలో వరదల ఉధృతిని తెలియజేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. భారీ వరద, బురద కారణంగా కేరళ ఆర్టీసీకి చెందిన బస్సు, మరికొన్ని వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. అదే సమయంలో వాటి పక్కనే ఓ వ్యక్తి, అతని కొడుకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోకుండా బస్సు టైర్‌ని పట్టుకుని ప్రాణాలు రక్షించుకునేందుకు యత్నిస్తుంటారు. ఒంటినిండా బురద, మట్టితో హాహాకారాలు చేస్తుంటారు. (చదవండి: ప్యాలెస్‌లోనే ఉంటా .. మొండికేసిన గజరాజు అశ్వత్థామ) గుజరాత్ వ్యక్తి, అతని భార్య పిల్లలను రక్షించిన కేరళ ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు అదే సమయంలో బస్సులో నుంచి వరద దృశ్యాల్ని తన సెల్ఫోన్లో చిత్రీకరిస్తున్న కండక్టర్ జైసన్ జోసెఫ్ వెంటనే స్పందించి ఒక్క ఉదుటున అక్కడకు చేరుకుని, తోటి సిబ్బంది సాయంతో వారిని అతి కష్టమ్మీద వరదలో కొట్టుకుపోకుండా రక్షిస్తారు. తర్వాత బస్సుకు కొద్ది దూరంలో కారులో ఉన్న ఆ వ్యక్తి భార్య, మరో చిన్నారిని కూడా మిగతావారి సాయంతో రక్షించి బస్సులోకి చేరుస్తాడు. వరద బాధితులు గుజరాత్‌కు చెందినవారిగా కండక్టర్ జోసెఫ్ తెలిపారు. వరద ఎక్కువ కావడంతో కారులో నుంచి బయటపడే క్రమంలో ఆ తండ్రీ కొడుకులిద్దరు ప్రమాదం అంచుల వరకు చేరారని పేర్కొన్నాడు. ఇడుక్కి జిల్లాలోని పుల్లుపురలో ఈ ఘటన జరిగింది. (చదవండి: Viral Video: ‘వ్యాక్సిన్ వద్దంటే వద్దు.. వెళ్లకపోతే పాముతో కరిపిస్తా’) -
కర్ణాటకకు షాక్: కేఎస్ఆర్టీసీ ఇక కేరళకు!
తిరువనంతపురం: కేఎస్ఆర్టీసీ అనే పేరు రెండు రాష్ట్రాల ఆర్టీసీకి ఉంది. ఈ పేరుపై ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా దీనిపై రిజిస్ట్రార్ ఆఫ్ ట్రేడ్‌మార్క్స్‌కు తుది నిర్ణయం వెలువరించింది. ఆ పేరు ఇక కేరళకే దక్కుతుందని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుతో కర్ణాటకకు షాక్ తగిలింది. కేరళ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కర్ణాటక స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అని పేర్లు ఉన్నాయి. వీటి సంక్షిప్త పేరు (షార్ట్ నేమ్) కేఎస్ఆర్టీసీ అని వస్తుంది. అయితే ఈ పేరు రెండు రాష్ట్రాలు వినియోగిస్తున్నాయి. కేఎస్ఆర్టీసీ అనే పేరుతో ఏనుగు వాహనం అనే నిక్‌నేమ్‌తో కూడిన పేరును కేరళ వాడాలని ట్రేడ్‌మార్క్ ఆఫ్ రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. కేఎస్ఆర్టీసీ పేరు తమదని, కేరళ వాడొద్దంటూ 2014లో కర్ణాటక కేరళకు నోటీసులు ఇచ్చింది. కేఎస్ఆర్టీసీని తమకు కేటాయించాలంటూ అప్పటి కేరళ రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఆంటోనీ చాకో రిజిస్ట్రర్ ఆఫ్ ట్రేడ్‌మార్క్స్‌కు దరఖాస్తు చేశారు. ఏడేళ్లుగా విచారణ కొనసాగుతోంది. 1999 ట్రేడ్‌మార్క్స్ చట్టం ప్రకారం కేఎస్ఆర్టీసీ పేరును కేరళకు కేటాయిస్తూ శుక్రవారం ట్రేడ్‌మార్క్స్ రిజిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేరళ రోడ్డు రవాణా శాఖ మంత్రి ఆంటోనీ రాజు హర్షం వ్యక్తం చేశారు. కేఎస్ఆర్టీసీ పేరు మాత్రమే కాదని, తమ సంస్కృతికి అద్దం పట్టేది అని పేర్కొన్నారు. -
బస్సు డ్రైవర్ కొడుకును.. వారి సమస్యలు తెలుసు: హీరో
సాక్షి, బెంగళూరు: డిమాండ్లను సర్కారు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ ఉద్యోగులు తీర్మానించడంతో బస్సుల సంచారంలేక ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. సమ్మెలో పాల్గొంటున్న రవాణా శాఖ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఖాతరు చేయడం లేదు. గురువారం నాటికి సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రవాణాశాఖ ఉద్యోగులు కొవ్వొత్తులతో ధర్నాకు దిగారు. 6వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం జీతాలను పెంచాలని స్పష్టం చేశారు. 2,237 మందికి తాఖీదులు.. ఎస్మా తప్పదన్న ప్రభుత్వం ఆ చట్టం ప్రయోగానికి వెనుకాడుతోంది. ప్రతిరోజు కొందరు ఉద్యోగులకు నోటీస్‌లు జారీ చేస్తోంది. బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా విధులకు రావాలని బీఎంటీసీ 2,237 మంది ఉద్యోగులకు ఆదేశాలు పంపింది. అయితే స్పందన లేదు. దీంతో వారందరూ సంజాయిషి ఇవ్వాలని మళ్లీ తాఖీదులు పంపారు. ఉద్యోగుల దాడుల్లో రాష్ట్రవ్యాప్తంగా 60 బస్సులు ధ్వంసం అయ్యాయి. రవాణాశాఖ ఉద్యోగుల తరపున పోరాటం చేస్తున్న కోడిహళ్లి చంద్రశేఖర్ ప్రభుత్వ బెదిరింపులకు భయపడేదిలేదని శుక్రవారం నుంచి వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. బెంగళూరు బస్టాండ్లలో బుధవారంతో పోలిస్తే గురువారం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పండుగకు ఊరికివెళ్లి రైళ్లలో బెంగళూరుకు చేరుకున్న ప్రజలకు ఇళ్లకు వెళ్లేందుకు బీఎంటీసీ బస్సులు లేక ఉసూరన్నారు. ప్రైవేటు బస్సులే గమ్యం చేర్చాయి. అయితే నగరంలోని అనేక ప్రాంతాలకు బస్సులు నడవడం లేదు. మెజస్టిక్ రైల్వేస్టేషన్, మెట్రో స్టేషన్లలో రద్దీ కనిపించింది. రూ.170 కోట్ల నష్టం: డీసీఎం సమ్మె వల్ల ఇప్పటికి సుమారు రూ.170 కోట్లు నష్టం వచ్చిందని, వెంటనే విధులకు హాజరుకావాలని రవాణా మంత్రి, డిప్యూటీ సీఎం లక్ష్మణ సవది విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం 4,500 రవాణాబస్సులు సంచరించాయన్నారు. ఇప్పటివరకు సమ్మెతో రూ.170 కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. బస్సులపై రాళ్ల దాడులు చేయడం సరికాదన్నారు. ప్రజల కోసం 24 వేల ప్రైవేటు బస్సులు సంచరిస్తున్నాయని తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి హీరో యశ్ మద్దతు బనశంకరి: ఒక బస్సు డ్రైవర్ కుమారునిగా తనకు ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసని ప్రముఖ నటుడు యశ్ అన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుండటంతో బుధవారం కన్నడ హీరో రాకింగ్‌స్టార్ యశ్ రవాణాశాఖ మంత్రి లక్ష్మణసవదికి లేఖ రాసి, గురువారం స్వయంగా కలిసి మాట్లాడారు. అంతకు ముందు ఆయన ట్విట్టర్లో ఆర్టీసీ కార్మికుల కష్టాలను పంచుకున్నారు. తన తండ్రి కూడా ఎన్నోసార్లు ఖాళీ కడుపుతో విధులకు వెళ్లిన సందర్భాలు తనకు గుర్తు ఉన్నాయని, ఇంతటి పని ఒత్తిడి ఉంటుందని వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. రవాణాశాఖ మంత్రి లక్ష్మణసవది కూడా స్పందించినట్లు చెప్పారు. సీఎంతో మాట్లాడి డిమాండ్లు చర్చిస్తామని చెప్పినట్లు ఆయన పోస్టు చేశారు. చదవండి: పండుగ సెలవులకు బస్సుల కొరత.. అక్కడ డబుల్ చార్జీలు 🙏 pic.twitter.com/VXdZfdf1xx — Yash (@TheNameIsYash) April 15, 2021 -
పండుగ సెలవులకు బస్సుల కొరత.. అక్కడ డబుల్ చార్జీలు
సాక్షి, బెంగళూరు/బనశంకరి: అర్జంటుగా ఎన్నో పనులు. ఊరికి వెళ్దామంటే ఆర్టీసీ బస్సులు లేవు. ప్రైవేటు బస్సుల్లో డబుల్ చార్జీలు. అవి కూడా దూరప్రాంతాలకు వెళ్లడం లేదు. కార్లు, క్యాబ్‌లను భరించే స్థోమత లేదు.. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె వల్ల సామాన్యులు పడుతున్న కష్టాలు ఎన్నో. రవాణా శాఖ ఉద్యోగులు చేపట్టిన సమ్మె శుక్రవారం మూడవ రోజుకు చేరుకుంది. 6వ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలుచేయాలని ఉద్యోగులు, చేయలేమని ప్రభుత్వం తేల్చిచెప్పాయి. ఇరు పక్షాలూ మెట్టు దిగకపోవడంతో పాతిక వేల బస్సులు బస్టాండ్లకే పరిమితం అయ్యాయి. యథా ప్రకారం లక్షలాది ప్రజలకు రవాణా సౌలభ్యం కనాకష్టమైంది. కండక్టర్ ఆత్మహత్య.. విధులకు రావాలని ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడంతో బెళగావి జిల్లా సవదత్తిలో శివకుమార్ నీలగార (40) అనే కండక్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రవాణా ఉద్యోగులు విధులకు హాజరుకాకపోతే ఉద్యోగాల నుంచి తీసేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రభుత్వ హెచ్చరికలు ఖాతరు చేయని ఉద్యోగులు శుక్రవారం సైతం సమ్మెను కొనసాగించారు. నోటీస్‌లను జారీచేయగా పట్టించుకోలేదు. కాగా, ఆర్టీసీ బస్సులపై రాళ్లు విసిరారని బళ్లారిలో ఇద్దరు రవాణా సిబ్బందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. బెంగళూరు బస్టాండ్లు వెలవెల.. మూడోరోజు సమ్మె కొనసాగుతుండటంతో బెంగళూరు మరింతగా బోసిపోయింది. ఆర్టీసీ సమ్మెతో బస్టాండ్లు వెలవెలబోయాయి. మెజెస్టిక్‌లో బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులు ప్రైవేటు బస్సులు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్, ఆటోలను ఆశ్రయించారు. ప్రభుత్వం సూచించిన రూట్‌మ్యాప్ ప్రకారం ప్రైవేటు బస్సులు సంచరిస్తున్నాయి. ప్రైవేటు బస్సులకు.. పండుగ.. మూడురోజుల్లో ఉగాది పండుగ వస్తుండడంతో బెంగళూరుతో పాటు ప్రధాన నగరాల నుంచి ఊళ్లకు వెళ్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులు ఎక్కుతున్నారు. శనివారం, ఆదివారాలు సెలవులు, సోమవారం ఒకరోజు సెలవు పెడితే మంగళవారం ఉగాది పండుగ కావడంతో నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఊళ్ల బాట పట్టారు. ప్రైవేటు బస్సుల్లో అడిగినంత డబ్బు ఇచ్చి సొంత ఊళ్లకు వెళ్లక తప్పడం లేదని పలువురు వాపోయారు. అయితే బెంగళూరు నుంచి బళ్లారి, హుబ్లీ, రాయచూరు, కలబురిగి, బీదర్, బాగల్కోటె, విజయపుర, బెళగావి తదితర ఉత్తర కర్ణాటక నగరాలకు ప్రైవేటు బస్సులు వెళ్లడం లేదు. రైళ్లలో వెళదామనుకున్నా టికెట్లు సులభంగా దొరకడం లేదు. దీంతో ఊళ్లకు చేరేదెలా అని టెన్షన్ నెలకొంది. సమ్మె కొనసాగిస్తాం: కోడిహళ్లి సాక్షి బెంగళూరు: తెలంగాణలో మాదిరిగా ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేస్తామంటే చేసుకోండి. అది కూడా చూస్తాం అని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల గౌరవాధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ సవాలుచేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ సమ్మెను కొనసాగిస్తున్నట్లు, సామాన్య ప్రజలు మరికొన్ని రోజులు ఇబ్బందులు పడక తప్పదని చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. త్వరలో బెళగావిలో, కలబుర్గిలో రవాణా ఉద్యోగుల సమావేశాలను నిర్వహిస్తామన్నారు. విధులకు వస్తేనే చర్చలు: సీఎం బనశంకరి: ఆర్టీసీ ఉద్యోగులు పట్టువీడి విధులకు రావాలి, ఎవరి మాటలో విని బలిపశువులు కావద్దు అని ముఖ్యమంత్రి యడియూరప్ప సూచించారు. శుక్రవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ సమ్మె విరమించి విధులకు హాజరయ్యే వరకూ ఆర్టీసీ సంఘాలతో ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రవాణా ఉద్యోగులు పట్టువీడకపోవడం సరికాదన్నారు. మూడురోజుల నుంచి బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారని, ప్రయాణాలకు తీవ్ర ఆటంకం ఏర్పడిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 6వ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడం సాధ్యం కాదని మరోసారి స్పష్టంచేశారు. బంద్ వల్ల ఆర్టీసీ మరింత నష్టపోతోందన్నారు. చదవండి: ఆ సిఫారసులు అమలు చేస్తే రూ.4 వేల కోట్ల అదనపు భారం -
ఆ సిఫారసులు అమలు చేస్తే రూ.4 వేల కోట్ల అదనపు భారం
సాక్షి, బెంగళూరు/బనశంకరి: ప్రజల సంచారానికి జీవనాడిగా పేరుపొందిన ఆర్టీసీ బస్సుల సమ్మెతో ప్రజలకు రవాణా వసతి బంద్ అయ్యింది. అదే మాదిరి ప్రభుత్వ ఆదాయం కూడా. ఇటీవల కోవిడ్ లాక్డౌన్, డిసెంబరులో ఆర్టీసీ సమ్మె వల్ల రూ. 16 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కేఎస్ ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉండగా, ప్రస్తుతం బుధవారం నుంచి ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆర్టీసీ సిబ్బంది వేతనాలకు నెలకు రూ.400 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక బస్సుల డీజిల్, నిర్వహణ కోసం రూ.300 నుంచి 400 కోట్లు ఖర్చుఅవుతుందని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు. కానీ నెలవారీ ఆదాయం అంతమొత్తంలో లేదని ప్రభుత్వ వర్గాల కథనం. ఉద్యోగులు కోరుతున్నట్లు 6 వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తే ఏడాదికి రూ.4 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. కోవిడ్ వల్ల రద్దీ తగ్గడం, సమ్మె మూలంగా రోజుకు సుమారు రూ. 20 కోట్లకు పైగా నష్టం వస్తోందని అంచనా. కొనసాగుతున్న సమ్మె వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలను పెంచాలనే డిమాండ్‌తో ఆర్టీసీ ఉద్యోగుల చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకోగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం పట్టుదలతో శిక్షణలో ఉన్న డ్రైవర్లతో బస్సులు నడపడానికి గురువారం ప్రయత్నం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రయాణ వసతి కరువై విలవిలలాడారు. బెంగళూరు సహా అనేక నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు వాహనాలే రవాణా అవసరాలను తీర్చాయి. లగేజ్, చిన్నపిల్లలను ఎత్తుకుని ప్రజలు బస్సులకోసం పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. బెంగళూరు మెజస్టిక్, శాటిలైట్, యశవంతపురతో పాటు ప్రముఖ బస్టాండ్లు ప్రయాణికులు లేక బోసిపోయాయి. చాలాచోట్ల ప్రైవేటు బస్సులు కూడా తక్కువగా సంచరించాయి. ప్రైవేటు బస్సుల దొరుకుతాయనే ఆశతో వచ్చిన ప్రయాణికులు, ప్రజలు బస్సులు సకాలంలో దొరక్కపోవడంతో నిరాశచెందారు. ఉత్తర కర్ణాటక నగరాల్లో ప్రైవేటు బస్సులు సైతం అరకొరగా సంచరిస్తున్నాయి. ట్రైనీలతో నడిపించే యత్నం.. సమ్మె నేపథ్యంలో శిక్షణలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు గురువారం తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని బీఎంటీసీ ఆదేశించింది. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని విధాలా భద్రత కల్పిస్తామని కేఎస్ఆర్టీసీ డైరెక్టర్ శివయోగి కళసద్ తెలిపారు. నేడు కూడా సమ్మె డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే శుక్రవారం కూడా సమ్మె కొనసాగిస్తామని రవాణాశాఖ ఉద్యోగుల ఒక్కూట గౌరవాధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టీసీ సిబ్బందికి అత్యంత తక్కువ వేతనం వస్తోందని అన్నారు. ఈ తారతమ్య ధోరణి సరికాదన్నారు. విధులకు హాజరుకాకపోతే కఠినచర్యలు తీసుకుంటామని రవాణాశాఖ సిబ్బంది ఇళ్లకు నోటీసులు అంటించడం సరైన పద్ధతి కాదన్నారు. 10 శాతం జీతం పెంచుతాం.. 6వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలను పెంచలేం, 8 శాతానికి బదులు 10 శాతం జీతం పెంచుతామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి అంజుంపర్వేజ్ తెలిపారు. సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తామని చెప్పారు. సమ్మె వీడకపోతే రెండేళ్ల లోపు పదవీవిరమణ చేసిన ఆర్టీసీ సిబ్బందిని పిలిపించి బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు. విధులకు రాకుంటే చర్యలు: సీఎం రవాణాశాఖ ఉద్యోగులు డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది. అయినా సమ్మె చేయడం సరికాదు. తక్షణం విధులకు హాజరుకావాలి, లేని పక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప గురువారం హెచ్చరించారు. ఆయన బెళగావిలో మాట్లాడుతూ కోవిడ్ క్లిష్ట సమయంలోనూ 8 శాతం వేతనం పెంచాలని తీర్మానించామన్నారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని విధుల్లో చేరాలన్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: టికెట్ ధరకు రెట్టింపు వసూళ్లు! -
చర్చలకు రండి.. లేదంటే తీవ్ర పరిణామాలు: సీఎం
సాక్షి, బెంగళూరు: ఆరవ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మె ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే డిపోల్లో నిలిచిపోయాయి. 24 వేల బస్సుల సంచారం బందై బస్టాండ్లు నిర్మానుష్యమయ్యాయి. ప్రజలు గమ్యస్థానం చేరడం ఎలా అని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రోగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లుల బాధలు వర్ణనాతీతం. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు గమ్యం చేరలేక నానా ఇబ్బందులు పడ్డారు. బుధవారం జరగాల్సిన బెంగళూరు, తుమకూరు, మంగళూరు, రాణిచెన్నమ్మ విశ్వవిద్యాలయ పరీక్షలను వాయిదా వేశారు. ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలోని 31 జిల్లాల్లో రవాణా బస్సులు సంచారం పూర్తిగా స్తంభించిపోయింది. కాగా, ప్రయాణ అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేటు బస్సులు, టెంపోలకు అనుమతి ఇచ్చింది. బెంగళూరుతో పాటు వివిధ జిల్లాల్లో ప్రైవేటు వాహనాలే ప్రజలకు దిక్కయ్యాయి. బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండు, కెంపేగౌడ బస్టాండు, శాటిలైట్, యశవంతపుర బస్టాండ్లులో ప్రైవేటు మినీబస్సుల సంచారం అధికమైంది. ఆటో, ట్యాక్సీ, ప్రైవేటు బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణాలు తప్పలేదు. దీనివల్ల కరోనా రెండో దాడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన ఏర్పడింది. ప్రైవేటు వాహనాల్లో అధిక టికెట్ ధరలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బస్టాండ్లలోకి ప్రైవేటు బస్సులు.. బెంగళూరు నగరంలో ప్రైవేటు బస్సులు, మినీ బస్సులు బీఎంటీసీ రూట్లలో తిరిగాయి. అయితే టికెట్ ధరకు రెట్టింపు వసూళ్లు చేసినట్లు ప్రయాణికులు వాపోయారు. గత్యంతరం లేక ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. ఇక ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు ఇదే అదనుగా విపరీతంగా చార్జీలు వసూలు చేశారు. మొత్తం మీద బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులు సంచారం తీవ్రతరమైంది. సాధారణంగా మెజెస్టిక్, కెంపేగౌడబస్టాండులోకి ప్రైవేటు బస్సులకు అనుమతిలేదు. కానీ బుధవారం అన్ని బస్టాండ్లలోకి స్వేచ్ఛగా ప్రైవేటు బస్సులు ప్రవేశించాయి. బెంగళూరు నుంచి రాష్ట్రంలో ప్రధాన నగరాలకు బస్సులు కరువయ్యాయి. సమ్మె వల్ల ఐటీ సిటీలో మెట్రోరైలు సర్వీసులను పెంచారు. మెట్రో స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. మెట్రో టోకెన్లు దొరక్క ప్రజలు ఇబ్బందిపడ్డారు. సమ్మె ముగిసే వరకు టోకెన్ వ్యవస్థను కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రయాణికులకు కటకట.. ప్రభుత్వం, రవాణా శాఖ ఉద్యోగులు పట్టువీడకపోవడంతో ప్రజలు నలిగిపోవాల్సి వచ్చింది. ఎంతో వెచ్చించి నెల పాస్ తీసుకుంటే ప్రైవేటు బస్సులు టెంపోలు, ఆటోల్లో డబ్బు పెట్టి ప్రయాణించాలా? అని పలువురు మండిపడ్డారు. మంగళవారం తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్‌కు వెళ్లి తిరిగివచ్చే కర్ణాటక ఉద్యోగులకు బస్సులు దొరకలేదు. మైసూరునగర, గ్రామీణ బస్టాండ్లు వెలవెలబోయాయి. కరోనా వైరస్ ఉండటంతో ధర్నా చేపట్టరాదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరించింది. దీంతో ఉద్యోగులు ధర్నాలకు దిగలేదు. చర్చిద్దాం రండి: సీఎం సాక్షి, బళ్లారి: కేఎస్ఆర్టీసీ సిబ్బంది సమ్మె మానుకుని ప్రభుత్వంతో చర్చలకు రావాలని సీఎం యడియూరప్ప కోరారు. బుధవారం బెళగావిలో ఉప ఎన్నికల ప్రచారంలో విలేకరులతో మాట్లాడుతూ చర్చల్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వంతో చర్చలకు రాకుండా, సమ్మె మానకపోతే ఎస్మా ప్రయోగించేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. కరోనా కష్ట సమయంలోను, విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున బంద్ పాటించడం తగదన్నారు. జీతాలకు కష్టమవుతుంది: డీసీఎం బనశంకరి: ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే జీతాలివ్వడం కష్టమని డిప్యూటీ సీఎం లక్ష్మణసవది హెచ్చరించారు. బీదర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రవాణాశాఖ నష్టాల్లో ఉందని ప్రతిరోజు రూ.4 కోట్లు నష్టం వస్తోందన్నారు. సమ్మె చేయడం వల్ల నష్టం మీకేనన్నారు. ప్రయాణికులను ఇబ్బందులు పెడుతూ సమ్మెకు దిగడం న్యాయమా అని ప్రశ్నించారు. రవాణాశాఖ ఉద్యోగులు పెట్టిన 9 డిమాండ్లలో 8 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. సమ్మె వల్ల రోజూ 30 లక్షల మంది ప్రయాణికులు కష్టాల పాలవుతారన్నారు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం -
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు: ఒకవైపు కరోనా వైరస్‌తో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలమీద ఆర్టీసీ సమ్మె పిడుగు పడింది. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం సమ్మె చేపట్టారు. దీంతో కర్ణాటకలో బస్సులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో పలు విశ్వవిద్యాలయాలు నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశాయి. ఇక జీతాలు చెల్లించడంలేదంటూ బస్సు డ్రైవర్ల నిరవధిక సమ్మెకు దిగడంతో, ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించకుండా ఉండేందుకు, కేఎస్ఆర్టీసీ ప్రైవేటు బస్సులకు తాత్కాలికంగా అనుమతినిచ్చింది. కాగా ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల నేపథ్యంలో యడ్డీ సర్కారు రాజీకి వచ్చే ప్రసక్తే లేదని మంగళవారం తేల్చిచెప్పింది. రవాణా శాఖ ఉద్యోగులతో చర్చలు లేదా రాజీ ప్రశ్నేలేదని, సమ్మెను విరమించాలని, ప్రజలకు ఇబ్బంది కలిగించడం లేదా ప్రభుత్వ ఆస్తులకు ధ్వంసంచేస్తే అలాంటి వారిపై ఎస్మా చట్ట ప్రయోగం తప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు, ముఖ్యమంత్రి నివాస కార్యాలయం కృష్ణాలో సీఎం యడియూరప్ప, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్, పోలీస్ కమిషనర్ కమల్‌పంత్, బీఎంటీసీ అధ్యక్షుడు నందీశ్‌రెడ్డి, డైరెక్టర్లు శిఖా, శివయోగికళసద్, రవాణాశాఖ కమిషనర్ శివకుమార్, వాయువ్య, ఈశాన్యతో సహా 4 ఆర్టీసీ మండళ్ల డైరెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. 6వ వేతన సిఫార్సులు అసాధ్యం: సీఎస్ ఇక మంగళవారం నాటి భేటీ అనంతరం సీఎస్ రవికుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో రవాణాశాఖ ఉద్యోగులకు 6వ వేతన కమిషన్ సిఫార్సులను అమలుచేయడం సాధ్యం కాదు. ఉద్యోగులు తక్షణం ధర్నాను విరమించి విధులకు హాజరుకావాలి. గైర్హాజరైతే వారి వేతనంలో కోత విధిస్తాం. రవాణాశాఖ ఉద్యోగుల ఒక్కూట నేతలతో కానీ ఇతరులతో చర్చలు జరిపేది లేదు. రాజీచర్చలు ముగిసిన అధ్యాయం. విధ్వంసానికి దిగితే కఠిన చర్యలుంటాయి. రవాణా ఉద్యోగుల వేతనాన్ని 8 శాతం పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించింది. ఇందుకు అనుమతి ఇవ్వాలని సోమవారం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశాం. అక్కడ నుంచి అనుమతి లభిస్తే వేతన అంశం పరిష్కారమవుతుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఎలాంటి హామీ ఇవ్వడం సాధ్యం కాదు’’ అని ఆయన తెలిపారు. ప్రతిరోజు 60 లక్షలమంది ప్రయాణికులు సంచరిస్తున్నారని, కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 30 లక్షలకు తగ్గిందని తమకు ప్రతి రోజు రూ.4 కోట్లు నష్టం వస్తోందని సీఎస్ చెప్పారు. ఇది రవాణాశాఖ ఉద్యోగులకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. పదేపదే ధర్నాలకు దిగడం ఎంతవరకు సమంజసమన్నారు. ఆందోళనల వల్ల కోవిడ్ విస్తరిస్తుందని చెప్పారు. ధర్నా చేయొద్దు: డీసీఎం లక్ష్మణ్ రవాణాశాఖ ఉద్యోగుల వేతనం పెంపునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, తక్షణం సమ్మెను విరమించి విధులకు హాజరుకావాలని డిప్యూటీ సీఎం లక్ష్మణసవది విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వేతనం పెంచాలని తీర్మానించామని తెలిపారు. ఎంతమేర అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మొదట ఉద్యోగులు ధర్నా విరమించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం సమ్మెకు ఉపక్రమించారు. చదవండి: ఆర్టీసీ సమ్మె యోచనపై సీఎం సీరియస్ -
మహిళలు ఇక బస్టాండ్‌లో సేఫ్.. కేరళ ఆర్టీసీ తాజా ప్రాజెక్ట్!
‘స్టే సేఫ్’... ఇది కేరళ ఆర్టిసీ తాజా ప్రాజెక్ట్. మహిళా ప్రయాణికుల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను మొదలెట్టింది. సుదీర్ఘ ప్రయాణాల్లో ఉన్న మహిళలు, వేళ గాని వేళ గమ్యం చేరుకున్న మహిళలు, సొంత పనులు మీద ఒంటరిగా వచ్చిన మహిళలు... వీరు సేఫ్‌గా ఇక బస్టాండ్లలోనే గదులు తీసుకుని ఉండవచ్చు. వీరి కోసం కేరళలోని 94 డిపోల్లో ఏసి, నాన్ ఏసి గదులు తయారవుతున్నాయి. అదీ ప్రయత్నించదగ్గ ధరలకు. మహిళా ప్రయాణికులకు సంబంధించి ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రశంసలు కూడా వస్తున్నాయి. గతంలో తిరువనంతపురంలో కేవలం మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే గెస్ట్‌హౌస్‌ను మొదలెట్టారు. అక్కడ మహిళలకు అవసరమైన వస్తువులు, చంటి పిల్లలకు అవసరమైన వస్తువులు ఉండే స్టోర్ కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పుడు మహిళల కోసం బస్టాండ్‌లోనే గదులు కేటాయించే, నిర్మించే పనులు ప్రారంభించారు. మరో రకంగా ఇది కోవిడ్ సమయపు ఆలోచన కూడా అనొచ్చు. కోవిడ్ వల్ల ప్రయాణాలు చేసే వారి సంఖ్య కొంచెం తగ్గింది. స్త్రీలకు తోడు వచ్చే వీలు లేనివారు, లేదా కోవిడ్ వల్ల బంధువుల ఇంటికి వెళ్లడం/రానివ్వడం కుదరని వారు ఎక్కడ ఉండాలి? వారి కోసం బస్టాండుల్లోనే గదుల ఆలోచన వచ్చింది. ఇది ఆదాయం పెంచుకునే మార్గంగా కూడా కేరళ ఆర్టీసీ భావిస్తోంది. వచ్చే పోయే బస్సులతో, ప్రయాణికులతో హడావిడిగా ఉండే ప్రాంగణాలలో గదులు మహిళలకు రక్షణ ఇస్తాయన్న విషయంలో సందేహం లేదు. హోటళ్ల కంటే ఇవే క్షేమకరం అని మహిళా ప్రయాణికులు భావిస్తే రాబోయే రోజుల్లో ఈ బస్టాండ్ హోటళ్లు కిటకిటలాడొచ్చు. -
మహిళల కోసం రూ.12 లక్షల బస్సు
బెంగళూరు : కేఎస్ఆర్టీసీకి చెందిన ఓ బస్సును అన్ని సదుపాయాలతో మహిళల టాయ్‌లెట్‌గా రూపొందించారు. అంతేకాదు ఇందులో శిశువులకు పాలిచ్చే గది, శానిటరి న్యాప్కిన్ వెండింగ్ మిషన్, బిడ్డ డైపర్ మార్చే స్థలం, సోలార్ దీపాలతో బహుళ ప్రయోజన బస్సుగా మార్చారు. ఇందుకు రూ.12 లక్షలు వ్యయమైంది. గురువారం డీసీఎం లక్ష్మణ సవది ప్రారంభించారు. బస్సును నగరంలో రద్దీ కూడళ్లలో మహిళల కోసం నిలిపి ఉంచుతారు. -
కరోనా: కేఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
కొచ్చి: కరోనా వైరస్ సంక్షోభం తరువాత కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ 4.0 సడలింపుల్లో భాగంగా అంతర్ జిల్లా సేవలకు ప్రభుత్వం బుధవారం అనుమతి నిచ్చింది. ఈ నేపథ్యంలో కేఎస్ఆర్టీసీ టికెట్ల ధరలను 50 శాతం పెంచేసింది. కీలక సమయాల్లో సాధ్యమైన ఎక్కువ బస్సులను బుధవారం నుంచి నడపనున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ఎ.కె.ససీంద్రన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు, సూచనలను ప్రతి డిపోకి ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేవలం 50 శాతానికి మాత్రమే అనుతి వుండటంతో టికెట్ ధర 50 శాతం పెంచినప్పటికీ, కార్పొరేషన్ రోజుకు రూ .42 లక్షల నష్టాన్ని చవిచూస్తుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తాత్కాలికంగా టికెట్ రేటును 50 శాతం పెంచింది. కనీస ఛార్జీలను రూ. 8 నుండి రూ. 12కు పెంచింది. అలాగే అన్ని ఆర్టీసీ యూనిట్లకు ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేయడంతోపాటు, సిబ్బంది, ప్రయాణీకులకు ఫేస్ మాస్క్ వాడకం తప్పనిసరి చేసింది. ప్రభుత్వం.ప్రయాణీకులు భౌతిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. బస్సు ఎక్కే ముందు శానిటైజర్ ఉపయోగించాలి. (కరోనా: వారికి ఎం అండ్ ఎం బంపర్ ఆఫర్లు) 50శాతం సామర్థ్యంతో 25 కంటే ఎక్కువ మంది ప్రయాణికులతో బస్సులు నడపడానికి అనుమతి లేదు.డబుల్ సీటర్లలో ఒకే ప్రయాణీకుడికి, మూడు సీట్లలో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే అనుమతి వుంది. మరోవైపు ప్రజా రవాణాలో కీలక మైన ప్రైవేట్ బస్సుల సర్వీసులు తిరిగి ప్రారంభించడంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. -
ఘోర ప్రమాదం : మృతుల కుటుంబాలకు రూ.20 లక్షలు
తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని అవినాషిలో కేరళకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కేరళ ప్రభుత్వం రూ .10 లక్షల ఎక్స్‌గ్రేషి యా ప్రకటించింది. అత్యవసర సహాయంగా రూ .2 లక్షలు వెంటనే అందిస్తామని రవాణా శాఖ మంత్రి ఏకే ససీంద్రన్ తెలిపారు. అలాగే గాయపడిన వారి చికిత్స ఖర్చులను కూడా కేరళ ప్రభుత్వం భరించనుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే మృతుల బంధువులు తమ వస్తువులను తీసుకొనేందుకు పాండి పోలీస్ స్టేషన్ అధికారులను 8300044804 లేదా 9498177908 నెంబర్లో సంప్రదించవచ్చని పాలక్కాడ్ జిల్లా కలెక్టర్డి బాలమురళి తెలిపారు. మృతదేహాలను తీసుకురావడానికి కేరళ ఇప్పటికే 20 అంబులెన్స్‌లను కోయంబత్తూరుకు పంపించినట్టు చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన కేఎస్ ఆర్టీసీ డ్రైవర్ గిరీష్, కండక్టర్ బైజు అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కేరళ ఆర్టీసీ వివిధ బీమా పథకాల ప్రకారం ఒక్కొక్కరికి రూ.30 లక్షలు పొందనున్నారని ససీంద్రన్ తెలిపారు. ఈ ప్రమాదంలో కేరళ ఆర్టీసీ బస్సు డ్రైవర్ గిరీష్, కండక్టర్ బైజు కూడా మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డుప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 20కి పెరిగినట్టు సమాచారం. స్వల్ప గాయాలతో 20 మంది ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కండక్టర్ కలెక్టరా.. అంతా ఫేక్!
కర్ణాటక: పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చంటూ గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో, వార్తా ఛానెళ్లలో వైరల్ అవుతోంది. విషయానికొస్తే.. యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో బెంగళూరు లోకల్ బస్సు కండక్టర్ సత్తా చాటాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. ఇక ఇది కూడా పూర్తి చేస్తే అతడు ఏకంగా కండక్టర్ నుంచి కలెక్టర్ స్థాయికి చేరిపోతాడు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, వార్తా ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. (ఈ కండక్టర్.. కాబోయే కలెక్టర్?) అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్త ఫేక్ అని తెలుస్తోంది. మధు ఎన్సీ అనే కండక్టర్ యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మధు పేరుతో వచ్చిన ఆ రిజల్ట్ మధు కుమారి అని బెంగళూరుకు చెందిన వేరే అమ్మాయిదని తేలింది. దీంతో తప్పుడు సమాచారంతో మీడియాను తప్పుదోవ పట్టించిన మధుపై బీఎంటీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యారు. We’ve come to know that the BMTC bus conductor who claimed to have cracked the IAS Mains exam was lying. We have reason to believe that the roll number he showed us didn't belong to him. (1/2) — Bangalore Mirror (@BangaloreMirror) January 30, 2020 -
ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా 50 శాతం మహిళలే
బెంగళూరు : నగరంలో నడిచే ఆర్టీసీ బస్సు వీల్స్ ఇక ఎక్కువగా మహిళల చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. కర్ణాటక రాష్ట్ర రహదారి రవాణా కార్పొరేషన్, బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా కార్పొరేషన్లో 50 శాతం ఆర్టీసీ బస్సు డ్రైవర్ పోస్టులను మహిళలకే కేటాయించే విధంగా ఓ స్పెషల్ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రవాణా మంత్రి హెచ్ఎం రెవన్నా గత శుక్రవారం కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ అధికారులతో నిర్వహించిన భేటీలో అధికారులకు ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. దీని కోసం ఓ డ్రాఫ్ట్ పాలసీని రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ డ్రాఫ్ట్ పాలసీలో మహిళా అభ్యర్థులు హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికిల్స్‌కు డ్రైవింగ్ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకునేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా తీసుకున్న మహిళలకు, ట్రైనింగ్, స్పెషల్ వేతనం ఇవ్వనున్నారు. ఒకవేళ ఈ రిజర్వేషన్‌ను అప్లయ్ చేస్తే, మహిళలకు 50 శాతం డ్రైవింగ్ ఉద్యోగాలు కేటాయిస్తున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక పేరొందనుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ వాహనాల్లో ఉచితంగా మహిళలకు డ్రైవింగ్ ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వనున్నారు. చైనా, బ్రిటన్, ఇటలీలలో మహిళలు బస్సు డ్రైవర్లుగా ఉన్నారు. ప్రభుత్వం రవాణా ఏజెన్సీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక పేరులోకి రానుందని రెవన్నా చెప్పారు. ఈ ఉద్యోగాలను స్వీకరించడానికి మహిళలను ప్రోత్సహించాలని, అందుకోసం ఓ స్పెషల్ పాలసీ కావాలని మంత్రి చెప్పారు. త్వరలోనే అభ్యర్థులను పిలిచి ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఆర్ ఉమాశంకర్ తెలిపారు. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ ఇలా నియామకాలు చేపట్టడం తొలిసారి కాదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగం మాదిరిగా అంతకముందు కూడా 30 శాతం డ్రైవర్ పోస్టులను మహిళలకే కేటాయించారు. -
బాలికపై ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లైంగికదాడి
♦ కర్ణాటకలోని రాణిబెన్నూరులో ఘోరం బెంగళూరు: కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. బిడ్డలా ఆదరించాల్సిన బాలికపై కామాంధులు కాటేశారు. ప్రేమించిన యువకుని కోసం ఒంటరిగా వచ్చిన బాలిక (15)పై కేఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్ బస్సులోనే సామూహిక అత్యాచారం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన బాలిక- ఉడుపిలో ఓ కాలేజీ కుర్రాడు ప్రేమించుకున్నారు. ఇద్దరికి విభేదాలు రావడంతో ఆ యువకుడు హావేరి జిల్లా రాణిబెన్నూరుకు వచ్చేశాడు. బాలిక కూడా ఈ నెల 5వ తేదీన మణిపాల్ నుంచి కేఎస్ఆర్టీసి బస్సులో ఒంటరిగా రాణిబెన్నూరుకు వచ్చింది. ప్రియుని కోసం వీధి వీధి గాలించి కనిపించకపోవడంతో సొంతూరు వెళ్లడానికి 6వ తేదీ రాత్రి రాణిబెన్నూరు బస్టాండ్‌కు చేరుకుంది. బాలిక పరిస్థితిని గమనించిన కేఎస్ఆర్టీసి బస్సు డ్రైవర్ వీరయ్య హీరేమఠ, కండక్టర్ యువరాజ్ కట్టెకార్‌తో పాటు మరో డ్రైవర్ రాఘవేంద్ర బడిగేరెలు తాము సహాయం చేస్తామంటూ నమ్మబలికారు. బస్సులోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచానికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని నిందితులు బెదిరించడంతో మౌనం వహించిన బాలికను మరుసటి రోజు ప్రయాణికులతో పాటు అదే బస్సులో మణిపాల్‌లో దించేసారు. ఇంటికి చేరుకున్న తరువాత ఈ ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఉడుపి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉడుపి మహిళా పోలీసులు మంగళవారం ముగ్గరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
బెంగళూరు నుంచి తిరుమలకు ప్యాకేజీ
బెంగళూరు : పర్యాటకులకు మరింత సౌకర్యంగా ఉండేలా బెంగళూరు నుంచి తిరుపతికి ప్యాకేజ్ టూర్ ఏర్పాటుచేసేందుకు కర్ణాటకరాష్ట్ర ఆర్టీసీతో ఏపీ పర్యాటక శాఖ ఒప్పందం చేసుకుంది. ఈమేరకు బెంగళూరు కేఎస్ఆర్టీసీ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.ఆర్.ఉమాశంకర్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ హిమాంశు శుక్ల ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. బెంగళూరు–తిరుమల మధ్య ప్యాకేజ్ టూర్‌ను ఈ నెల 12 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ ప్యాకేజ్ ద్వారా పర్యాటకులకు అమరావతి మల్టీ యాక్సల్ బస్సు సదుపాయం, హోటల్లో కాలకృత్యాలు, అల్పాహారం, భోజనంతో పాటు తిరుమలలో తక్షణ దర్శనం కల్పించేలా ఏర్పాట్లు ఉంటాయి. బెంగళూరు నుంచి రోజూ రాత్రి 10 గంటలకు బయల్దేరే ఈ సర్వీస్ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తిరుపతిలో బయల్దేరుతుంది. శుక్ర, శనివారాల్లో పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.2000 టికెట్ ధరగా నిర్ణయించారు. మిగతా రోజుల్లో పెద్దలకు రూ.2000 పిల్లలకు రూ.1700 టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. కేఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, ప్రైవేట్ బుకింగ్ కేంద్రాల ద్వారా, ఆన్లైన్, మొబైల్ ఫోన్ ద్వారా 30 రోజుల ముందుగానే టికెట్లు బుక్‌చేసుకోవచ్చు. కార్యక్రమంలో కేఎస్ఆర్టీసీ డైరెక్టర్ బీఎన్ఎస్ రెడ్డి, ట్రాఫిక్ జనరల్ మేనేజర్ కేఎస్ విశ్వనాథ్, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ జనరల్ మేనేజర్ జిరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు 7760990034, 7760990035 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చు. -
పొగరాయుళ్ల నుంచి రూ.1.7 కోట్లు వసూలు
బెంగళూరు : బహిరంగ ప్రదేశాల్లో పొగతాగుట నిషేధం. బస్సులో పొగ తాగరాదు అంటూ ప్రతి ఆర్టీసీ బస్సులో దర్శనమిస్తూనే ఉంటాయి. అయినా నిబంధనలు అతిక్రమిస్తూనే ఉంటారు. నిబంధనలు అతిక్రమించి పబ్లిక్ ప్రాంతమైన బస్సు స్టేషన్లలో స్మోకింగ్ చేసిన వారికి జరిమానా విధించేలా కర్ణాటక రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) చేపట్టిన యాంటీ-స్మోకింగ్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన వచ్చింది. జరిమానా కింద మొత్తం రూ.1.7 కోట్లను కేఎస్ఆర్టీసీ వసూలు చేసింది. 2013 నుంచి ఇప్పటివరకు 85,143 మంది ప్రయాణికులపై కేఎస్ఆర్టీసీ జరిమానా విధించింది. 2013-14 నుంచి 2014-15కు బస్సులో పొగతాగే వారి సంఖ్య పెరిగినా.. ఈ జరిమానాలతో 2015-16కు స్మోకింగ్ చేసే వారి తగ్గినట్టు కేఎస్ఆర్టీసీ పేర్కొంది. సిగరేట్స్, ఇతర పొగాకు ఉత్పత్తుల యాక్ట్ 2003 కింద బస్సు స్టేషన్లో స్మోకింగ్ చేస్తూ పట్టుబడిన వారికి కేఎస్ఆర్టీసీ రూ.200 జరిమానా విధిస్తోంది. దీంతో ఈ ప్రజారవాణా సంస్థకు ఊహించకుండానే రూ.1.70 కోట్ల ఆర్థిక సాయం అందింది. రాష్ట్రవ్యాప్తంగా 150 కేఎస్ఆర్టీసీ బస్సు స్టేషన్లలో ప్రయాణికులు స్మోకింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ డ్రైవ్ కేవలం రెవెన్యూలు ఆర్జించడమే కాకుండా, ప్రజల్లో స్మోకింగ్ వల్ల కలిగే ఆరోగ్యసమస్యలపై అవగాహన తెప్పిస్తున్నామన్నారు.