బెంగళూరు : నగరంలో నడిచే ఆర్టీసీ బస్సు వీల్స్ ఇక ఎక్కువగా మహిళల చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. కర్ణాటక రాష్ట్ర రహదారి రవాణా కార్పొరేషన్, బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా కార్పొరేషన్‌లో 50 శాతం ఆర్టీసీ బస్సు డ్రైవర్ పోస్టులను మహిళలకే కేటాయించే విధంగా ఓ స్పెషల్ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రవాణా మంత్రి హెచ్‌ఎం రెవన్నా గత శుక్రవారం కేఎస్‌ఆర్టీసీ, బీఎంటీసీ అధికారులతో నిర్వహించిన భేటీలో అధికారులకు ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. దీని కోసం ఓ డ్రాఫ్ట్ పాలసీని రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ డ్రాఫ్ట్ పాలసీలో మహిళా అభ్యర్థులు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్‌కు డ్రైవింగ్ ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకునేలా కార్యక్రమాలు రూపొందించాలన్నారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్లుగా తీసుకున్న మహిళలకు, ట్రైనింగ్, స్పెషల్ వేతనం ఇవ్వనున్నారు. ఒకవేళ ఈ రిజర్వేషన్‌ను అప్లయ్ చేస్తే, మహిళలకు 50 శాతం డ్రైవింగ్ ఉద్యోగాలు కేటాయిస్తున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక పేరొందనుందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా భారీ వాహనాల్లో ఉచితంగా మహిళలకు డ్రైవింగ్ ఇవ్వడమే కాకుండా.. ఉచితంగా డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఇవ్వనున్నారు. చైనా, బ్రిటన్, ఇటలీలలో మహిళలు బస్సు డ్రైవర్లుగా ఉన్నారు. ప్రభుత్వం రవాణా ఏజెన్సీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక పేరులోకి రానుందని రెవన్నా చెప్పారు. ఈ ఉద్యోగాలను స్వీకరించడానికి మహిళలను ప్రోత్సహించాలని, అందుకోసం ఓ స్పెషల్ పాలసీ కావాలని మంత్రి చెప్పారు. త్వరలోనే అభ్యర్థులను పిలిచి ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు కేఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌ఆర్ ఉమాశంకర్ తెలిపారు. కేఎస్‌ఆర్టీసీ, బీఎంటీసీ ఇలా నియామకాలు చేపట్టడం తొలిసారి కాదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగం మాదిరిగా అంతకముందు కూడా 30 శాతం డ్రైవర్ పోస్టులను మహిళలకే కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment