![KSRTC double-decker bus to munnar, Go kerala shares video goes viral](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/KSRTCDouble-Deckermunnar.jpg.webp?itok=gh_HbOoL)
రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించే టూరిస్టులకు మున్నార్ అందాలను మరింత అందంగా చూపించాలనే ఉద్దేశంతో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) కొత్త బస్సు సర్వీసులను తీసుకొచ్చింది. హిల్ స్టేషన్‌లో డబుల్ డెక్కర్ బస్సులను లాంచ్ చేసింది. 'రాయల్ వ్యూ ప్రాజెక్ట్'లో భాగమైన ఈ బస్సులో పర్యాటకులు మున్నార్ అందాలను ఆస్వాదించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాటు కూడా చేసింది. దీనికి సంబంధించి ఒక వీడియోను గో కేరళ ట్విటర్ హ్యాండిల్ షేర్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో పర్యాటక ప్రేమికులను బాగా ఆకట్టుకుంటోంది.
ఇటీవల మున్నార్‌లో సందర్శన కోసం కొత్త డబుల్ డెక్కర్ బస్సును జెండా ఊపి రవాణా మంత్రి శ్రీ గణేష్ కుమార్ ప్రారంబించారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ పర్యాటకులకు కొత్త అనుభవాన్ని అందిస్తుందన్నారు. డబుల్ డెక్కర్ బస్సు సర్వీసు వల్ల ప్రస్తుతం ఉన్న పర్యాటక సంబంధిత సౌకర్యాలకు ఎలాంటి ముప్పు ఉండదని కూడా ఆయన హామీ ఇచ్చారు.
దీని ప్రకారం, మున్నార్ రాయల్ వ్యూ డబుల్ డెక్కర్ బస్సు తేయాకు తోటలు ,ఎత్తైన ప్రాంతాలను 360 డిగ్రీల వీక్షణ అందించేలా రూపొందించారు. గాజు అద్దాలతో, వినసొంపైన సంగీతం పారదర్శకంగా బయటి దృశ్యాలను చక్కగా చూపిస్తుంది. బస్సు ఎగువ డెక్‌లో 38 మంది, దిగువ డెక్‌లో 12 మంది కూర్చునే అవకాశం ఉంటుంది. ఈ బస్సు మున్నార్-దేవికులం మార్గంలో రోజువారీ నాలుగు సర్వీసులను నడుపుతుందని సమాచారం.
KSRTC launches double-decker bus for tourists in Munnar 💚 pic.twitter.com/pJbn6mxik7
— Go Kerala (@Gokerala_) February 11, 2025
కామెంట్లు చూస్తే గుండె గుభిల్లు
అయితే ఈ వీడియో చాలామంది అనుమానాలు, భయాలు వ్యక్తం చేశారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులో నిస్సందేహంగా ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. కానీ ఈ రోడ్డుపై నా అనుభవం చాలా తీవ్రంగా ఉంది అంటూ ఒకరు రిప్లై ఇచ్చారు.. KSRTC డ్రైవర్లు సరిగ్గా నావిగేట్ చేయకపోయినా, ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా... పెద్ద ముప్పు తప్పదు అని ఒకరు, మోషన్ సిక్‌నెస్ రావచ్చు, ముఖ్యంగా పొగమంచు ఉన్న రోజుల్లో ఇది చాలా ప్రమాద కరమైనది కావచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
డబుల్ డెక్కర్ బస్సు సర్వీస్ పై చట్టపరమైన సవాళ్లు
కొత్త బస్సు సర్వీస్‌ను పర్యాటకులు స్వాగతిస్తున్నప్పటికీ, ఇది చట్టపరమైన సమస్యలను రేకెత్తిస్తోంది. కేరళ హైకోర్టు ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని వాహనాలతో సహా అక్రమ వాహన మార్పులకు సంబంధించిన పిటిషన్లను సమీక్షిస్తోంది. ఎటువంటి మినహాయింపులు లేకుండా మోటారు వాహనాల చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలని జస్టిస్ అనిల్ కె. నరేంద్రన్ , జస్టిస్ మురళీకృష్ణతో కూడిన డివిజన్ బెంచ్ నొక్కి చెప్పింది.
మరోవైపు మున్నార్ టూరిస్ట్ టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ కొత్త బస్సు సర్వీస్ వారి జీవనోపాధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని వాదిస్తూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ సమస్య ప్రస్తుత పిటిషన్ పరిధిలోకి రాదని పేర్కొంటూ కోర్టు వారి దరఖాస్తును తోసిపుచ్చింది. తగిన మార్గాల ద్వారా చట్టపరమైన సహాయం తీసుకోవాలని పిటిషనర్లకు కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment