munnar
-
అందుకే కొన్ని రోజులు మిస్సయ్యా!
‘‘అందరూ క్షమించాలి. కొన్ని రోజులుగా మిమ్మల్ని మిస్సవుతూ వచ్చాను. ఎందుకంటే నెట్వర్క్ లేని ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నాను’’ అని రష్మికా మందన్నా సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. ఆమె కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రెయిన్ బో’. ఇందులో దేవ్ మోహన్ హీరో. ఈ చిత్రం షూటింగ్ కొన్నాళ్లు నెట్వర్క్ లేని ప్రాంతాల్లో జరిగింది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయి, నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి రావడంతో రష్మిక పై విధంగా పేర్కొన్నారు. ఇంకా ఈ చిత్రం గురించి రష్మికా మందన్నా మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ చెన్నైలో కొన్ని రోజులు ‘రెయిన్ బో’ షూటింగ్ చేశాం. ఆ తర్వాత కొడైకెనాల్ వెళ్లాం. అక్కడ షూట్ చేసి, మున్నార్‌లో మొదలుపెట్టాం. ఈ రెండు ప్రాంతాల్లోనూ నెట్వర్క్ లేదు. అయితే షెడ్యూల్ చాలా కూల్‌గా జరిగింది. కొడైకెనాల్లో నా గది నుంచి సూర్యోదయాన్ని తిలకించడం ఓ అందమైన అనుభూతి. మంచుకి తడిచిన పువ్వులు కంటికి హాయినిచ్చాయి. మున్నార్ కూడా అంతే. అందమైన, ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో షూటింగ్ చేయడం మనసుకి ఉల్లాసంగా అనిపించింది’’ అన్నారు. -
ఇది కదా అద్భుతం: ఎగ్జోటిక్ వీడియోషేర్ చేసిన ఆనంద్ మహీంద్ర
సాక్షి, ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త ఎంఅండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర మరో అద్బుతమైన వీడియోను షేర్ చేశారు. ఎన్నో ఇన్నోవేటివ్ వీడియోలతో అభిమానులను ఆకట్టుకునే ఆయన తాజాగా మరో వీడియోతో ఫాన్స్‌ను ఫిదా చేశారు. చెన్నైకి చెందిన ఒక వ్లాగర్ వీడియోలోని విశేషాలపై అబ్బురపడుతూ అసలు ఇప్పటికే ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన హాలిడే అనుభవాలలో ఒకటిగా ఎందుకు జాబితా కాలేదంటూ ప్రశంసించారు. ఆవిష్కర్తలకు సెల్యూట్ చెబుతూ సాటర్డేవండరింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో దీన్ని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: మలేసియాలో ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి గ్రామానికి: రారాజులా లాభాల పంట ప్రకృతి సోయగాల నడుమ మనోహరమైన మున్నార్‌లోని బబుల్ గ్లాంపింగ్లో ట్రాన్స్పరంట్గా హోటల్ గదులు ఉండటం విశేషం.హోటల్ గది నుంచే సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని ఆకాశాన్ని, చుక్కల్ని ఎంజాయ్ చేస్తూ గడవపచ్చు టాప్ లగ్జరీ హోటల్స్‌లో ఉండే అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉంటాయి. ప్రేమికులకు, కొత్తజంటల రొమాంటిక్ అనుభవంకోసం ఇవి బెస్ట్ సమ్మర్ వెకేషన్స్గా బాగా పాపులర్ అయ్యాయి. (అక్షయ తృతీయ 2023: టన్నుల కొద్దీ విక్రయాలు, ఏడాదిలో షాకింగ్ ధరలు) Why isn’t this listed yet as one of the world’s most exotic holiday experiences. ( Hope it’s a net-zero facility?) Salute to the innovators who established this…On my bucket list now… 👏🏽👏🏽👏🏽 #saturdaywandering pic.twitter.com/0lQGmcwld3 — anand mahindra (@anandmahindra) April 22, 2023 -
Neelakurinji: ఆ పువ్వులు మళ్లీ 2030లో పూస్తాయి!
మున్నార్ అంటే మూడు నదుల సమ్మేళనం. పశ్చిమ కనుమలలో విస్తరించిన ఈ ప్రదేశం ముథిరాప్పుజ, నల్లతన్ని, కుండలి నదుల మధ్య ఉన్న హిల్‌స్టేషన్. ఈ కొండలకు నీలగిరులు అనే పేరు రావడానికి ‘నీలకురింజి’ పూలే కారణం. కేరళలో ఏ ప్రదేశానికి ట్రిప్ అయినా సరే ట్రైన్ పాలక్కాడ్ సమీపించగానే మరోలోకంలోకి వెళ్తున్న భావన కలుగుతుంది. పచ్చని పొలాలు, లెక్కపెట్టటానికి సాధ్యం కానన్ని కొబ్బరిచెట్లు కనువిందు చేస్తాయి. రైల్లోకి కనిపించే చిన్న చిన్న గ్రామాలు, ఇళ్లు ముచ్చటగా ఉంటాయి. చాలా వరకు పెంకుటిళ్లే. పెంకులను అమర్చడంలో నైపుణ్యం సీనియర్ ఆర్కిటెక్ట్‌ను కూడా మురిపించేటట్లు, ఇల్లంటే ఇలా ఉండాలి అనిపించేటట్లు ఉంటుంది. ఇటీవల ఆర్కిటెక్ట్‌లు ఎర్ర పెంకు కప్పు నిర్మాణాల మీద ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు కూడా. పుష్కరకాలం ఎదురు చూపు నీలగిరుల్లో పన్నెండేళ్లకోసారి ప్రకృతి వరం వికసిస్తుంది. కొండల మీద ఎటు చూసినా నీలకురింజి చెట్లే. ఈ చెట్లు పన్నెండేళ్లకు ఒకసారి పూస్తాయి. పూసిన పువ్వు ఏడాది వరకు ఉంటుంది. ఒక చెట్టు ఒక్కపువ్వును మాత్రమే పూసి వాడిపోతుంది. ఆ పువ్వు పేరు నీలకురింజి. నీల అంటే నీలిరంగు, కురింజి అంటే మళయాళంలో పువ్వు అని అర్థం. ఆ నీలిపువ్వునుంచి రాలిన గింజలు మొలకెత్తి పన్నెండేళ్లకు పూతకు వస్తాయి. నీలకురింజి పూలు పూసిన ఏడాది పర్యటించగలగడం అదృష్టమనే చెప్పాలి. 2006లో ఈ పూలు పూశాయి, ఆ తర్వాత 2018లో పూశాయి. ఆ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం రోజు ప్రధానమంత్రి తన ప్రసంగంలో పశ్చిమ కనుమల్లో విరిసే నీలకురింజి గురించి ప్రస్తావించారు. అయితే ఆ ఏడాది ప్రకృతి వరం ఇవ్వడంతోపాటు కన్నెర్ర కూడా చేసింది. పూలు కొండల నిండుగా విరిసిన జూలై, ఆగస్టుల్లో కుంభవృష్టి కురిసింది. కొచ్చి ఎయిర్‌పోర్టు రన్‌వే మీద కూడా నీళ్లు నిలిచాయి. విమాన సర్వీసులు ఆగిపోయాయి. రైళ్లు నడవడం కూడా కష్టమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా టూరిజం గాడిన పడడానికి కొద్ది నెలలు పట్టింది. పర్యాటకుల పుష్కర కాలపు ఎదురు చూపు వృథా అయింది. ఒకటి కాదు... యాభై రకాలు! కురింజి పూసినప్పుడు కొండలన్నీ నీలిరంగు దుప్పటి పరిచినట్లు ఉంటాయి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్‌లను మామూలు రోజుల్లో చూసిన వాళ్లు కూడా కురింజి కోసం ఆ పువ్వు పూసే ఏడాది మళ్లీ టూర్ ప్లాన్ చేసుకుంటారు. బొటానికల్‌గా వీటిని 50 రకాల జాతులుగా చెప్తారు కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి, షేడ్లు మాత్రం ఏ చిత్రకారుడూ మిక్స్ చేయలేనంత లలితంగా ఉంటాయి. ఈ పూలు మళ్లీ 2030లో పూస్తాయి. ఆ ఏడాది కోసం ఎదురు చూద్దాం. ట్రావెల్ టిప్స్: జాగ్రత్తగా వెళ్లి వద్దాం! కేరళలో ఎండాకాలం ఉష్ణోగ్రతలు ఎక్కువ. కాబట్టి టూర్లో తేలికపాటి దుస్తులు ధరించాలి. ఈ వాతావరణంలో పాదాలకు కూడా చెమట పడుతుంది. రెయినీ షూస్ అయితే తడి నేల మీద అడుగు వేసినప్పుడు జారదు. బురద అంటినా శుభ్రం చేసుకోవడం సులభం. కేరళ ఆహారంలో మసాలాలు ఉండవు కాబట్టి, జీర్ణాశయ సమస్యలు ఎదురుకావు. జలుబు, జ్వరం మందులు మాత్రం దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. కేరళ టూర్లో రోజూ తలస్నానం చేయాలి, ఒక కొబ్బరి బోండాం తాగడం కూడా మంచిది. కేరళలో దొరికే అరటికాయ చిప్స్ రుచి చూడాలి. కొబ్బరి నూనెలో వేయించిన అరటికాయ చిప్స్ నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. వీలయితే కొన్ని ప్యాకెట్లు తెచ్చుకోవచ్చు. ∙టీ ఆకులతో మరిగించిన టీ రుచి చూడాలి. టీ పొడులు రకరకాల ఫ్లేవర్లు దొరుకుతాయి. చదవండి: కొండల రాణి.. మేఘాల్లో తేలినట్లుగా ఉంటుంది! -
తేయాకు నీడ
ఆకాశం మబ్బు పట్టి ఉంది. ఉదయం నుంచి వర్షం కురిసి వాతావరణం చల్లగా ఉంది. వేడివేడిగా టీ తాగాలనిపిస్తుంది. వంటగదిలోకెళ్లి టీ కెటిల్లో నీళ్లు పెట్టి గత ఏడాది మునార్ టూర్‌కెళ్లినప్పుడు తెచ్చుకున్న టీ పౌడర్ వేసి మూతపెడతాం. రొటీన్ టీ కాదు, ఒక ఏలక్కాయ కూడా వేస్తే... అనుకుంటూ ఒక ఏలక్కాయను కొట్టి టీలో వేస్తాం. ఎంతయినా అక్కడ నుంచి తెచ్చుకున్న టీ పొడి, ఏలక్కాయల క్వాలిటీనే వేరు. ఆకు పచ్చటి పెద్ద ఏలక్కాయలు మనకు దొరకడం చాలా అరుదు. ఇవి సౌదీకి ఎగుమతి అవుతాయట. ఒక ఏలక్కాయ రైతుకి ఒక ఎకరా పంట నుంచి ఏడాదికి లక్ష రూపాయలు వస్తాయట. కేరళ పర్యటనలో తెలుసుకున్న వివరాలన్నీ గుర్తు చేసుకుంటూ తుంపరలుగా పడుతున్న చిరు చినుకులను కిటికీలో నుంచి చూస్తూ టీని ఆస్వాదిస్తాం. వీటన్నింటికీ వెనుక మరో కోణం ఉంది. వాళ్ల నాసిక ఏలకుల సువాసనను గుర్తించడం మానేసి తరాలు దాటుతోంది. తేయాకులోని వగరు మినహా మరేమీ మిగలని జీవితం వాళ్లది. తల దాచుకోవడానికి ఇల్లు కావాలి, ఆ ఇల్లు కావాలంటే టీ తోటలోనే పని చేయాలి. తరాలుగా తోటల్లోనే టీ కంపెనీ అడ్వర్టయిజ్మెంట్లో ఒక అందమైన అమ్మాయి రంగురంగుల దుస్తులు ధరించి, చక్కగా మేకప్ వేసుకుని, వీపుకు వెదురు బుట్ట కట్టుకుని పాట పాడుతూ, సంగీతానికి అనుగుణంగా లయబద్దంగా పాదాలను కదిలిస్తూ మునివేళ్లతో లేత టీ ఆకులను కోసి వెనుక ఉన్న బుట్టలో వేస్తుంది. నిజానికి టీ తోటల్లో పని చేసే ఆడవాళ్ల చేతులు యాడ్‌లో అమ్మాయి చేతులున్నట్లు మృదువుగా ఉండవు. టీ ఆకులను కోసి కోసి, కొమ్మలు గీరుకుపోయి గరుకుబారి ఉంటాయి. పని చేసేటప్పుడే కాదు, పండుగ పబ్బాలకు కూడా ఖరీదైన దుస్తులు ధరించే పరిస్థితి ఉండదు. ఈ ఉద్యోగంలో తినడానికి తిండి ఉంటుంది. కట్టుకోవడానికి ముతక దుస్తుల వరకు భరోసా ఉంటుంది. ఉండడానికి ఇల్లు... ఇల్లు ఉంటుంది. కానీ అది సొంతం కాదు. టీ తోటలో కార్మికులు ఎస్టేట్ యజమానులు ఏర్పాటు చేసిన క్వార్టర్. వంటగది, ఒక బెడ్ రూమ్, ముందుగది ఒకటి మొత్తం మూడు గదులతో గూడ పెంకు కప్పిన చిన్న పోర్షన్. అక్కడ ఉద్యోగం చేసినంత కాలం ఆ ఇంటిలో ఉండవచ్చు. రిటైర్ అయిన తర్వాత ఖాళీ చేసి వెళ్లి పోవాలి. ఖాళీ చేస్తే ఎక్కడికి పోవాలి? అదే ఇప్పుడు వారిని తరతరాలుగా వేధిస్తున్న ప్రశ్న. మూడు తరాలకు ముందు తమిళనాడు నుంచి వలస వచ్చిన కుటుంబాలున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్లడానికి తమ ఊరు ఏదో కూడా ఈ తరానికి తెలియదు. దాంతో విధిగా తర్వాతి తరం కూడా టీ తోటల్లోనే ఉపాధిని వెతుక్కోవాల్సి వస్తోంది. ఇంటికోసమే ఈ పని బయటకు వెళ్తే ఏ పని చేసుకున్నా ఎక్కువ డబ్బు వస్తుంది, అంతే మొత్తంలో ఆ డబ్బు ఇంటి అద్దెలకు పోతుంది. అందుకే ఇందులోనే మగ్గిపోక తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు కేరళలోని మునార్ టీ తోటలు, ఇడుక్కి ఏలకుల తోటల పనివాళ్లు. ‘కొచ్చిలో బేకరీలో పని చేస్తే రోజుకు వెయ్యి రూపాయలు వచ్చేవి. మా అమ్మా నాన్న టీ తోటల్లో పనిచేసేవాళ్లు. టీ ఎస్టేట్ ఇచ్చిన క్వార్టర్లో ఉండేవాళ్లు. ఇప్పుడు వాళ్లు రిటైర్ అయ్యారు. మాకు క్వార్టర్ కావాలంటే ఎవరో ఒకరం టీ తోటల్లో పని చేయాలి. అందుకే బేకరీ ఉద్యోగం వదిలేసి టీ తోటల పనికి వచ్చాను. ఇక్కడ రోజుకు మూడు వందలు వస్తాయి’ అని చెప్తున్నాడు ఓ కార్మికుడు. -
రాజకీయాలంటే ఆయనకు ఇష్టం: సబితా ఆనంద్
‘నా భార్య కొండంత అండ.. అన్ని విషయాల్లో సూచనలు, సలహాలు ఇస్తుంది. మా మధ్యన ఎలాంటి దాపరికాలూ ఉండవు. ప్రతి విషయాన్ని ఇద్దరం కలిసి పంచుకుంటాం’ అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ చెప్పారు. తన భర్తకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టమని.. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. కుటుంబ బాధ్యతలు, ఆస్పత్రి నిర్వహణ తాను చూసుకుంటున్నానని ఆనంద్ భార్య సబిత చెప్పారు. వారి జీవన విశేషాలను శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి, వికారాబాద్: మా సొంత గ్రామం ధారూరు మండలం కేరెళ్లి. మాది చిన్న కుటుంబం. ఇద్దరు అక్కలు, నేను. నా విద్యభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కొసాగింది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు కేరెళ్లిలోని సీయుపీఎస్లో, ఆ తరువాత 8 నుంచి పదవ తరగతి వరకు ధారూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కొనసాగింది. ఇంటర్ వికారాబాద్ ఎస్ఏపీ కళాశాలలో బైపీసీలో చేరి చదివాను. ఆ తరువాత మా గురువు డాక్టర్ టి.వీరయ్య ప్రోద్బలంతో ఎంసెట్‌లో మొదటి సారి ర్యాంకు సాధించి గాంధీ మెడికల్ కళాశాలలో చేరి 1999లో డాక్టర్ పట్టా అందుకున్నా. మా ఇంట్లో నా కంటే ముందు చదువుకున్నావారు లేరు. నేను మాత్రమే డాక్టర్ అయ్యాను. ఎండీ, ఎంఎస్ కాకతీయ మెడికల్ కళాశాలలో 2003లో పూర్తి చేశాను. ఎండీ, ఎంఎస్ చేసిన డాక్టర్లు అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా నాకు తెలిసి పది మంది లోపే ఉంటారు. నేను మొదటి నుంచి అన్నింట్లోనూ మొదటి స్థానాన్నే సంపాదించుకున్నా. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో నా విద్యభ్యాసం కొనసాగింది. అందరు మాది ప్రేమ వివాహం అని అనుకుంటారు. కానీ, మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ సోదరే నా భార్య. ఆయనే ప్రోద్బలంతోనే 2002లో మా వివాహమైంది. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఎంతో ఇష్టం. నా జీవితంలో మరిచిపోలేనివి రెండు. అవి ఒకటి.. నేను డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నది, రెండవది నేను వికారాబాద్ ఎమ్మెల్యేగా ఎంపికైనది. ఈ రెండు అంశాలు నా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. నాకు ఇష్టమైన ఇవీ.. నేను డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఉదయం లేవగానే యోగ చేస్తాను. బుక్స్ చదవడం, సినిమాలు చూడటం, వారంలో ఒక రోజు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్లిరావడం ఇష్టం. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇష్టమైన సినిమా భరత్ అనే నేను.. నాతో పాటు మా కుటుంబానికి అందరికి నచ్చింది. నాకు దేశంలో నచ్చిన ప్రాంతం కేరళలోని మునార్. ఆ ప్రాంతం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నాకు చేపలు, పెరుగు, జొన్నరొట్టె చాలా ఇష్టం. మా ఆవిడ తానే స్వయంగా చికెన్ బిర్యాని చేస్తుంది. చాలా బాగా వండుతుంది. డాక్టర్ వృత్తికి దూరమయ్యాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత డాక్టర్ వృత్తికి దూరమయ్యాను. ప్రజల మధ్య ఉండి సేవలు అందించాల్సి వస్తోంది. కుటుంబానికి ప్రస్తుతం సమయం కేటాయించడానికి వీలులేకుండా పోతోంది. వారానికి ఒక రోజు కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించాలి. నా భార్యే ఆస్పత్రి బాధ్యతలతో పాటు ఇంటిని చక్కబెట్టడం స్వయంగా చూసుకుంటుంది. నాకు మద్యం, సిగరెట్ అలవాటు లేదు. కనీసం కాఫీ, టీ కూడా తాగను. చిన్నప్పటి నుంచీ అలవాటు లేదు. నాకు ఒక కూతురు వినుత్నా ఆనంద్, ఒక కుమారుడు వైభవ్ ఆనంద్. వారు 9, 8వ తరగతి హైదరాబాద్‌లో చదువుతున్నారు. మా భార్య సబితా ఆనంద్‌కు ఆగ్రాలోని తాజ్‌మహల్ అంటే ఇష్టం. రాజకీయల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి. రాజకీయాలంటే ఆయనకు ఇష్టం – సబితా ఆనంద్ మా ఆయనకు రాజకీయాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల్లో మమేకం కావడం నాకు ఎంతో తృప్తినిస్తుంది. కుటుంబం, ఆస్పత్రి వ్యవహారాలన్నీ నేను చూసుకుంటున్నా. ఆయనకు సంతృప్తి ఇచ్చే పనుల్లో చేదోడువాదోడుగా ఉండడమే నాకు తృప్తి. -
ఆరడుగుల బుల్లెట్
మున్నార్... కేరళలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం. సముద్ర మట్టానికి 5,200 అడుగుల ఎత్తులో ఉన్న హిల్‌స్టేషన్. ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ వేసవి తాపాన్ని తప్పించుకోవడానికి లక్షలాది పర్యాటకులు ఏటా మున్నార్‌కు వస్తుంటారు. ఇదే అక్కడో మాఫియా పుట్టడానికి కారణం. అది ల్యాండ్ మాఫియా. మున్నార్ ల్యాండ్ మాఫియా. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించి రిసార్టో, హోటలో కట్టేయడం. వాణిజ్య సముదాయాలు లేపేయడం. పార్టీలతో సంబంధం లేకుండా నేతలందరీ బినామీల పేరిట ఇదే దందా. అది 2016 జూలై. దేవికుళం సబ్ కలెక్టర్‌గా ఒక్కడొచ్చాడు... పేరు శ్రీరామ్ వెంకిటరమణన్. 2013లో సివిల్ సర్వీసెస్‌లో దేశంలోనే రెండో ర్యాంకు సాధించిన కేరళవాసి. సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపడుతూనే శ్రీరామ్ ఈ ప్రభుత్వ స్థలాల దురాక్రమణలపై దృష్టి పెట్టాడు. రెవెన్యూ యంత్రాగాన్ని పరుగులు పెట్టించి ఆక్రమణలను తొలగించాడు. పార్టీ యంత్రాంగాలు, ట్రేడ్ యూనియన్లు బలంగా ఉండే కేరళలో శ్రీరామ్ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నాడు. నిరసనలకు దిగినా, భౌతికంగా అడ్డుగా నిలిచినా, దూషణలకు దిగినా... లెక్కచేయలేదాయన. హైకోర్టులో ఈ కూల్చివేతలు నిలిపివేయాలని పిటిషన్లు పడితే... ప్రతికేసులో పక్కా ఆధారాలు సమర్పించి ప్రభుత్వ భూమిగా నిరూపిస్తూ పోయారు. పోలీసులు సహకరించకున్నా... ఆక్రమణలను కూల్చడంలో వెనుకడుగు వేయలేదు. బెదిరించారు... రాజకీయంగా ఒత్తిడి తెచ్చారు. ప్రజలకేదో సేవచేయాలనే ఉద్దేశంతో డాక్టర్ వృత్తిని వదులుకొని సివిల్స్‌ను ఎంచుకొన్న ఈ యువ అధికారి తగ్గలేదు. అక్రమాలను సహించని స్థానిక యువతలోనూ అతనికి క్రేజ్ ఏర్పడింది. రెండు వారాల కిందట మన్నూర్ సమీపంలోని చిన్నక్కనల్ గ్రామంలో ఆక్రమిత భూమిలో నుంచి ఓ చర్చికి సంబంధించిన శిలువను తొలగించింది శ్రీరామ్ బృందం. అంతే కాచుకొని ఉన్న పార్టీలు రాజకీయం చేశాయి. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారనే ఫిర్యాదు కేరళ సీఎం పినరయి విజయన్‌కు వెళ్లింది. అఖిలపక్షం నిర్వహించే దాకా ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని విజయన్ ఇడుక్కి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేశారు. అయితే అఖిలపక్షం పెట్టేదిశగా సీఎం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. సీపీఎంలో బలమైన నాయకుడిగా పేరున్న విద్యుత్‌శాఖ మంత్రి కె.కె.మణిది ఇడుక్కి జిల్లానే. శ్రీరామ్ ధోరణితో రగిలిపోతున్న ఆయన ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ ‘చర్చిలు, దేవాలయాలు, మసీదులు ఎన్నో పట్టాలేని భూముల్లో ఉన్నాయి. వీటిని తొలగించొచ్చని ఓ మూర్ఖపు సబ్ కలెక్టర్ అనుకుంటే... అతన్ని పిచ్చాసుపత్రికి పంపాల్సిందే’ అని తన అక్కసును వెళ్లగక్కారు. శ్రీరామ్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకోరు. చట్టానికి లోబడి పనిచేస్తున్నపుడు... తానెవరికీ భయపడాల్సిన పనిలేదని అంటారాయన. బదిలీలు అనేవి ఉద్యోగికి మామూలేనని తేలికగా తీసుకునే.. శ్రీరామ్ విషయంలో కేరళలోని సీపీఎం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. నిజాయితీ పరుడైన అధికారిని అకారణంగా బదిలీ చేశారనే అపవాదు తెచ్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడుతుందా? గుబురుగా పెరిగిన గడ్డం, జీన్స్ ప్యాంటు, పైన జాకెట్ లేదా టీషర్ట్. ఇదీ శ్రీరామ్ ఆహర్యం. సామాన్యుడిలా బుల్లెట్‌పై మున్నార్ చుట్టుపక్కల గ్రామాలన్నీ కలియదిరుగుతూ ప్రజలతో మమేకమవుతుంటారు. అన్యాయంపై ఎక్కుపెట్టిన ఆరడుగుల బుల్లెట్‌గా జనం మన్ననలు అందుకుంటున్నాడీ 31 ఏళ్ల యువ ఐఏఎస్. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఆ మహిళలు.. అసమానతను గెలిచారు..!
వీపుపై వెదురు బుట్టలు కట్టుకొని పచ్చని ప్రకృతి మధ్య టీతోటల్లో ఆకులు తుంచుతూ కనిపించే ఆ మహిళలను చూస్తే మనకు ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ.. కానీ వారి జీవితాల్లో బాధలు ఆగాధాల్లా పేరుకొన్నాయి. వారికి అంతులేని వేదనలు మిగులుస్తున్నాయి. అయితే ఏళ్ళదరబడి జీవన పోరాటంలో గెలిచేందుకు వారు చేసిన ప్రయత్నం ఇప్పుడు విజయవంతమైంది. టీ తోటల్లో కనిపించని కష్టాలను గట్టెక్కేందుకు నెరపిన ఉద్యమం ఎందరో మహిళలకు స్ఫూర్తి దాయకంగా మారింది. రాజకీయాలకు అతీతంగా, పురుషుల అండదండలు అవసరం లేకుండా యాజమాన్యాలపై పోరాడి అనుకున్నది సాధించారు. కన్నన్ దేవన్ హిల్స్ టీ తోటల్లోని మహిళలు తమ సత్తా చాటుకున్నారు. కేరళరాష్ట్రం మున్నార్ కొండప్రాంతం టీ తోటల పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ పనిచేసే మహిళా కూలీల శ్రమను మాత్రం దశాబ్దాలు గడుస్తున్నా గుర్తించేవారే లేకుండా పోయారు. దీంతో మహిళలంతా ఒక్కటయ్యారు. మేం బుట్టలను వీపుపై కట్టుకొని టీ ఆకులు కోస్తాం.. మీరు ఆ బుట్టల్లోంచి డబ్బు దండుకుంటున్నారు.... అంటూ టీ తోటల్లో మొదలైన మహిళల ఉద్యమం రోడ్డుపైకి చేరింది. కనీసం తమ నిరసనల్లో రాజకీయ నాయకులను, పురుషులను అనుమతించలేదు. ఎటువంటి సంఘాలను జోక్యం చేసుకోనివ్వలేదు. యూనియన్ నాయకులు యాజమాన్యాలతో కుమ్మక్కై వారి బోనస్ ను తగ్గించడాన్ని నిరసించారు. నాలుగు నుంచి ఆరువేల మంది మహిళలు తొమ్మిది రోజులపాటు.. యాజమాన్యాలతో అధిక బోనస్ కోసం పోరాడి చివరికి కేవలం మహిళా శక్తితో గెలుపు సాధించారు. పార్టీలకు ప్రభావితమైన యూనియన్ లీడర్లు, ఆధిక్యం ప్రదర్శించే పురుషులకు దీటుగా... ఉద్యమించిన మహిళా శక్తి నేడు ఈ ప్రాంతంలోని పలు ఎస్టేట్స్ లోని మహిళా కూలీలకు, ఉద్యోగినులకు స్ఫూర్తిగా మారింది. దీంతో వీరంతా ఇప్పుడు వేతనాలకోసం పోరాటాన్ని ప్రారంభించారు. ఒక్క టీ తోటల్లోనే కాదు వరి చేలల్లోనూ, అగరబత్తి, బీడీ రోలింగ్, రొయ్య పొట్టు, పట్టు పురుగు పెంపకం, జీడి గింజల ఫ్యాక్టరీల్లోనూ ఈ మహిళా గళం ప్రతిధ్వనించింది. ఉద్యోగాల్లోనూ, వృత్తుల్లోనూ మహిళలు సమానంగా పనిచేస్తున్నా పురుషులకంటే తక్కువ వేతనాలు ఇవ్వడం, పురుష ఆధిక్యతతో ఉండటం ఎందుకు జరుగుతోందంటూ వీరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత మున్నార్ మహిళల తిరుగుబాటు ఒక్క వారి సమస్యలు సాధించేందుకే కాదు... ఏకంగా భారత ఆర్థిక వ్యవస్థ పైనే పడనుంది. కులం, రంగు, రాజకీయాలు మొదలైన అనేక వివక్షల్లో మార్పును తెచ్చేందుకు, అందరికీ సమన్యాయం జరిగేందుకు ఉపయోగ పడనుంది. ఇటువంటి స్త్రీ వాద ఉద్యమాలు సమన్యాయం జరిగేందుకు దోహదపడనున్నాయి. ఆర్థిక అసమానతలను తొలగించేందుకూ సహాయపడే అవకాశం ఉంది. ప్రస్తుత మున్నార్ ఉద్యమం ఓ చిన్న నిప్పు రవ్వ అగ్గిని రాజేసినట్లుగా ఇంతింతై.. మొత్తం ప్రపంచాన్ని తాకనుంది. అసురక్షిత కార్మికులు, శ్రామిక ఒప్పందాలు, యజమానుల ద్రోహం, వంటి అనేకమైన ఆర్థిక అంశాలను విమర్శించేందుకు తావునిచ్చింది. అనేక సమస్యలు స్త్రీలు పురుషులకంటే సమర్థవంతంగా నిర్వర్తించగలరని నిరూపించింది. ఇండియా రాజధాని ఢిల్లీలో జరిగిన అభయ అత్యాచార ఘటనలోనూ మహిళా ఉద్యమం తారాస్థాయికి చేరి, ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపింది. అప్పట్లో జరిపిన అతి పెద్ద ఉద్యమం ఏకంగా చట్టాల్లోనే కీలకమైన మార్పును తెచ్చాయి. అనంతర పరిణామంలో ఇటీవల లైంగిక హింసలపై మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వస్తున్నారు. లైంగిక హింస కేసులు నమోదు చేసేందుకు ధైర్యం చేస్తున్నారు. అదే రీతిన మున్నార్ ఉద్యమం.. ప్రపంచంలోనే మహిళా వివక్షను ప్రశ్నించేందుకు ఓ స్ఫూర్తిగా మారనుంది. -
మనోహరమైన మున్నార్..!
నేడు చాలామంది మానసిక ఒత్తిడి నుంచి దూరం అవాలని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వెదుక్కుంటూ ప్రకృతి వనాలున్నచోటుకు వెళ్లాలని తపిస్తున్నారు. ఆ కోవలో పర్యాటకులను అమితంగా ఆకర్షించే ప్రాంతం మున్నార్. ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఆకుపచ్చని తేయాకు తోటల్లో మీ సెలవుదినాలను ఎంజాయ్ చేయవచ్చు. ఏర్కాడు, ఏలగిరి, తేక్కడితో పాటు ఊటీ, కొడెకైనాల్లు మున్నార్‌కు దగ్గరలోనే ఉన్నాయి. అద్భుతమైన సెలవు దినాలలో మూడు రాత్రులు, నాలుగు పగళ్ల కోసం రూ.17,010 చెల్లిస్తే చాలు. ఇందులోనే అల్పాహారం, లంచ్, డిన్నర్, విమానాశ్రయానికి చేర్చడం వంటి అవకాశాలు కల్పించారు. అతిథుల సౌకర్యం కోసం 10 శాతం డిస్కౌంట్‌తో రూమ్ డైనింగ్, లాండ్రీ సౌకర్యాలున్నాయి. అత్యంత రద్దీగల ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పిల్లలు, పెద్దలు వినోదాన్ని పొందే సౌకర్యాలూ ఉన్నాయి. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు మున్నార్, తేక్కడిలో గడపచ్చు. ఇందుకు ప్యాకేజీ ధర రూ.32,000. దీంట్లోనే పెద్దలకు ప్రత్యేకమైన ఆయుర్వేదిక్ మసాజ్, సుగంధద్రవ్యపు తోటల సందర్శన, మున్నార్‌లోని ఇతర ప్రదేశాల సందర్శన అవకాశం కల్పిస్తారు. మరిన్ని వివరాలకు: http://bookings.sterlingholidays.com/packages/monsoon/ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వచ్చు.