‘నా భార్య కొండంత అండ.. అన్ని విషయాల్లో సూచనలు, సలహాలు ఇస్తుంది. మా మధ్యన ఎలాంటి దాపరికాలూ ఉండవు. ప్రతి విషయాన్ని ఇద్దరం కలిసి పంచుకుంటాం’ అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ చెప్పారు. తన భర్తకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టమని.. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. కుటుంబ బాధ్యతలు, ఆస్పత్రి నిర్వహణ తాను చూసుకుంటున్నానని ఆనంద్ భార్య సబిత చెప్పారు. వారి జీవన విశేషాలను శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు.
సాక్షి, వికారాబాద్: మా సొంత గ్రామం ధారూరు మండలం కేరెళ్లి. మాది చిన్న కుటుంబం. ఇద్దరు అక్కలు, నేను. నా విద్యభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కొసాగింది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు కేరెళ్లిలోని సీయుపీఎస్‌లో, ఆ తరువాత 8 నుంచి పదవ తరగతి వరకు ధారూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కొనసాగింది. ఇంటర్ వికారాబాద్ ఎస్‌ఏపీ కళాశాలలో బైపీసీలో చేరి చదివాను. ఆ తరువాత మా గురువు డాక్టర్ టి.వీరయ్య ప్రోద్బలంతో ఎంసెట్‌లో మొదటి సారి ర్యాంకు సాధించి గాంధీ మెడికల్ కళాశాలలో చేరి 1999లో డాక్టర్ పట్టా అందుకున్నా. మా ఇంట్లో నా కంటే ముందు చదువుకున్నావారు లేరు.
నేను మాత్రమే డాక్టర్ అయ్యాను. ఎండీ, ఎంఎస్ కాకతీయ మెడికల్ కళాశాలలో 2003లో పూర్తి చేశాను. ఎండీ, ఎంఎస్ చేసిన డాక్టర్లు అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా నాకు తెలిసి పది మంది లోపే ఉంటారు. నేను మొదటి నుంచి అన్నింట్లోనూ మొదటి స్థానాన్నే సంపాదించుకున్నా. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో నా విద్యభ్యాసం కొనసాగింది. అందరు మాది ప్రేమ వివాహం అని అనుకుంటారు. కానీ, మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్ సోదరే నా భార్య. ఆయనే ప్రోద్బలంతోనే 2002లో మా వివాహమైంది. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఎంతో ఇష్టం. నా జీవితంలో మరిచిపోలేనివి రెండు. అవి ఒకటి.. నేను డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నది, రెండవది నేను వికారాబాద్ ఎమ్మెల్యేగా ఎంపికైనది. ఈ రెండు అంశాలు నా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.
నాకు ఇష్టమైన ఇవీ..
నేను డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఉదయం లేవగానే యోగ చేస్తాను. బుక్స్ చదవడం, సినిమాలు చూడటం, వారంలో ఒక రోజు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్లిరావడం ఇష్టం. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇష్టమైన సినిమా భరత్ అనే నేను.. నాతో పాటు మా కుటుంబానికి అందరికి నచ్చింది. నాకు దేశంలో నచ్చిన ప్రాంతం కేరళలోని మునార్. ఆ ప్రాంతం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నాకు చేపలు, పెరుగు, జొన్నరొట్టె చాలా ఇష్టం. మా ఆవిడ తానే స్వయంగా చికెన్ బిర్యాని చేస్తుంది. చాలా బాగా వండుతుంది.
డాక్టర్ వృత్తికి దూరమయ్యాను
రాజకీయాల్లోకి వచ్చిన తరువాత డాక్టర్ వృత్తికి దూరమయ్యాను. ప్రజల మధ్య ఉండి సేవలు అందించాల్సి వస్తోంది. కుటుంబానికి ప్రస్తుతం సమయం కేటాయించడానికి వీలులేకుండా పోతోంది. వారానికి ఒక రోజు కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించాలి. నా భార్యే ఆస్పత్రి బాధ్యతలతో పాటు ఇంటిని చక్కబెట్టడం స్వయంగా చూసుకుంటుంది. నాకు మద్యం, సిగరెట్ అలవాటు లేదు. కనీసం కాఫీ, టీ కూడా తాగను. చిన్నప్పటి నుంచీ అలవాటు లేదు. నాకు ఒక కూతురు వినుత్నా ఆనంద్, ఒక కుమారుడు వైభవ్ ఆనంద్. వారు 9, 8వ తరగతి హైదరాబాద్‌లో చదువుతున్నారు. మా భార్య సబితా ఆనంద్‌కు ఆగ్రాలోని తాజ్‌మహల్ అంటే ఇష్టం. రాజకీయల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి.
రాజకీయాలంటే ఆయనకు ఇష్టం – సబితా ఆనంద్
మా ఆయనకు రాజకీయాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల్లో మమేకం కావడం నాకు ఎంతో తృప్తినిస్తుంది. కుటుంబం, ఆస్పత్రి వ్యవహారాలన్నీ నేను చూసుకుంటున్నా. ఆయనకు సంతృప్తి ఇచ్చే పనుల్లో చేదోడువాదోడుగా ఉండడమే నాకు తృప్తి.
Comments
Please login to add a commentAdd a comment