చేదోడు లేని ఆ నలభై ఏడు! | The past is a bitter memory for the Congress party | Sakshi
Sakshi News home page

చేదోడు లేని ఆ నలభై ఏడు!

Published Thu, Oct 26 2023 2:42 AM | Last Updated on Thu, Oct 26 2023 2:44 AM

The past is a bitter memory for the Congress party - Sakshi

తెలంగాణలో అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌ పార్టీకి గత చరిత్ర మాత్రం చేదు జ్ఞాపకంగానే ఉంది.  47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రమేనని గత ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా స్థానాల్లో కొన్నిచోట్ల గత పది ఎన్నికల్లో ఆ పార్టీ ఒకట్రెండు సార్లు మాత్రమే గెలవగలిగింది.

1967 తర్వాత నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారిక అభ్యర్థులు ఇప్పటివరకు విజయం సాధించలేదు. పునర్విభజన తర్వాత ఏర్పాటైన బెల్లంపల్లి, మంచిర్యాల, నిజామాబాద్‌ అర్బన్, నిజామాబాద్‌ రూరల్, కోరుట్ల, ధర్మపురి, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, దేవరకద్ర, పాలకుర్తి, వరంగల్‌ వెస్ట్, వైరాలోనూ ఇప్పటివరకు కాంగ్రెస్‌ పాగా వేయలేదు. 

మెక్‌ నియోజకవర్గంలోనూ 1989 తర్వాత 
కాంగ్రెస్‌ గెలవలేదు.  సిరిసిల్లలో 2009 నుంచి అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కెవిజయం సాధిస్తూనే ఉన్నారు. దుబ్బాకలో 2009లో చెరుకు ముత్యంరెడ్డి గెలిచారు. అంబర్‌పేటలో 1989లో వి. హనుమంతరావు గెలిచిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి అక్కడ విజయం దక్కలేదు. మహబూబ్‌నగర్‌లో 1989లో పులివీరన్న గెలిచిన తర్వాత జరిగిన ఏడు ఎన్నికల్లో­నూ కాంగ్రెస్‌ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. భువ­నగిరిలో 1983 ఎన్నికల్లో కాం­గ్రెస్‌ నుంచి  కె.నర్సింహారెడ్డి మాత్రమే గెలిచారు. నర్సంపేటలో మొత్తం 14 సార్లు ఎన్నికలు జరిగితే 1957లో కె.కనకరత్నమ్మ, 1967లో కె.సుదర్శన్‌రెడ్డి మాత్రమే గెలిచారు.   

గతంలో కాంగ్రెస్‌ వ్యతిరేక పవనాలు ఎక్కువగా వీచిన నియోజకవర్గాలివే.. 
2004 తర్వాత సిర్పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీకి గెలుపు దక్కలేదు. 1978 తర్వాత గెలిచింది 2004లోనే. అప్పుడు కోనేరు కోనప్ప విజయం సాధించగా, గత 10 సార్లు జరిగిన ఎన్నికల్లో ఒకసారి మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది.  
 చెన్నూరులో కూడా 1978 తర్వాత గెలిచింది 2004లోనే. ఇక్కడ మాత్రం ఓడిపోయిన ప్రతిసారీ రెండోస్థానంలో నిలిచింది. 2004లో జి.వినోద్‌ గెలిచారు. 
 2009లో బెల్లంపల్లి అసెంబ్లీ స్థానం ఏర్పాటయిన తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ గెలవలేదు. 
 మంచిర్యాలలోనూ కాంగ్రెస్‌ ఇప్పటివరకు గెలవలేదు. నాలుగుసార్లు (ఒక ఉప ఎన్నికతో సహా) ఓడిపోయిన కాంగ్రెస్‌ మూడుసార్లు రెండో స్థానంలో నిలిచింది.  
 ఖానాపూర్‌లో 1989లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కె.భీంరావు గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ గెలవలేదు. 
 1983 నుంచి ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో పదిసార్లు ఎన్నికలు జరిగితే 1989, 2004లో రెండుసార్లు సి.రామచంద్రారెడ్డి మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందారు.  
బోథ్‌ నియోజకవర్గంలో వరుసగా ఎనిమిది పర్యాయాలుగా కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోతోంది. ఇక్కడ 1983లో కాంగ్రెస్‌ పక్షాన ఎం.కాశీరాం గెలిచిన తర్వాత మరెవరూ గెలవలేదు.  
 నిర్మల్‌లో 1999, 2004లో వరుసగా రెండు సార్లు ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్‌ ఆ నియోజకవర్గంలో గెలవలేదు.  
 1989, 99 ఎన్నికల్లో రెండుసార్లు ఆర్మూరు నుంచి కాంగ్రెస్‌ గెలిచింది. 1999 తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లోనూ ఓడిపోయింది.  
ఎస్సీ రిజర్వుడు అయిన తర్వాత జుక్కల్‌ నియోజకవర్గంలో 10 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ గెలిచింది నాలుగు సార్లు మాత్రమే. ఐదు సార్లు రెండోస్థానంలో నిలిచింది. చివరగా 2004లో సౌదాగర్‌ గంగారాం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు.  
బాన్సువాడలో గత నాలుగు సార్లు ఓటమిపాలయ్యింది. 2004లో బాజిరెడ్డి గోవర్దన్‌ గెలవగా, 2009, 2011 (ఉప ఎన్నిక), 2014, 2018లో ఓడిపోయింది.  
కామారెడ్డిలో 1983 తర్వాత కాంగ్రెస్‌ గెలిచింది రెండుసార్లు మాత్రమే. 1989, 2004లో షబ్బీర్‌అలీ ఇక్కడి నుంచి గెలిచారు. 
నిజామాబాద్‌ అర్బన్‌గా మారిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడి నుంచి గెలుపొందలేదు. 2009లో నియోజకవర్గం పేరు మారగా, అంతకుముందు 2004, 1999లో కాంగ్రెస్‌ తరఫున డి.శ్రీనివాస్‌ రెండుసార్లు గెలుపొందారు.  
 నిజామాబాద్‌ రూరల్‌లో కూడా ఇప్పటివరకు కాంగ్రెస్‌ గెలవలేదు. అంతకుముందు డిచ్‌పల్లిగా ఉన్నప్పుడు కూడా 2008 ఉప ఎన్నికలో, 1978లో ఆకుల లలిత, ఎ. బాల్‌రెడ్డిలు మాత్రమే ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయం సాధించారు.  
కోరుట్లలోనూ ఇప్పటివరకు కాంగ్రెస్‌ విజ యాన్ని అందుకోలేకపోయింది. బుగ్గారం (2009కి ముందు)గా ఉన్నప్పుడు మాత్రం రెండుసార్లు రత్నాకర్‌రావు, ఒకసారి కె.గంగారం, మరోమారు రాజారాం, ఇంకోసారి మోహన్‌రెడ్డిలు కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచారు.  
పెద్దపల్లిలో 1989 తర్వాత కాంగ్రెస్‌ గెలుపొందలేదు. 1989లో గీట్ల ముకుందరెడ్డి గెలిచిన తర్వాత వరుసగా ఆరుసార్లు ఆ పార్టీ ఓటమి పాలు కావడం గమనార్హం.
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 1978 తర్వాత కాంగ్రెస్‌ పార్టీ గెలవలేదు. అప్పుడు దుగ్గిరాల వెంకట్రావు విజయం సాధించారు. 
 సిద్దిపేటలో కాంగ్రెస్‌ చివరగా గెలిచింది 1983లోనే. అంతకుముందు వరుసగా మూడుసార్లు గెలిచిన కాంగ్రెస్, ఆ తర్వాత జరిగిన 12 ఎన్నికల్లో వరుసగా ఓడిపోవడం గమనార్హం. 
దేవరకద్రలో ఇంతవరకు కాంగ్రెస్‌ బోణీ కొట్టలేదు. నాగర్‌కర్నూల్‌లో 1989లో వంగా మోహన్‌గౌడ్‌ గెలుపొందారు. ఆ తర్వాత ఆ పార్టీ ఓటమి పాలవుతూనే ఉంది. 1983 తర్వాత  ఇబ్రహీంపట్నంలోనూ కాంగ్రెస్‌ పార్టీ వరుసగా ఓటమి పాలవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement