హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపు ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకని ఒక సీటులో మాత్రమే పోటి చేసిన సీపీఐ విజయాన్ని అందుకుంది. దాంతో కాంగ్రెస్ 65 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ రోజు(ఆదివారం) జరిగిన ఎన్నికల కౌంటింగ్‌లో ఆది నుంచి ఆధిక్యం కనబరిచిన కాంగ్రెస్.. అదే ఊపును కడవరకూ కొనసాగించింది. ఫలితంగా తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ తొలిసారి జెండా ఎగురవేయనుంది.
మొత్తం 119 సీట్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సీపీఐలు కలిసి 65 సీట్లను గెలవగా, బీఆర్‌ఎస్ 39 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇక బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించగా, ఎంఐఎం 7 స్థానాల్లో గెలుపును అందుకుంది.
ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వం కౌంటింగ్ మొదలైనప్పట్నుంచీ చూస్తే వెనుకబడే ఉంది. ఎక్కడ కూడా లీడ్‌లోకి రాలేదు. కాంగ్రెస్ ఆది నుంచి 50 స్థానాల్లో ఆధిక్యం దక్కకుండా ముందుకు దూసుకుపోయింది. అదే సమయంలో బీఆర్‌ఎస్ వెనుకంజలో పయనించింది. కాగా, బీఆర్‌ఎస్ ఓటమిలో బీజేపీ పాత్ర ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ ఎన్నికలు పోరు ప్రారంభమైన నాటి నుంచి బీఆర్‌ఎస్-బీజేపీలు మిత్రులు అంటూ కాంగ్రెస్ ప్రచారం సాగించింది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీఆర్‌ఎస్‌కు ఎన్నికల తర్వాత మద్దతు ఇస్తుందనే ప్రచారం కూడా కాంగ్రెస్ చేసింది. వీరిద్దరూ మిత్రపక్షాలేనని, బీఆర్‌ఎస్ ‘ఏ’ టీమ్ అయితే బీజేపీ ‘బీ’ అంటూ ప్రచారం సాగించింది కాంగ్రెస్ పార్టీ.
తెలంగాణలో బీజేపీ సుమారు 14 శాతం ఓట్ల షేర్‌ను సాధించినట్లే కనబడుతోంది. అదే సమయంలో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోవడంతో తెలంగాణలో బీజేపీ తన ఉనికిని కాపాడుకుంది. ఇక బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అభ్యర్థుల్లు ఎవరూ గెలవలేదు. చాలా చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment