సాక్షి, పటాన్‌చెరు: తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా వలసలు మొదలయ్యాయి.
తాజాగా బీఆర్‌ఎస్ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో వీరు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాను. ఇన్ని రోజులు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పటాన్‌చెరు ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి నన్ను గెలిపించారు. కచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి పార్టీ కండువా కప్పుకున్నాను. గత పది ఏళ్లు నాకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలాఉండగా.. తెలంగాణలో ఇప్పటికే బీఆర్‌ఎస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. గూడెం మహిపాల్ రెడ్డితో ఈ సంఖ్య పదికి చేరుకుంది. ఇక, రానున్న రోజుల్లో మరికొంత మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment