ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి
తూప్రాన్ (మెదక్)/గజ్వేల్: కాంగ్రెస్ పార్టీ అమలు కాని ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి...నేడు తికమకపడుతోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర మెదక్ జిల్లా తూప్రాన్‌కు చేరుకోగా కిషన్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకటేనని, రెండూ కుటుంబపార్టీలేనని విమర్శించారు.
బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తూ ఎన్నికల్లో బీజేపీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 17 సీట్లు గెలుస్తుందని, హైదరాబాద్‌లో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. కార్యక్రమంలో దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
రూ.12 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన కాంగ్రెస్
దేశంలో రూ.12 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడ్డ కాంగ్రెస్‌కు వచ్చే ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్పయాత్ర ఆదివారం రాత్రి గజ్వేల్‌కు చేరుకుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లకే పరిమితం కావడం వల్ల మూడు నెలల పాటు విదేశీయాత్రకు వెళ్లిన రాహుల్‌గాంధీకి ఈ సారి ఏకంగా ఏడాది పాటు విదేశాల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటకలోనూ బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటుందని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment