అమరావతి: తెలుగు ప్రాంతం సాంకేతికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా 2014 జూన్ 2న విడిపోయాక రెండు చోట్ల శాసనసభ ఎన్నికలు ఆరు నెలల తేడాతో నిర్వహించడం ఐదేళ్ల క్రితం మొదలైంది. తెలంగాణ అసెంబ్లీకి రెండో ఎన్నికలు దాని పదవీ కాలం ముగియడానికి ఆరు నెలలు ముందు 2018 డిసెంబర్ 7న జరిగాయి. పాలకపక్షమైన తెలంగాణ రాష్ట్ర సమితి బలం మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో 63 నుంచి 88 స్థానాలకు పెరిగింది. ఓట్ల శాతాన్ని కూడా ఈ ఎన్నికల్లో 46.9 శాతానికి పెంచుకోగలిగింది. ఆరు నెలల తర్వాత 17వ లోక్ సభ ఎలక్షన్లతోపాటు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు వినూత్న, చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. 2019 ఏప్రిల్–మే మాసాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఏపీలో నాటి పాలకపక్షాన్ని తొలగించి, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మునుపెన్నడూ కనీవినీ ఎరగని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారు.
మొత్తం 175 సీట్లకు గాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీకి 151 సీట్లలో విజయాన్ని అందించారు. పాలక టీడీపీకి కేవలం 23 సీట్లే ఇచ్చి అసెంబ్లీలో, రాష్ట్రంలో మూలన కూర్చోబెట్టారు. ఐదేళ్ల అడ్డగోలు పరిపాలనకు తెలుగుదేశం చెల్లించిన మూల్యం ఇది. నూతన రాజధాని అమరావతి పేరుతో, ఇంకా ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ వంటి పేర్లుతో చేసిన కుంభకోణాలపై ఆంధ్రా ప్రజలు ఇలా స్పందించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పన్నెండేళ్ల ఉద్యమాల ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి తన నాలుగున్నరేళ్ల పాలన తర్వాత జరిపించిన 2018 డిసెంబర్ ఎన్నికల్లో తన బలాన్ని 25 సీట్లు పెంచుకుని మరో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంది.
2022 అక్టోబర్ లో భారత రాష్ట్రసమితిగా (బీఆరెస్) మారిన టీఆరెస్ ఇప్పుడు మూడోసారి తనకు పరిపాలించే అవకాశం ఇవ్వాలని జనం ముందకు పోతోంది. తొమ్మిదిన్నరేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, మరో జాతీయపక్షం బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో పాలక ప్రాంతీయపక్షంతో పోటీపడుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని పార్టీకి మూడోసారి పరిపాలించే అవకాశం ఇవ్వాలా? అనేది తెలంగాణ ఓటర్ల ముందున్న ప్రశ్న.
ఈసారి అంతకుమించి..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రగతితోపాటు ప్రజా సంక్షేమంపై అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ దృష్టి పెట్టింది. వృద్ధాప్య పెన్షన్లను దశలవారీగా పెంచుతూ పోయే ఫైలుపైనే కొత్త సీఎం జగన్ 2019 మే 30న లక్షలాది మంది ప్రజానీకం ముందు సంతకం చేశారు. ‘నవరత్నాలు’ పేరుతో ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చే పనిని కృతనిశ్చయంతో మొదలుబెట్టింది రాష్ట్ర సర్కారు. పేద, దిగువ మధ్య తరగతి ప్రజల అభ్యున్నతికి రూపొందించిన అనేక నగదు బదిలీ పథకాలను గత నాలుగున్నర సంవత్సరాలుగా పకడ్బందీగా అమలు చేస్తోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.
మతం, కులం, పార్టీ భేదం లేకుండా ఆంధ్రా ప్రజలంతా రాష్ట్ర సర్కారు పనితీరుపై పూర్తి సంతృప్తితో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం తన అనుకూల మీడియా సాయంతో పాలకపక్షంపై దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని 2019 వేసవి నుంచీ నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ చివర్లో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ అవినీతి కుంభకోణంలో తెలుగుదేశం అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పటి నుంచీ ఓ పక్క కోర్టుల్లో న్యాయవిచారణ ప్రక్రియ కొనసాగుతోంది. మరో పక్క టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబసభ్యులు అబద్ధాలు, అర్థసత్యాలతో చంద్రబాబు అరెస్టు ‘అన్యాయమంటూ’ గావుకేకలు పెడుతూ రోడ్లెక్కుతున్నారు.
టీడీపీ ఐదేళ్ల పాలనలో ఎంత అవినీతి జరిగిందో స్వయంగా చూసిన తెలుగు ప్రజానీకం మాత్రం అవినీతి ఆరోపణలపై జరిగిన మాజీ సీఎం అరెస్టుపై హేతుబద్ధంగానే స్పందిస్తున్నారు. సొంత రాష్ట్రం ఏపీలో జనం నుంచి తమ నాయకుడి అరెస్టుపై ‘సానుభూతి వర్షం’ కురవకపోవడంతో టీడీపీ కొత్త వ్యూహానికి తెర తీసింది. హైదరాబాద్ నగరంలోని ఐటీ ఉద్యోగులు, ఆంధ్రా మూలాలున్న కొన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలు చేయడానికి ఈ పార్టీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
ఆరు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా–జనాదరణ కరవైన టీడీపీ ఇప్పుడు నిరాశా నిస్పృహలతో చేస్తున్న విన్యాసాలను ఆంధ్రాప్రజలు గమనిస్తున్నారు. 2024 ఏప్రిల్–మేలో జరిగే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధిచెబుతారు. వైఎస్సార్సీపీ మెజారిటీని 160 సీట్లు దాటించి ఇంకా ఎందాకా తీసుకెళతారనేదే ప్రస్తుతం రాజకీయ, ఎన్నికల విశ్లేషకుల చర్చనీయాంశం.
-విజయసాయి రెడ్డి, రాజ్యసభ ఎంపీ
ఇదీ చదవండి: వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ఉత్తమ పథకం
Comments
Please login to add a commentAdd a comment