నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ అందరి నోట్లో ఇదే పేరు
దుగ్గొండి మండలం బిక్కాజిపేటకు ప్రముఖుల రాక
ప్రియాంకగాంధీ దూతగా వచ్చిన అప్పటి యూపీ ఎంపీ డాలీశర్మ
మీకు అండగా ఉంటామంటూ మా నేత పంపారని సందేశం
ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు భావోద్వేగ ట్వీట్
న్యాయం చేయాలంటూ ప్రవళిక తల్లిదండ్రుల వేడుకోలు
కూలీ పనులకు వెళ్తూ జీవనం వెళ్లదీస్తూ కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
సాక్షి, వరంగల్/దుగ్గొండి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మర్రి ప్రవళిక ఆత్మహత్య రాష్ట్రాన్నే కాదు దేశంలోనే సంచలనంగా మారింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి , బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ల నోటి వెంట రాజకీయ ఎన్నికల ప్రచారంలో ఆమె పేరు మార్మోగింది. అదే సమయంలో ప్రవళిక కుటుంబాన్ని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అదుకోవాలని, ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
అదే సమయంలో రాబోయే తమ ప్రభుత్వం ద్వారా ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని బాహాటంగానే ప్రకటించాయి. అలా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపేటకు చెందిన ప్రవళిక పేరును వాడుకొని ఆయా పార్టీలు మద్దతు కూడగట్టుకున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండి ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవాలన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీసం ఇప్పుడు ఆ కుటుంబంవైపు చూడకపోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగిన ప్రవళిక తండ్రి విసిగివేసారి కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వరంగల్‌కు రానున్న సందర్భంలో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే..
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక పోటీ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటున్న క్రమంలో పోటీ పరీక్షల పేపర్‌లు లీక్ కావడంతో విరక్తి చెందిన ఆమె 2023 అక్టోబర్ 13న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక మృతితో అక్కడే వివిధ కోచింగ్ సెంటర్లలోని నిరుద్యోగ యువతీ యువకులు నిరసనకు దిగారు. అప్రమత్తమైన అప్పటి ప్రభుత్వం ప్రవళిక మృతదేహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామం బిక్కాజిపల్లి గ్రామానికి తీసుకువచ్చి వందలాది మంది పోలీసుల పహారా మధ్య అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియల సందర్భంలో వేలాది మంది విద్యార్థ్ధులు వచ్చి ఆందోళన చేపట్టినా పోలీసులు వారిని తోసివేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం వచ్చి ఆందోళన నిర్వహించారు.
ప్రియాంక గాంధీ దూత వచ్చినా..
అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 45 రోజుల గడువు ఉండగా ప్రవళిక మృతిని అప్పటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు అనుకూలంగా మలచుకున్నాయి. ప్రవళిక మృతిని దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకుల మద్దతు కూడగట్టాయి. అప్పటి అధికార పక్షం, నేటి ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సైతం ప్రవళిక మృతిని పెద్దది చేయకుండా ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడి ప్రవళిక సోదరుడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ఆ పార్టీ నాయకులు చేతులు ఎత్తివేశారు. ప్రవళిక మృతి సమయంలో ప్రియాంకగాంధీ దూతగా ఉత్తర్‌ప్రదేశ్ ఎంపీ డాలీశర్మ స్వయంగా అక్టోబర్ 15న బిక్కాజిపల్లికి వచ్చి ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడారు.
అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘ప్రియాంకగాంధీ నీకు తోడుగా ఉంటానని చెప్పమని నన్ను పంపింది’అని డాలీశర్మ ప్రవళిక తల్లి విజయకు చెప్పారు. ఇదే సమయంలో పీసీసీ అధికార ప్రతినిధి, నేటి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌రియాజ్ స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ప్రవళిక తల్లిదండ్రులు లింగయ్య, విజయలతో మాట్లాడించారు. ‘పోయిన బిడ్డను తెచ్చి ఇవ్వలేం.. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి’అని ధైర్యం చెప్పారు. నేడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏడు నెలలు దాటింది. ప్రవళిక కుటుంబం, ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా అంటూ విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
నాటి, నేటి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దూతలుగా వచ్చి మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్‌లు నేడు ప్రవళిక కుటుంబ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది. ఇప్పటికై నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు స్పందించి ప్రవళిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.
కూలీ పనులకు వెళ్తున్నా..
నా బిడ్డ చనిపోయి ఎనిమిది నెలలు దాటుతుంది. బిడ్డ చనిపోయినప్పుడు వేలాది మంది రోజు వచ్చిండ్లు. ఆదుకుంటామని ధైర్యం చెప్పిండ్లు. మీటింగ్‌లల్ల నాబిడ్డ పేరు చెప్పని నాయకుడు లేడు. ఎన్నికలు అయిపోయినయి. నన్ను ఎవళ్లూ పట్టిచ్చుకుంటలేరు. చానామంది నాయకుల దగ్గరికి తిరిగిన. కాళ్లు ఏళ్లు మొక్కినా కనికరం లేదు. అప్పడు ఇప్పుడు అంటున్నరు. బిడ్డ పోయినందుకు కొడుక్కు ఉద్యోగం ఇస్తం అన్నరు. ఇప్పుడు ఎవళూ ఏమీ చెబుతలేరు. రెక్కాడితిగాని డొక్కాడదు. అందుకు రోజు కూలీ పనులకు పోతున్న. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సారు నా కొడిక్కి ఉద్యోగం, నాకు ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలే.
– మర్రి లింగయ్య, ప్రవళిక తండ్రి
నిందమోపిండ్లు.. రుజువు చేయలే..
నాబిడ్డ చదువులో చాలా తెలివిగలది. ఏనాటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తా అన్నది. ఉద్యోగం వచ్చినంకనే పెళ్లి అన్నది. పరీక్షల పేపర్‌లు లీక్ కాంగనే రంది పడ్డది. మళ్ల ఎప్పుడు పెడుతరో.. నౌకరి వస్తదో రాదో అని మదన పడేది. గుండె ధైర్యం చెడి ఆత్మహత్య చేసుకున్నది. చావుకు ప్రేమ కథ అల్లిండ్లు. నింద మోపిండ్లు. ఇప్పటికీ రుజువు చేయలే. కడుపు కాలుతుంది. క్షణంక్షణం బిడ్డ యాదికోస్తుంది. ఇప్పుడు మా ఇంటి వంక ఎవ్వలూ చూడటం లేదు. నా బిడ్డ పేరు చెప్పుకుని ఓట్లు సంపాదించుకున్నరు. గద్దెలు ఎక్కిండ్లు. నా బిడ్డ ఇప్పుడు ఎవ్వరికి గుర్తుకు లేదు.
– మర్రి విజయ, ప్రవళిక తల్లి
Comments
Please login to add a commentAdd a comment