ఇండియా డయాస్పోరా ఆర్గనైజేషన్స్ మీట్‌లో మాట్లాడుతున్న సీఎం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్‌ను బొక్కబోర్లాపడేసి బొక్కలిరగ్గొట్టినా బుద్ధి రాలేదని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ను ఆనవాళ్లు లేకుండా 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో మీరో, మేమో చూసుకుందామని సవాల్ చేశారు. పులి బయటికి వస్తోందంటూ బీఆర్‌ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని.. దాని కోసమే ఎదురుచూ స్తున్నానని, తమ దగ్గర బోను, వల ఉందని వ్యాఖ్యానించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి శుక్రవారం లండన్‌లో నిర్వహించిన ‘ఇండియా డయాస్పోరా ఆర్గనైజేషన్స్ మీట్’కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..
‘‘దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీ యాలు మాట్లాడొద్దని, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలనుకుని బయలుదేరాను. కానీ ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చ లు.. తండ్రీకొడుకులు, అల్లుడు కలసి ప్రజలెన్ను కున్న ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూశాక.. లండన్ గడ్డమీద రాజకీయ అంశాలు మాట్లాడదల్చుకున్నా. మంచి పనులకు ఎవరు పునాదిరాయి వేసినా.. వాటిని కొనసాగించడానికి నాకు గానీ, మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. కానీ కొందరు తమ కుటుంబం కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టి, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. పైగా ఈ రోజు అవినీతి గురించి చర్చే జరగొద్దన్నట్టు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించవద్దన్నట్టు మాట్లాడుతున్నారు.
ప్రపంచంతో పోటీ పడతాం..
మేం సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళుతుంటే కొందరు ఓర్వలేకపో తున్నారు. నేను సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టి 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నా. ఇది ఆషామాషీగా రాలేదు. అయ్యనో, తాతనో ఇస్తే రాలేదు. నేను అయ్య పేరు చెప్పుకుని మంత్రి అయ్యి, విదేశీ పర్యటనల పేరు మీద విలాస జీవితం గడపడానికి రాలేదు. రాష్ట్ర అభివృద్ధిని మనసులో పెట్టుకుని వచ్చా. పక్క రాష్ట్రాలతో పోటీపడాలన్న ఆలోచన కాదు నాది.
ఈ ప్రపంచంతోనే పోటీపడే ఆలోచన. ప్రపంచంతో పోటీపడే యువత, హైదరాబాద్ నగరం, ఐటీ మేధావులు, జీనోమ్ వ్యాలీ, అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్, ఐటీ, ఫార్మా కంపెనీలు నా దగ్గరున్నాయి. ప్రపంచంతో పోటీపడతానే తప్ప దివాలా తీసిన దద్దమ్మలతో నాకేం పోటీ? వారికి అధికారం పోయినా అహంకారం, బలుపు తగ్గినట్టు లేదు. మేం బ్రిటన్‌కు వచ్చి ఇంతమంది కుటుంబ సభ్యులను కలిశాం. ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ రావాలి. అక్కడి పర్యాటక ప్రాంతాలను ఆస్వాదించాలి. ఫొటోలు దిగాలి. థేమ్స్ నది స్ఫూర్తితో మూసీని అభివృద్ధి చేస్తాం..’’ అని రేవంత్ చెప్పారు. తెలంగాణ శక్తి, వారసత్వ సంపదకు మీరే ప్రచారకులని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని లండన్‌లోని ఎన్నారైలను కోరారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళతానని చెప్పారు.
పార్లమెంటు ఎన్నికల్లో చూసుకుందాం
60 ఏళ్లలో 16 మంది సీఎంలు రూ.72 వేల కోట్లు అప్పులు చేస్తే.. గత పదేళ్లలో ఒకే ఒక్క కుటుంబం రూ.ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఆ దరిద్రాన్ని మన నెత్తిమీద పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసే దిశలో పనిచేస్తామని చెప్పాం. కానీ అసెంబ్లీ మొదలుపెట్టిన రోజునే.. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని బిల్లా, రంగాలు అడిగారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని, నాయకులను బొక్కబోర్లా పడేసి బొక్కలిరగ్గొట్టినా బుద్ధి రాలేదు. ఇంకా మాట్లాడుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చూసుకుందాం. బిల్లారంగా, చార్లెస్ శోభారాజ్‌లకు సూటిగా సవాల్ విసురుతున్నా. రెండు రోజుల్లో తెలంగాణ గడ్డమీద కాలుపెడతా. ఈ నెల 26వ తేదీ తర్వాత ఇంద్రవెల్లిలో మొదలుపెట్టి తెలంగాణ నలుమూలలా సుడిగాలి పర్యటన చేస్తా. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీ నిషాన్ (ఆనవాళ్లు) లేకుండా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతా.
Comments
Please login to add a commentAdd a comment