సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణంగా, గాంధీ మార్గంలో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని.. ఆ ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో పరిపాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉందని మహాత్మా గాంధీ పదే పదే చెప్పేవారని.. ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ౖగ్రామాల నుంచి పట్టణాలు, నగరాల దాకా.. వ్యవసాయం మొదలుకొని, పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధి దాకా.. గిరిజనులు, దళితులు, మైనారిటీల నుంచి అగ్రవర్ణ పేదలదాకా అందరికీ, అన్ని అంశాలకు సమప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అందుకే ఈ రోజు తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు.
గత ఏడాది ఆగస్టు 8న ప్రారంభించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ముగింపునిచ్చింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేది. టీఆర్‌ఎస్‌ను స్థాపించినపుడు అహింసాయుతంగా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని నేను స్పష్టంగా ప్రకటించాను. ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాను.ఆ నేపథ్యంలోంచి వచ్చినదే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన.
స్వాతంత్య్ర పోరాట కాలంలో బ్రిటిష్ పాలనే బాగుందన్న ప్రబుద్ధుల్లాంటి కొందరు తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఉన్నారు. వారంతా తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చిత్రమేమిటంటే.. అలా అన్న వాళ్లే ఈరోజు మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటైన ఈ పదేళ్లలోనే అద్భుత పురోగతి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశానికే దిక్సూచి అనే స్థాయికి ఎదిగింది.
స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణంగా..
స్వాతంత్య్ర సమర యోధుల ఆశయాల వెలుగులోనే అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలకు వేదికగా నిలుస్తున్నది. ౖగాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది.ఈ అభివృద్ధి నమూనాను ఇదేవిధంగా కొనసాగిస్తూ, సకల జనులకూ ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్య్రోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతాం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నిజం చేద్దాం. జాతి నిర్మాణంలో తెలంగాణను అనునిత్యం అగ్రభాగంలో నిలుపుదాం..’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
సమర యోధుల ఆశయాలనుచాటేలా..: సీఎస్ శాంతికుమారి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్త యిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు వజ్రోత్సవాలను నిర్వహించిందని సీఎస్ శాంతికుమారి చెప్పారు. సమరయోధుల ఆశయాలను ప్రస్తుత తరానికి చాటì చెప్పేలా విభిన్న కార్యక్రమాలు నిర్వహించామని.. రాష్ట్రవ్యాప్తంగా సినిమా ధియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించామని, దాదాపు 30 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు ప్రధాన లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచాయని అమె అన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాఘవాచారి బ్రదర్స్ నిర్వహించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ గానంతో సంగీత విభావరి ప్రారంభమైంది. ‘ఇదిగో భద్రాద్రి.. అదిగో చూడండి’ ఆలాపనతోపాటు ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలూ’ అంటూ సాగిన త్యాగరాజ కీర్తన ఆకట్టుకున్నాయి.
సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘భారతీయ భావన’ నాట్య రూపకంలో.. కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, మోహినీ అట్టం, ఒడిస్సీతోపాటు ఆరు రకాల భారతీయ నృత్యరీతులతో కూడిన ఏక ప్రదర్శన అలరించింది. ఆయాచితం నటేశ్వర శర్మ రాసిన ‘తెలంగాణ అవతరణం తొలిపొద్దు నవకిరణం.. భరత మాత ఆభరణం’ అంటూ సాగిన నృత్య ప్రదర్శన రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక్కో ప్రభుత్వ కార్యక్రమాన్ని వర్ణిస్తూ సాగింది.
అనంతరం ‘సింఫనీ ఆఫ్ ఫ్రీడం’ పేరిట పలు వాయిద్యాలతో సాగిన జూగల్బందీ.. తర్వాత మంజుల రామస్వామి బృందం ప్రదర్శించిన ‘వజ్రోత్సవ హారతి’ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన సీఎం కేసీఆర్.. చాలా బాగున్నాయంటూ కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్‌పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment