Diamond Jubilee celebrations
-
సాగులో సాంకేతికత పెంచండి..
సాక్షి, హైదరాబాద్: దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవ సాయం వెన్నెముక లాంటిదని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. రైతులకు మరింత చేరువయ్యేలా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రెండు రోజులపాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను చాన్స్‌లర్ హోదాలో శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు. వజ్రోత్సవాల మీనియేచర్ పైలాన్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్యతో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ గుర్తింపు పత్రా లని అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 2047 నాటికి వ్యవసాయ రంగంలో విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గడిచిన 60 ఏళ్లుగా వర్సిటీ అసమాన సేవలందిస్తూ.. సోనామసూరి, తెలంగాణ సోనా వంటి ఎన్నో కొత్త వంగడాలను అభివృద్ధి చేసిందని కొనియాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి అధునాతన సాంకేతికతలను వ్యవసాయ రంగంలోకి విస్తృతంగా తీసుకురావాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మారేలా శాస్త్రవేత్తలు కృషి చేయాలని కోరారు. ఉద్యానవన పంటల సాగు పెరగాలి: తుమ్మల రాష్ట్రంలో వరి, పత్తి, మిరప పంటల సాగును తగ్గించి.. కూరగాయలు, ఆయిల్‌పామ్, ఇతర ఉద్యాన పంటల సాగు పెంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రైతాంగానికి సూచించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన కిసాన్ మేళాలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో వ్యవసాయ పట్టభద్రులు రావాలని ఆకాంక్షించారు. శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు పంటల సాగును సూచించాలని కోరారు. ప్రతి వ్యవసాయ కళాశాల పరిధిలో ఒక ‘మోడల్ అగ్రికల్చర్ ఫార్మ్’ను అభివృద్ధి చేయాలని సూచించారు. నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల సౌకర్యం పెరగటంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా పెరిగిందని.. అదే సమయంలో కూరగాయలు, ఉద్యాన పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో వెనుకబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు నాదెండ్ల భాస్కర్‌రావు, సమరసింహారెడ్డి, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ బాల్‌రాజ్, కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీకల్చర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డి. రాజిరెడ్డి, పద్మశ్రీ పురస్కార గ్రహీతలు చింతల వెంకటరెడ్డి, వై. వెంకటేశ్వర్రావు, విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతులు రఘువర్ధన్ రెడ్డి, రాఘవరెడ్డి, పద్మరాజు, వెటర్నరీ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. -
రాజ్యాంగ వజ్రోత్సవాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ చరిత్రాత్మక సందర్భానికి మంగళవారంతో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. దాంతో మంగళవారం నుంచి ఏడాది పొడవునా రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగ ప్రాశస్త్యానికి ప్రచారం కల్పించడం, దానిపట్ల పౌరుల్లో అవగాహనను మరింతగా పెంచడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు రూపొందించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనం వంటివి జరగనున్నాయి. రాజ్యాంగ నిర్మాతల కృషిని పార్లమెంటు మరోసారి నెమరువేసుకోనుంది. వారికి ఘనంగా నివాళులు అర్పించనుంది. ఇందుకోసం ఉభయ సభలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలిసారి భేటీ అయిన పార్లమెంటు పాత భవనంలోని చారిత్రక సెంట్రల్ హాలే ఇందుకు వేదిక కానుండటం విశేషం. ఇందుకోసం సెంట్రల్ హాల్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తమ భావాలను పంచుకుంటారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉభయ సభల ఎంపీలంతా పాల్గొంటారు. రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను పురస్కరించుకుని కాన్స్టిట్యూషన్75డాట్‌కామ్ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా కేంద్రం రూపొందించింది. ఆ చరిత్రాత్మక దినాన... 1946 డిసెంబర్ 9న పార్లమెంటు పాత భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ పరిషత్ తొలి భేటీ జరిగిన క్షణాలను లోక్‌సభ భావోద్వేగపూరితంగా స్మరించుకుంది. ‘‘చెప్పదగ్గ స్వాతంత్య్ర సమరానికి సారథ్యం వహించిన మహామహులైన నేతలు ఆ రోజున ఇదే హాల్లో అర్ధచంద్రాకృతిలో వరుసలు తీరి ఆసీనులయ్యారు. ముందు వరుసలో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఆచార్య జేబీ కృపాలనీ, అబుల్ కలాం ఆజాద్ తదితరులు కూర్చున్నారు. బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు’’ అంటూ లోక్‌సభ వెబ్సైట్ నాటి స్మృతులను మరోసారి గుర్తు చేసుకుంది.మోదీ ప్రసంగించరు: రిజిజు ఉభయ సభల సంయుక్త భేటీలో ప్రధాని మోదీ ప్రసంగించబోరని రిజిజు స్పష్టం చేశారు. ఈ భేటీలో ఉభయ సభల విపక్ష నేతలకు కూడా ప్రసంగించే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు తెలిపారు. ‘‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్ మాత్రమే మాట్లాడతారు. విపక్ష నేతలిద్దరికీ వేదికపై స్థానముంటుంది. ఇదో చరిత్రాత్మక సందర్భం. దీన్ని వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేయొద్దు’’ అని విపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
సుప్రీం ప్రమాణాలతో సుదృఢ ప్రస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం తన సుదీర్ఘ ప్రస్థానంలో ఉన్నత ప్రమాణాలను నెలకొలి్పందంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తద్వారా దేశ ప్రజాస్వామ్య యాత్రను మరింతగా బలోపేతం చేసిందన్నారు. సుప్రీంకోర్టులో తొలి విచారణ జరిగి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన వజ్రోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయసూత్రాల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతోందని కితాబిచ్చారు. వ్యక్తిగత హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి కీలకాంశాలపై సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పులు ఇతర దేశాలకు కూడా కరదీపికలని అభిప్రాయపడ్డారు. దేశ సామాజిక, రాజకీయ ప్రస్థానాన్ని అవి మేలిమలుపు తిప్పాయన్నారు. వికసిత భారత్ లక్ష్య సాధనకు సాధికార న్యాయవ్యవస్థ అత్యంత కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘శరవేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా చట్టాలను కూడా హౠ ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. ఈ నూతన చట్టాలు భవిష్యత్ భారతాన్ని మరింతగా బలోపేతం చేస్తాయి. సులభ, సత్వర న్యాయం దేశ పౌరులందరి హక్కు. అందుకే ఈ–కోర్టు మిషన్ ప్రాజెక్టు–3కి నిధులు పెంచాం. కోర్టుల్లో మౌలిక సదుపాయాల పెంపుకు నిబద్ధతతో పని చేస్తున్నాం’’ అని చెప్పారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ఇతోధికంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యంతోనే తాజాగా జన్ విశ్వాస్ బిల్లును తీసుకొచి్చనట్టు చెప్పారు. మున్ముందు న్యాయవ్యవస్థపై అనవసర భారాన్ని అది తగ్గిస్తుందని వివరించారు. అలాగే వివాదాలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపేందుకు ఉద్దేశించిన మధ్యవర్తిత్వ చట్టం కూడా కోర్టు పనిభారాన్ని బాగా తగ్గించగలదని ఆశాభావం వెలిబుచ్చారు. వాయిదా సంస్కృతికి తెర పడాలి: సీజేఐ కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు, కాలం చెల్లిన విధానాలు, కేసుల వాయిదా సంస్కృతి వంటి సమస్యలు న్యాయ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తున్నాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఆవేదన వెలిబుచ్చారు. వీటిని నిర్మాణాత్మక రీతిలో పరిష్కరించడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అందుకే వీటిపై అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. సమర్థంగా సకాలం న్యాయం అందించాలంటే కోర్టుల్లో వాయిదా సంస్కృతి నుంచి వృత్తిపరమైన సంస్కృతికి మారాలని ఉద్బోధించారు. కేసుల పరిష్కారంలో అంతులేని జాప్యానికి కారణమవుతున్న సుదీర్ఘ వాదనలకు చెక్ పెట్టాల్సి ఉందన్నారు. ‘‘న్యాయ వృత్తి ఒకప్పుడు ఉన్నత వర్గాల పురుషులకే పరిమితమైందిగా ఉండేది. కానీ పరిస్థితులు మారుతున్నాయి. జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం 36 శాతానికి పెరగడం స్వాగతించదగ్గ పరిణామం. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో ఎంపికైన వారిలో 50 శాతానికి పైగా మహిళలే కావడం హర్షణీయం. న్యాయ వృత్తిలోకి కొత్తవారిని ప్రోత్సహించడంలో లింగ భేదం, నేపథ్యాలతో నిమిత్తం లేకుండా సమానావకాశాలు కలి్పంచాలి. అలాగే జడ్జిల్లోనూ, లాయర్లలోనూ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ప్రాతినిధ్యం ఎంతగానో పెరగాల్సి ఉంది’’ అన్నారు. ‘‘కోర్టులకు సుదీర్ఘ సెలవులపైనా చర్చ జరగాల్సి ఉంది. ఇందుకోసం న్యాయవాదులు, న్యాయమూర్తులకు ‘ఫ్లెక్సీ టైం’ వంటి ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలనూ ఆలోచించాలి. కోర్టుల లోపల, వెలుపల రాజ్యాంగ నిర్దేశిత నిబద్ధతతో నడుచుకుంటున్నామా, లేదా అని అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. సర్వోన్నత న్యాయస్థాన వజ్రోత్సవ వేడుకలు ఇందుకు సరైన సందర్భం’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. ఈ–కోర్టుల పురోగతిని వివరించారు. దేశ న్యాయ వ్యవస్థను సమర్థంగా, పర్యావరణహితంగా సాంకేతికతతో కూడిందిగా మార్చడానికి కృషి చేస్తున్నట్టు వివరించారు. ప్రజల కోర్టు: సీజేఐ సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం లాంఛనంగా ఏర్పాటైన ధర్మాసనానికి సీజేఐ జస్డిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యం వహించారు. 75 ఏళ్ల క్రితం 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టు తొలి విచారణ జరిగిన తీరు, అప్పుడు పాటించిన స్వతంత్ర విలువలు నేటికీ అనుసరణీయమేనన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులకు విధి నిర్వహణలో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి గీటురాళ్లని అభిప్రాయపడ్డారు. వారు సామాజిక, రాజకీయ ఒత్తిళ్లకు మానవ సహజమైన మొగ్గుదలలకు అతీతంగా తీర్పులు వెలువరించాలని పేర్కొన్నారు. ఈ దిశగా జడ్జిల సామర్థ్యాలను మరింతగా పెంచే ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని గుర్తు చేశారు. ‘‘సుప్రీంకోర్టు తొలి విచారణ పార్లమెంటులోని ప్రిన్సెస్ చాంబర్లో సాదాసీదాగా జరిగింది. నాటినుంచి సుదీర్ఘ ప్రస్థానంలో కోర్టు పనితీరు నానాటికీ మెరుగవుతూనే వస్తోంది. ప్రజల కోర్టుగా రూపుదిద్దుకుంటోంది. ప్రజల నుంచి ఏటా ఏకంగా లక్షకు పైగా అందుతున్న లెటర్ పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానంపై వారి విశ్వాసానికి అద్దం పడుతున్నాయి’’ అన్నారు. -
లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ వజ్రోత్సవం
న్యూఢిల్లీ: లుఫ్తాన్సా జర్మన్ ఎయిర్‌లైన్స్ ఢిల్లీకి ఎయిర్‌లైన్స్ సేవలు ప్రారంభించి 60 ఏళ్లు పూర్తయింది. ఈ వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ ఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. లుఫ్తాన్సా గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్ నేవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీకి ఏ380 ఫస్ట్‌క్లాస్ సరీ్వసును తిరిగి అందిస్తున్నట్టు ప్రకటించారు. 1963 సెపె్టంబర్ 1న బోయింగ్ 720 సరీ్వస్‌ను ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి ఈ సంస్థ ప్రారంభించడం గమనార్హం. భారత వృద్ధి పథాన్ని ముందే నమ్మిన వారిలో తామూ కూడా ఒకరమంటూ, మరో 60 ఏళ్లపాటు భారత్‌తో బలమైన అనుబంధానికి కట్టుబడి ఉన్నామని లుఫ్తాన్సా గ్రూప్ పేర్కొంది. -
గాంధీ మార్గంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణంగా, గాంధీ మార్గంలో తెలంగాణ ఉద్యమం కొనసాగిందని.. ఆ ఆశయాలకు అనుగుణంగానే తెలంగాణలో పరిపాలన కొనసాగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉందని మహాత్మా గాంధీ పదే పదే చెప్పేవారని.. ఆ మాటల ప్రేరణతోనే గ్రామీణ జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు. ౖగ్రామాల నుంచి పట్టణాలు, నగరాల దాకా.. వ్యవసాయం మొదలుకొని, పరిశ్రమలు, ఐటీ రంగాల అభివృద్ధి దాకా.. గిరిజనులు, దళితులు, మైనారిటీల నుంచి అగ్రవర్ణ పేదలదాకా అందరికీ, అన్ని అంశాలకు సమప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అందుకే ఈ రోజు తెలంగాణ మోడల్ దేశానికే దిక్సూచిగా నిలిచిందన్నారు. గత ఏడాది ఆగస్టు 8న ప్రారంభించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ముగింపునిచ్చింది. హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్ర పోలీసుల నుంచి గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేది. టీఆర్ఎస్ను స్థాపించినపుడు అహింసాయుతంగా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని నేను స్పష్టంగా ప్రకటించాను. ప్రాణాన్ని పణంగా పెట్టి అయినా సరే లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాను.ఆ నేపథ్యంలోంచి వచ్చినదే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన. స్వాతంత్య్ర పోరాట కాలంలో బ్రిటిష్ పాలనే బాగుందన్న ప్రబుద్ధుల్లాంటి కొందరు తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఉన్నారు. వారంతా తెలంగాణ వద్దు.. సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చిత్రమేమిటంటే.. అలా అన్న వాళ్లే ఈరోజు మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారు. తెలంగాణ ఏర్పాటైన ఈ పదేళ్లలోనే అద్భుత పురోగతి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశానికే దిక్సూచి అనే స్థాయికి ఎదిగింది. స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణంగా.. స్వాతంత్య్ర సమర యోధుల ఆశయాల వెలుగులోనే అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలకు వేదికగా నిలుస్తున్నది. ౖగాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది.ఈ అభివృద్ధి నమూనాను ఇదేవిధంగా కొనసాగిస్తూ, సకల జనులకూ ప్రగతి ఫలాలను సమానంగా పంచడం ద్వారానే స్వాతంత్య్రోద్యమ ఆశయాలను పరిపూర్తి చేసుకోగలుగుతాం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలను నిజం చేద్దాం. జాతి నిర్మాణంలో తెలంగాణను అనునిత్యం అగ్రభాగంలో నిలుపుదాం..’’ అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సమర యోధుల ఆశయాలనుచాటేలా..: సీఎస్ శాంతికుమారి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్త యిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు వజ్రోత్సవాలను నిర్వహించిందని సీఎస్ శాంతికుమారి చెప్పారు. సమరయోధుల ఆశయాలను ప్రస్తుత తరానికి చాటì చెప్పేలా విభిన్న కార్యక్రమాలు నిర్వహించామని.. రాష్ట్రవ్యాప్తంగా సినిమా ధియేటర్లలో గాంధీ చిత్రాన్ని ప్రదర్శించామని, దాదాపు 30 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ చిత్రాన్ని వీక్షించారని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అనే రెండు ప్రధాన లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలిచాయని అమె అన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాఘవాచారి బ్రదర్స్ నిర్వహించిన ‘రఘుపతి రాఘవ రాజారాం’ గానంతో సంగీత విభావరి ప్రారంభమైంది. ‘ఇదిగో భద్రాద్రి.. అదిగో చూడండి’ ఆలాపనతోపాటు ‘ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలూ’ అంటూ సాగిన త్యాగరాజ కీర్తన ఆకట్టుకున్నాయి. సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ‘భారతీయ భావన’ నాట్య రూపకంలో.. కూచిపూడి, భరత నాట్యం, పేరిణి, మోహినీ అట్టం, ఒడిస్సీతోపాటు ఆరు రకాల భారతీయ నృత్యరీతులతో కూడిన ఏక ప్రదర్శన అలరించింది. ఆయాచితం నటేశ్వర శర్మ రాసిన ‘తెలంగాణ అవతరణం తొలిపొద్దు నవకిరణం.. భరత మాత ఆభరణం’ అంటూ సాగిన నృత్య ప్రదర్శన రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఒక్కో ప్రభుత్వ కార్యక్రమాన్ని వర్ణిస్తూ సాగింది. అనంతరం ‘సింఫనీ ఆఫ్ ఫ్రీడం’ పేరిట పలు వాయిద్యాలతో సాగిన జూగల్బందీ.. తర్వాత మంజుల రామస్వామి బృందం ప్రదర్శించిన ‘వజ్రోత్సవ హారతి’ నృత్య ప్రదర్శన వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన సీఎం కేసీఆర్.. చాలా బాగున్నాయంటూ కళాకారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
సాగుకు ‘సహకారం’
సాక్షి అమరావతి: సహకార రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ఆప్కాబ్‌ను నిలబెట్టిన ఘనత దివంగత వైఎస్సార్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. వైద్యనాధన్ సిఫార్సులను ఆమోదించి సహకార పరపతి వ్యవస్థ బలోపేతం కోసం రూ.1,850 కోట్లు ఇచ్చిన తొలి రాష్ట్రంగా ఉమ్మడి ఏపీకి వైఎస్సార్ గుర్తింపు తెచ్చారని చెప్పారు. ఆప్కాబ్ (ద ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్) ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆప్కాబ్ నూతన లోగో, ఆప్కాబ్ బ్రాండ్ ఐడెంటిటీ గైడ్‌లైన్స్ (బీఐజీ) బిగ్ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. డీసీసీబీలకు రూ.55.93 కోట్ల డివిడెండ్‌ను పంపిణీ చేశారు. అత్యుత్తమ ప్రతిభ కనపర్చిన డీసీసీబీలు, పీఏసీఎస్, బ్రాంచ్‌లు, ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ఆ ఒక్క మార్పుతో.. ఆప్కాబ్ షష్టి పూర్తి సందర్భంగా సహకార రంగ చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. రైతులకు అండగా నిలుస్తూ బ్యాంకింగ్ సేవలతో ఆప్కాబ్ 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిన పరిస్థితి చూస్తే చాలా గొప్పగా ఉంది. బ్యాంకును ఈ స్థాయికి తెచ్చేందుకు కృషి చేసిన యాజమాన్యానికి, బ్యాంకు కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు. మన దేశంలో రైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే పెరుగుతాడు.. అప్పుల్లోనే చనిపోతారని ఒకప్పుడు నానుడి ఉండేది. దీనికి కారణం విత్తనం నుంచి పంట కోత వరకు అన్నింటికీ పెట్టుబడి అవసరం. అందుకోసం రైతన్నలు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక రైతన్నలు అవస్థలు పడుతున్న పరిస్థితుల వల్ల ఈ నానుడి వచ్చింది. అప్పుడు.. విప్లవంలా ఒక మార్పు జరిగింది. అదేమిటంటే.. ఎప్పుడైతే రైతులకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్థ అడుగులు వేసిందో అప్పుడు తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఒక్క మార్పుతో వ్యవసాయంలో రైతన్నలు నిలదొక్కుకునే పరిస్థితి వచ్చింది. ఈ మార్పును మరింత ముందుకు తీసుకెళ్తూ మన రాష్ట్రంలో ఆప్కాబ్ అనే కోపరేటివ్ బ్యాంకు వచ్చింది. ఒక చారిత్రక అవసరంతో ఏర్పడ్డ ఈ బ్యాంకు రైతన్నలను చేయి పట్టుకుని నడిపించింది. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు, ఇబ్బందికర పరిస్థితులను చవి చూసింది. సహకార చట్ట సవరణ.. ఆర్థిక చేయూత ఆప్కాబ్‌ను మెరుగైన స్థితికి చేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసే బాధ్యతను 2019 అక్టోబర్‌లో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్విస్ నాబ్కాన్స్కు అప్పగించాం. వారు ప్రతి బ్యాంకుకూ వెళ్లి ఏడాది పాటు క్షుణ్నంగా అధ్యయనం అనంతరం కొన్ని సూచనలు, సలహాలు అందించారు. వాటిని పరిగణలోకి తీసుకుంటూ సహకార సంఘాలు, రైతుల ప్రస్తుత పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా 1964 సహకార చట్టాన్ని సవరించాం. కో ఆపరేటివ్ గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరుస్తూ ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో ప్రొఫెషనల్స్ ఉండేలా చర్యలు చేపట్టాం. దీనివల్ల పారదర్శకత, సామర్థ్యం పెరుగుతుంది. ప్రొఫెషనల్స్ డైరెక్టర్లుగా బ్యాంకుల్లో బాధ్యతలు తీసుకోవడంతో రాజకీయ కార్యకలాపాలు తగ్గే పరిస్థితి వచ్చింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ డీసీసీబీ సీఈవోల ఎంపిక కోసం రాష్ట్రస్థాయిలో కామన్ ఎంపిక కమిటీని ఏర్పాటు చేశాం. దాని ద్వారా సీఈవోల ఎంపిక, నియామకం చేపట్టడం ద్వారా మరింత ప్రొఫెషనలిజం తెచ్చాం. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనాన్ని సమకూర్చుకోలేని డీసీసీబీలకు, ఆప్కాబ్‌కు గతేడాది రూ.295 కోట్లు షేర్ క్యాపిటల్ రూపంలో ఆర్థ్ధిక చేయూతనిచ్చాం. ఇవన్నీ ఆప్కాబ్‌ను బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేందుకు దోహదపడ్డాయి. పెరిగిన పరపతి.. లాభాల బాట సహకార వ్యవస్థలో పారదర్శక, సమర్థతను పెంపొందించేందుకు కంప్యూటరైజేషన్ తీసుకొచ్చాం. టీసీఎస్ సహకారంతో కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సహకార పరపతి సంఘాల వ్యవస్థ గణనీయంగా అభివృద్ధి చెందింది. 2019 నుంచి నాలుగేళ్ల వ్యవధిలో సహకార బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలు 24 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ఆప్కాబ్ లావాదేవీలు గణనీయంగా విస్తరించాయి. 2019 మార్చి 31 నాటికి రూ.53,249 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల పరపతి ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,05,089 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలో ఏకంగా రెట్టింపైన పరిస్థితి కనిపిస్తోంది. 2019లో రూ.13,700 కోట్లుగా ఉన్న ఆప్కాబ్ పరపతి 2023 మార్చి నాటికి ఏకంగా రూ.36,700 కోట్లకు పెరిగింది. అంటే మూడు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మినహా మిగతా డీసీసీబీలన్నీ లాభాల్లో నడుస్తున్నాయని చెప్పేందుకు గర్వపడుతున్నా. అంతేకాదు.. 36 ఏళ్ల తర్వాత కర్నూలు డీసీసీబీ, 28 ఏళ్ల తర్వాత వైఎస్సార్ కడప జిల్లా డీసీసీబీలు లాభాల్లోకి వచ్చిన పరిస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. గొప్పగా అడుగులు వేసిన సిబ్బంది, యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. డిజిటలైజేషన్ పూర్తి కావడం ద్వారా ఆప్కాబ్, డీసీసీబీలు మరింత బలోపేతమై ఈరోజు మనం చూస్తున్న మార్పులే కాకుండా ఇంకా మెరుగైన ఫలితాలు రానున్న రోజుల్లో కనిపిస్తాయి. ఇందుకోసం రూ.25 కోట్లు కేటాయించాం. కంప్యూటరైజేషన్ పనులు వేగంగా జరుగు తున్నాయి. రాబోయే రోజుల్లో ఆప్కాబ్ సేవలు రైతులందరికీ విస్తరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్బీకేల స్థాయిలో అన్నీ.. ఇవాళ సాగైన ప్రతి పంటను నమోదు చేసేందుకు ఆర్బీకేల స్థాయిలో ఈ – క్రాపింగ్ జరుగుతోంది. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ యాంత్రీకరణ తీసుకొచ్చాం. రైతులు గ్రూప్‌గా ఏర్పడి పది శాతం చెల్లిస్తే చాలు 40 శాతం బ్యాంకు రుణాలు, 50 శాతం సబ్సిడీగా ఇస్తూ తోడుగా నిలుస్తున్నాం. ఆర్బీకే స్థాయిలోనే అన్ని రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చాం. వీటి కోసం ఆప్కాబ్ రూ.500 కోట్లు రుణాలు మంజూరు చేసింది. ప్రభుత్వ సహకారం ప్రశంసనీయం: జేపీ ఆప్కాబ్ మాజీ ఎండీ, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ తాను ఆప్కాబ్ ఎండీగా ఉన్నప్పుడు సహకార రంగంలో సంస్కరణలు తేవాలని ప్రయతి్నంచానని, కానీ అప్పటి ప్రభుత్వాలు సహకరించలేదన్నారు. నాడు కేవలం 8 శాతానికి మించి రికవరీ చేయలేకపోయేవాళ్లమని, నేడు 80 శాతానికి పైగా రికవరీ సాధిస్తున్నారని చెప్పారు. సహకార వ్యవస్థ బలంగా ఉండాలన్న ఆకాంక్షతో ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు నిజంగా ప్రశంసనీయమని అన్నారు. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు. మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, జోగి రమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఆప్కాబ్ చైర్పర్సన్ మల్లెల ఝాన్సీ, నాఫ్స్కాబ్ ఎండీ బీమా సుబ్రహ్మణ్యం, నాబార్డు సీజీఎం ఆర్ఎం గోపాల్, సహకార మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, సహకార శాఖ రిజిస్ట్రార్ అహ్మద్‌బాబు, ఆప్కాబ్ ఎండీ ఆర్.శ్రీనాథ్‌రెడ్డి, లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ, 13 జిల్లాల డీసీసీబీ పర్సన్ ఇన్చార్జి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తొలిసారిగా డీసీసీబీలకు డివిడెండ్ ‘‘రాష్ట్రంలో సహకార విప్లవంతో బ్యాంకింగ్ వ్యవస్థ రైతన్నలకు చేరువగా అడుగులు వేసింది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో సహకార రంగం బలోపేతమై ఆధునికీకరణ సంతరించుకుంటోంది. తక్కువ వడ్డీకే రుణాలను అందిస్తూ అన్నదాతలకు చేదోడుగా నిలుస్తోంది’’ ‘‘బ్యాంక్ చరిత్రలో తొలిసారిగా డీసీసీబీలకు డివిడెండ్ ఇచ్చే కార్యక్రమం మన ప్రభుత్వ హయాంలో జరుగుతున్నందుకు గర్వంగా ఉంది. ఆప్కాబ్ ఇంకా గొప్పగా ఎదిగి రైతన్నలకు మరింత మంచి చేసే అవకాశం ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’’ – సీఎం వైఎస్ జగన్ ఆర్బీకేలతో పీఏసీఎస్‌ల అనుసంధానం.. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలతో (పీఏసీఎస్) అనుసంధానం చేయడంతో మరో గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఆ తర్వాత డీసీసీబీలతో అనుసంధానించే ప్రక్రియ జరుగుతోంది. మిగతా బ్యాంకుల సహకారంతో ఈరోజు ప్రతి ఆర్బీకేలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను అందుబాటులోకి తెచ్చాం. కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, ఆర్బీకేలతో ‘ప్యాక్స్’ అనుసంధానం.. ఇవన్నీ గ్రామ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు నిదర్శనంగా నిలుస్తాయి. తద్వారా రైతులకు ఆర్బీకేల వద్దే వ్యవసాయ ఇన్‌పుట్స్‌తో పాటు రుణ పరపతి పొందే పరిస్థితి కూడా వస్తుందని గట్టిగా చెబుతున్నా. రైతు.. గ్రామం బాగుండాలంటే రైతు, గ్రామం రెండూ బాగుండాలంటే వ్యవసాయంతో పాటు ఆర్థిక స్వావలంబనపై ఆధారపడి ఉంటుంది. మన రైతన్నలు, అక్కచెల్లెమ్మలు ఆర్థికంగా ఎదగగలిగితే గ్రామీణ వ్యవస్థ బతుకుతుంది. ఇలా అక్కచెల్లెమ్మలకు మంచి చేసే గొప్ప అడుగు ఆప్కాబ్ ద్వారా పడింది. పాడి, పంట సమృద్ధిగా పెరిగాయి. మనం అందచేస్తున్న వైఎస్సార్ చేయూత, ఆసరా, సున్నా వడ్డీ వీటన్నింటిని బ్యాంకులతో అనుసంధానించి ఆ డబ్బులను సరైన పద్ధతిలో వాడుకోవడం, అమూల్ లాంటి సంస్థ గ్రామ స్థాయిలోకి రావడం ద్వారా రైతన్నలు, అక్కచెల్లెమ్మలు మోసపోకుండా డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 12 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తున్న పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఆప్కాబ్ అన్ని రంగాల్లో విస్తరించడంతో గ్రామస్థాయిలో రుణాలు ఇప్పించగలిగే స్థితిలోకి వచ్చింది. దేశంలోనే భారీ నెట్వర్క్ ఆప్కాబ్, డీసీసీబీలు, ప్యాక్స్‌తో అనుసంధానమైన ఆర్బీకేలు.. ఇలాంటి పంపిణీ వ్యవస్థ బహుశా దేశ చరిత్రలో ఏ బ్యాంకుకూ లేని విధంగా రానున్న రోజుల్లో మన ఆప్కాబ్‌కు మాత్రమే ఉంటుంది. వీటన్నింటికి తోడు ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉన్నారు. దీనివల్ల భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రతి గ్రామంలో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు సిద్ధమవుతున్నాయి. గ్రామ స్థాయిలోకి ఫైబర్ గ్రిడ్ చేరుకుంటుంది. ఇవన్నీ గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుంది. -
Live: ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకలు
-
అప్పుడు విప్లవంలా ఒక మార్పు జరిగింది... ఆప్కాబ్ వజ్రోత్సవాల్లో సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో పర్యటించారు. నగరంలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్(ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఆప్కాబ్ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉందన్నారు. ఆప్కాబ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ కృషి చేస్తోంది. ఆప్కాబ్ రైతులకు ఇస్తున్న చేయూత ఎనలేనిది. విప్లవాత్మక మార్పులు ఆప్కాబ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఆప్కాబ్‌తోనే రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ చేరువైంది. రైతుల అభ్యున్నతికి కృషి చేసింది మహానేత వైఎస్సార్. సహకార వ్యవస్థను వైఎస్సార్ బలోపేతం చేశారు’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సహకార రంగ చరిత్రలో ప్రత్యేకమైన రోజు. రాష్ట్ర కోపరేటివ్ చరిత్రలో అంటే సహకార రంగ చరిత్రలో ఈ రోజు చాలా ప్రత్యేకమైనది. కారణం ఈ రోజు ఆప్కాబ్ షష్టిపూర్తి జరుపుకుంటుంది. రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తూ.. బ్యాంకింగ్ సేవల్లో రాష్ట్ర సహకార బ్యాంకు ఆప్కాబ్ నేటితో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి.. ఈ రోజుకు ఒక విశిష్టత ఉంది. ముఖ్యంగా కోపరేటివ్ బ్యాంకు ఈ 60 సంవత్సరాల ప్రయాణం.. ఎలా ఉంది అని వెనక్కి తిరిగి చూసుకుంటే... చాలా గొప్పగా నిలబడింది అని చెప్పుకునే స్ధాయిలో ఆప్కాబ్ ఉంది. ఈ సందర్భంగా రైతన్నలకు, బ్యాంకు సిబ్బందికి, బ్యాంకును సమర్ధవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యానికి, బ్యాంకు కార్యకలాపాలలో పాలుపంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా నా తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనందరికి తెలిసిన ఒక నానుడి కూడా చెప్పాలి. భారతరైతు అప్పుల్లోనే పుడతాడు.. అప్పుల్లోనే పెరుగుతాడు.. అప్పుల్లోనే తాను చనిపోతాడనే నానుడి ఒకప్పుడు ఉండేది. కారణం ఏమిటంటే.. విత్తనం నుంచి పంట కోత వరకూ అన్నింటిలోనూ రైతులకు పెట్టుబడి అవసరం. ఆ పెట్టుబడి అవసరం అయినప్పుడు దానికోసం రైతన్నలు అప్పు చేయాల్సి వస్తుంది. ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక అవస్ధలు పడుతున్న పరిస్థితులు వల్ల ఈ నానుడి వచ్చింది. విప్లవం లాంటి మార్పు... అప్పుడు విప్లవంలా ఒక మార్పు జరిగింది. అదేమిటంటే.. ఎప్పుడైతే రైతులకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్ధ అడుగులు వేసిందో అప్పుడే.. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఒక్క మార్పుతో వ్యవసాయంలో రైతులు నిలబడగలిగే పరిస్థితి వచ్చింది. ఈ మార్పును మరింత ముందుకు తీసుకువెళ్తూ ఈ రాష్ట్రంలో మన బ్యాంకు, రైతుల బ్యాంకు అయిన ఆప్కాబ్ అనే కోపరేటివ్ బ్యాంకు వచ్చింది. ఒక చారిత్రాతక అవసరం అయిన సందర్భంలో ఈ బ్యాంకు వచ్చింది. రైతన్నలను చేయిపట్టుకుని నడిపించింది. ఇటువంటి ఈ బ్యాంకు ఎన్నో ఒడిదుడికులును కూడా చూసింది. ఆప్కాబ్– వైఎస్సార్– మార్పులు.. గతంలో ఎన్నో ఇబ్బందకర పరిస్థితులను ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. అప్పట్లో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు.. నాన్నగారు, ప్రియతమ నేత రాజశేఖరరెడ్డి గారు కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆప్కాబ్‌ను నిలబెట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అప్పట్లో వైద్యనా«ధన్ సిఫార్సులను తాను ఆమోదించి.. సహకార పరపతి వ్యవస్ధ అంటే కోపరేటివ్ క్రెడిట్ సిస్టమ్‌ను బలోపేతం చేయడం కోసం రూ.1850 కోట్లు ఇచ్చిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఇదొక్కటే కాకుండా రైతులకు మరింత మంచి జరగాలని 9 జిల్లా కేంద్ర సహకారబ్యాంకులు(డీసీసీబీ)కు అప్పట్లో రూ.217 కోట్లు షేర్ కేపిటల్‌గా ఇన్ఫ్యూజ్ చేసి సహకార రంగాన్ని ఆదుకున్నారు. పావలా వడ్డీ – రైతు రుణాలు.. రైతులకు మరింత తోడుగా నిలుస్తూ.. 2008 ఖరీప్ నుంచి పావలా వడ్డీకి రుణాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి గారు. నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్లీ అదే ఒడిదుడుకులు ఈ సహకార రంగంలో ఎదురవడం చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈ బ్యాంకును మళ్లీ నిలబెట్టాలి.. తోడుగా నిలబడాలని మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ఆలోచనలు చేయడం మొదలుపెట్టి.. వేగంగా అడుగులు కూడా వేస్తున్నాం. మరింత మెరుగ్గా ఆప్కాబ్... మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లో నాబార్డ్ కన్సెల్టెన్సీ సర్వీసు అయిన నాబ్కాన్స్(నాబార్డు కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైయివేట్ లిమిటెడ్) అధ్యయం చేయమని.. అప్కాబ్‌ను మెరుగైన పరిస్థితుల్లోకి ఎలా తీసుకొని పొగలుగుతామో అధ్యయనం చేయమని నాబ్కాన్స్ బృందానికి బాధ్యతలు అప్పగించాం. వారు దాదాపు ఏడాది టైం తీసుకుని.. ప్రతి బ్యాంకు తిరిగి ఉన్న పరిస్థితులు అన్నీ గమనించారు. కొన్ని సూచనలు, సలహాలు అందించారు. వాటిన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్రంలో సహకార సంఘాలు, రైతుల ప్రస్తుత పరిస్థితి, అవసరాలకు అనుగుణంగా 1964 నాటి చట్టాన్ని సవరించాం. అనంతరం కోపరేటివ్ గవర్నెన్స్‌ను మరింత మెరుగుపరుస్తూ.. ఆప్కాబ్‌లో డీసీసీబీ బోర్డులలో ప్రొఫెషనల్స్ కూడా ఉండేటట్టుగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే చర్యలు తీసుకున్నాం. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. సామర్ధ్యం పెరుగుతుంది. ప్రొఫెషనల్ డైరెక్టర్లు ఎప్పుడైతే బ్యాంకుల్లో కూర్చోవడం మొదలుపెట్టారో.. అప్పుడు రాజకీయంగా వేరే అడుగులు వేసే కార్యక్రమాలు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. అదే విధంగా పారదర్శకత, సామర్ధ్యం పెంచడంలో భాగంగానే... డీసీసీబీల సీఈఓల ఎంపిక కూడా రాష్ట్రస్ధాయిలో ఒక కామన్ సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి.. దాని ద్వారా చేయడం మొదలుపెట్టాం. తద్వారా డీసీసీబీల సీఈఓలను కూడా మరింత ప్రొఫెషనల్‌గా ఎన్నుకునే కార్యక్రమం తీసుకొచ్చాం. వీటితో పాటు ఆర్బీఐ నిబంధనల ప్రకారం మూలధనాన్ని సమకూర్చుకోలేని డీసీసీబీలకు ఆప్కాబ్‌కు గత ఏడాది రూ.295 కోట్లు షేర్ కేపిటల్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇన్ప్యూజ్ చేసింది. ఆప్కాబ్ – డిజిటలైజేషన్– కంప్యూటరైజేషన్ ఇవన్నీ ఆప్కాబ్‌ను బలోపేతం చేసే దిశగా వేసిన అడుగులు. ఇదొక్కటే కాకుండా.. మొత్తం ఆప్కాబ్ వ్యవస్ధలన్నింటిలోనూ కూడా పారదర్శకతను, సామర్ధ్యాన్ని పెంచేందుకు ఈ వ్యవస్ధలన్నింటిలోనూ డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్‌ను తీసుకుని వచ్చాం. టీసీఎస్‌ను ఇన్వాల్వ్ చేసి ఈ ప్రక్రియను వేగంగా చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో డిజిటలైజేషన్లో భాగంగా ప్రతి ప్యాక్‌కు పూర్తిగా అనుసంధానం అయిన వెంటనే.. పారదర్శకత, సామర్ధ్యం అన్నవి గణనీయంగా పెరుగుతాయి. నాలుగేళ్లలో ప్రగతి... ఈ చర్యలన్నింటి వల్ల రాష్ట్రంలో వ్యవసాయ పరపతి సంఘాల వ్యవస్ధ గణనీయంగా అభివృద్ధి చెందింది. ఏ స్ధాయిలో అభివృద్ధి ఉందంటే... 2019 నుంచి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సహకార బ్యాంకుల వాణిజ్య కార్యకలాపాలు 24 శాతం పెరిగాయి. ఆప్కాబ్ లావాదేవీలు గణనీయంగా విస్తరించాయి. 2019 మార్చి 31న.. మనం అధికారంలోకి వచ్చేనాటికి రూ.53,249 కోట్లుగా ఉన్న సహకార బ్యాంకుల పరపతి ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.1,05,089 కోట్లకు చేరింది. నాలుగేళ్లలో ఏకంగా రెట్టింపు అయింది. అలాగే 2019లో రూ.13,700 కోట్లుగా ఉన్న ఆప్కాబ్ పరపతి నాలుగేళ్లలో 2023 నాటికి ఏకంగా రూ.36,700 కోట్లకు పెరిగింది. దాదాపు మూడురెట్లు పెరిగింది. లాభాల బాటలో డీసీసీబీలు... గత ఆర్ధిక సంవత్సరంలో ఒక్క ఏలూరు మినహా అన్ని డీసీసీబీలు లాభాల్లో నడుస్తున్నాయి. నిజంగా ఎంత బాగా నడుస్తున్నాయి అంటే 36 ఏళ్లు తర్వాత లాభాలు గడించిన కర్నూలు డీసీసీబీని ఇవాల మనం చూస్తున్నాం. 28 సంవత్సరాల తర్వాత లాభాలు పొందిన కడప డీసీసీబిని కూడా చూస్తున్నాం. ఈ సందర్భంగా ఇంత గొప్ప అడుగులు వేయగలిగినందుకు, వేయించినందుకు సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మెరుగైన ఫలితాలు... ఇంతకముందు నేను చెప్పినట్టుగా.. ఎప్పుడైతే డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్ పూర్తవుతుందో, ఆప్కాబ్, డీసీసీబీల బలోపేతం ప్యాక్స్(పీఏసీఎస్) వరకు తీసుకుని రావడం ఎప్పుడు పూర్తవుతుందో... అప్పుడు ఇవాళ మనం చూస్తున్న మార్పు కన్నా మెరుగైన ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో చూస్తాం. దీనికోసం ప్రత్యేకంగా రూ.25 కోట్లు నిధులు కేటాయించాం. వాటితో పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇదొక్కటే కాకుండా ప్యాక్స్‌ను ఆర్బీకేలకు అనుసంధానం చేసే గొప్ప మార్పు కూడా జరిగింది. రైతును ప్రతి అడుగులోనూ గ్రామస్ధాయిలో చేయిపట్టుకుని నడిపిస్తున్న వ్యవస్ధ.. రైతు భరోసా కేంద్రాలు. ఈ ఆర్బీకేలను ప్యాక్స్‌కు అనుసంధానం చేశాం. ఆ తర్వాత ఈ వ్యవస్ధను డీసీసీబీకి అనుసంధానం చేశాం. డీసీసీబీ నుంచి ఆప్కాబ్‌కు అనుసంధానం చేసే గొప్ప ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు మిగిలిన బ్యాంకుల సహాయసహకారాలతో ప్రతి ఆర్బీకేలోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు కూడా అందుబాటులో ఉన్నారు. డిజిటలైజేషన్, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, ఆర్బీకేలతో అనుసంధానం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు గ్రామస్ధాయిలోనే జరుగుతాయి అని చెప్పడానికి నిదర్శనంగా నిలబడతాయి. రైతులకు ఆర్బీకే వద్దే క్రెడిట్- అగ్రీ ఇన్పుట్స్.. రైతులకు ఆర్బేకేల వద్దనే క్రెడిట్‌తో సహా వ్యవసాయ ఇన్పుట్స్ పొందే వీలు కూడా రాబోయే రోజుల్లో మన కళ్లెదుటనే కనిపించే పరిస్థితి వస్తుంది. బ్యాంకింగ్ కరస్పాండెంట్లు అక్కడే ఉన్నారు, ప్రతి ఆర్బీకే స్ధాయిలోనూ ఇ–క్రాపింగ్ జరుగుతుంది. మొత్తం డిజిటలైజేషన్, కంప్యూటరైజేషన్ జరుగుతుంది. ఇన్ని కనిపిస్తున్నప్పుడు సహజంగానే ఆర్బీకే స్ధాయిలోనే క్రెడిట్ ఇవ్వడం అన్నది రాబోయే రోజుల్లో మనం చూడబోయే గొప్ప మార్పు అవుతుంది. ఈ రోజు రైతులందరికీ కూడా ఆప్కాబ్ సేవలు విస్తరిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా ఆప్కాబ్, డీసీసీబీలు ఏ స్ధాయిలో ఇన్వాల్వ్ అయ్యాయంటే... ఆర్బీకే స్ధాయిలోనే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అంటే ఫామ్‌మెకనైజేషన్‌ను తీసుకొచ్చాం. రైతులు గ్రూపుగా ఏర్పడి 10 శాతం కడితే.. 40శాతం బ్యాంకు రుణాలు, 50 శాతం ప్రభుత్వ నుంచి సబ్సిడీ వస్తుంది. పెద్ద పెద్ద వ్యవసాయ ఉపకరణాలు ఆర్బీకే స్ధాయిలోనే అందుబాటులోకి వచ్చాయి. దీనికోసం ఏకంగా ఆప్కాబ్ దగ్గర నుంచి రూ.500 కోట్ల రుణాలు మంజూరు కూడా జరిగింది. రైతు- గ్రామం రెండూ బాగుండాలని... గ్రామీణ వ్యవస్ధలో రైతు, గ్రామం రెండూ బాగుండాలంటే.. గ్రామస్ధాయిలో వ్యవసాయంతోపాటు పాడి, పంట వారి ఆర్ధిక స్వావలంబన కూడా ముడిపడి ఉన్నాయి. గ్రామీణ వ్యవస్ధలో అక్కచెల్లెమ్మలు, రైతులు వీళ్లంతా ఆర్ధికంగా ఎదగగలిగితే గ్రామీణ వ్యవస్ధ బ్రతుకుతుంది. అటువంటి అక్కచెల్లెమ్మలకు కూడా మంచి చేసే గొప్ప అడుగు కూడా ఆప్కాబ్ ద్వారా పడింది. దానివల్ల పాడి, పంట విపరీతంగా పెరిగాయి. ఇవాల మనం ఇస్తున్న చేయూత, ఆసరా, సున్నావడ్డీ వీటన్నింటినీ బ్యాంకులతో అనుసంధానం చేసి, ఆ డబ్బులను సరైన పద్ధతితో వాడుకోగలిగితే... అమూల్ లాంటి సంస్ధ గ్రామస్ధాయిలోకి రావడం ఎప్పుడు మొదలుపెడుతుందో.. అప్పుడు ఏ రైతన్న, అక్కచెల్లెమ్మ మోసపోకుండా మంచి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. గ్రామ స్ధాయిలో వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు గతంలో 12శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీకి రుణాలిస్తున్న పరిస్థితిలుండేవి. ఆప్కాబ్ వీటన్నింటిలో ముందడుగు వేస్తూ.. అన్ని రంగాల్లో విస్తరించి, గ్రామస్ధాయిలో రుణాలు ఇప్పించగలిగే స్ధాయిలోకి ఏర్పడింది. రాబోయే రోజుల్లో ఆప్కాబ్, డీసీసీబీలు, ప్యాక్స్‌తో అనుసంధానం అయిన ఆర్బీకేలు.. ఈ పంపిణీ వ్యవస్ధ బహుశా దేశ చరిత్రలో ఏ ఒక్క బ్యాంకుకూ లేని విధంగా.. మన ఆప్కాబ్‌కు ఉంటుంది. ఆప్కాబ్– భారీ నెట్వర్క్.... ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే, ప్యాక్స్‌కు అనుసంధానం, కంప్యూటరైజేషన్, డిజిటలైజేషన్, అక్కడ నుంచి డీసీసీబీ, అక్కడ నుంచి ఆప్కాబ్‌కు అనుసంధానం ఈ రకమైన భారీ నెట్వర్క్ ఏ బ్యాంకుకూ లేదు. వీటన్నింటికి తోడు ఆర్బీకేల్లోనే బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఉన్నారు. దీనివల్ల రాబోయే రోజుల్లో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రతి గ్రామంలోనూ డిజిటల్ లైబ్రరీలు తయారవుతున్నాయి. గ్రామస్ధాయిలోకి ఫైబర్ గ్రిడ్ చేరుకుంటుంది. ఇవన్నీ రాబోయే రోజుల్లో మార్పులకు శ్రీకారం చుట్టినట్టవుతుంది. ఆప్కాబ్ ఇంకా గొప్పగా ఎదగాలని, దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడివ్వాలని ఆకాంక్షిస్తూ..సెలవు తీసుకుంటున్నాను అని సీఎం ప్రసంగం ముగించారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Viveka Case: ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ విశ్లేషణాత్మక కథనం–2 -
ఆప్కాబ్‌కు 60 ఏళ్లు
సాక్షి, అమరావతి: సహకార బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) 60 ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డీసీసీబీ, పీఏసీఎస్‌ల ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి కోసం ఆప్కాబ్ కృషి చేస్తోంది. పీఏసీఎస్‌లు స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్థిక చేయూత అందిస్తోంది. ఈ నెల 4వ తేదీన జరగనున్న వజ్రోత్సవ వేడుకలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. రూ.లక్ష కోట్ల వ్యాపారం 1963 ఆగస్టు 4న ఏర్పడిన ఆప్కాబ్ 1966లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి షెడ్యూల్డ్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. దీని పరిధిలో 18 శాఖలు ఉండగా.. ఆప్కాబ్ పర్యవేక్షణలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)ల పరిధిలో 425 బ్రాంచ్‌లు, 1,995 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఆప్కాబ్ ఆధునిక సాంకేతికతను సంతరించుకుంది. డీసీసీబీలు, పీఏసీఎస్‌లను కూడా కోర్ బ్యాంకింగ్ నెట్వర్క్ పరిధిలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. 2018–19 నాటికి రూ.13,322 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ఉన్న ఆప్కాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో ఏకంగా రూ.36,732 కోట్ల వ్యాపార మైలురాయిని అధిగమించింది. రూ.251 కోట్ల లాభాలను ఆర్జించింది. సహకార వ్యవస్థ ద్వారా దేశంలోనే తొలిసారి రూ.లక్ష కోట్ల వ్యాపారంతో గ్రామీణ సహకార వ్యవస్థలో స్వర్ణయుగానికి నాంది పలికింది. నాలుగేళ్లలో వరుసగా రెండు సార్లు నాఫ్స్కాబ్ ద్వారా జాతీయ స్థాయిలో నంబర్–1 సహకార బ్యాంక్‌గా గుర్తింపు పొందింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఇండియాలోనే బెస్ట్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌గా ఆప్కాబ్ బీఎఫ్ఎస్ఐ ద్వారా అవార్డు అందుకుంది. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా బ్యాంక్ నూతన లోగో, పోస్టల్ స్టాంప్‌తో పాటు విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనుంది. రైతు సేవలో 60 ఏళ్లు ఆప్కాబ్ రైతుల సేవలో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బ్యాంక్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులకు అభినందనలు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సహకార రంగం సీఏం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలతో బలోపేతమైంది. రికార్డుస్థాయి వ్యాపారంతో నష్టాల నుంచి గట్టెక్కి లాభాలను ఆర్జిస్తోంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
ఎంతటివారినైనా ఎదుర్కోండి
న్యూఢిల్లీ: అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనాసరే కర్తవ్య దీక్షలో ముందడుగువేసి పోరాడాలని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ కర్తవ్యబోధ చేశారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన సీబీఐ వజ్రోత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ‘ కేంద్రప్రభుత్వ స్థాయిలో అవినీతిని ఎదుర్కొనేందుకు రాజకీయ సంకల్పానికి కొదువే లేదు. ప్రభుత్వం నుంచి పూర్తి సహాయస హకారాలు అందుతాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అవినీతిపై పోరాడండి. అవినీతిపరులు ఎంతటి శక్తివంతులైనాసరే తగ్గేదేలేదు’ అంటూ సీబీఐ అధికారులను ఆదేశించారు. ‘ ప్రజాస్వామ్యం, న్యాయాలకు అవినీతే అతిపెద్ద అవరోధం. అవినీతి నుంచి దేశాన్ని విముక్తి చేయాల్సిన బాధ్యత సీబీఐ పైనే ఉంది. అవినీతిపరులను వదలొద్దని ప్రజలు కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా అవినీతితో లబ్ధిపొందిన నేతలు నేడు ఏకంగా సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలపైనే విమర్శలు చేసే పరిస్థితులు సృష్టించారు. పక్కదోవ పట్టించే వీళ్లను పట్టించుకోకుండా విధి నిర్వహణపై దృష్టిపెట్టండి. మన ప్రయత్నంలో అలసత్వం, నిర్లక్ష్యం వద్దు. ఇదే దేశం, దేశ ప్రజలు కోరుకునేది. దేశం, చట్టం, రాజ్యాంగం మీ వెన్నంటే ఉన్నాయి’ అని అధికారులకు భరోసా ఇచ్చారు. ఫోన్‌కాల్‌తో వేలకోట్ల రుణాలు ఇప్పించుకున్నారు ‘స్వాతంత్య్రం వచ్చేనాటికే దేశంలో అవినీతి తిష్టవేసి ఉంది. దీన్ని తొలగించాల్సిన ఆనాటి నేతలు కొందరు దీనిని మరింత పెంచడం దారుణం. ఎవరెంతగా అవినీతి చేయగలరనే పోటీ నడుస్తోందిప్పుడు. దీంతో దేశంలో పలు వ్యవస్థలు ధ్వంసమై ప్రభుత్వ విధానాలు నిర్వీర్యమై అభివృద్ధి ఆగిపోతోంది. దేశ ఐక్యత, స్నేహభావం, ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే అవినీతిని పెకిలించాలి. ఇప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి పారదర్శకమైన విధానాలొచ్చాయిగానీ గతంలో కొందరు ‘శక్తివంతమైన’ నేతలు కేవలం ఫోన్‌కాల్ ద్వారా తమ వారికి వేలకోట్ల రుణాలు దక్కేలా చేశారు. అలా ఆయాచిత లబ్ధిపొందాక దేశం వదిలి పారిపోయారు. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం ద్వారా మేం రూ.20,000 కోట్ల ఆస్తులను జప్తుచేశాం. ఇలాంటి అవినీతిపరులు మరింత తెగించి ప్రభుత్వం ద్వారా నిజమైన లబ్ధిదారులకు దక్కాల్సిన రేషన్, ఇళ్లు, స్కాలర్షిప్, పెన్షన్లనూ లూటీ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే వాస్తవ లబ్ధిదారునికి చేరుతోందని స్వయంగా గత ప్రధానమంత్రే సెలవిచ్చారు’ అని మోదీ గుర్తుచేశారు. అందరి నోటా సీబీఐ ‘‘ఏదైనా కేసు సంక్షిష్టంగా, సమస్యాత్మకంగా ఉందంటే పరిష్కారం కోసం ప్రజల నోట వినిపించే ఒకే ఒక పేరు సీబీఐ. 60 ఏళ్లుగా న్యాయం, సత్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా సీబీఐ నిలుస్తోంది. పంచాయతీ స్థాయిలో జరుగుతున్న ముఖ్య నేరాలనూ సీబీఐకి అప్పజెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో అవినీతి చిన్నదిగా కనిపించొచ్చు. కానీ అది పేదల హక్కులను లాగేసుకుంటుంది. కొత్తగా ఎన్నో నేరాలకు అంటుకడుతుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీస్ మెడల్స్‌ను, చక్కని దర్యాప్తు చేసిన సీబీఐ అధికారులకు బంగారు పతకాలను ప్రధాని ప్రదానం చేశారు. స్మారక తపాలా బిళ్ల, నాణేలను ఆవిష్కరించారు. -
2014 తర్వాతే సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది: ప్రధాని మోదీ
ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా(CBI) తాజాగా అరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో.. డైమండ్ జూబ్లీ వేడుకలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. సీబీఐ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడంతో పాటు షిల్లాంగ్, పూణే, నాగ్‌పూర్‌లలో కొత్తగా ఏర్పాటు చేసిన సీబీఐ కాంప్లెక్స్‌లను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్‌తో పాటు ఉత్తమ దర్యాప్తు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు. అలాగే.. డైమండ్ జూబ్లీ ఉత్సవాల స్మారకార్ధం పోస్టల్ స్టాంపు, నాణెం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే సీబీఐ కొత్త ట్విటర్ హ్యాండిల్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘సీబీఐ పరిధి పెరిగింది. చాలా నగరాల్లో సీబీఐ ఆఫీసులు నెలకొల్పుతున్నాం. అవినీతి సాధారణ నేరం కాదు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు. అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు. 2014లో మేము అవినీతిపై యుద్ధం ప్రారంభించాము. 2014 తర్వాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది. అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర. ఇప్పుడు అవినీతిపరులు భయపడుతున్నారు. గత ప్రభుత్వాలు అవినీతిని వ్యవస్థీకృతం చేశాయి. ఒక కుంభకోణానికి మించి మరో కుంభకోణం చేశాయి. 2జీ స్కామ్ అతిపెద్ద కుంభకోణం. ఆర్థిక నేరగాళ్లు వేలకోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారు. బీజేపీ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తోంది’ అని స్పష్టం చేశారు. ఇక, నాటి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీర్మానం మేరకు.. 1963, ఏప్రిల్ 1వ తేదీన సీబీఐ ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ పర్యవేక్షణలో.. సీబీఐ పని చేస్తుంది. దేశంలో ఇప్పటిదాకా ఎన్నో హైప్రొఫైల్‌తో పాటు సంక్లిష్టమైన కేసుల్ని పరిష్కరించిన కేంద్రం అత్యున్నత దర్యాప్తు సంస్థగా సీబీఐకంటూ ఓ పేరు ఉండిపోయింది. #WATCH | 10 years ago, there was a competition to do more and more corruption. Big scams took place during that time but the accused were not scared because the system stood by them… After 2014, we worked on a mission mode against corruption, black money: PM Narendra Modi pic.twitter.com/LOqxd6mCbz — ANI (@ANI) April 3, 2023 ఇదీ చదవండి: ఆలయంలోకి బుల్డోజర్లు.. అక్రమ కట్టడం కూల్చివేత -
భావి విద్యకు బాటలు
రాజ్‌కోట్: స్వతంత్ర భారతంలో తొలిసారిగా దేశ భావి అవసరాలను సంపూర్ణంగా తీర్చేలా సమగ్ర విద్యా విధానం అమలుకు చిత్తశుద్ధితో కృషి జరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్ పాలనలో కనుమరుగైన మన ఉజ్జ్వల పురాతన గురుకుల విద్యా విధానం తదితరాల సుగుణాలను పునరుద్ధరించేందుకు స్వాతంత్రం రాగానే పాలకులు నడుం బిగించాల్సింది. కానీ బానిస మనస్తత్వంలో నిండా కూరుకుపోయిన గత ప్రభుత్వాలు ఈ దిశగా ఏ ప్రయత్నమూ చేయలేదు పైగా చాలా అంశాల్లో తిరోగమన ధోరణితో దేశాన్ని వెనక్కు తీసుకెళ్లాయి’’ అంటూ కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘ఇలాంటి తరుణంలో మన బాలలకు మళ్లీ గురుకుల తరహా నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధ్యాత్మిక గురువులు పూనుకున్నారు. శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ ఇందుకు ఉదాహరణ’’ అన్నార. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న సంస్థ 75వ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి ప్రధాని శనివారం వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. సనాతన భారతదేశం అన్ని విషయాల్లోనూ విశ్వ గురువుగా భాసిల్లిందన్నారు. ‘‘మిగతా ప్రపంచం అంధకారంలో మునిగి ఉన్న సమయంలో మన దేశం విద్యా దీపాలను సముఉజ్జ్వలంగా వెలిగించింది. నలంద, తక్షశిల వంటి మన విశ్వవిద్యాలయాలు ప్రపంచమంతటికీ నిస్వార్థంగా, వివక్షారహితంగా విద్యా దానం చేశాయి. ఆత్మ తత్వం నుంచి పరమాత్వ తత్వం దాకా, ఆయుర్వేదం నుంచి సామాజిక శాస్త్రం, గణిత, లోహ అంతరక్ష శాస్త్రాల దాకా, సున్నా నుంచి అనంతం దాకా అన్ని శాస్త్రాలూ మన దేశంలో ఉచ్ఛ స్థాయిలో విలసిల్లిన కాలమది. వాటన్నింటినీ ప్రస్తుత తరాలకు అందించేందుకు స్వామి నారాయణ్ వంటి విద్యా సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్నాయి’’ అని ప్రశంసించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఐఐటీలు, ఐఐఎంలు, వైద్య కళాశాలల వంటి అత్యున్నత నాణ్యతతో కూడిన విద్యా సంస్థల సంఖ్య 65 శాతానికి పైగా పెరిగిందని చెప్పారు. ‘‘దేశ భవిష్యత్తు గొప్పగా ఉండాలంటే విద్యా విధానం, విద్యా సంస్థల పాత్ర చాలా కీలకం. కాబట్టే ఈ దిశగా అన్ని స్థాయిల్లోనూ శరవేగంగా మెరుగైన మార్పులు తెచ్చేందుకు మేం నడుం బిగించాం’’ అన్నారు. -
ఘనంగా శ్రీ వెంకటేశ్వర కాలేజీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలు
-
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు..ప్రారంభించిన సీఎం కేసీఆర్ (ఫొటోలు)
-
ప్రపంచంలోని ఎంతోమంది గొప్ప నేతలకు గాంధీ స్ఫూర్తి: సీఎం కేసీఆర్
-
జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందాం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అనేక మంది త్యాగాలు, పోరాటాలతో దేశానికి స్వాతంత్రం వచ్చిందని.. అలాంటి గడ్డపై జాతిని చీల్చే కుట్రను అడ్డుకుందామని దేశానికి, రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ పిలుపు ఇచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమాలను సోమవారం నగరంలోని హెచ్ఐసీసీలో ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. అనేక త్యాగాలు, పోరాటాలతో మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. భారత స్వాతంత్ర సముపార్జన సారథి, ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత, విశ్వమానవుడు మహాత్మాగాంధీ. ప్రపంచంలోని ఎంతో మందికి స్పూర్తి ఆయన. అలాంటి మహోన్నతుడిని కించపరిచే ఘటనలు జరగడం దురదృష్టకరం. గాంధీని కించపరిచే ఘటనలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. విశ్వమానవుడిపై కొందరు విద్వేషం రగలిస్తున్నారు. కానీ, మహాత్ముడు ఎప్పటికైనా మహాత్ముడే. ఆ చిల్లర శక్తుల ప్రయత్నాలు ఫలించవు. పేదరికం ఉన్నంతవరకు ఆక్రందనలు, అలజడులు దేశంలో కొనసాగుతూనే ఉంటాయి. పేదరికం నిర్మూలిస్తేనే దేశానికి శాంతి, సౌబ్రాతృత్వం లభిస్తుంది. దేశంలో అలజడులను సృష్టించిన బ్లాక్ షిప్‌లను తరిమి కొట్టే ఘనత భారత దేశానికి ఉంది. ఈ గడ్డపై జాతిని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాంటి వెకిలి, మకిలి చర్యలను ఖండించాలి. ఆ చిల్లర మల్లర ప్రయత్నాలు, కుట్రలను ఖండించాల్సిన అవసరం ఉందని పిలుపు ఇచ్చారు సీఎం కేసీఆర్. కూర్పు వెనుక ఎంత కష్టం ఉంటుందో.. దాని విలువ తెలియనివాళ్లే చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, దేశానికి సంఘటితంగా ఉంచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల కోసం తెలంగాణ ఎప్పుడూ ముందు ఉంటుంది. ప్రజాప్రతినిధులంతా స్వాతంత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపు ఇచ్చారు సీఎం కేసీఆర్. మహనీయుల కష్టం, త్యాగాలతో దేశం ఈ తీరుకు వచ్చింది. కాబట్టే, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నామని, ఎంతో మంది కష్టపడ్డారని, అలాగే అవసరమైతే తెలంగాణ నుంచి జాతీయ స్థాయిలో వెళ్లి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు నీతి ఆయోగ్ ప్రాధాన్యత తెలియదు -
స్వాతంత్య్ర దినం.. అమృత మహోత్సవం
అహ్మదాబాద్: 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమంలో శుక్రవారం ప్రారంభించారు. జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన చరిత్రాత్మక దండియాత్రను స్మరించుకుంటూ సబర్మతీ ఆశ్రమం నుంచి పాదయాత్రకు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. ఈ యాత్రలో 81 మంది పాల్గొంటున్నారు. వీరంతా 386 కిలోమీటర్లు నడిచి ఏప్రిల్ 5వ తేదీ నాటికి నవసరీ జిల్లాలోని దండికి చేరుకుంటారు. ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా మహాత్మాగాంధీ 78 మంది అనుచరులతో కలిసి 1930 మార్చి 12న దండియాత్రలో మొదటి అడుగు వేసిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్యానికి తల్లి.. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు 2022 ఆగస్టు 15 వరకూ కొనసాగుతాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. దేశంలో ఎంతోమంది మహనీయులు తగిన గుర్తింపునకు నోచుకోలేకపోయారని, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో గత ఆరేళ్లుగా వారి చరిత్రను పదిలపర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంప్రదాయాలు మనకు గర్వకారణమని చెప్పారు. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది భారత్ అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని వ్యాఖ్యానించారు. మనం సాధించిన ఘనతలు, విజయాలు మనకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా వెలుగులు పంచుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. మనం ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్’తో ప్రపంచ అభివృద్ధి ప్రయాణం వేగం పుంజుకుంటుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అవి మన చోదక శక్తులు ‘‘ఐదు స్తంభాలు.. స్వాతంత్య్ర పోరాటం, ఆలోచనలు, విజయాలు, చర్యలు, తీర్మానాలు అనేవి మనం ముందుకు సాగడానికి తోడ్పడే చోదకశక్తులు. మహనీయుల చరిత్రను వెలికి తీసి, పదిలపరుస్తున్నాం. దండియాత్రతో ముడిపడి ఉన్న ప్రాంతానికి, అండమాన్‌లో నేతాజీ సుభాష్‌చంద్రబోస్ త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రాంతానికి గుర్తింపు తీసుకొచ్చాం. అలాగే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. నా అంకితభావం బలోపేతం అంతకుముందు ఢిల్లీ నుంచి విమానంలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన నరేంద్ర మోదీ నేరుగా సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్నారు. మహాత్మాగాంధీకి ఘనంగా నివాళులర్పించారు. ఆశ్రమంలో 1918 నుంచి 1930 వరకు గాంధీజీ తన భార్య కస్తూర్బాతో కలిసి నివసించిన హృదయ్‌కుంజ్ అనే ఇంటిని మోదీ సందర్శించారు. ‘ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్’ మన స్వాతంత్య్ర సమర యోధులకు, స్వాతంత్య్ర పోరాటానికి ఒక నివాళి అని సందర్శకుల పుస్తకంలో రాశారు. జాతి నిర్మాణం పట్ల తన అంకితభావం సబర్మతీ ఆశ్రమానికి రావడంతో, బాపూజీ స్ఫూర్తితో మరింత బలోపేతమయ్యిందని అందులో పేర్కొన్నారు. స్వావలంబన(ఆత్మ నిర్భరత), ఆత్మ విశ్వాసం అనే సందేశాన్ని బాపూజీ ఇక్కడి నుంచే ఇచ్చారని గుర్తుచేశారు. సబర్మతీ ఆశ్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను నరేంద్ర మోదీ తిలకించారు. వోకల్ ఫర్ లోకల్.. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభం కంటే ముందు ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. ఏదైనా స్థానిక ఉత్పత్తిని కొనుగోలు చేసి, ఆ ఫొటోను ‘వోకల్‌ఫర్‌లోకల్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో పోస్టు చేయాలని సూచించారు. సబర్మతీ ఆశ్రమంలో ఒక చరఖాను ఏర్పాటు చేస్తామని, ఆత్మనిర్భరతకు సంబంధించిన ప్రతి ట్వీట్‌కు ఇది ఒక పూర్తివృత్తం తిరుగుతుందని చెప్పారు. స్థానిక ఉత్పత్తుల కొనుగోలును ప్రోత్సహించే దిశగా ఇదొక ఉత్ప్రేరకంగా పని చేస్తుందని ట్వీట్లో పేర్కొన్నారు. ‘వోకల్‌ఫర్‌లోకల్’ గాంధీజీకి, మన స్వాతంత్య్ర సమరయోధులకు గొప్ప నివాళి అవుతుందని వెల్లడించారు. -
న్యాయ వ్యవస్థలో సుపరిపాలన పునాదులు
అహ్మదాబాద్: ప్రజల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడంలో భారత న్యాయవ్యవస్థ తనవంతు కర్తవ్యాన్ని భేషుగ్గా నిర్వర్తిస్తోందని, భారత రాజ్యాంగాన్ని ఇది బలోపేతం చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. కరోనా వైరస్ సంక్షోభంలో భారత న్యాయస్థానాలు ఉత్తమ పనితీరు కనపర్చాయన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అధికంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలు చేపట్టిందని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్ న్యాయవ్యవస్థ అవసరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా మోదీ తపాలా బిళ్లను విడుదల చేశారు. ప్రత్యక్ష ప్రసారాల ఆరంభం.. కోవిడ్ సందర్భంలో ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిగా ప్రారంభించింది గుజరాత్ హైకోర్టేనని మోదీ చెప్పారు. ‘దేశంలో 18,000 పైగా కోర్టులు కంప్యూటీకరించబడ్డాయి. వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ కాన్ఫరెన్సింగ్‌లకు సుప్రీంకోర్టు అనుమతించడంతో దేశంలోని అన్ని కోర్టుల్లో ఆన్లైన్ విచారణలు సాధ్యమయ్యాయి’ అని మోదీ అన్నారు. డిజిటల్ విభజనను తగ్గించడానికి హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో కూడా ఈ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు మోదీ చెప్పారు. దేశంలో తొలి లోక్ అదాలత్ గుజరాత్‌లోని జునాగఢలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైందని మోదీ తెలిపారు. -
రచయితలే లేకపోతే మేము లేము
‘‘నేను పరిచయం చేసిన రచయితలు.. ముఖ్యంగా సత్యానంద్, పరుచూరి బ్రదర్స్, భారవి, హరనాథ్‌బాబు, జంధ్యాలతో పాటు ఇతర రచయితలకు ధన్యవాదాలు. రాబోయే దర్శకులకు కష్టకాలం వచ్చింది. రచయితలు అందరూ దర్శకులయ్యారు. అందుకనే కొత్త రచయితల్ని నమ్ముకోవాల్సిందే’’ అని ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు అన్నారు. ‘తెలుగు సినీ రచయితల సంఘం’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం ‘వజ్రోత్సవ వేడుకలు’ ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన హీరో చిరంజీవి చేతులమీదుగా సీనియర్ రచయితలు ఆదివిష్ణు, రావికొండలరావు, సత్యానంద్, భువనచంద్రలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందజేశారు. చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సినీపరిశ్రమలో దర్శక–నిర్మాతల తర్వాత అత్యధికంగా గౌరవించేది, సన్నిహితంగా ఉండేది రచయితలతోనే. పరుచూరి బ్రదర్స్, సత్యానంద్‌గారికి అది తెలిసిందే. రచయితలే లేకపోతే మేం లేం అనేది వాస్తవం. ఈ మధ్య దీపావళికి మోహన్‌బాబు ఇంటికి వెళ్లాం. అక్కడ వెండి సింహాసనంపై సత్యానంద్‌ను కూర్చోబెట్టారు రాఘవేంద్రరావుగారు. అది చూశాక.. కరెక్టేకదా.. ఆ స్థానం అలంకరించే అర్హుడు సత్యానంద్ అనిపించింది. సింగీతం శ్రీనివాసరావు, విశ్వనాథ్‌గారు రాకపోవడం లోటుగా భావిస్తున్నా. వారిద్దరూ మనకు నిధి లాంటివారు. ‘మాయాబజార్’ నుంచి ఈ కాలం వరకు ఉన్నారు. వారిని సన్మానించుకునే అవకాశం నాకు ఇస్తే బాగుంటుంది’’ అన్నారు. నటుడు మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘ రచయితలు సరస్వతీ పుత్రులు. వారిని సన్మానించే కార్యక్రమంలో పాల్గొంటానని కలలో కూడా ఊహించలేదు. నేను మొదట అప్రెంటీస్‌గా పనిచేసింది ఎం.ఎం. భట్‌గారి దగ్గర. అక్కడే శ్రీశ్రీగారు పరిచయం. ఆ తర్వాత ఆరుద్రగారు. ఆయన ఎన్నో సిల్వర్‌జూబ్లీలు ఇచ్చారు. కానీ ఆరుద్రగారి చివరిరోజు ఏ నిర్మాత రాలేదు. తొలి అవకాశం కోసం నేను వెంటపడింది సత్యానంద్‌గారినే. నాకు తండ్రిలాంటి దాసరి నారాయణరావుగారు, సోదరుడు రాఘవేంద్రావుగారితో పాటు దర్శకుల ఆశీస్సులతోనే ఈ స్థితిలో ఉన్నా. మనకంటే ఎందరో అందగాళ్లు, మేథావులున్నారు. కళామతల్లి మనకు అవకాశం ఇచ్చింది.. దాన్ని కాపాడుకుందాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి, డా.పాలకేడేటి సత్యనారాయణ, విజయేంద్రప్రసాద్‌లకు గౌరవ పురస్కారాలు అందజేశారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, పోసాని కృష్ణమురళీ, ఆకుల చంద్రబోసు, సుద్దాల అశోక్‌తేజ, జెకె. భారవి, ఆకుల చిన్నికృష్ణ, అనంత శ్రీరామ్, భాస్కరభట్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో పాటు పలువురు రచయితలకు విశిష్ట రచనా పురస్కారాలు అందించారు. -
విద్యా సౌగంధిక!
జూబ్లీహిల్స్: సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల. తెలుగు రాష్ట్రాల్లో పరిచయంఅక్కరలేని మహిళా కళాశాల. అరవై వసంతాల ఘన చరిత దీని సొంతం. నగరం నడిబొడ్డున 8 ఎకరాల సువిశాల స్థలంలో సకల సౌకర్యాలతో కూడిన ప్రాంగణంతో ఈ కళాశాల అలరారుతోంది. విద్యా సౌగంధికగా విరాజిల్లుతోంది. డైమండ్ జూబ్లీ వేడుకలు చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం. సిస్టర్స్ ఆఫ్ చారిటీ. ఇటలీలో 1832లో ప్రారంభమై ప్రపంచవ్యాప్తంగా సామాజిక, విద్యారంగంలో సేవలు అందిçస్తున్న ప్రఖ్యాత సేవాసంస్థ. 1860లో భారత్‌లో ప్రవేశించి క్రమంగా తన సేవలను విస్తరించింది. 1959లో 15మంది విద్యార్థినులతో సికింద్రాబాద్‌లో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాలను ప్రారంభించింది. ముందుగా బీఏ కోర్స్ తర్వాత బీకాం, బీఎస్సీ కోర్సులు ప్రారంభించింది. 1977 ప్రాంతంలో బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో 8ఎకరాల సువిశాల ప్రాంగణంలోకి కళాశాలను మార్చారు. 1999లో నాక్ 5 స్టార్ గుర్తింపు లభించింది. క్రమంగా 2006, 2012లలో ‘ఎ’ గ్రేడ్ గుర్తింపు పొందింది. 2014లో ప్రతిష్టాత్మకమైన ‘కాలేజ్ విత్ పొటెన్షియల్ ఎక్స్‌లెన్స్ ’ (సీపీఈ)గా నాక్ ప్రకటించింది. 2018లో గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం 172మంది అధ్యాపకులు, 110 మంది నాన్‌టీచింగ్ స్టాఫ్, 4 వేలకుపైగా విద్యార్థిలున్నారు. కోర్సులు ఇవీ.. 26 డిపార్ట్మెంట్లతో పలు పీజీ, యూజీ కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులు, ఫారిన్ కొలాబరేషన్‌తో కొన్ని కోర్సులునిర్వహిస్తున్నారు. పూర్వ విద్యార్థులు.. హేమాహేమీలు.. వివిధరంగాల్లో ఉన్నత స్థితికి ఎదిగిన ఎంతోమంది విద్యార్థులను ఈ కళాశాల అందించింది. ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, వాణీమోహన్, సునీత ఐపీఎస్ తేజ్‌దీప్‌కౌర్ మీనన్, నటీమణులు మంచు లక్ష్మి, నందిత, అర్చనా వేద తదితరులు ఇక్కడ చదువుకున్నవారే. కళాశాలలో పలు విభాగాలు క్లబ్‌లు నిర్వహిస్తున్నాయి. వ్యాపారంగంలో ప్రవేశించాలనుకునే విద్యార్థినుల కోసం ప్రత్యేక ఎంటర్ప్రెన్యూర్ సెల్ నిర్వహిస్తున్నారు. ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ విభాగాలు ఉన్నాయి. విద్యార్థినులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని పలు పతకాలు సాధించారు. గ్రీన్ కాలేజీ.. పర్యావరణ పరిరక్షణకు ఈ కళాశాల పెద్దపీట వేస్తోంది. ప్రాంగణంలో వర్షపు నీరు ఒడిసిపట్టడానికి ఇంకుడుగుంతలు ఏర్పాటు చేశారు. శుభం పేరుతో వేస్ట్ మేనేజ్మెంట్, సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ‘ప్రకృతి’ పేరుతో ప్రత్యేకంగా కాలేజీ క్లబ్ ఏర్పాటు చేసి పలు కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. యూజీసీ అటానమస్ హోదా.. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా కొనసాగుతున్న ఈ కళాశాలకు నగరంలో మొదటిసారిగా 1988లో యూజీసీ అటానమస్ హోదా లభించింది. 2015 నుంచి ‘చాయిస్ అండ్ క్రెడిట్ బేస్డ్ సెమిస్టర్ సిస్టమ్’ (సీసీబీఎస్‌ఎస్) పద్ధతి అమలు చేస్తున్నారు. ఎన్నో సదుపాయాలు 83 వేలకుపైగా పుస్తకాలు, ‘స్లిమ్ 21 ’పేరుతో కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ జర్నల్స్, ఇంటర్నెట్ రిసోర్స్ సెంటర్, సైన్స్ ల్యాబ్, ఇంగ్లిష్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, యూజీ, పీజీ సైకాలజీ ల్యాబ్, మాస్‌కమ్యునికేషన్ ల్యాబ్, ఇండోర్ స్టేడియం, స్టూడెంట్ కార్నర్, మైక్రోబయాలజీకి ప్రత్యేకించిన లూయిస్ పాశ్చర్ రిసెర్చ్ ల్యాబ్, ఫిటనెస్ సెంటర్, హెల్త్‌సెంటర్, అమెరికన్ కార్నర్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేశారు. 15 మందితో ప్రస్థానం మొదలు.. 1959లో కేవలం 15మంది విద్యార్థినులతో కళాశాల ప్రయాణం మొదలైంది. ఆరు దశాబ్దాల కాలంలో 4వేలకుమందికిపైగా విద్యార్థినులు, 28 విభాగాలు, 300కిపైగా టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌తో సాగుతోంది. విలువలతో కూడిన విద్యాబోధన మా సొంతం. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. – సాండ్రా హోర్తా, ప్రిన్సిపాల్ -
అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ ఫలాలు సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) ప్రాంగణంలో ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ), రీసెర్చ్ ఫర్ రీసర్జెన్స్ ఫౌండేషన్ (ఆర్‌ఎఫ్‌ఆర్‌ఎఫ్), ఇతర సంస్థల సహకారంతో నిర్వహించిన ‘‘ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డెవలప్మెంట్ డిస్కోర్స్’’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇఫ్లూ వజ్రోత్సవాల సందర్భంగా నిర్మించిన స్మారకాన్ని(పైలాన్) ఆవిష్కరించారు. ప్రకృతితో కలసి జీవించడం భారతీయ సంస్కృతిలో ఉందని, పెద్దలు మన సంప్రదాయాల్లో, ఆరాధనలో ప్రకృతికి ప్రాధాన్యమిచ్చారన్నారు. సామాజిక అభివృద్ధితోపాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. జనాభాలో ఇప్పటికీ 18 నుంచి 20 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలు దారిద్య్ర నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పేదరిక నిర్మూలనకు అవసరమైన అన్ని రకాల ప్రయత్నాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. పాఠశాలస్థాయి నుంచే ప్రకృతికి మేలు చేసే విధంగా అభివృద్ధి భావనను విద్యార్థుల్లో కలిగించాలని పేర్కొన్నారు. అభివృద్ధిలో గ్రామాలను అంతర్భాగం చేయాలన్నారు. ప్రతి అభివృద్ధి ప్రణాళిక పరిపూర్ణం అయ్యేందుకు ఐదు ‘‘పి’’లు అవసరమని ఉపరాష్ట్రపతి అన్నారు. పీపుల్(ప్రజలు), ప్రాస్పరిటీ(శ్రేయస్సు), ప్లానెట్ (భూగ్రహం), పీస్(శాంతి), పార్ట్నర్షిప్(భాగస్వామ్యం) అనే ఐదు అంశాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధిమార్గంలో ముందుకు పోవాలని ఆయన సూచించారు. స్థిరమైన ఆర్థికవృద్ధే సమాజాభివృద్ధి జీడీపీ, వినియోగం, మానవ అభివృద్ధి, ఆదాయ స్థాయి, పేదరిక నిర్మూలన, సామాజిక అభివృద్ధి, పాశ్చాత్యీకరణ లాంటి అనేక భావనలతో అభివృద్ధి అనేది ముడిపడి ఉంటుందని వెంకయ్య అన్నారు. స్థిరమైన ఆర్థికవృద్ధి సమాజాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. పేదరిక నిర్మూలనలో భాగంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, గ్రామాలు, పట్టణాల మధ్య అంతరాన్ని తొలగించడం, వాతావరణ సమస్యలను పరిష్కరించడం, సాంకేతిక పరిజ్ఞానాన్ని నియంత్రించడం, మహిళా సాధికారతను సాకారం చేయడం, ఉద్యోగాల కల్పన లాంటి అంశాల మీద దృష్టి సారించి ముందుకు సాగాలని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవితాల్లో వేగవంతమైన పురోగతే దేశాభివృద్ధికి సూచిక అని అన్నారు. దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, కుల–లింగ వివక్ష, నల్లధనం, ఉగ్రవాదం వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు కృషి చేయడం ద్వారా వేగవంతమైన పురోగతి సాధించవచ్చని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు. -
నేటి నుంచి నిట్ వజ్రోత్సవాలు
కాజీపేటలోని వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) వజ్రోత్సవాలకు సిద్ధమైంది. ఈ వేడుకలను సోమవారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను యాజమాన్యం పూర్తి చేసింది. పోలీసు విభాగం ఆధ్వర్యంలో 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. కాజీపేట అర్బన్ (వరంగల్): కాజీపేటలోని వరంగల్ నిట్‌లో ఏడాది పొడవునా వజ్రోత్సవాలు నిర్వహించడానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు 1959 అక్టోబర్ 10న నాటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నేహ్రు శకుస్థాపన చేశారు. ఈ నెల 10వ తేదీ నాటికి 60వ వసంతంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను ప్రారంభించేందుకు సోమవారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచ్చేస్తున్నారు. ఇందుకు గాను ఇటీవల నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు ఉపరాష్ట్రపతికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏడాది పొడవునా వజ్రోత్సవాలు ఏడాది పొడవున వజ్రోత్సవ వేడుకలు నిర్వహించేందుకు నిట్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు స్పిక్‌మేకే బృందంచేత విరాసత్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు, నవంబర్ 10 నుంచి 12 వరకు ఎవెల్యూషన్ ఆఫ్ వరల్డ్ క్లాస్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్షన్స్–ఇష్య్సూ–కన్సరŠన్స్ అనే అంశంపై జాతీయ సదస్సు, డిసెంబర్ 18 నుంచి 21 వరకు 6వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బిగ్‌డాటా, డిసెం బర్ 15, 16 తేదీల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డైనమిక్స్ ఆఫ్ ఇంటర్ఫేసేస్ ఇన్ మల్టీఫేస్ సిస్టమ్స్, జనవరి 18 నుంచి 20 వరకు నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కాంపిటేషనల్ మోడలింగ్ ఆఫ్ ప్లూయిడ్స్ డైనమిక్ ప్రాబ్లెమ్స్, ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్›డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ అండ్ డివైసెస్‌లను నిర్వహించనున్నారు. వీటితోపాటు వివిధ కళాశాలలు, సంస్థల నుంచి ఎంఓయూలు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన షెడ్యూల్.. నిట్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి సోమవారం ఉదయం 9.20 నిమిషాలకు చేరుకుంటారు. కళాశాల మైదానం నుంచి రోడ్డు మార్గంలో 9.30 నిమిషాలకు నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్‌కు వచ్చాక తొలుత నిట్ వజ్రోత్సవ వేడుకల శిలాఫలకాన్ని, అల్యూమ్ని కన్వెన్షన్ సెంటర్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. నాటి ఆర్ఈసీ ప్రిన్సిపాల్స్, నేటి నిట్ డైరెక్టర్లను సన్మానించి నిట్ వజ్రోత్సవ వేడుకలపై ఉపన్యసిస్తారు. తిరిగి 10.30 నిమిషాలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి బయల్దేరుతారు. 600 మంది పోలీసులతో బందోబస్తు వరంగల్ క్రైం: వజ్రోత్సవాలకు ముఖ్యఅతిథిగా వస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆదివారం రాత్రి సుమారు గంటపాటు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించా రు. అధికారులు ఎక్కడెక్కడ ఎవరుండాలనే విషయాలతోపాటు బందోబస్తు విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించా రు. బందోబస్తు కోసం సుమారు 600 మంది సిబ్బంది, అధికారులను నియమించినట్లు సమాచారం. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు ట్రాఫిక్ నియంత్రణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సిబ్బందికి సూచించారు. -
ఎల్ఐసీ సేవా దృక్పథం ప్రశంసనీయం
జేసీ ఇంతియాజ్ నెల్లూరు(వేదాయపాళెం) : వ్యాపార అభివృద్ధే ధ్యేయంగా కాకుండా సామాజసేవలో తమవంతు చేయూతనందిస్తున్న ఎల్ఐసీ సంస్థ ప్రశంసించదగినదని జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అన్నారు. నగరంలోని స్వర్ణవేదిక కల్యాణ మండపంలో బుధవారం జరిగిన ఎల్ఐసీ వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎల్ఐసీ సంస్థ బీమా రంగంలో అగ్రగామిగా నిలుస్తోందన్నారు. నెల్లూరు డివిజన్ పరిధిలోని మూడు జిల్లాల్లో ఎల్ఐసీ సంస్థ వైద్య సేవలకు లక్షలాది రూపాయలు కేటాయించడం గర్వించదగిన విషయమన్నారు. ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ పి.రమేష్‌బాబు మాట్లాడుతూ సంస్థ దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రగతి సాధించిందన్నారు. మార్కెటింగ్ మేనేజర్ కె.మునికృష్ణయ్య, ఎల్ఐసీ పాలసీల ప్రయోజనాలను వివరించారు. అనంతరం వివిధ అనాథాశ్రమాలకు 100 బస్తాల బియ్యాన్ని వితరణగా అందజేశారు. విద్యార్థులకు నిర్వహించిన క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, ఎల్ఐసీ ఉద్యోగులకు నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు మెమోంటోలు అందజేశారు. అలాగే బీఎస్ఎన్ఎల్, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్, పోలీసు, ఉపాధ్యాయ శాఖల్లో అవార్డు గ్రహీతలను ఈ సందర్భంగా సన్మానించారు. సేల్స్‌మేనేజర్ కృష్ణమూర్తి, ఎల్ఐసీ సంస్థ ఉద్యోగులు, పలు కళాశాలల ప్రిన్సిపల్స్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
హక్కులు సరే.. విధుల సంగతేంటీ?
వైద్య ఉద్యోగ సంఘాల నేతలను నిలదీసిన ఉప ముఖ్యమంత్రి గాంధీ వైద్య కళాశాల డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో రాజయ్య సీరియస్ హైదరాబాద్ : ‘కొంత మంది వైద్యులు సామాజిక బాధ్యతనే కాదు, మానవత్వాన్ని సైతం మర్చిపోతున్నారు. కళ్ల ముందే రోగి ప్రాణాలు పోతున్నా.. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పవిత్రమైన వైద్య వృత్తిని ఓ వ్యాపారంగా మార్చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివి.. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సేవ చేస్తున్నారు. జూనియర్ వైద్యులు, వైద్య, ఇతర సంఘాల నాయకులు, తమ హక్కుల కోసం కొట్లాడటంలో తప్పులేదు కానీ, విధుల సంగతేంటి..? ఎవరూ... ఎక్స్ట్రా టైమ్ పని చేయాల్సిన అవసరం లేదు. నిర్దేశిత సమయానికి ఆస్పత్రికి చేరుకుని వచ్చిన రోగులను చీదరించుకోకుండా ఆప్యాయంగా పలకరిస్తే చాలు’ అని ఉపముఖ్యమంత్రి రాజయ్య హితబోధ చేశారు. గాంధీ వైద్య కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆదివారం ఘనంగా జరిగాయి. ఉప ముఖ్యమంత్రితో పాటు వుంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఎంపీలు బండారు దత్తాత్రేయ, బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, డీఎంఈ పుట్టా శ్రీనివాస్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటు, అలుమ్ని భవనంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అదే ప్రాంగణంలో డాక్టర్ యాదయ్యగౌడ్ మెమోరియల్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కళాశాల ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పతకాలను అందించారు. అనంతరం మంత్రి రాజయ్య మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి, ఒక్కో ఆస్పత్రిలో నలుగురు వైద్యులను నియమించనున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను, పారా మెడికల్ స్టాఫ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు. రోగులకు సేవ చేయాలంటే వైద్యులకు ఎంతో సహనం అవసరమని, దురదృష్టవశాత్తూ జూనియర్ వైద్యులకు ఆ ఓపిక కూడా ఉండటం లేదన్నారు. వైద్యుల ఆలోచనా ధృక్పథంలో మార్పురావాలని సూచించారు. కోర్సు పూర్తైన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాలనే నిబంధన ఉన్నా.. ఇందుకు జూడాలు నిరాకరిస్తున్నారని, ఇది వారికి తగదని చెప్పారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ సనత్‌నగర్‌లో మరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో చాలా పరికరాలు పని చేయడం లేదని, వైద్య పరికరాల కొనుగోలుకు రూ.100 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రవుంలో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
వజ్రోత్సవ ధగధగలు
నేటి నుంచి ఏసీఏ డైమండ్ జూబ్లీ వేడుకలు రేపు విశాఖ రానున్న ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ విశాఖపట్నం: ఆరు దశాబ్దాల క్రితం.. అప్పటి మద్రాసు నగరం నుంచి స్వయం ప్రతిపత్తి కోసం తరలివచ్చిన ఓ క్రీడా సంస్థ ఇప్పుడు ఇంతింతై ఎదిగి అవధుల్లేని ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతోంది. ఆంధ్రప్రాంతంలో క్రికెట్ వటవృక్షంగా విస్తరించిన ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వజ్రోత్సవాలకు ఉరకలేస్తోంది. ఏసీఏ కీర్తి కిరీటంలో వజ్రం వంటి విశాఖ ఈ ఉత్సవాలకు వేదికగా నిలుస్తోంది. రెండు రోజుల వజ్రోత్సవ వేడుకలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుంది. క్రికెట్ ఘనాపాఠీలంతా పాల్గొనే ఉత్సవాలకు మరింత వన్నె తెచ్చే విధంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ శ్రీనివాసన్ విశాఖ రానున్నారు. తొలిరోజైన శనివారం వేడుకల్లో నిన్నటి స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్, గతతరం మేటి బౌలర్ జవగళ్ శ్రీనాథ్ హాజరు కానున్నారు. రెండో రోజు ఆదివారం వేడుకల్లో ఐసీసీ అధ్యక్షుడు శ్రీనివాసన్ పాల్గొనబోతున్నారు. తొలిరోజు వేడుకలు వాల్తేర్ క్లబ్లో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కానున్నాయి. మలిరోజు వేడుకలు నొవాటెల్‌లో ఐదుగంటలకు మొదలు కానున్నాయని శుక్రవారం నిర్వహించిన వజ్రోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు తెలిపారు. ఇదీ కార్యక్రమం : ఆంధ్ర మాజీ రంజీ ఆటగాళ్లకు సన్మానాలు, సాంస్కతిక కార్యక్రమాలతో వేడుకలు ఉల్లాసంగా సాగిపోనున్నాయి. ము గింపు వేడుకలకు బీసీసీఐ ప్రతినిధులు శివలాల్ యాద వ్, సంజయ్‌పటేల్, ఐపీఎల్ చైర్మన్ రంజీబ్ బిస్వాల్, అనిల్‌కుంబ్లే, పాండవ్, మాథ్యూస్, వినోద్, చేతన్ భగత్ రానున్నారు. పూర్వ రంజీ ఆటగాళ్లకు ప్రోత్సాహం గడచిన అర్ధశతాబ్దిలో రంజీల్లో ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన 108 మంది క్రికెటర్లకు వజ్రోత్సవ వేడుకల్లో నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. ఆడిన మ్యాచ్‌ల ప్రకారం లక్ష నుంచి ఐదు లక్షల వరకు అందుకోనున్నారు. అటువంటి వారి ఆరోగ్య సమస్యలపై కూడా ఏసీఏ దృష్టి సారించనుందని గంగరాజు చెప్పారు. త్వరలోనే టెస్ట్ హోదా ఏసిఏ -వీడీసీఏ సంయుక్తంగా నిర్మించిన వైఎస్ఆర్ స్టేడియంకు త్వరలో టెస్ట్ హోదా లభించనుందని గంగరాజు తెలిపారు. ఇటీవలే ప్రతినిధుల బృందం స్టేడియాన్ని మ రోసారి పరిశీలించి పంపిన నివేదిక ప్రకారం కొన్ని మార్పులు చేస్తే త్వరలోనే విశాఖకు టెస్ట్ హోదా లభించనుందని చెప్పారు. అక్టోబర్‌లో మరో వన్డే ఏడాది వ్యవధిలో రెండు వన్డేలు నిర్వహించిన ఘనత విశాఖ స్టేడియం పరం కానుంది. గతేడాది చివర్లో వైఎస్సార్ స్టేడియంలో వెస్టిండీస్- భారత్ వన్డే మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో వెస్టీండీస్ పర్యటనలో భాగంగా మరో మ్యాచ్ కు స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఏసీఏ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బీసీసీఐ కానుక అందించనుంది. ఏ క్రీడకైనా ప్రోత్సాహం ఏ క్రీడలో ప్రతిభ చూపుతున్న క్రీడాకారుడికైనా ఆర్థిక సాయం అందించేందుకు ఏసీఏ ముందుంటుంది. అందు కోసం రూ. 30 లక్షల నిధిని ఏర్పాటు చేశాం. వ్యక్తిగత క్రీడాంశాల్లోనే కాకుండా టీ మ్ ఈవెంట్లలోనూ ప్రతిభ చూపే ఆటగాళ్లకు సా యం అందిస్తాం. చెస్, ఆర్చరీ, స్విమింగ్‌లో ప్ర తిభావంతులకు ఈ సాయం అందించాం. - గోకరాజు గంగరాజు, ఏసీఏ కార్యదర్శి