దేశమంతటా నేటినుంచి ఏడాది పాటు
నేడు పార్లమెంటు ఉభయసభల భేటీ
వేదిక కానున్న చారిత్రక సెంట్రల్ హాల్
న్యూఢిల్లీ: రాజ్యాంగానికి ఆమోదముద్ర పడ్డ చరిత్రాత్మక సందర్భానికి మంగళవారంతో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి. దాంతో మంగళవారం నుంచి ఏడాది పొడవునా రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజ్యాంగ ప్రాశస్త్యానికి ప్రచారం కల్పించడం, దానిపట్ల పౌరుల్లో అవగాహనను మరింతగా పెంచడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు రూపొందించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా విద్యా సంస్థల్లో రాజ్యాంగ ప్రవేశిక సామూహిక పఠనం వంటివి జరగనున్నాయి.
రాజ్యాంగ నిర్మాతల కృషిని పార్లమెంటు మరోసారి నెమరువేసుకోనుంది. వారికి ఘనంగా నివాళులు అర్పించనుంది. ఇందుకోసం ఉభయ సభలు మంగళవారం ప్రత్యేకంగా సమావేశం అవుతున్నాయి. 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలిసారి భేటీ అయిన పార్లమెంటు పాత భవనంలోని చారిత్రక సెంట్రల్ హాలే ఇందుకు వేదిక కానుండటం విశేషం. ఇందుకోసం సెంట్రల్ హాల్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది.
సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తమ భావాలను పంచుకుంటారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఉభయ సభల ఎంపీలంతా పాల్గొంటారు. రాజ్యాంగ దిన వజ్రోత్సవాలను పురస్కరించుకుని కాన్‌స్టిట్యూషన్75డాట్‌కామ్ పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా కేంద్రం రూపొందించింది.
ఆ చరిత్రాత్మక దినాన...
1946 డిసెంబర్ 9న పార్లమెంటు పాత భవనం సెంట్రల్ హాల్లో రాజ్యాంగ పరిషత్ తొలి భేటీ జరిగిన క్షణాలను లోక్‌సభ భావోద్వేగపూరితంగా స్మరించుకుంది. ‘‘చెప్పదగ్గ స్వాతంత్య్ర సమరానికి సారథ్యం వహించిన మహామహులైన నేతలు ఆ రోజున ఇదే హాల్లో అర్ధచంద్రాకృతిలో వరుసలు తీరి ఆసీనులయ్యారు. ముందు వరుసలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, ఆచార్య జేబీ కృపాలనీ, అబుల్ కలాం ఆజాద్ తదితరులు కూర్చున్నారు. బాబూ రాజేంద్రప్రసాద్ అధ్యక్ష స్థానాన్ని అలంకరించారు’’ అంటూ లోక్‌సభ వెబ్‌సైట్ నాటి స్మృతులను మరోసారి గుర్తు చేసుకుంది.
మోదీ ప్రసంగించరు: రిజిజు
ఉభయ సభల సంయుక్త భేటీలో ప్రధాని మోదీ ప్రసంగించబోరని రిజిజు స్పష్టం చేశారు. ఈ భేటీలో ఉభయ సభల విపక్ష నేతలకు కూడా ప్రసంగించే అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు తెలిపారు. ‘‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్ మాత్రమే మాట్లాడతారు. విపక్ష నేతలిద్దరికీ వేదికపై స్థానముంటుంది. ఇదో చరిత్రాత్మక సందర్భం. దీన్ని వివాదాస్పదంగా మార్చే ప్రయత్నం చేయొద్దు’’ అని విపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment