సుప్రీం ప్రమాణాలతో సుదృఢ ప్రస్థానం | Supreme Court has strengthened India vibrant democracy says pm Narendra Modi | Sakshi
Sakshi News home page

సుప్రీం ప్రమాణాలతో సుదృఢ ప్రస్థానం

Published Mon, Jan 29 2024 4:35 AM | Last Updated on Mon, Jan 29 2024 4:36 AM

Supreme Court has strengthened India vibrant democracy says pm Narendra Modi - Sakshi

ప్రధాని మోదీకి జ్ఞాపిక అందజేస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

సాక్షి, న్యూఢిల్లీ: అత్యున్నత న్యాయస్థానం తన సుదీర్ఘ ప్రస్థానంలో ఉన్నత ప్రమాణాలను నెలకొలి్పందంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. తద్వారా దేశ ప్రజాస్వామ్య యాత్రను మరింతగా బలోపేతం చేసిందన్నారు. సుప్రీంకోర్టులో తొలి విచారణ జరిగి ఆదివారంతో 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన వజ్రోత్సవ కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో పాటు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్‌ దేశాల ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్వాల్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయసూత్రాల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతోందని కితాబిచ్చారు.

వ్యక్తిగత హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ వంటి కీలకాంశాలపై సుప్రీంకోర్టు ఇచి్చన చరిత్రాత్మక తీర్పులు ఇతర దేశాలకు కూడా కరదీపికలని అభిప్రాయపడ్డారు. దేశ సామాజిక, రాజకీయ ప్రస్థానాన్ని అవి మేలిమలుపు తిప్పాయన్నారు. వికసిత భారత్‌ లక్ష్య సాధనకు సాధికార న్యాయవ్యవస్థ అత్యంత కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ‘‘శరవేగంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా చట్టాలను కూడా హౠ ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. ఈ నూతన చట్టాలు భవిష్యత్‌ భారతాన్ని మరింతగా బలోపేతం చేస్తాయి.

సులభ, సత్వర న్యాయం దేశ పౌరులందరి హక్కు. అందుకే ఈ–కోర్టు మిషన్‌ ప్రాజెక్టు–3కి నిధులు పెంచాం. కోర్టుల్లో మౌలిక సదుపాయాల పెంపుకు నిబద్ధతతో పని చేస్తున్నాం’’ అని చెప్పారు. న్యాయవ్యవస్థ విశ్వసనీయతను ఇతోధికంగా పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ లక్ష్యంతోనే తాజాగా జన్‌ విశ్వాస్‌ బిల్లును తీసుకొచి్చనట్టు చెప్పారు. మున్ముందు న్యాయవ్యవస్థపై అనవసర భారాన్ని అది తగ్గిస్తుందని వివరించారు. అలాగే వివాదాలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపేందుకు ఉద్దేశించిన మధ్యవర్తిత్వ చట్టం కూడా కోర్టు పనిభారాన్ని బాగా తగ్గించగలదని ఆశాభావం వెలిబుచ్చారు.  

వాయిదా సంస్కృతికి తెర పడాలి: సీజేఐ
కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు, కాలం చెల్లిన విధానాలు, కేసుల వాయిదా సంస్కృతి వంటి సమస్యలు న్యాయ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తున్నాయని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆవేదన వెలిబుచ్చారు. వీటిని నిర్మాణాత్మక రీతిలో పరిష్కరించడం తక్షణావసరమని అభిప్రాయపడ్డారు. అందుకే వీటిపై అర్థవంతమైన చర్చ జరగాల్సి ఉందన్నారు. సమర్థంగా సకాలం న్యాయం అందించాలంటే  కోర్టుల్లో వాయిదా సంస్కృతి నుంచి వృత్తిపరమైన సంస్కృతికి మారాలని ఉద్బోధించారు.

కేసుల పరిష్కారంలో అంతులేని జాప్యానికి కారణమవుతున్న సుదీర్ఘ వాదనలకు చెక్‌ పెట్టాల్సి ఉందన్నారు. ‘‘న్యాయ వృత్తి ఒకప్పుడు ఉన్నత వర్గాల పురుషులకే పరిమితమైందిగా ఉండేది. కానీ పరిస్థితులు మారుతున్నాయి. జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం 36 శాతానికి పెరగడం స్వాగతించదగ్గ పరిణామం. అలాగే తాజాగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షల్లో ఎంపికైన వారిలో 50 శాతానికి పైగా మహిళలే కావడం హర్షణీయం. న్యాయ వృత్తిలోకి కొత్తవారిని ప్రోత్సహించడంలో లింగ భేదం, నేపథ్యాలతో నిమిత్తం లేకుండా సమానావకాశాలు కలి్పంచాలి.

అలాగే జడ్జిల్లోనూ, లాయర్లలోనూ ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గ ప్రాతినిధ్యం ఎంతగానో పెరగాల్సి ఉంది’’ అన్నారు. ‘‘కోర్టులకు సుదీర్ఘ సెలవులపైనా చర్చ జరగాల్సి ఉంది. ఇందుకోసం న్యాయవాదులు, న్యాయమూర్తులకు ‘ఫ్లెక్సీ టైం’ వంటి ప్రత్యామ్నాయాల సాధ్యాసాధ్యాలనూ ఆలోచించాలి. కోర్టుల లోపల, వెలుపల రాజ్యాంగ నిర్దేశిత నిబద్ధతతో నడుచుకుంటున్నామా, లేదా అని అందరూ ఆత్మపరిశీలన చేసుకోవాలి. సర్వోన్నత న్యాయస్థాన వజ్రోత్సవ వేడుకలు ఇందుకు సరైన సందర్భం’’ అని సీజేఐ పిలుపునిచ్చారు. ఈ–కోర్టుల పురోగతిని వివరించారు. దేశ న్యాయ వ్యవస్థను సమర్థంగా, పర్యావరణహితంగా సాంకేతికతతో కూడిందిగా మార్చడానికి కృషి చేస్తున్నట్టు             వివరించారు.

ప్రజల కోర్టు: సీజేఐ
సుప్రీంకోర్టు వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం లాంఛనంగా ఏర్పాటైన ధర్మాసనానికి సీజేఐ జస్డిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యం వహించారు. 75 ఏళ్ల క్రితం 1950 జనవరి 28న భారత సుప్రీంకోర్టు తొలి విచారణ జరిగిన తీరు, అప్పుడు పాటించిన స్వతంత్ర విలువలు నేటికీ అనుసరణీయమేనన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులకు విధి నిర్వహణలో పూర్తి స్వేచ్ఛా స్వాతంత్య్రాలు న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తికి గీటురాళ్లని అభిప్రాయపడ్డారు.

వారు సామాజిక, రాజకీయ ఒత్తిళ్లకు మానవ సహజమైన మొగ్గుదలలకు అతీతంగా తీర్పులు వెలువరించాలని పేర్కొన్నారు. ఈ దిశగా జడ్జిల సామర్థ్యాలను మరింతగా పెంచే ప్రయత్నాలు ఇప్పటికే జరుగుతున్నాయని గుర్తు చేశారు. ‘‘సుప్రీంకోర్టు తొలి విచారణ పార్లమెంటులోని ప్రిన్సెస్‌ చాంబర్లో సాదాసీదాగా జరిగింది. నాటినుంచి సుదీర్ఘ ప్రస్థానంలో కోర్టు పనితీరు నానాటికీ మెరుగవుతూనే వస్తోంది. ప్రజల కోర్టుగా రూపుదిద్దుకుంటోంది. ప్రజల నుంచి ఏటా ఏకంగా లక్షకు పైగా అందుతున్న లెటర్‌ పిటిషన్లు అత్యున్నత న్యాయస్థానంపై వారి విశ్వాసానికి అద్దం పడుతున్నాయి’’ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement